చేవెళ్ల: ఖరీఫ్ సీజన్ ‘కళ‘ తప్పుతోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ సరియైన వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం విత్తనాలు విత్తడానికి సైతం సరిపడా వర్షపాతం నమోదు కాలేదు. సీజన్ వారం పదిరోజులు ఆలస్యమైనా దిగుబడులు తగ్గుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్న తరుణంలో ఏకంగా రెండునెలలు వర్షాలు కురవకపోవడంపై అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
గత రెండు మూడు దశాబ్దాలుగా సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవకపోవడాన్ని తామెన్నడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. వర్షాభావంతో వ్యవసాయ బోర్లు, బా వులలో నీరు గణనీయంగా తగ్గింది. సీజన్‌లో అడపాదడపా కురిసిన చిరుజల్లులకు పత్తి, మొక్కజొన్న తదితర పంటల విత్తనాలు పెట్టి నా ఆ తరువాత వర్షాలు కురవకపోవడంతో అవి మొలకెత్తలేదు. వేలాది రూపాయలు వెచ్చించి పెట్టిన విత్తనాలు వృధా అయ్యాయి. ఈ సీజన్‌లో పచ్చని మొక్కలతో, వరి పైర్లతో కళకళలాడాల్సిన పంటపొలాలు బీడు భూములను తలపిస్తున్నాయి. కలుపు తీస్తూ , మందులు వేస్తూ నిత్యం బిజీగా ఉండే రైతన్నకు పనిలేకుండా పోయింది. వర్షాల్లేక షాబాద్ మం డలంలోని పహిల్వాన్‌చెరువు, చందనవెళ్లి పెద్దచెరువు, తాళ్లపల్లి, నాగరకుంట తదితర చెరువులు, కుంటలు బోసిపోయి కనిపిస్తున్నాయి. చెక్‌డ్యాంలలో చుక్కనీరు కూడా చేరలేదు.
అతితక్కువ వర్షపాతం
చేవెళ్ల వ్యవసాయ డివిజన్ పరిధిలో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మండలాలలో ఖరీఫ్ సీజన్‌లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. చేవెళ్ల మండలంలో జూన్‌నెలలో సాధారణ వర్షపాతం 123.2 మిల్లీమీటర్లు కాగా కురిసిన వర్షపాతం మాత్రం కేవలం 26ఎంఎంగా నమోదైంది. అదేవిధంగా మొయినాబాద్ మండలంలో సాధారణం 107.2కాగా, కురిసింది 21.8ఎంఎం మాత్రమే.
షాబాద్ మండలంలో 126.4 ఎంఎంకి గానూ 26.8, శంకర్‌పల్లి మండలంలో 127.3ఎంఎంకిగానూ 65.2ఎంఎం వర్షపాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలై నెలలో చేవెళ్ల మండలంలో సాధారణం 179 ఎంఎం కాగా, కురిసింది కేవలం 38.4ఎంఎం. అలాగే మొయినాబాద్‌లో 160కిగానూ 41.6, షాబాద్‌లో 148కిగానూ 74.3, శంకర్‌పల్లిలో 177కిగానూ 72.6ఎంఎం వర్షపాతం మాత్రమే నమోదైనట్లు చేవెళ్ల వ్యవసాయ డివిజన్ ఏడీఏ దేవ్‌కుమార్ పేర్కొన్నారు.
మబ్బుల జోరు.. జాడలేని చినుకు
గత పదిహేను రోజులనుంచి ప్రతినిత్యం ఆకాశం మేఘావృతమై ఉంటోంది. కనీసం చినుకైనా కురవడం లేదు. మబ్బులు కమ్మినప్పుడల్లా వర్షం పడుతుందని ఆశిస్తున్న రైతులకు నిస్పృహ తప్పడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడిందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని నిత్యం వాతావరణశాఖ పేర్కొంటున్నప్పటికీ ఆ సూచనలేమీ కనిపించడం లేదు. వర్షాలు పడి పంటలు పండితేనే అందరూ బాగుంటారని సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణాదారులు అంటున్నారు.
కళ తప్పిన ఖరీఫ్
Published Fri, Jul 25 2014 11:57 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement