సందిగ్ధం..!
- వెదజల్లాలా.. నారుపోయాలా..
- తేల్చుకోలేని రైతాంగం
- కుళ్లిపోతున్న వెదజల్లిన విత్తనాలు
- నారుమళ్లకు సాగునీరు కరువు
చల్లపల్లి : ఎన్నడూలేని విధంగా ఈసారి రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సాగునీటి విడుదలపై అయోమయం నెలకొంది. మరోవైపు వర్షాలు కూడా కురవడం లేదు. ఖరీఫ్ సీజన్ దాటిపోతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో సాగుకు ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలియక అన్నదాతలు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు వెదజల్లే పద్ధతిన సాగు చేయగా తడి, పొడి కలయిక వల్ల విత్తనాలు కుళ్లిపోతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో నారుమడులు పోసేందుకు సాగునీరందక పడరాని పాట్లు పడుతున్నారు. సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయశాఖాధికారులు సరైన సూచనలు, సలహాలను అందించక పోవడం వల్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు.
అయోమయం..
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 85వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిని అనుసరించగా, 13,200 ఎకరాల్లో వరి నారుమళ్లు పోసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, పెడన, పామర్రు మండలాల్లో వెదజల్లే పద్ధతిన విత్తనాలు చల్లారు. కొన్నిచోట్ల సరిగా నీరందకపోవడంతో సగం తడి, సగం పొడిగా ఉన్న విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
మరికొన్నిచోట్ల సాగునీరందక పోవడంతో విత్తనాలు సరిగా మొలవక మళ్లీ నారుమళ్లు పోసుకుంటున్నారు. దీనివల్ల ఎకరాలకు రూ.2వేల నుంచి రూ.3వేల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సగం సాగుపనులు మాత్రమే చేశారు. గత ఏడాది ఇప్పటికి 35శాతం సాగుపనులు జరగ్గా, ప్రస్తుతం 15 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
కలవరపెడుతున్న నీటిఎద్దడి
నారుమళ్లు పోసుకునేందుకు సన్నద్ధమవుతున్న రైతులను సాగునీటి ఎద్దడి కలవర పెడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఇంజిన్లతో నారుమళ్లు పోసిన రైతులు నారు చేతికొచ్చింది. పొలాలు తడిపేందుకు సాగునీరు లేకపోవడంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ పద్ధతిన సాగుచేస్తే ప్రయోజనమో వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
వరుణుడిపైనే భారం
ఈ నెల 8, 9, 10 తేదీల్లో జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈనెల 11న అల్పపీడనం ఏర్పడినప్పటికీ మూడు రోజులు మబ్బులతో ఊరించి చినుకురాలకుండానే ముఖం చాటేశాయి. ఈ నెల 20వ తేదీకి జిల్లాలో 205.4 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, 116.5 మి.మీ మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 46 శాతం తక్కువగా నమోదైంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి, అల్పపీడనం ఏర్పడ్డాయని, వీటివల్ల వర్షాలు పడతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పట్లో పంటకాలువలకు సాగునీరు విడులయ్యే పరిస్థితి లేకపోవడంతో వరుణుడిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.