పరిగి: ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో రైతులు పంటలకు ఎరువులు వేయటం ప్రారంభించారు. ఎరువుల వాడకంలో రైతుల అవగాహన లోపంతోనే యూరియా సమస్య తలెత్తుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో యూరియా ఎక్కువగా వాడుతుండటంతో కొరత కూడా ఏర్పడుతోంది.
మోతాదు కంటే రెండింతల యూరియాను రైతులు వాడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూరియా అధికంగా వాడటం వల్ల మొక్క ఎక్కువ పచ్చగా, ఎక్కువ మెత్తగా మారుతుంది. దీంతో చీడపీడలు అధికమయ్యే అవకాశముంది. ఖర్చు పెరగటంతో పాటు పురుగుల మందులు కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. తద్వారా పెట్టుబడులు గణనీయంగా పెరిగి దిగుబడులపై, రైతులకు వచ్చే నికర లాభాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పంటలకు యూరియా వాడకంపై వ్యవసాయ శాఖ అధికారి రేణుకా చక్రవర్తిని సూచనలు అందజేశారు. భూముల సారాన్ని బట్టి ఎరువుల మోతాదు ఈ విధంగా ఉండాలని చెప్పారు.
ఎంత మోతాదులో..
డీఏపీ ఎరువు ప్రతి ఎకరానికి 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పనిసరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందున ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగం ఉండదు. పత్తి పంటకు విత్తే కంటే ముందు మూడు నుంచి నాలుగు అంగుళాల లోతులో డీఏపీ వేయాలి. మిగతా అన్ని ఖరీప్ పంటలకు కూడా ఎకరానికి 50 కేజీలే వాడాలి. ఒకవేళ మొక్కలకు వేయాలంటే భూమిలో గోతులు తీసి వేయాలి.
యూరియా ప్రతి ఎకరానికి వంద కిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందునా యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి విత్తిన 20 రోజుల నుంచి మూడు నుంచి నాలుగుసార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగుసార్లు వాడాలి. కలుపుతీసే సమయంలో తర్వాత 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు యూరియాను వరి పైరుకు వాడాల్సి ఉంటుంది. అయితే రైతులు వేసిన ప్రతిసారి ఎకరానికి రెండు బస్తాల యూరియా అంటే 100 కేజీలు ఒకేసారి వాడుతున్నారు. మొక్కలకు కనీసం ఐదు సెంటీమీటరల దూరంలో యూరియా వేయాల్సి ఉండగా రైతులకు అవగాహన లేమితో మొక్కకు ఆనుకుని వేస్తున్నారు.
ఏ ఎరువును ఎందుకు ఉపయోగిస్తారు..
ఏ ఎరువును ఎందుకు ఉపయోగిస్తారనే విషయంలో అవగాహన రైతులకు లేకపోవటంతో అన్ని రకాల అవసరాలకు ధర తక్కువగా ఉన్న ఎరువునే ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడంతో ఆయా ఎరువులు పంటకు మేలు చేయటం అటుంచి కీడే ఎక్కువగా చేస్తున్నాయి. యూరియా వాడటం వల్ల పంట ఏపుగా, పచ్చగా వస్తుంది. మోతాదుకు మించి వాడితే తెగుళ్లు సోకే అవకాశం ఉంది. డీఏపీ వాడటం వల్ల వేర్లు, కొమ్మలు, రెమ్మలు ఎక్కువగా వస్తాయి. భాస్వరం వాడటం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఈ సంవత్స రం కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరగటం తో ఎరువులు సమపాళ్లలో వాడకుండా ధర తక్కువగా ఉన్న యూరియాను ఎక్కువగా వాడుతున్నారు.
డీఏపీ ధర పెరగటమూ సమస్యకు కారణమే..
గత సంవత్సరం నుంచి డీఏపీ ధరలు విపరీతంగా పెరగటంతో యూరియాపై ప్రభావం చూపుతోంది. ధరలను తట్టుకోలేక డీఏపీ వేయాల్సిన పొలాలకు కూడా రైతులు యూరియానే వేస్తున్నారు. ఒక్క డీఏపీ బస్తాకు పెట్టే డబ్బులు పెడితే నాలుగు బస్తాల యూరియా వస్తుంది. దీంతో కొందరు రైతులు యూరియా అవసరం లేకున్నా, పొలానికి డీఏపీ అవసరం ఉన్నా యూరి యానే తీసుకెళ్లీ వేస్తుం డటం కూడా సమస్యకు కారణమవుతోంది.
యూరియా అతిగా వేయొద్దు
Published Wed, Sep 10 2014 11:23 PM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement