శివ్వంపేట, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చాలినంత యూరియా లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురియడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అందుకు తగినట్లుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆగ్రోస్, పీఏసీఎస్, గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో విక్రయాలు చేపడతున్నా చాలినంత యూరియా రాకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. గత పదిరోజుల్లో ఐదుసార్లు యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. సోమవారం పీఏసీఎస్‌కు 20 టన్నుల యూరియా రావడంతో భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. క్యూలో చెప్పులు, రాళ్లు, చెట్ల కొమ్మలు పెట్టారు. కౌంటర్ వద్ద యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. వచ్చిన యూరియా ఏ మాత్రం సరిపోకపోవడంతో రైతులు తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగేశ్వర్‌రావు ఆందోళన కారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
టోకెన్లు ఉన్నవారికే యూరియా
టేక్మాల్: మండల కేంద్రమైన టేక్మాల్‌లో సోమవారం రైతులు, మహళలు యూరియా కోసం పడిగాపులుగాశారు. స్థానిక వ్యవసాయాధికారి శ్రీకాంత్ రాహుల్‌ను రైతులు చుట్టూ ముట్టి యూరియా ఎప్పుడిస్తారని నిలదీశారు. ప్రస్తుతం 60టన్నుల యూరియా వచ్చిందన్నారు. ఈ స్టాకును రెండు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చిన రైతులకు పంపిణీ చేశారు. మిగతా వారికి అందకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ
అల్లాదుర్గం రూరల్: పొలీసు బందోబస్తు మధ్య యూరియాను విక్రయించిన సంఘటన సోమవారం అల్లాదుర్గం మండలం చిల్వెరలో చోటు చేసుకుంది. గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా యూరియాను విక్రయించారు. రైతులు ఎరువుల కొసం ఎగబడడంతో తోపులాట జరిగింది. ఒక దశలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది రైతులను వరుస క్రమంలో నిలబెట్టి యూరియాను పంపిణీ చేశారు. ముస్లాపూర్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అల్లాదుర్గం మండలానికి 2500 టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటి వరకు 850 టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. రైతులకు మరో 1500 టన్నుల యూరియా అవసరముంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎరువులు దొరకక పొవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గంటలోపే 10 మెట్రిక్ టన్నులు పంపిణీ
మెదక్ రూరల్: కేంద్ర ప్రభుత్వ నిబంధనలవల్ల పీఏసీఎస్‌లు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చేందుతున్న సిబ్బంది సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆందోళన చేపట్టేందుకు తరలివెళ్లారు. ఇదే సమయంలో ఎరువుల కోసం మండలంలోని నలుమూలలనుంచి రైతులు తరలివచ్చారు.
దీంతో డీలర్ల వద్ద ఉన్న 10 మెట్రిక్ టన్నుల యూరియా గంటలోపే అయిపోయింది. సొసైటీ ఆధీనంలో ఉన్న 12 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేద్దామంటే పీఏసీఎస్ అందుబాటులో లేరు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ విజయ్‌కుమార్ సొసైటీ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు యూరియాను సరఫరా చేయించారు. దీంతో అన్నదాతలు ఆందోళన ను విరమించారు.