ఒంగోలు టూటౌన్: జిల్లాలో మూడు రోజులుగా కురిసిన వర్షాలకు అన్నదాతల్లో ఖరీఫ్ ఆశలు చిగురించాయి. భూమి పదునెక్కింది. పొలం పనులకు రైతులు సిద్ధమయ్యారు. సీజన్ ప్రారంభమైన నెలన్నర తరువాత వరుణుడు కరుణించడంతో అన్నదాతలు దుక్కుల పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈ సీజన్‌లో 2.30 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు కేవలం 17 వేల హెక్టార్లలో కంది, పత్తి, మినుము, వేరుశనగ పంటలతో పాటు ఇతర రకాల పైర్లు సాగయ్యాయి.
వేసవి పత్తి 14 వేల హెక్టార్లకు పైగా, పెసర 400 హెక్టార్లలో సాగయింది. నీటి సౌకర్యం ఉన్న ఏరియాల్లో కొన్ని చోట్ల వరి నార్లు పోసే పనిలో రైతులున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు వేరుశనగ పైర్లకు జీవం పోశాయి. మిగతా పైర్లు కూడా జీవం పోసుకున్నాయి.
గత ఏడాది 3,35,898 హెక్టార్లలో వరితో పాటు కంది, వేరుశనగ, మిరప, సజ్జ పంటలతో పాటు ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం జొన్న 10 క్వింటాళ్లు, సజ్జ 90 క్వింటాళ్లు, మొక్కజొన్న 50 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 150 క్వింటాళ్లు, కంది 1500 క్వింటాళ్లు, నువ్వులు 110 క్వింటాళ్లు, ఆముదం 50 క్వింటాళ్లు, వేరుశనగ 3 వేల క్వింటాళ్లు, జీలుగ 700 క్వింటాళ్లు, పిల్లిపెసర 800 క్వింటాళ్లు, జనుము 300 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. వీటితో పాటు వరి ఆరు వేల క్వింటాళ్లు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలతో కొంత ఊరట చెందిన రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. దర్శి, త్రిపురాంతకం, తర్లుపాడు ప్రాంతాల్లో కంది సాగు ఎక్కువగా జరుగుతుంది. కందితో పాటు సజ్జ, జొన్న, ఆముదం పంటలు అధికంగా సాగయ్యే అవకాశాలున్నాయి. అనుకోకుండా వర్షాలు కురిస్తే భూమిని సారవంతం చేసుకోవడానికి జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలు సగం రాయితీపై ఇచ్చేందుకు ఆయా మండలాలకు కేటాయించారు. 694 ఎరువుల నమూనాల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు నత్రజని 16, భాస్వరం 160, డీఏపీ 96, పొటాష్ 31, కాంప్లెక్స్ ఎరువులు 150, మిక్చర్స్ 90, మరోరెండు రకాల ఎరువుల నమూనాలను సేకరించారు. అదే విధంగా భూసార పరీక్షలు పూర్తయిన వాటిని రైతులకు అందించనున్నారు. ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
చిగురించిన ఆశలు
Published Wed, Jul 9 2014 3:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement