Anndata
-
అన్నదాతకు విత్తన కష్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పెద్ద నోట్ల రద్దు అన్నదాతలకు మరిన్ని ఇక్కట్ల పాల్జేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ఖాతరు చేయపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను విత్తన దుకాణాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు స్వీకరించడం లేదు. ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లను తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అధికారులు ఆ ఉత్తర్వులను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు, విత్తనాలు ఎరువులు కొనే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంలలో చిల్లర అందుబాటులో లేక రైతులకు కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో శనగ విత్తనాల పంపిణీ జరుగుతోంది. ఇటీవలే విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 63 వేల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 30 నుంచి 40 శాతం మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేయలేదు. విత్తనాలు కొనుగోలు చేద్దామనుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దీంతో రైతుల వద్ద డబ్బులు అందుబాటులో లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేయలేకపోయారు. 10 రోజులు దాటుతున్న పరిస్థితి యధాతథంగానే ఉంది. బ్యాంకులు, ఏటీఎంలలో సైతం కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు. చాలా బ్యాంకులు వాటి ఏటీఎంలు మూతబడ్డాయి. తగినంత డబ్బులు ఎప్పటికి అందుబాటులోకి వస్తోందో కూడా తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది రైతులు విత్తనాలు కొనలేక అలాగే ఉండిపోయారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతరు చేయని అధికారులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సంబంధించి రైతుల వద్ద పాత నోట్లను తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయశాఖ కమిషనరేట్ ఈ నెల 15న ఉత్తర్వులిచ్చింది. నవంబర్ 24 వరకు పాత నోట్లను తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు, పాత నోట్లను తీసుకోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పాత నోట్లు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పొలాలు బీళ్లుగా ఉంచక తప్పదని రైతులు వాపోతున్నారు. -
కొనుగోడు కేంద్రాలు
► అన్నదాతను వెంటాడుతున్న కొనుగోలు కష్టాలు ► కేంద్రాల ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత కరువు ► అప్పుడే మొదలైన అక్రమ రవాణాలు ► ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్న దళారులు ► రైతన్నకు మిగిలింది కష్టమే... అష్టకష్టాలు పడి... ప్రకృతికి ఎదురీది... ఆర్థిక సమస్యలను అధిగమించి... కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట కోతలు మొదలయ్యారుు. అప్పుడే కళ్లాలకు చేను తరలుతోంది. ఇప్పుడిప్పుడే నూర్పులు మొదలుపెట్టి బస్తాల్లో భద్రపరుస్తున్నారు. ఆరుగాలం కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించే తరుణమిది. పెట్టుబడికి తగిన గిట్టుబాటుకోసం పరితపించే సమయమిది. సర్కారు ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాల్సిన కాలమిది. కానీ సర్కారు ఇంకా దీనిపై దృష్టిసారించలేదు. మద్దతు ధరను అధికారికంగా ప్రకటించి... విసృ్తత ప్రచారం చేపట్టలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత నివ్వలేదు. కానీ అన్నింటా ముందుండే దళారీ వ్యవస్థ మాత్రం అప్పుడే సిద్ధమైంది. రైతన్న కష్టాన్ని తక్కువ మొత్తానికే కాజేసేందుకు బాటలు వేసుకుంది. - పార్వతీపురంరూరల్/ బలిజిపేటరూరల్/సీతానగరం బలిజిపేట మండలంలో గత ఏడాది ఇలా... కొనుగోలు కేంద్రాలు: వెలుగు ఆధ్వర్యంలో 5, పీఏసీఎస్ 2 విక్రరుుంచిన రైతులు: 3075 సేకరించిన ధాన్యం: 38,041.48టన్నులు ఈ ఏడాది ఖరీఫ్ సాగు: 6,307 హెక్టార్లలో జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో అప్పుడే కోతలు మొదలయ్యారుు. వరి నూర్పులు చేసి కళ్లాల్లో అమ్మకానికి ధాన్యం సిద్ధమైంది. కానీ సర్కారు మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీనివల్ల అప్పుడే దళారులు కళ్లాల్లో వాలుతున్నారు. ధాన్యాన్ని అక్రమంగా మిల్లుకు తరలించేస్తున్నారు. సర్కారు క్వింటా సాధారణ రకం రూ. 1470లుగా ప్రకటించినప్పటికీ దళారులు మాత్రం క్వింటాకు రూ. 1250లే చెల్లిస్తున్నారు. రైతన్న అవసరాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పార్వతీపురం మండల వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ పంట అన్నదాతకు అనుకూలంగా మారినా.. కొనుగోలు కేంద్రాలు సర్కారు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారులు అప్పుడే లాభాలు పొందుతున్నారు. . దాదాపు 30శాతం వరకు వరి కోతలు పూర్తయ్యారుు. పండిన ధాన్యాన్ని విక్రరుుంచేందుకు ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల కన్ను వాటిపై పడింది. గత ఏడాది ప్రారంభంలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు దశలవారీగా 13 కేంద్రాలకు విస్తరించారు. బిల్లుల చెల్లింపు మాత్రం మార్చివరకు కొనసాగారుు. ఈ ఏడాది ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ఈ నెలాఖరు నాటికి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నారుు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. ఈ ఏడాది 35వేల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నారుు. సుమారు 26వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో సేకరించడానికి సన్నద్ధమవుతున్నాం.- ఎం.వాసుదేవరావు, మండల వ్యవసాయాధికారి తరలిపోతున్న ధాన్యం : సీతానగరం మండలం 2016-17 ఖరీఫ్ సీజన్లో రైతులు వరి ఎదలు, ఉభాల రూపంలో 6,148 హెక్టార్లలో వరిపంట సాగుచేసి 1.5లక్షల క్వింటాళ్ళ ధాన్యం పండించినట్లు అధికారుల అంచనా. అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురవడంతో తొలుత ఆరుతడి భూముల్లో వరి ఎదలు వేశారు. నీటి వనరులున్న భూముల్లో ఉభాలు చేశారు. దీంతో నవంబర్ రెండో వారం నుంచే వరి కోతలు ముమ్మరంగా ప్రారంభించి... నూర్పులు మొదలెట్టేశారు. కానీ సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో పండించిన పంటలో చాలా వరకూ ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. రైతుల అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు విక్రరుుంచాల్సి వస్తోంది. ఈ మండలంలో ప్రైవేటు వర్తకులు క్వింటాలు ధాన్యానికి కేవలం రూ. 1190లే చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు.... మండలంలోని వరిచేలు కోతలు జరుగుతున్న కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని నిర్ణరుుంచాం. 9 పీఏసీఎస్‌లు, 5 గ్రామైక్య సంఘాల ద్వారా కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. - బి సత్యనారాయణ, తహసీల్దార్, సీతానగరం. -
విస్తరిస్తున్న వయ్యారిభామ
అన్నదాతల పాలిట శాపంగా మారిన కలుపుమొక్క శ్వాసకోశ, చర్మ వ్యాధులకు మూలం పంటను ఎదగనీయని మొక్క దృష్టి సారించని అధికారులు ఆందోళనలో అన్నదాతలు మెదక్:వయ్యారిభామ అనే కలుపు మొక్క అన్నదాతల పాలిట శాపంగా మారింది. దానిపేరులోనే అందం ఉన్నప్పటికీ పనితీరుమాత్రం ఘోరమే.. అది మొలకెత్తిన చోట ఏ పంట ఎదగనీయదు...దాని నుంచి వచ్చే గాలితో శ్వాసకోశ, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. పశువులు మేసినా ప్రాణపాయం తప్పదని...సాక్షాత్తు వ్యవసాయ అధికారులు చెబుతున్నారంటే ఆ మొక్క సృష్టించే విధ్వంసం అంతాఇంత కాదు. రోజు రోజుకు విస్తరిస్తున్న వయ్యారిభామ విషపు మొక్కను అంతం చేసేందుకు పాలకులు, అధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో అన్నదాతల పాలిట ఆ మొక్కశాపంగా మారింది. జిల్లాలో ఎక్కడచూసినా ఈ కలుపుమొక్కలే కనిపిస్తాయి. సుమారు 7 దశాబ్దాల క్రితం దక్షిణ అమెరికా నుంచి జొన్నలు దిగుమతి చేసుకున్న క్రమంలో ఈ మొక్కకు సంబంధించిన విత్తనాలు ఆ ధాన్యంలో వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్క మొలకెత్తి పూతదశకు చేరినప్పుడు వీచే గాలిలో దీని విత్తనాలు గాలి తాకిడికి వేలాది అడుగుల దూరం వరకు వెళ్లిపోతాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మొక్క మొలకెత్తిన ప్రాంతంలో ఎలాంటి పంట మొక్కలు, ఇతర మొక్కలుగాని ఎదగవని చెబుతున్నారు. ఈ మొక్క వల్ల మనుషులకు శ్వాసకోశ వ్యాధులతోపాటు చర్మవ్యాధులు వస్తాయని అంటున్నారు. అన్నదాతలకు వచ్చే ఽశ్వాసకోశ వ్యాధులు కేవలం దీనివల్లేనని పేర్కొంటున్నారు. పశువులు ఈ మొక్కను మేషాయంటే మరణం సంభవిస్తుందని వెటర్నరి అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్కను నామరూపల్లేకుండా తుదముట్టించాలంటే ఒక్క రైతుల వల్లే కాదని, ప్రభుత్వ చర్యలు తప్పనిసరి అని ఓ జిల్లా ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈజీఎస్ వంటి పథకాల్లో భాగంగా ఈ మొక్కలను పూర్తిగా తొలగించి నిప్పుపెట్టి కాల్చివేస్తే తప్ప బయట పడటం కష్టమేనని చెబుతున్నారు. ఏదేమైనా అన్నంపెట్టే రైతన్నను ఈ విషఽపు మొక్కబారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
దుర్భిక్షం.. దండయాత్ర
జిల్లాలో కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది.. ఏ రైతును కదిపినా కన్నీళ్లే. ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదంటూ నిట్టూర్పులే. పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలు, కూలీలుగా మారుతున్నారు. కనీసం ఉపాధి పనులు కూడా దొరక్క పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. - వరుస కరువులతో అన్నదాత కుదేలు - ఎండుతున్న వేరుశనగ - తీవ్ర మవుతున్న పశుగ్రాసం కొరత - కబేళాలకు తరలుతున్న పశువులు - ప్రభుత్వ చేయూత కరువు - పడమటి మండలాల్లో సాగు దారుణం - కుప్పం నియోజక వర్గంలో - భారీ సంఖ్యలో వలసలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఈ ఏడాది వర్షాలు రైతన్నను ఊరించి ఉసూరుమనిపించాయి. అప్పులు చేసి.. అష్ట కష్టాలు పడి వేరుశనగ పంటసాగు చేసిన రైతుకు చివరకు అప్పుల మూటే మిగిలింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడులు నామమాత్రంగానే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరకు అన్నదాతకు గుండె కోతను మిగుల్చుతున్నాయి. సీఎం సొంత ఇలాకా కుప్పంలోనే భారీ సంఖ్యలో వలసలు ఉండటం గమనార్హం. ఇంకా జిల్లాలో వలసలు పడమటి మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మూగ జీవాలకు సైతం పశుగ్రాసం లేక కబేళాలకు తరలుతున్నాయి. ప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. కొంతమంది ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి గడ్డి తెచ్చుకుని పశువులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని తలుచుకుని పాడి రైతు తల్లడిల్లిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లు సైతం నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే 10 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టదన్నట్లు వ్యవహారిస్తోంది. ప్రత్యామ్నాయమే శరణ్యం... - ఆగస్టు నెలలో 117.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవా ల్సి ఉండగా 109.7మిల్లిమీటర్ల వర్షపాతం కురిసింది. - జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో ఎన్నడూ లేని రీతిలో 1500 అడుగుల మేరకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న 80 శాతం మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. - సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు వేరుశనగ పంటను వేయలేకపోయారు. - దీంతో ప్రత్యామ్నాయంగా ఉలువలు, పెసలు, ఉద్దులు జొన్నలు రాగి పంటలను సాగు చేస్తున్నారు. - తూర్పు ప్రాంతాల్లో... ఎన్నడూ లేని విధంగా తూర్పు మండలాల్లో సైతం తాగు నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసే పరిస్థితులు నెలకొన్నాయి. - తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ, వరదయ్య పాళ్యం సత్యవేడు మండలాల్లో వరి సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో తూర్పు మండలాల్లో ఖరీప్‌లో వరి పంటను 15,365 హెక్టార్లల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 6132 హెక్టారుల్లో మాత్రమే సాగు చేశారు. - సరైన సమయం వర్షలు కురవకపోవడంతో వరి నారు పోసేందుకు రైతులు మొగ్గుచూపడం లేదు. ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎండుతున్న పంటలు... - వేరుసెనగ పంట 1,38,375 హెక్టార్లకు గానూ 1,05,869 హెక్టార్లలో సాగు చేశారు. ఇటీవల కురిసిన అరకొర వర్షానికి పైరు పచ్చగా మారిన కాయలు మాత్రం శూన్యం. - 2.2 లక్షల హెక్టార్లలో మామిడి, 1 హెక్టారు దానిమ్మ, 1 హెక్టారు చీనీ, 1 హెక్టారు జామ, 1 హెక్టారు అరటి, 1 హెక్టారు బొప్పాయి పంటలు జిల్లాలో సాగులో ఉన్నాయి. బోరుబావుల్లో నీరు అడుగంటడంతో రైతులు చెట్లను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. -
కృష్ణా డెల్టాలో కరువు దరువు
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరొందిన కృషా ్ణడెల్టాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టివేశాయి. సెప్టెంబరులో పుడమితల్లికి పచ్చకోక కట్టినట్లు కళకళలాడాల్సిన పొలాలు నేడు నైచ్చి కలుపు మొక్కలతో దర్శనమిస్తున్నాయి. జూన్ ఒకటో తేదీ నాటికే కాలువలకు సాగు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చిన పాలకులు సెప్టెంబరు వచ్చినా నెరవేర్చలేదు. దీంతో ఈ ఖరీఫ్‌ను వదులుకోవాల్సిందేనా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. - కాలువలకు చుక్కనీరు విడుదల కాని వైనం - 2.53 లక్షల ఎకరాల్లో వరిసాగు లేనట్టే! - పశ్చిమ కృష్ణాలో 62,500 ఎకరాల్లో వరిసాగు లేదు - రీ షెడ్యూలుకే పరిమితమైన పంట రుణాలు - దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు మచిలీపట్నం : జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కాలువలకు నీరు విడుదల చేయకపోవటంతో వర్షాలు, బోరు నీటి ఆధారంగా ఇప్పటివరకు 3.80 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తి చేశారు. మిగిలిన 2.54 లక్షల ఎకరాల్లో వరినాట్లు ఈ ఏడాదికి లేనట్టే. ఆ విషయాన్ని వ్యవసాయాధికారులే సూచనప్రాయంగా చెప్పారు. 21 వేల ఎకరాల్లో వరి నారుమడులు పోయగా 60 శాతం నారుమడులు నీరు లేని కారణంగా చనిపోవటమో, నారు ముదిరిపోవటమో జరిగింది. ఆగస్టులో అడపా దడపా వర్షం కురిసినా మొక్కలు ఎదిగేందుకు తోడ్పడకపోవటంతో నాట్లు వేసిన పొలాల్లో వరిపైరు చావలేక, బతకలేక కొట్టుమిట్టాడుతోంది. శివారు మండలాల్లో నాట్లు పడేనా? సముద్రతీరం వెంబడి, కాలువ శివారున ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మొవ్వ, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి, కైకలూరు, కలిదిండి తదితర మండలాల్లో ఈ ఖరీఫ్‌లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువలకు నేటి వరకు నీరు విడుదల కాలేదు. వర్షాధారంగా పోసిన నారుమడులు 45 నుంచి 50 రోజుల వయసుకు రావటంతో వరినాట్లు వేయాలా, వద్దా అని రైతులు అయోమయానికి గురవుతున్నారు. కాలువలకు నీరు రాకుంటే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఖరీఫ్‌లో వరినాట్లు పడకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని రైతులు వాపోతున్నారు. సెప్టెంబరు 15 నాటికి వరినాట్లు పూర్తికాకుంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రబీలో సాగు చేసే 1001, 1010, 1121 రకాల వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నా కాలువలకు నీరు రాకుంటే ఈ రకం వంగడాలను కూడా ఎలా సాగు చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి 521.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 512.6 మిల్లీమీటర్లు కురిసిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 20 మిల్లీమీటర్లు తక్కువ గాని, ఎక్కువ గాని ఉంటే సాధారణ వర్షపాతం గానే పరిగణించే అవకాశం ఉంది. జూలైలో 97.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 270.6 మిల్లీమీటర్లు కురిసింది. అప్పట్లో కురిసిన వర్షం రైతులకు ఉపయోగపడలేదు. ప్రభుత్వం ఈ వర్షపాతాన్ని సైతం లెక్కల్లో చూపటం శోచనీయం. వెంటాడుతున్న కరువు ఛాయలు జిల్లాలో గత ఇరవయ్యేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్‌కు సెలవు ప్రకటించే పరిస్థితి నెలకొంది. దీంతో కృష్ణాడెల్టాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎవరైనా రైతు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటే రూ.10 వేలు అప్పు పుట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయం ఆశాజనకంగా లేకపోవటంతో అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది. పంటలు లేకపోవటంతో రోజువారీ పనులు కూడా రైతు కుటుంబాల్లో జీవనం అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో రూ.2396 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు రూ.1740 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చూపుతోంది. వాటిలో 70 శాతం రీషెడ్యూలు చేసిన రుణాలేనని రైతులు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే పనులు లేక జీవనం కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు భయపడుతున్నారు. -
నిండని చెరువులు..రైతన్న గుండె గుబేలు
వరుణుడి కరుణ కోసం రైతన్న ఆకాశం వైపు ఎదురు చూడడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. రెండు నెలలుగా వర్షాలు సాధారణ స్థాయి కన్నా తక్కువగా నమోదు కావడంతో భూములన్నీ బీళ్లుగా మారాయి. దీంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చెరువులు నిండకపోవడంతో ఆయకట్టు కూడా ప్రశ్నార్థకంగా మారింది. - సకాలంలో కురవని వర్షాలు - అడుగంటిన భూగర్భజలాలు - నెర్రెలువారిన పంట పొలాలు - ఆందోళన చెందుతున్న అన్నదాతలు మహేశ్వరం: వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మండల పరిధిలోని పలు చెరువుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఆయకట్టు కింద సాగయ్యే పంట పొలాలు బీళ్లుగా మారుతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో ఉన్న పెద్ద చెరువు, తుక్కుగూడ, మంఖాల్, తుమ్మలూరు, మహేశ్వరం, మన్సాన్పల్లి, అమీర్‌పేట్, కల్వకోల్, గొల్లూరు, కోళ్లపడకల్, దుబ్బచర్ల, నాగారం తదిర గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలల్లో చుక్కనీరు లేవు. గతేడాదితో పోల్చుకుంటే.. ఈసారి తొలకరి ముందుగా పలకరించడంలో రైతులు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. దీంతో దుక్కులు దున్ని ఎరువులు, విత్తనాలు చల్లుకున్నారు. అయితే మొలకెత్తిన మొక్కజొన్న, పత్తి, వరి, కూరగాయ పంటలు వర్షాలు కురవక ఎండుముఖం పడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు సైతం ఎండిపోయాయి. దీంతో వీటిని నమ్ముకున్న రైతులు వరి సాగుకు దూరమయ్యారు. వర్షాలు అదును దాటి పోతుండడంతో చెరువు ఆయకట్టు కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. నాట్లు వేసుకునే సమయంలో చెరువుల్లో సాగు నీరు లేక పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. చెరువుల్లో నీరు లేక ఆయకట్టు కింద వరి సాగు చేద్దామంటే చెరువుల్లో చుక్క నీరు లేదు. బోర్లు అన్నీ ఎండు ముఖం పట్టాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వర్షాధార పంటలు ఎండు ముఖం పట్టాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. - శేఖర్, రైతు, కోళ్లపడకల్ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి రైతులు కంది, పెసర, బెబ్బర , ఆము దం, నువ్వులు ఆరుతడి పంటలు వేసుకోవాలి. వాడు ముఖం పడుతున్న పంటలకు యూరియాను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. -రుద్రమూర్తి, ఏడీఏ, మహేశ్వరం చెరువులు నిండుతేనే.. చెరువులు నిండుతేనే బోర్లలో పుష్కలంగా నీరు ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తే భూగర్భజలాలు పెరిగి బోర్లు పుష్కలంగా నీరు పెరుగుతాయి. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి అన్నదాతకు నష్టపరిహారం చెల్లించాలి. - పుంటికూర శేఖర్‌రెడ్డి, రావిర్యాల -
బీమా లేదు..ధీమా లేదు
- ఎకరాకూ దక్కని వైనం - ముగిసిన పంట బీమా గడువు - అధికారుల వైఫల్యం - ఆందోళనలో అన్నదాతలు సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు ధీమా లేకుండా పోతుంది. ఏటా విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలు..కరువు కాటకాల బారినపడే పంటలకు బీమా లేకుండా పోతుంది. ప్రభుత్వ ఉదాశీనత, శాఖల మధ్య సమన్వయ లోపం..ముఖం చాటేస్తున్న బ్యాంకర్ల పుణ్యమాని ఏ ఒక్క రైతు బీమా పొందలేని పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు బీమా పథకం నేడు అక్కరకు రాకుండా పోతోంది. గతేడాది హుద్‌హుద్ వల్ల సర్వం తుడుచుకుపెట్టుకుపోయినా ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చిందే కానీ బీమా రాలేదు. ఈ పథకం పట్ల రైతుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత ఖరీఫ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క ఎకరానికీ బీమా వర్తించలేదు. ఏరైతూ బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,12,285 ఎకరాలు. ఇందులో 2,57,670 ఎకరాల్లో వరి, 94,570 ఎకరాల్లో చెరుకు, 56,535 ఎకరాల్లో రాగి పంటలు సాగు చేస్తుండగా, ఇతర పంటలన్నీ మరో 1,3,510 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చెరకుతో పాటు వరిపంటలకు మాత్రమే పంట బీమా వర్తిస్తుంది. ఈ రెండింటి విస్తీర్ణమే మూడొంతులుంటుంది. 80 శాతం మంది ఈ పంటలే పండిస్తుంటారు. అయినా సర్కార్ పంట బీమా పథకం అమలు పట్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. నాలుగేళ్లుగా కవరైన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. 2014-15లో అతి కష్టమ్మీద 3 వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే బీమా కల్పించారు. ఈ ఏడాది ఒక్క ఎకరాకు కూడా బీమా కల్పించ లేదు. ఒక్క రైతు కూడా ఒక్కరూపాయి ప్రీమియం చెల్లించలేదు. వరికైతే ఎకరాకు పెద్దరైతు రూ.522లు, సన్నకారు రైతు 470లు, చెరకుకైతే రూ.2806, రూ.2229, మొక్క జొన్న కైతే రూ.277లు, రూ.249 చొప్పున ప్రీమియం చెల్లించాలి. జూలై-31తో గడువు ముగిసినా ఎవరూ ప్రీమియం చెల్లించిన వైనం లేదు. హుద్‌హుద్ విరుచుకుపడిన గతేడాదితో సహా గడిచిన నాలుగేళ్లలో బీమా చేయించుకున్న ఏ ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు కూడా బీమా సొమ్ము విడుదల కాలేదు. 2012-2014 మధ్య పంటల బీమా చేయించుకున్న రైతులకు సుమారు రూ.8కోట్ల మేర బీమా మొత్తం రావాల్సి ఉంది. ఒక్క పైసా విడుదల కాకపోవడం కూడా రైతుల్లో ఈపథకం పట్ల నిరాశ కలిగించింది. రైతులను చైతన్య పర్చడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎకరాకు ఎంత కట్టాలి..ఎప్పటిలోగా చెల్లించాలి అనేది ఏ వ్యవసాయాధికారి మా వద్దకు వచ్చి చెప్పిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. కరువుఛాయలు తరుముకొస్తున్నాయి. మరొక పక్క రోజుకో వాయుగుండం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటువంటి తరుణంలో ఏ దశలో పంట ను కోల్పోవల్సి వస్తుందో తెలియని పరిస్థితి. -
కరువు కాటు.. కాడెద్దులూ భారమే!
వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఎదిగిన కొడుకు తల్లిదండ్రులకు ఎంత అండో.. కాడెద్దులు కూడా అంతే... పశువుల వయస్సు పెరిగి వ్యవసాయానికి పనికిరాక పోయినా అమ్మడానికి రైతులు ఒప్పుకోరు... రైతులకు, పశువులకు అంత అనుబంధం ఉంటుంది... అలాంటి వారికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చింది. ఇలాంటి సమయంలో సాగు సంగతి దేవుడెరుగు. కనీసం పశువుల కడుపు నిండే పరిస్థితి కూడా లేదు... దీంతో మూగ జీవాల బాధ చూడలేక మరో గత్యంతరం లేక కళేబరాలకు అమ్ముకుంటున్నారు. చిన్నమండెం: జిల్లాలోని పలు మండలాల నుంచి నెల రోజులుగా వందల సంఖ్యలో పశువులను కళేబరాలకు తరలిస్తున్నారు. ఏ సంతలో చూసినా ఇదే దృశ్యం కనిపిస్తోంది. పశువులకు మేత కూడా లేకపోవడంతో సంత జరిగే ప్రాంతాలలో దిగాలుగా పశువులను అమ్మేదుకు వచ్చిన అన్నదాతలే కనిపిస్తున్నారు. ప్రతి నిత్యం రాయచోటి-బెంగ ళూరు ప్రధాన రహదారిలో, కడప-చిత్తూరు జాతీయ రహదారిలో పశువులతో వెళ్తున్న లారీలు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చినుకు కూడా రాలకపోవడంతో చెరువుల్లో నీరు లేక పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం పశువులకు కావాల్సిన మేత కూడా దొరకక పోవడంతో వాటిని బతికించుకునే అవకాశాలు లేవని, అందుకే అమ్ముకుంటున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కనీసం పాలు ఇచ్చే పాడి పశువులకైనా ప్రభుత్వం పశుగ్రాసం పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. గతంలో వరిగడ్డి కట్ట ఒక్కొక్కటి రూ.5-6లకు దొరుకుతుంటే, ప్రస్తుతం అది రెండింతలు అయ్యింది. దీంతో పాటు ట్రాక్టర్ వేరుశనగ కట్టె కొనాలంటే రూ.15 వేలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేత భారం మోయలేక అమ్ముకుంటున్నారు. దీంతో పాడి పశువులు, సేద్యం చేసే పశువులు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. పశువుల మాంసానికి పలు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉండటం అందుకు ఒక కారణంగా తెలుస్తోంది. అయితే పశువులను అక్రమంగా తరలించటం చట్ట వ్యతిరేకమని చట్టాలు చెబుతున్నాయి. కాడెద్దులను మేపాలంటే భారంగా ఉంది: బుడ్డా వెంకట్రమణ, చాకిబండ కస్పా, రైతు కరువు వచ్చేసింది. పశువుల మేత దొరకడం లేదు. పంటలు సాగు అవ్వలేదు. కాడెద్దులు మేపాలంటే భారంగా ఉంది. గతంలో అడవులకు పశువులను తీసుకెళ్లి మేపే వాళ్లం. పంట పొలాల చుట్టూ పశువులకు కావాల్సిన మేత ఉండేది. కానీ ఇప్పుడు లేదు. మేత కొనాల్సిన పరిస్థితి వచ్చింది. నెలకు పశువుల మేతకు సుమారు 4-5వేల రూపాయలు అవుతోంది. దీంతో చుట్టు పక్కల చాలా ఊర్లలో పశువులను అమ్ముకున్నారు. నెల రోజుల వరకు వర్షాలు పడకుంటే మేము కూడా పశువులను అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అయినా ఆదుకుని, పశుగ్రాసం పంపిణీ చేయిస్తే బాగుంటుంది. -
పల్లె పొమ్మంటోంది
కడప గడపలో కరువు దరువేస్తోంది. ఆకాశ గంగ దిగిరానంటోంది. పాతాళ గంగ పైకి రానంటోంది. వెరసి పంటపొలాలు బీళ్లుగా మారాయి. రైతు బతుకు దుర్భరంగా మారింది. పూట గడవడం కష్టమైంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు వలసబాట పడుతున్నారు. కన్న ఊరిపై మమకారం చంపుకోలేక.. ఇక్కడే ఉండి క ష్టాల కాపురం చేయలేక.. గుండెలోతు బాధతో గూడు విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఆ పల్లెల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇది కరువు మిగిల్చిన పల్లెల కన్నీటి క(వ్య)థ. - అన్నదాతను కుదిపేస్తున్న కరువు రక్కసి - పంటలు పండక.. పనులు దొరక్క.. - వలసబాట పడుతున్న గ్రామీణులు - నిర్మానుష్యంగా మారుతున్న పల్లెసీమలు రాయచోటి: అవి రాయచోటి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో చుట్టూ కొండల మధ్య ఉండే మారుమూల పల్లెలు. ఏ పల్లెలో అడుగిడినా కరువు ఛాయలే కనిపిస్తాయి. ఏ ఇంట్లోకి తొంగి చూసినా కరువు రక్కసి చేస్తున్న వికటాట్ట హాసమే వినిపిస్తుంది. ఏరోజుకారోజు తిండిగింజలు సంపాదించుకుంటే కడుపుకు కాసింత తిండి దొరుకుతుంది. లేదంటే పొయ్యి వెలగదు. పొగచూరిన పేదరికం. బతుకంతా అంధకారం. ఇదీ అక్కడి రైతుల దయనీయ స్థితి. రాయచోటి నియోజకవర్గంలో గత పదేళ్లుగా కరువు రక్కసి కరళానృత్యం చేస్తోంది. యేటా పంటలు దెబ్బతినడంతో మధ్య తరగతి రైతులు కూడా కూలీలుగా మారిపోతున్నారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టు బడులు కూడా చేతికి రాక అవస్థలు పడుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, కుటుంబ పోషణ భారమై అల్లాడిపోతున్నారు. అప్పులు తీర్చేందుకు భూమిని అమ్ముదామన్నా కొనేవారు కూడా కరువయ్యారు. ఆకలి బాధలు భరించలేక క్రమక్రమంగా ఒక్కో రైతు వలసబాట పట్టాడు. కరువు కాలంలో వ్యవసాయ పనులు లేవు. పనికి రమ్మని పిలిచే రైతులు కరువయ్యారు. వర్షాభావంతో పొలాలు బీళ్లుగా మారి భూస్వాములు సైతం ఎలా బతకాలని దిగులుపడుతున్నారు. కూలి పనులకు వెళ్లిన విషయం అందరికీ తెలిస్తే చిన్నతనంగా భావించి రాత్రికి రాత్రే ఇళ్లకు తాళాలు వేసి పెద్ద రైతులుసైతం వలస బాట పడుతున్నారు. రాయచోటి మండలం మాధవరం గ్రామ పంచాయతీలోని మూలవాండ్లపల్లె, మల్లెంవాండ్లపల్లె, కాల్వపల్లెలు ఇందుకు సజీవ సాక్ష్యాలు. కాల్వపల్లెలో మొత్తం 20 కుటుంబాల వారు నివసిస్తున్నారు. ప్రతి కుటుంబానికి రెండు నుంచి 3 ఎకరాల వరకు పొలం ఉంది. చిన్న, సన్నకారు రైతులయిన వీరు వర్షంపై ఆధారపడి పంటలు సాగు చేసుకొనేవారు. గత ఏడాది కరువు పరిస్ధితులు తట్టుకోలేక ఆపల్లె వాసులు నేటికి 8 ఇళ్లకు తాళం వేసి వలస వెళ్లారు. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన కుటుంబాలు కూడా వలస పోయే పరిస్థితి ఉంది. ఈ పల్లెలోని వెంకటమల్లప్ప, జయమ్మ, సూర్యనారాయణ, సరస్వతమ్మ, మునెప్ప, పార్వతమ్మ, రవణప్ప, నారాయణమ్మ, చంద్రమోహన్, సుజాత, మల్లికార్జున, రాజేశ్వరి అనే రైతులు తమ పొలంలో పంటలు పండక పోవడంతో పాటు ఈ పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తోచక బెంగళూరులోని గురుడాచర పాళెంకు కూలి పనులకోసం వలస వెళ్లారని ఆ గ్రామస్తులు తెలిపారు. అలాగే మల్లెంవాండ్లపల్లెకు చెందిన పురుషోత్తం అనే రైతు తన ఇంటికి తాళం వేసి చిత్తూరు సమీపంలో మామిడితోటల్లో కాపలాదారుడిగా వె ళ్లాడని ఆ గ్రామస్తులు కొందరు తెలిపారు. కరువు ఇలాగే వెంటాడితే తాము కూడా వలస బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఆవేదనతో చెప్పారు. కన్న ఊరిని.. నేల తల్లిని నమ్ముకొని తాము ఇంత వరకు ఉన్నామని, తమకు తాగేందుకు నీరు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఈ పల్లెలపై దృష్టి సారించి పల్లె ప్రజలకు కరువు పనులు కల్పించి వలసలు నివారించాల్సిన అవసరం ఉంది. వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా నాపేరు కదిరప్ప. మాది మాధవరం గ్రామపంచాయతీలోని కాల్వపల్లె. మా పల్లెలో 20 ఇళ్లు ఉంటే నేటికీ 8 మంది ఇళ్లకు తాళం వేసి బెంగళూరులోని గురుడా చరపాళెంకు వలస వెళ్లారు. మరో నాలుగు ఇళ్లకు చెందిన వారు కూడా వలస వెళ్లారు. ఇంకొన్ని రోజుల్లో వర్షం పడకపోతే నేను కూడా వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. ఉపాధి పనులు కల్పించాలి - ఆదెప్ప - కాల్వపల్లె నా పేరు అద్దెప్ప. మాది మాధవరం గ్రామ పంచాయతీలోని కాల్వపల్లె. నేను ఇలాంటి కరువును ఎప్పుడూ చూడలేదు. నాకు ఉన్న మూడుఎకరాల పొలంలో సాగు చేసేందుకు దుక్కులు చేసి వాన కోసం ఎదురు చూస్తున్నా. వాన రాకపోతే నేను కూడా ఇంటికి తాళం వేసి వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం ఉపాధి పనులు కల్పిస్తే ఆ పనులు చేసుకొని నేను కుటుంబాన్ని పోషించుకుంటా. లేకపోతే వలస వెళ్లి పోతా. -
ఖరీఫ్ ఖతం
రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆయకట్టు కింద ఈ ఖరీఫ్‌లో పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు తుంగభద్రకు సరైన వరద నీరు రాలేదు. ఈ ప్రాజెక్టు నిండితేనే ఆర్డీఎస్ ద్వారా నీటి విడుదల సాధ్యమవుతుంది. కానీ, ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడంతో ఖరీఫ్ పంటపై అన్నదాతలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. - ఆర్డీఎస్ నుంచి నీటి విడుదల కష్టమే - తుంగభద్రలో 36టీఎంసీల నీటి నిల్వ చేరితేనే కిందకు విడుదల - ప్రస్తుతం వస్తున్న వరద 8,708 క్యూసెక్కులే - కర్ణాటకలో సరైన వర్షాలు లేకపోవడమే కారణం - అయోమయంలో అన్నదాత జూరాల : తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గింది. కేవలం 8,708 క్యూసెక్కులు వస్తుంది. దీంతో ఆర్డీఎస్ పరిధిలో ఖరీఫ్ సాగుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వ మరో 37 టీఎంసీలు చేరితే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఆ నీరు ఎప్పుడు వస్తుందో... ఆర్డీఎస్ ఆయకట్టులో ఖరీఫ్‌కు సాగునీరు ఎప్పుడు అందుతుందో తేలని ప్రశ్నగా మారింది. ప్రతి ఏటా ఆగస్టు మొదటి, రెండవ వారాల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు ఖరీఫ్ నీటి విడుదల ప్రారంభమయ్యే ది. గతేడాది ఇదే రోజున తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటి నిల్వ 85 టీఎంసీలు ఉంది. ఇప్పుడు కేవలం 63 టీఎంసీలకే పరిమితమైంది. కర్ణాటకలో వర్షాలు తగ్గిపోవడం, ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మరీ తక్కువగా ఉండడంతో తుంగభద్ర ప్రాజెక్టులో నీటినిల్వ పూర్తిస్థాయికి చేరేందుకు ఎన్నాళ్లు పడుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులే మరో నెలరోజులు ఇలాగే కొనసాగితే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నదిలోకి నీటి విడుదల ప్రారంభం కాక.. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందడం కష్టమవుతుంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వకు చేరి క్రస్టుగేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదల చేస్తేనే ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌కు నదిద్వారా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు గేట్ల నుంచి నీటి విడుదల ప్రారంభమయ్యే వరకు ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం లేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 87,500 ఎకరాల ఆయకట్టు మన రాష్ట్ర పరిధిలో, కర్ణాటకలో అధికారికంగా 5వేల ఎకరాలు, అనధికారికంగా మరో 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు 1,2 ప్యాకేజీలలో ఆధునికీకరణ పనులు పూర్తికానందున పూర్తిస్థాయి ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లందించలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ ఖరీఫ్‌లో ఆర్డీఎస్ ద్వారా 25వేల నుంచి 30వేల ఎకరాల వరకు సాగునీరందించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వ నుంచి హెచ్ఎల్బీసీ, ఎల్‌ఎల్‌బీసీలకు ఖరీఫ్ ఆయకట్టులో నారుమడులు చేసుకునేందుకు ఇప్పటికే నీటి విడుదలను ప్రారంభించారు. రోజూ దాదాపు 7వేల క్యూసెక్కుల విడుదల కొనసాగుతుండగా రిజర్వాయర్‌కు పై నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో రోజురోజుకు తగ్గిపోతుంది. ఇన్‌ఫ్లో తగ్గిపోయినా ఆయకట్టుకు నీటి విడుదల చేసినందున పంటలు పూర్తయ్యే వరకు ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి ఔట్‌ఫ్లోను ప్రధాన కాలువల ద్వారా చేయాల్సి ఉంటుంది. దీంతో రిజర్వాయర్‌లో ఉన్న నీటిమట్టం రోజురోజుకు మరింతగా తగ్గిపోతుంది. వర్షాలు ఇలాగే ఆలస్యమైతే రిజర్వాయర్‌లో మరింతగా నీటిమట్టం పడిపోయి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఈ ఖరీఫ్‌లో కన్నీళ్లు తప్పేలా కని పించడం లేదు. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 (1633 అడుగులు) టీఎంసీలు కాగా, ప్రస్తు తం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి నిల్వ మట్టం 63.7 (1621.98 అడుగులు) టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే రో జున 85 టీఎంసీల నీటినిల్వ ఉంది. -
వర్షం.. హర్షం..
- విశాఖలో 4.4 సెం.మీల వర్షపాతం - జిల్లాలోనూ పలుచోట్ల వాన సాక్షి, విశాఖపట్నం : చాన్నాళ్ల తర్వాత వరుణుడు కరుణించాడు. అనుకోని అతిథిలా వచ్చి వర్షం కురిపించాడు. కొన్నాళ్లుగా ఎండలతో అల్లాడిపోతున్న జనానికి ఊరటనిచ్చాడు. అటు అన్నదాతల్లోనూ ఆనందాన్ని పంచాడు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన మూడు రోజుల క్రితం నుంచి వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. అయితే ఆకాశం మేఘావృతమై చల్లదనం పంచిందే తప్ప చెప్పుకోదగినట్టుగా వాన కురవలేదు. శనివారం ఉదయం మాత్రం విశాఖలోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. అయితే ఆదివారం సాయంత్రం అనూహ్యంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఇటు విశాఖనగరంతో పాటు మధురవాడ, భీమిలి, గాజువాక, అటు జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విశాఖ విమానాశ్రయంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షంతో పాటు కొన్నిచోట్ల గాలులు కూడా వీచాయి. కొద్దిరోజులుగా మండే ఎండలతో వేగిపోతున్న జనానికి ఈ వాన కొండంత ఊరటనిచ్చింది. అలాగే రైతుల్లోన్లూ ఆశలు చిగురింపజేసింది. పగటి పూట ఎండలు కాసినా సాయంత్రమయ్యే సరికి అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఇలాంటి వర్షాలను కురిపిస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. -
కొనసాగుతున్న ఆత్మహత్యలు
మండ్య జిల్లాలో ఇద్దరు, బాగలకోటె జిల్లాలో ఓ రైతు బలవన్మరణం మండ్య : మండ్య జిల్లాలో రైతుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. చేసిన అప్పులు తీర్చలేమన్న ఆవేదనతో మరో ఇద్దరు అన్నదాతలు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... కృష్ణరాజపేట తాలూకా పరిధిలోని కెంపికొప్పలికి చెందిన చిన్నస్వామి(40) తన పొలంలోనే విషం తాగి మరణించాడు. ఐపనహళ్లి గ్రామానికి చెందిన మరో రైతు రామకృష్ణప్ప(35) తన ఇం టిలో ఉరి వేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య ఐదుకు చేరింది. మండ్య తాలూకా పరిధిలోని హిరికళలెకు చెందిన శంకరగౌడ, మూడనహళ్లికి చెందిన లోకేష్, దొడ్డతారహళ్లికి చెందిన ప్రదీప ఆత్మహత్యలు చేసుకున్న వైనం విదితమే. రైతు చిన్నస్వామి తనకున్న రెండు ఎకరాల స్థలంలో చెరుకు పంట సాగుకు రూ. రెండు లక్షలు అప్పు చేశాడు. పంట చేతికి వస్తుండగా పురుగు పట్టి మొత్తం ఎండిపోయింది. ఈ నేపథ్యంలోనే పం ట పెట్టుబడుల కోసం అప్పులు ఇచ్చిన వారు తమ డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచారు. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక శని వారం తెల్లవారుజామున తన పొలం వద్దకు చేరుకున్న చిన్నస్వామి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అతని భార్య లతామణి(35) తన ఇంటిలో ఉన్న నిద్రమాత్రలను మింగారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను కేఆర్ పేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే ఐపనహళ్లికి చెందిన యువరైతు రామకృష్ణ(35) తనకున్న నాలుగు ఎకరాల పొలంలో చెరుకు పం ట ను సాగు చేశాడు. ఇందుకోసం పీఎల్డీ బ్యాంక్ నుంచి రూ. 2.50 లక్షలు రుణం తీసుకుని పొలంలో బోరు వేయించాడు. బోరు బావిలో నీరు లభ్యం కాలేదు. అంతేకాక చెరుకు పంటకు నీరు అందక ఎండిపోయింది. దీంతో అప్పు ఎలా తీర్చాలంటూ మదనపడే అతను శనివా రం ఉదయం తన ఇంటిలో ఉరి వేసుకున్నాడు. బాగల్కోటె జిల్లాలోని మదూల్ తాలూకా శిరోళి గ్రామానికి చెందిన యువ రైతు హనుమంతు తిమ్మన్న దాసర (28) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పంట పెట్టుబడుల కోసం ఇతరుల వద్ద అతను అప్పు చేశారు. అయితే అకాల వర్షాలతో పంట పూర్తిగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ వచ్చాడు. ఆఖరుకు అప్పులు తీర్చే మార్గం కానరాక శనివారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. -
అన్నదాత కడుపుమండింది..
- చెరకు పంటను పశువులకు మేతగా వేసిన రైతు - ఫ్యాక్టరీకి చెరకు తరలించి ఏడునెలలైనా అందని బిల్లులు - మెదక్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో సంఘటన మెదక్ రూరల్: ఏడాది కింద పండించిన చెరకు ఫ్యాక్టరీకి తరలించిన ఆ అన్నదాతకు ఏడు నెలలు గడిచినా యాజమాన్యం బిల్లులు చెల్లించలేదు. సాగుచేసిన చెరకు పంటకు ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. భవిష్యత్తులో చెరకు ఫ్యాక్టరీ నడుస్తుందో లేదో అనే ఆందోళన. దీంతో ఆ అన్నదాత పండించిన చెరకు పంటను పశువుల మేతగా వేశాడు. ఈ సంఘటన మెదక్ మండలం గాజిరెడ్డిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సాపరవి గత ఏడాది మూడెకరాల్లో చెరకు పంట సాగుచేశాడు. పంటను ఫ్యాక్టరీకి తరలించిన రవికి యాజమాన్యం రూ.60వేలు ఇవ్వాల్సి ఉండగా అందులో రూ.40వేలను మాత్రమే చెల్లించింది. మరో రూ.20వేలు ఇవ్వాల్సి ఉన్నా నేటికి చెల్లించలేదు. ఫ్యాక్టరికి చెరకు తరలించి ఏడునెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో రైతు రవి ఆవేదనకు గురయ్యాడు. ప్రస్తుతం మూడెకరాల్లో చెరకు పంట మోడం అలాగే ఉంది. కాగా నేటికీ పంటను ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో కడుపు మండిన రైతు చేనులోకి పశువులను తోలి మేపించాడు. జిల్లాలోని వేలాది మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. అనంతరం రవి విలేకరులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా స్వాధీనం చేసుకోనందునే తనలాంటి రైతులకు ఈ పరిస్థితి ఎదురైందన్నారు. -
రైతును నట్టేట ముంచిన బాబు దొంగ హామీలు
- పట్టిసీమతో ఉత్తరాంధ్రకు నష్టం - అడ్డగోలు నిర్ణయాలతో రాష్ర్ట అభివృద్ధి వెనక్కి - ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాడుగుల: చంద్రబాబు అడ్డగోలు హామీలు అన్నదాతలను నట్టేట ముంచాయని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం మాడుగుల వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రుణ మాఫీ పేరుతో విడతలుగా ఇస్తున్న సొమ్మువడ్డీలకే చాలడం లేదన్నారు. ఓటుకు నోటు కేసు నడుస్తుండగా సెక్షన్ 8ని తెర మీదకు తీసుకు రావడంలో అర్థంలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా పట్టిసీమను తెరమీదకు తీసుకురావడంవలన పోలవరం ఎడమ కాలువ ఆయకట్టులో ఉన్న తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుండగా, చంద్రబాబు అడ్డగోలు నిర్ణయాలతో మన రాష్ట్రం వెనక్కు వెళుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బాలవాడీలు ఇపుడు కనిపించడంలేదన్నారు. ఇసుక మీద ఆంక్షలు విధించి, గ్రామాలలో బాత్రూములు నిర్మించుకోవడానికి నాటు బండితో ఇసుక తీసుకువస్తున్నా ఎర్ర చందనం స్మగ్లర్లులా చూస్తూ కఠినమైన కేసులు పెట్టడం ఎప్పుడూచూడలేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత వాసులకు ఇసుక దక్కకుండా బడా కంపెనీలకు ధారాదత్తం చేసి ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు గొళ్లవిల్లి సంజీవరావు, వేమవరపు రామ ధర్మజ, పడాల అప్పలనాయుడు ఆడారి కన్నారావు తదితరులున్నారు. -
ఇదేం తీరు(వా)
- అన్నదాతపై నీటితీరువా పిడుగు - అమాంతం రెట్టింపయిన పన్ను - అధికారుల వద్ద గత లెక్కలు లేని వైనం - పక్కదారి పడుతున్న వసూలు - లెక్కాజమా లేని తీరు సాక్షి, విశాఖపట్నం: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. పుట్టెడుకష్టాల్లో ఉన్న వీరిపై నీటితీరువా పెంచుతూ ఇటీవల సర్కార్ తీసుకున్న నిర్ణయం గుది బండగా మారుతోంది. జిల్లాలో 6,98,702 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ భూమిలో సాగునీటి వనరులు కింద 2,83,412 ఎకరాల భూమి సాగవుతుంటే, మరో 4,36,132 ఎకరాల భూమి పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగవుతుంది. జిల్లాలో మేజర్ అండ్ మీడి యం ఇరిగేషన్ ప్రాజెక్టులైన తాండవ కింద 51,465, రైవాడకింద15,344, కోనాం కింద 12,628, పెద్దేరు జలాశయం కింద 19,969 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే వంద ఎకరాలకు పైబడిన ఆయకట్టు ఉన్న 236 మీడియం ఇరిగేషన్ టాంక్స్ (చెరు వులు) కింద మరో 59వేలఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నీటితో పంటలు పండించు కున్న రైతులు ప్రభుత్వానికి నీటితీరువా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద ప్రాజెక్టుల కింద పంటలు పండించుకునే రైతులు వరికైతే ఎకరాకు ఏడాదికి ఒక పంటకు రూ.200,చెరువుల కింద రూ.100 చొప్పున, అదే చెరకుకైతే ఎకరాకు రూ.350 చొప్పున వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో చెరువులు, చిన్న, మధ్యతరహా నీటి వనరుల కింద సాగయ్యే లక్షా 80వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీటి తీరువా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.2.25కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఏటా కోటి మాత్రమే వసూలవుతుందని అధికారులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో రావాల్సిన నీటి తీరువా ఏకంగా రూ.21కోట్లకు పైగా పేరుకుపోయిందని అధికారిక అంచనా. వాస్తవంగా క్షేత్ర స్థాయి సిబ్బంది మాత్రం నీటి తీరువాను వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఉజ్జాయింపుగా చెప్పడమే తప్ప ఏ మండల పరిధిలో డిమాండ్ ఎంత? ఎంత వసూలైంది.? ఎంత బకాయి ఉందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ప్రభుత్వం నీటి తీరువా రెట్టింపు చేసింది. ప్రస్తుత డిమాండ్ రూ.2.25 కోట్లు నాలుగున్నర కోట్లకు చేరుకోనుంది.పెట్టుబడి వ్యయంతో భారం గా మారినసాగు చేయలేక తల్లడిల్లుతున్న రైతులపై నీటితీరువా భారం కానుంది. ఖరీఫ్ సీజన్ నుంచే నీటితీరువా పెంపు అమలులోకి రానుం డడంతో పెరగనున్న భారంతో పాటు పాత బకాయిలను కూడా సీజన్ పూర్తయ్యేలోగా వసూలు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా నీటితీరువా బకాయిల జాబితాలను సిద్దం చేయాలని తహశీల్దార్లను జేసీ ఆదేశించారు. నీటితీరువా పెంచడం సరికాదు తిమ్మరాజుపేటలో నాకు ఎకరంన్నర వరి ఉంది. ఏటా నీటితీరువా ఎకరాకు రూ.300 చెల్లిస్తున్నాను. గత ఆరేళ్లుగా అధికారులు నీటితీ రువా సక్రమంగా వసూలు చేయ డం లేదు. ప్రభుత్వం సాగునీటి సమస్యలు పట్టించుకోకుండా నీటితీరు వా పెంచడం సరికాదు. రైతులు మరింత ఇబ్బంది పడ తారు. -భీమరశెట్టి గణేష్‌నాయుడు, వ్యవసాయరైతు, తిమ్మరాజుపేట కాలువలు బాగు చేయకుండా పెంపా సాగునీటి ఇబ్బందులను పట్టించుకోని ప్రభుత్వం నీటి తీరువాను పెంచడం సరికాదు. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనిలో వరి, చెరకు పంటలు పండిస్తున్నాను. వరికి ఎకరానికి రూ.100, చెరకుకు రూ.350 చెల్లిస్తున్నా. కాల్వలు పూడికతో ఉండటం వల్ల సక్రమంగా నీరు అందకపోయినా ప్రతీఏటా నీటితీరువా చెల్లిస్తున్నా. -వెలగా రమణ, రైతు, జి.కోడూరు, మాకవరపాలెం మండలం -
అపురూపమైన సంప్రదాయ వంగడం ‘మచ్చల కంది’!
సంప్రదాయ వంగడాలు అపురూపమైనవి. ఈ పంటల దిగుబడులు ఔషధ గుణాలకు చెరగని చిరునామాలు. నేలతల్లినే నమ్ముకున్న అన్నదాతలు అడవి మొక్కల్లో నుంచి తమకు అవసరమైన పంట మొక్కల్ని ఏరికోరి తెచ్చి.. వేల ఏళ్ల క్రితం నుంచి పొలాల్లో సాగు చేస్తూ పరిరక్షించుకుంటున్న అమూల్యమైన జాతి సంపద ఈ దేశీ విత్తనాలు. సుసంపన్నమైన చిరకాలపు వ్యవసాయ సంస్కృతికి ఆనవాళ్లయిన ఇటువంటి విశిష్ట వంగడాలపై జన్యుహక్కులను కాపాడుకోవడం అవసరం. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జెరి (మోడి) గ్రామ పరిసరాల్లో రైతులు అనాదిగా ‘మచ్చల కందు’లను సాగు చేస్తున్నారు. మచ్చల కంది గింజలు మామూలు కందుల కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. అధిక ప్రొటీన్లు కలిగిఉండటం, రుచిగా ఉండటం, త్వరగా ఉడకటం, కడుపు ఉబ్బరం కలిగించకపోవడం.. వంటివి మచ్చల కందుల విశిష్టతలు. జెరి గ్రామ జీవవైవిధ్య యాజమాన్య కమిటీ(బీఎంసీ) ఆ ప్రాంతంలోని పంటలు, ఔషధ మొక్కలు, పశువులు, చేపలు, ఇతర జంతుజాలానికి సంబంధించిన వివరాలను ప్రజా జీవవైవిధ్య రిజిస్టర్లో నమోదు చేసింది. తన వారసత్వ సంపదగా ఈ బీఎంసీ గుర్తించిన వంగడాల్లో విశిష్టమైనవి మూడు రకాలు: మచ్చల కంది, బాలింత పెసలు, పెద్దజొన్నలు. వీటిని తమ రైతుల సంప్రదాయ వంగడాలుగా గుర్తించమని కోరుతూ జెరి బీఎంసీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ద్వారా ఢిల్లీలోని ‘రైతుల హక్కులు, వంగడాల పరిరక్షణ ప్రాథికార సంస్థ’కు గతంలో దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో ‘మచ్చల కందుల’కు ఇటీవల ప్రాధికార సంస్థ గుర్తింపు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి గుర్తింపు పొందిన తొలి సంప్రదాయక వంగడం ఇదే కావటం విశేషం. ఉడబెట్టుకొని తినడానికి మచ్చల కంది కాయలు చాలా బాగుంటాయని, మార్కెట్లో కిలో రూ. 40-50లు పలుకుతున్నాయని జెరి బీఎంసీ సభ్య కార్యదర్శి ఎస్కే దస్తగిరి (99893 32675) ‘సాక్షి’తో చెప్పారు. -
విత్తు లేదు..రుణం రాదు
- వేరుశెనగ విత్తనాలు అవసరం 2.10 లక్షల క్వింటాళ్లు - ప్రభుత్వం చెప్పింది 83 వేలు, ఇచ్చింది 55వేల క్వింటాళ్లు - బ్యాంకుల రుణ పంపిణీ లక్ష్యం రూ.2,808 కోట్లు - మూడు నెలల్లో ఇచ్చింది రూ.300 కోట్లే సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం మాటమీద నిలబడే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రైతులకు అవసరమైనన్ని విత్తనాలతో పాటు బ్యాంకు రుణాలను పెద్ద ఎత్తున ఇస్తామన్న ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.7,493.94 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఇందులో ఒక్క పంట రుణాలే రూ 2,808 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఏప్రిల్ నుంచి రుణ పంపిణీని ప్రారంభించినా మూడు నెలల కాలంలో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.7,100 కోట్లు ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు సృష్టించిన రుణమాఫీ గందరగోళంలో గత ఏడాది రైతులకు 51 శాతం రుణాలు కూడా అందే పరిస్థితి లేకుండా పోయింది. 2014-15కు గాను రూ.3,573.52 కోట్ల పంట రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకుల లక్ష్యం కాగా కేవలం రూ.1,831.02 కోట్లు (51.24శాతం) మాత్రమే ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి కనీసం ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. విత్తన పంపిణీదీ అదేదారి.. విత్తన పంపిణీలోనూ ప్రభుత్వం అన్నదాతలను వంచించింది. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.36 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ పంటను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. అందరికీ తగినన్ని విత్తనాలు సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ లెక్కన 2.10లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమవుతాయి. 40 శాతం మందికే సబ్సిడీ విత్తనాలు అన్నట్లు వ్యవసాయాధికారులు 1.05 లక్షల క్వింటాళ్ల విత్తనాలకే ప్రతిపాదనలు పంపారు. ఇందులో 83వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జూన్ 1 నుంచి 7వ తేదీ నాటికి 55వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులెత్తేశారు. ఈ విత్తనాలు కేవలం 35వేల హెక్టార్లకు మాత్రమే సరిపోతాయి. మిగిలిన లక్ష హెక్టార్లకు సబ్సిడీ విత్తనాలు లేవు. ప్రయివేటు సంస్థలను ఆశ్రయిస్తున్న రైతన్నలను అవి నిలువుదోపిడీ చేస్తున్నాయి. -
సేద్యం ఎలా సాధ్యం
పలకరించిన తొలకరి ఏరువాకకు సాగిపొమ్మంటోంది... దుక్కి దున్ని విత్తునాటమని చినుకు చెబుతోంది. కానీ అన్నదాతకు ధైర్యం చాలడం లేదు. ప్రభుత్వ పోకడలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. కష్టనష్టాల పాలబడి సేద్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆరుగాలం చమటోడ్చినా కలిసి రావడం లేదు. సాగుఖర్చులు ఊహించనంతగా పెరిగి పెట్టుబడికి, ఆదాయానికి పొంతనలేని పరిస్థితుల్లో సేద్యమంటేనే జూదమన్న భావన వ్యక్తమవుతోంది. అయినా వ్యవసాయం తప్ప మరో విద్య తెలియని అన్నదాతలు నేల తల్లిని నమ్మి ఏరువాకకు సిద్ధమవుదామంటే విత్తనాల కొరత వెక్కిరిస్తోంది. గతేడాది కంటే 10 శాతం పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలతో కొత్త అప్పులు చేయాల్సివస్తోంది. మరోవైపు ‘ఎలినినో’ ముంచుకొస్తోందన్న ప్రభుత్వ ప్రకటన కలవరపరుస్తోంది. గతేడాది ఖరీఫ్‌లో చేతికందిన పంటను నాశనం చేసిన హుద్‌హుద్ రైతుల ఆశలను చిదేమిసిన వైనాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,08,988 హెక్టార్లలో సాగు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో 1,08,682 ఎకరాలకు సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. 1,00,306 ఎకరాలు పూర్తిగా వర్షాధారంగానే సాగు చేయాలి. 1.06లక్షల హెక్టార్లలో వరి, 35573 హెక్టార్లలో చెరకు, 23,764 హెక్టార్లలో రాగి, 13,817 హెక్టార్లలో చిరుధాన్యాలు చేపడుతున్నట్టు అధికారుల వివరాలు తెలుపుతున్నాయి. విత్తు విపత్తు: ఈ ఖరీఫ్‌లో వరికి 72 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. వ్యవసాయ శాఖ వద్ద కేవలం 6 వేల క్వింటాళ్లే ఉన్నాయి. మరో 19 వేల కింటాళ్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సాధారణంగా 30 శాతం విత్తనాలకు వ్యవసాయశాఖ పంపిణీ చేస్తుంది. మిగతావి రైతులే సమకూర్చు కుటుంటారు. ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. పదేళ్లకు పైబడిన వంగడాలపై సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం కావడం, కొత్త వంగడాలు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచనను సవరించారు. గతంలో కిలోకు రూ.10 రాయితీ ఇచ్చేవారు. ఈ సీజన్లో రూ.5 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రైతులు అధిక ధరకు విత్తనాలు కొనాల్సిన దుస్థితి. ఎరువు దరువు: యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులు 69,500 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు ప్రతిపాదించగా మార్క్‌ఫెడ్ వద్ద 1921 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 2023 మెట్రిక్స్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎరువుల కోసం అన్నదాతలు వెతుకులాట మొదలుపెట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్న కొద్దిపాటి విత్తనాలను జిల్లాలోని 39 పీఏసీఎస్‌ల్లో అందుబాటులో ఉంచాలనుకుంటున్నారు. సూక్ష్మ పోషకాలను 50శాతం సబ్సిడీతో అందించేందుకు జిప్సమ్ 3వేల మెట్రిక్ టన్నులు, జింక్ 1000 మెట్రిక్ టన్నులు, బోరాన్ 30 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నారు. దా‘రుణ’యాతన రుణమాఫీ పుణ్యమాని రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. 2014-15 సీజన్లో రూ.960 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. అతికష్టం మీద రూ.630కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఈ ఏడాది 2,93,447 మంది రైతులకు రూ.1200కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో రెండున్నర లక్షలకు పైగా కౌలురైతులు ఉన్నారు. వీరిలో 10,783 మందికి మాత్రమే కౌలు అర్హత కార్డులిచ్చారు. వీరికి గత సీజన్లో కేవంల 8 లక్షల రుణాలు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది వీరికి రుణాలు అందే పరిస్థితి కానరావడం లేదు. కానరాని ‘భూసారం’: మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసార పరీక్షల్లో భాగంగా 32వేల శాంపిళ్లు సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ 14వేల శాంపిళ్లు తీసుకున్నారు. 1679 శాంపిళ్లకే పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది 1250 హెక్టార్లలో 125 చంద్రన్న రైతన్న రైతు క్షేత్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం ఎకరాకు రూ.2 వేల విలువైన విత్తనాలు, ఎరువుల అందించనున్నారు. -
నాణ్యత పేరుతో దోపిడీ!
- వరి ధాన్యానికి దక్కని ‘మద్దతు’ - క్వింటాలుకు సగటు ధర రూ.1,250 - తాండూరు మార్కెట్లో వ్యాపారుల మాయ! తాండూరు: సాధారణ రకం వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుకు ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. నాణ్యతాప్రమాణాల పేరుతో అన్నదాతలను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ‘మద్దతు’ లభించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఊదాసీన వైఖరితో యార్డులో కొందరు కమీషన్ ఏజెంట్లు ఇష్టానుసారంగా పంటకు ధర నిర్ణయించడం వల్ల రైతాంగానికి మేలు జరగడం లేదు. ఈనెల మొదటి వారం నుంచి మార్కెట్ యార్డులో రబీ ధాన్యం కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. తాండూరు నియోజకవర్గం పరిధిలోని యాలాల, బషీరాబాద్, తాండూరు,పెద్దేముల్ మండలాలతోపాటు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు తాండూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. పట్టణంలోని పౌరసరఫరాల గోదాంలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుందనే కారణంతో చాలా మంది రైతులు మార్కెట్ యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. సాధారణ వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,360 చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు సుమారు 13,463 క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నారు. క్వింటాలుకు గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200, సగటు ధర రూ.1,250 మాత్రమే పలికింది. ఈ మూడు ధరలను పరిశీలించినా కనీస మద్ధతు ధర రైతులకు లభించలేదని స్పష్టమవుతోంది. ఈ ధరల ప్రకారం రైతులు క్వింటాలుకు రూ.60 నుంచి రూ.160 వరకు నష్టపోయారు. నాణ్యతాప్రమాణాలు లేనందుకే మద్దతు ధర పలకడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత పేరుతో రైతన్నల శ్రమ దోపిడీకి గురవుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం. -
బలిపీఠంపై అన్నదాత
రాష్ర్టంలో కరువుకాటుతో రైతన్నల బలిదానం రూ. 15 వేల కోట్ల ప్రైవేటు అప్పు అందని పంట నష్టపరిహారం ఖరీఫ్ ముంచుకొస్తున్నా రెండోవిడత రుణమాఫీపై అస్పష్టత 774 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటున్న రైతు సంఘాలు హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కరాళనృత్యం చేస్తోంది. మొదట వర్షాభావంతో.. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల అన్నదాతలు నిండా మునిగారు. వాతావరణం లో అనూహ్య మార్పులతో రైతు కష్టం పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోయింది. వారు శక్తిమేర సా గు చేసిన కొద్దిపాటి పంటలపైనా ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు ప్రైవేటు అప్పులు పేరుకుపోయి అన్నదాతలు అయోమయంలో పడ్డా రు. వడ్డీ వ్యాపారుల వేధింపులు వారిని అంతకంతకూ కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం ఘనం గా చెప్పుకొన్న రుణమాఫీ అమలులో విపరీత జాప్యం కూడా ఇందుకు తోడైంది. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు కనీస సాయానికి కూడా ముందుకు రావడం లేదు. కరువు మండలాలను గుర్తించే పని కూడా చేయడం లేదు. రైతుల ఆత్మహత్యలకు పరి హారమిస్తే మరిన్ని చావులు సంభవిస్తాయని కొందరు మంత్రులే వింత వాదన వినిపిస్తున్నారు. చెత్తబుట్టలో కలెక్టర్ల నివేదిక రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి ఆ ఛాయలు కనిపించడం లేదు. వాస్తవ పరిస్థితిని కలెక్టర్లు విన్నవించినా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 401 కరువు మండలాలున్నట్లు కలెక్టర్లు ఎప్పుడో నిర్ధారించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. కానీ ఆ నివేదికను పక్కనబెట్టి.. 88 మండలాలనే కరువు మండలాలుగా ఉన్నతస్థాయి కమిటీ నిర్ధారించడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుంటే 40 మండలాల్లో కరువున్నట్లు అక్కడి కలెక్టర్ పేర్కొన్నారు. కానీ రాష్ట్రస్థాయి కమిటీ మాత్రం ఆ జిల్లాలో ఏ మండలంలోనూ కరువు లేదని చెప్పింది. అలాగే ఖమ్మంలోనూ 46 మండలాలకు 32 మండలాల్లో కరువు ఉందని అక్కడి కలెక్టర్ చెప్పగా.. జిల్లాలో అసలు కరువే లేదని కమిటీ నిర్ధారించింది. వరంగల్ జిల్లాలో 40 మండలాల్లో కరువుందని కలెక్టర్ ప్రతిపాదిస్తే.. కేవలం ఒక్క మండలాన్ని మాత్రమే గుర్తించారు. ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు వర్షాభావం.. పంట నష్టం.. అప్పుల భారంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత వ్యవసాయ సీజన్లో రైతులు చేసిన ప్రైవేటు అప్పులు రూ. 15 వేల కోట్ల మేరకు ఉంటాయని అధికారవర్గాల అంచనా. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కౌలుదార్లకు రుణ అర్హత కార్డులు లేకపోవడం, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేకపోవడం, వ్యాపారుల దోపిడీ కూడా కారణాలే. అయితే రాష్ర్ట ప్రభుత్వం రైతు ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ర్టం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 96 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రైతు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 774 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అవి ఆధారాలు చూపుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చాలా ఆత్మహత్యలను ‘ఇతర కారణాల వల్లే’ జరిగినట్లు పేర్కొం టోంది. నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరమని భావించే సర్కారు పెద్దలు ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రెండో విడత రుణమాఫీ ఎప్పుడు? మరో నెల రోజుల్లో వ్యవసాయ సీజన్ మొదలుకానుంది. కొద్దిపాటి వర్షాలు కురిసినా రైతులు పత్తి విత్తనం వేస్తారు. ఈలోపే చాలామంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకుంటారు. గతేడాది తొలి విడత రుణమాఫీ కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది రెండో విడత సొమ్మును విడుదల చేయాల్సి ఉంది. కానీ బ్యాంకుల నుంచి ఇప్పటికీ గత రుణమాఫీకి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) రాలేదు. యూసీలు రాకుంటే రెండో విడత రుణమాఫీని విడుదల చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకపోతే బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారు మళ్లీ ప్రైవేటు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుంది. -
అదనపు భారం
- హమాలీ చార్జీల భారం రైతులకు తప్పదా - ఇక పై క్వింటాకు రూ.15.28 చొప్పున చెల్లించాల్సిందే - ఈ సీజన్ నుంచే అమల్లోకి తెచ్చిన అధికారులు - కొనుగోలు కేంద్రాల్లో ఇంకా తప్పని తిప్పలు నల్లగొండ : అన్నదాత నెత్తిన మరో భారం పడింది. ప్రభుత్వం లెవీ తగ్గింపుతో పండిన పంటకు మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్న రైతాంగంపై సివిల్ సప్లయ్ అదనపు భారం మోపింది. నాణ్యత, తేమ, తూకం పేరుతో ఇప్పటికే నష్టపోతున్న రైతులు ఇక నుంచి హమాలీ చార్జీల భారాన్ని సైతం మోయక తప్పదు. ప్రస్తుత రబీ సీజన్ నుంచే ఈ చార్జీల చెల్లింపులను అమల్లోకి తీసుకొచ్చారు. క్వింటాకు అదనంగా రూ.15.28 చొప్పున హమాలీ చార్జీలను రైతులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి క్వింటాకు రూ.20 చొప్పున హమాలీ చార్జీలు చెల్లించాలి. ఇందులో గతేడాది ఖరీఫ్ సీజన్ వరకు రూ.10 రైతులు చెల్లిస్తే.. మిగిలిన రూ.10 ధాన్యం కొనుగోలు చేస్తున్న సివిల్ సప్లయ్ కార్పొరేషన్ భరించేది. ఇక పై క్వింటాకు రూ.4.72లకు ఎక్కువ చెల్లించేది లేదని, రైతుల ముంగిట్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నందున మిగిలిన మొత్తాన్ని రైతులే చెల్లించాలని సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇప్పటికే తేమ శాతం 17 మించితే.. ఒక్కో శాతానికి కిలో చొప్పున తూకంలో కోతపెడుతున్నారు. కొత్తగా ఈ హమాలీ చార్జీల కారణంగా రైతులు మరింత భారాన్ని మోయక తప్పదు. సమస్యల వలయంలో కొనుగోలు కేంద్రాలు ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో బుధవారం సాయంత్రం వరకు 1,53,547 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీంట్లో ఐకేపీ కేంద్రాల్లో 80,709 టన్నులు కాగా, పీఏసీఎస్ కేంద్రాలు 72,838 క్వింటాళ్లు కొన్నారు. ఈ ధాన్యం విలువ రూ.214 కోట్లు. దీంట్లో రైతులకు రూ.95 కోట్లు చెల్లించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంలో మాత్ర ం అధికారులు విఫలమయ్యారు. 50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే దీంట్లో పది లక్షల బ్యాగుల వరకు సరిగా లేవని చిల్లులు, పాతవి వచ్చాయని కొనుగోలు కేంద్రాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. టార్పాలిన్లు కూడా కేంద్రాల కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి కాకుండా హెచ్చుతగ్గులు ఉండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 165 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 146 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో కేంద్రాలు ఆరంభమైతే ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. టార్పాలిన్లు, గన్నీ బ్యా గులు సప్లయ్ చేయడంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. -
రైతులను ఆదుకోవాలి
- ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్ని రాయితీలు ఇవ్వాలి - లోకసభలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్నదాతలను ఆదుకోవాలని రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లోకసభలో సోమవారం గళమెత్తారు. రైతు సమస్యలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రధానంగా అన్నదాతల సమస్యలను కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచించిన మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాలోని రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర *780కు ధాన్యం విక్రయిస్తున్నారన్నారు. హుదూద్ బాధితులను ఇంతవరకు ఆదుకోలేదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. దీంతో సుమారు 35 ఏళ్లకు పైబడిన మామిడి చెట్లు నిలువునా ఎండిపోయాయన్నారు. గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందంగా ఇటీవల కురిసిన అకాలవర్షం, వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ 5 కిలోల వడగండ్లు పడిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని రాయితీలు ప్రభుత్వం రైతులకు అందించాలన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. -
తుపాన్ గండం
పంట చేతికొచ్చే సమయంలో వరణుడు రైతన్న కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. తుపాన్ రూపంలో మరో గండం పొంచి ఉంచడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఆదివారం జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసి ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యూర్డుల్లో మొక్కజొన్నలు, ధాన్యం పేరుకుపోయింది. తేమతో కొనుగోళ్లు నిలిచి పోగా.. మబ్బులు పడడంతో మరింత అడ్డంకి మారింది. మరో మూడు రోజులపాటు వర్ష సూచన ఉండడంతో రైతులకు ధాన్యాన్ని ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారింది. జగిత్యాల అగ్రికల్చర్ : ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమైన తరుణంలో వాతావరణం మబ్బులతో ఉండి వర్షాలు కురుస్తుండడంతో ఇబ్బందులు మొదలయ్యూయి. రైతులు తమ పొలాలను హార్వేస్టర్లతో కోయించి నేరుగా గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. మబ్బులు ఉండి వర్షాలు వస్తుండడంతో ధాన్యంపై కప్పేందుకు కవర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఐకేపీ కేంద్రాలన్నీ మామూలు వ్యవసాయ భూముల్లోనే నిర్వహిస్తుండడం, కవర్లు లేక ధాన్యం మట్టిలోనే పోస్తుండడంతో వర్షానికి తడిసి ముద్దయిపోతోంది. భూమిలో తేమ ఉండడంతో పొలాలు కోతకు వచ్చినప్పటికీ హార్వేస్టర్లతో కోయించలేని పరిస్థితి నెలకొంది. మరో రెండు,మూడు రోజుల వరకు వరి కోతలు, కొనుగోళ్లు లేక రైతులకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. పత్తి పరిస్థితి అంతంతే.. పత్తిని తీసి మార్కెట్‌కు తరలిస్తున్న తరుణంలో రైతుకు చిక్కులు మొదలయ్యూయి. పత్తిలో తేమ ఉంటే వెంటనే నల్లగా మారుతుంది. తీసిన పత్తిలో తేమ లేకుండా ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి. మబ్బులతో పత్తిలో తేమ ఉండడంతో ఇటు ఇంట్లో పెట్టుకోలేక.. అటు మార్కెట్‌కు తీసుకెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్తే తేమ సాకుతో ఎక్కడ ధర తగ్గిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. తడిసిన వరి, మొక్కజొన్న... ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న తడిసిపోయింది. జగిత్యాల మార్కెట్‌యార్డులో సెలవులు ప్రకటించడంతో మొక్కజొన్న ధాన్యం లేకున్నా తేమతో కొనుగోలు చేయకపోవడంతో హబ్సీపూర్‌కు చెందిన వెంకట్రె డ్డికి చెందిన 50 క్వింటాళ్ల మొక్కజొన్నలు తడిశాయి. ధరూర్, నర్సింగాపూర్ తదితర ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం బాగా తడిసింది. మూడు రోజులపాటు స్వల్ప వర్ష సూచన మరో మూడు రోజులపాటు జిల్లాకు స్వల్ప వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. నవంబర్ 10న 5 మి.మీ, 11న 10 మి.మీ, 12న 5 మి.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 18డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయి, చలి తీవ్రత పెరిగవచ్చని చెప్పారు. ఈదురుగాలులు గంటకు 5-9 కిలోమీటర్ల వేగంతో వీచవచ్చని తెలిపారు. అకాల వర్షం..తడిసిన ధాన్యం మల్యాల : మల్యాల మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. ధాన్యం బస్తాలను లారీల్లో నింపడానికి సిద్ధమవగా వర్షం కురిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిందని వాపోయారు. సుమారు రెండు లారీల బస్తాల ధాన్యం తడిసిముద్దయింది. -
లెవీ పోటు
నిబంధనలు మార్చిన ఎఫ్‌సీఐ కొత్త విధానంలో 25 శాతం బియ్యమే స్వీకరణ ధాన్యాన్ని నిల్వ చేయలేమంటున్న మిల్లర్లు రైతులకు గిట్టుబాటు ధర దక్కదన్న ఆందోళన పట్టించుకోని ప్రభుత్వం నెల్లూరు (హరనాథపురం) : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తీసుకున్న నిర్ణయం అన్నదాతను పరోక్షంగా దెబ్బతీయనుంది. ఎఫ్‌సీఐ 25 శాతానికి లెవీ కుదిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఖరీఫ్‌లో పండించిన ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. ఎఫ్‌సీఐ తాజాగా మార్చిన లెవీ నిబంధనలతో మిల్లర్లకూ ఇబ్బంది పరిస్థితులున్నా.. రైతులకు మాత్రం పెను శాపంగా మారనుంది. కొత్త లెవీ నిబంధనలతో ఈ సీజన్లో ధాన్యం కొనే నాథుడు లేక ఆరుగాలం కష్టించిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించని పరిస్థితి నెలకొనేటట్లు ఉంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. లెవీ 25 శాతమే అయితే.. మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో గత సెప్టెం బర్ వరకు 75 శాతం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యం రూపే ణా సేకరించేది. మిగిలిన 25 శాతంలో రెండొంతులు ఇతర రాష్ట్రాల్లోనూ మూడో వంతు రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లో మిల్లర్లు స్వేచ్ఛగా అమ్ముకునే వీలుండేది. ఎఫ్‌సీఐ నిర్ణయంతో లెవీ విధానం తారుమారైంది. మిల్లర్ల నుంచి కేవలం 25 శాతం మాత్రమే లెవీ తీసుకుంటామని ఎఫ్‌సీఐ గత ఆగస్టులో ప్రకటించింది. ఈ విధానం అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చింది. ఎఫ్‌సీఐ తీసుకున్న నిర్ణయం మిల్లర్లు, రైతులపై పెనుప్రభావం చూపనుంది. లెవీ 75 శాతం ఉంటేనే మిగిలిన 25 శాతం బియ్యం అమ్ముకునేందుకు మిల్లర్లు నానా పాట్లు పడేవారు. ఇది పరోక్షంగా రైతులపై ప్రభావం చూపి మద్దతు ధరకన్నా క్వింటాలు ధాన్యాన్ని రూ.100 నుంచి రూ.200 వరకు తక్కువ ధరకు కొనేవారు. మారిన పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో 75 శాతం బియ్యం అమ్ముకునేందుకు స్వేచ్ఛ ఇవ్వకుండా పర్మిట్ల నిబంధన విధించడంతో బియ్యం కొనుగోలు చేసే నాథుడే లేడని మిల్లర్లు చెబుతున్నారు. నూతన విధానంలో ఇప్పటికే బాయిల్డ్ రైస్ ధర క్వింటాల్‌కు రూ.2,400 నుంచి రూ.2,200, రారైస్ రూ.2,200 నుంచి రూ.2 వేలకు పడిపోయినట్లు మిల్లర్లు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే ఈ ధరలు మరింత దిగజారుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత నెల నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాలి. గతంలో మిల్లర్లు ఇబ్బడిముబ్బడిగా కొనేవారు. మారిన పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడంలేదు. లెవీ కుదింపుతో ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునేందుకు, బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు అనేక సమస్యలు ఉన్నాయని మిల్లర్లు అంటున్నారు. ప్రభుత్వ ఉదాసీనత రైతు సంక్షేమానికి ప్రమాదం ముంచుకువస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ నిర్ణయంపై ఏ మాత్రం స్పందించలేదు. లెవీ 50 శాతానికి పెంచాలని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం నిర్మోహమాటంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను రంగంలోకి దించుతారని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ డబ్బులు సకాలంలో చెల్లిస్తుందనే గ్యారెంటీ లేదనే భయం మిల్లర్లను వెంటాడుతుంది. ఎఫ్‌సీఐ నిర్ణయంతో అంతిమంగా నష్టపోయేది రైతులేనని మిల్లర్లే చెబుతున్నారు. అమ్ముకునే స్వేచ్ఛను ఇవ్వాలి : ఎఫ్‌సీఐ లెవీ బియ్యం సేకరణ నిబంధన మార్చడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం 25 శాతం లెవీ తీసుకున్నప్పటికి మిగిలిన 75 శాతం మిల్లర్లు అమ్ముకునేందుకు స్వేచ్ఛ కల్పించాలి. పర్మిట్ విధానం పెట్టడం వల్ల రాజకీయ నాయకులు, అధికారులు లాభపడుతున్నారు. జిల్లాకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ ఉంచేందుకు గిడ్డంగుల సౌకర్యం ఉంది. - రంగయ్యనాయుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకుడు -
హాలాహలం
రైతన్నకు కన్నీటిని మిగిల్చిన ఖరీఫ్.. అదే దారిలో రబీ జిల్లాలో కరువు కోరలు.. అన్నదాతల ఆకలి కేకలు నిండా ముంచిన చీ‘కట్’లు.. కష్టాల సాగులో చితికిన రైతులు అరకొరగా సర్కారు సాయం.. నిర్వేదంలో బలవన్మరణాలు కోటి ఆశల నవ తెలంగాణ ప్రయాణంలోని తొలి ఖరీఫ్.. హలధారి కంట జలధారను తెప్పించింది. వర్షాభావ పరిస్థితులతో ప్రారంభమైన సీజన్... రైతు స్వేదాన్ని, రక్తాన్ని పీల్చేసింది. నీటివనరులు అందుబాటులో లేని కర్షకుడిని సాగుకు దూరం చేసిం ది. భూములను బీళ్లుగా మార్చి కష్టజీవి నోట్లో మట్టికొట్టింది. మొండి ధైర్యంతో నాగలిపట్టిన రైతును నట్టేటముంచింది. అన్నదాతను అప్పుల ఊబిలోకి దింపి అచేతనావస్థకు చేర్చింది. రైతన్న కళ్లను నీళ్లు లేని ఎడారిగా మార్చింది. తుదకు బలవంతంగా బలిపీఠమెక్కించింది. - వరంగల్ 42 మండలాల్లో వర్షాభావం జిల్లాలోని 51 మండలాలకు గాను 42 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం కంటే అదనంగా ఒకే ఒక్క మండలంలో మాత్రమే అదనంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 993.6 మి.మీ కాగా ఇప్పటి వరకు జిల్లాలో 589.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 29 శాతం లోటు. ఒక మండలంలో మైనస్ 60శాతం నుంచి మైనస్ 99 శాతం, 41 మండలాల్లో మైనస్ 20శాతం నుంచి మైనస్ 59శాతం, 8 మండలాల్లో మైనస్ 19శాతం నుంచి అదనంగా 19శాతం, ఒకే మండలంలో అదనంగా 20 శాతం వర్షపాతం నమోదైంది. దెబ్బమీద దెబ్బ వర్షాలు లేక, కరెంటు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు తెగుళ్ల రూపంలో మరో కష్టం వచ్చిపడింది. కాస్తోకూస్తో చేతికొస్తుందనుకున్న పంటలు చీడపీడల బారిన పడడంతో రైతన్న మరింత కుంగిపోయాడు. పంట ఎదిగే సమయంలో మిరపకు, గొలుసు పెట్టే సమయంలో వరికి ఈ రోగాలు పట్టి పీడించాయి. పత్తి పంటకు దెబ్బ ఈ సీజన్లో జిల్లాలో 2,29,000 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు. ఏపుగా పెరిగిన పత్తికి ఆకుముడత, తెల్లదోమ, పూత, కాత రాలిపోవడం, పచ్చదోమ కాటు, రసం పీల్చే పురుగుల దాడితో పంటలు దెబ్బతింటున్నాయి. ధర్మసాగర్, ఘనపురం, నెల్లికుదురు, చేర్యాల, చిట్యాల, శాయంపేట, నల్లబెల్లి ప్రాంతాల్లో పత్తి, మహబూబాబాద్, కురవి, మరిపెడ మండలాల్లో మిరప పంటకు ఆకు, చిగుళ్ల ముడత తెగులు వ్యాపించాయి. ఆలస్యంగా సాగుచేసిన వరిపంటకు పేనుబంక, దోమకాటు, కాండం తొలుచు పురుగులు వెంటాడుతున్నాయి. అప్పుల పెట్టుబడి.. తగ్గుతున్న దిగుబడి అప్పుల పెట్టుబడితో అన్నదాతలు ఆగమవుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న దిగుబడితో అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, అడ్తిదారులు, పురుగుమందు వ్యాపారుల నుంచి ఏడాదికి 45శాతానికిపైగా వడ్డీతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఒక్కో రైతు రూ.రెండు నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పు చేస్తుండడంతో ఆ ఊబి నుంచి కోలుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 5,03,605 హెక్టార్లు కాగా ప్రస్తుతం 4,14,084 హెక్టార్లలో(83శాతం) పంటలు సాగుచేశారు. ఇందులో ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, వరి ఉన్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.25వేలు.. 25 క్వింటాళ్లు తొలి వర్షానికి భూమి దున్నడం, ట్రాక్టర్ కూలీ, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. దీనికి అదనంగా ఇంటిల్లిపాదీ శ్రమ. మధ్యలో అకాల వర్షాలు, చీడపీడలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వరి సాగుకు ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి పెడితే సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర లభిస్తే రూ. 33 వేలు రైతుకు వచ్చే అవకాశం ఉంది. ఇక కౌలు రైతులకు అదనంగా భూమి కౌలు, పెట్టుబడి వడ్డీ కలిపి రూ.10వేల భారం పడే పరిస్థితి నెలకొంది. పత్తి సాగుకు ఎకరానికి రూ. 30వేలు పెట్టుబడి పెడితే దిగుబడి ఆరు క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. పత్తి అమ్మకం ద్వారా రూ. 25వేలు వస్తాయని అంచనా. మొక్కజొన్న ఎకరానికి రూ.20 వేలు పెడితే దిగుబడి 30 క్వింటాళ్లు వస్తుంది. మద్దతు ధర లభిస్తే రూ. 34వేలు వస్తుంది. రుణం కోసం అరిగోస రుణం కోసం రైతులు గోసపడుతున్నారు. రుణం అందకుండానే ఖరీఫ్ ముగియడంతో కనీసం రబీలో అయినా అందుతుందో లేదోననే మీమాంశ లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చి న రుణమాఫీ హామీ అమలులో జాప్యం కావడంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. సెప్టెంబర్ నెలాఖరులో రుణమాఫీకి సంబంధించి ఆమోదం తెలియజేస్తూ ప్రభుత్వం 25శాతం నిధులు విడుదల చేసింది. కొత్త రుణాలివ్వాలని బ్యాంకులను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ అందలేదని క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో రూ.లక్షలోపు రుణమాఫీ కింద రూ.1915 కోట్ల మేరకు ఉన్నాయని, జిల్లాకు రూ. 472 కోట్లు విడుదలయ్యాయని లీడ్‌బ్యాంక్ అధికారులు తెలిపారు. రుణాల రెన్యువల్‌కు సంబంధించి కసరత్తు సాగుతున్నట్టు పేర్కొన్నారు. నిజానికి జిల్లాలో నాలుగు లక్షలమంది రైతులు పంట రుణాలపై ఆధారపడి సాగుచేస్తున్నారు. వర్షాభావంతో ఈసారి ఆ సంఖ్య మూడు లక్షలకు తగ్గింది. ఈ ఏడాది పంట రుణాల కింద రూ.2,100 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఖరీఫ్ లక్ష్యం రూ.1,400 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రుణాలిచ్చిన జాడలేదు. రబీలో పంట రుణాల లక్ష్యం రూ.700 కోట్లుగా ప్రకటించారు. ఈ మేరకు రైతులకు రుణాలందించి ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నారు. -
ఎరువులకోసం తోపులాట
లక్కవరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత అమ్మకం నిలిపివేత యలమంచిలి: పుడమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలతో నిండా మునుగుతున్న అన్నదాతలకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. హుదూద్ తుపాను ధాటికి సగానికిపైగా పంటలు కోల్పోయిన రైతులు మిగిలిన కొద్దిపాటి పంటలను బాగు చేసుకునేందుకు ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు అవసరమైన సంఖ్యలో ఎరువులు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఎరువుల కోసం సహకార సంఘాల చుట్టూ రైతులు కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అసలే ప్రకృతి వైపరీత్యాలతో కుంగిపోయిన రైతులకు ప్రభుత్వ వైఖరి మరింత దిగులు కలిగిస్తోంది. ఆదివారం యలమంచిలి మండలం లక్కవరం పీఏసీఎస్ వద్ద ఎరువుల విక్రయం తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక్కడ ఎరువులు విక్రయిస్తున్నారని తెలియడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. కేవలం 30 బస్తాలు మాత్రమే స్టాకు ఉండటం, 200 మందికిపైగా రైతులు ఎరువుల కోసం అక్కడకు చేరుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఎరువుల కోసం రైతులు ఒకరినొకరు తోసుకోవడం, వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వచ్చిన రైతులను వారించడం పీఏసీఎస్ సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో యలమంచిలి రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో ఎరువుల విక్రయాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. రైతులను పోలీసులు బయటకు నెట్టివేసి గోడౌన్ షట్టర్ దించి తాళం వేయించారు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. కొందరు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎరువులు కూడా అందించకపోతే తామెలా వ్యవసాయం చేసుకుంటామని ప్రశ్నించారు. -
అల్పపీడనంపై ఆందోళన
ఏటా పంట చేతికందే సమయంలో విపత్తులు తాజా పరిస్థితిపై తల్లడిల్లిపోతున్న అన్నదాతలు పంట బీమా కూడా లేదంటూ ఆవేదన విపత్తుల పేరు వింటేనే రైతులు వణికిపోతున్నారు. అవి ఎక్కడ తమను నట్టేట ముంచుతాయోనని హడలిపోతున్నారు. ఏటా పంట చేతికందే సమయంలో ఈ ఖర్మ ఏంట్రా బాబు అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆరుగాలం కష్టాన్ని అల్పపీడనాలు, తుపాన్లు తుడిచిపెడుతున్నాయి. ఈ ఏడాది సరాసరి వర్షం తక్కువైనప్పటికీ మధ్యలో రెండుమూడు సార్లు కుండపోత వర్షంతో పంటలను దెబ్బతీసింది. వాటిన్నింటినీ ఎదురొడ్డి సాగు చేసి పంట చేతికందే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న వార్తతో రైతులు బెంబేలెత్తుతున్నారు. గుడ్లవల్లేరు : ఈ ఏడాది ప్రకృతి విపత్తులను అధిగమించి రైతులు సాగు చేశారు. వర్షాభావం వెంటాడినప్పటికీ అడపాదడపా కురిసిన వర్షాలతోపాటు అందుబాటులో ఉన్న నీటి వనరులతో విత్తారు. పైర్లు ఏపుగా పెరిగాయి. మొక్కజొన్న కండెలు, వరి కేళిలతో పంటలు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న వార్తతో రైతులు గుండెలు చేత్తో పట్టుకుంటున్నారు. నేటికీ అందని పంట నష్టపరిహారం గతేడాది ఇదే సమయంలో వరుస తుపాన్లు చెలరేగి రైతులను బికారులను చేశాయి. పంటల్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాయి. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. వాటి తాలూకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ ఏడాది వాటిని అధిగమిస్తామనుకుంటున్న తరుణంలో అల్పపీడనం భయపడుతోంది. దానికితోడు ఈసారి పంటల బీమా కూడా లేకపోవడంతో రైతుల పంటల పరిస్థితి గాలిలో పెట్టిన దీపంలా మారింది. ఇటీవల వచ్చిన హుదూద్ తుపాను బీభత్సాన్ని చూస్తుంటే కంటిపై కునుకు పట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో గురువారం కురిసిన చిరుజల్లులతో రైతన్న గుండెల్లో మళ్లీ గుబులు బయలుదేరింది. జిల్లాలో సాగు ఇలా... మిర్చి 19,612 ఎకరాలు వరి 5,77,630 ఎకరాలు పత్తి 1,37,575 ఎకరాలు మొక్కజొన్న 12,777 ఎకరాలు -
ఇద్దరు రైతులను బలిగొన్న అప్పులు
మునిగలవీడు(నెల్లికుదురు) : ఇద్దరు ఆడపిల్లల పెళ్లికి ఆ రైతు చేసిన అప్పులు ఇంకా తీరలేదు. ఉన్న ఎకరం పొలంలో వరి సాగు చేయగా.. కరెంట్ లేక పంటంతా ఎండిపోరుుంది. అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురైన ఆ అన్నదాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మునిగలవీడులో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్కే ఖాజామియూ(55), మహిబూబా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడు వ్యవసాయంతోపాటు ఐస్‌క్రీమ్, కూరగాయల బేరం చేస్తుండేవాడు. అప్పు తెచ్చి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. ఇటీవల కూతురు పురుడు ఖర్చుకు కూడా అప్పు చేయూల్సి వచ్చింది. ఈ సారి ఎలాగైనా పంట పండించి అప్పులు తీర్చాలని తనకున్న 30 గుంటల పొలంతోపాటు తన అక్క మహిబాకు చెందిన 20 గుంటల పొలంలో వరి సాగు చేశాడు. అరుుతే కరెంట్ రాక.. నీళ్లు లేక పొలమంతా ఎండిపోరుుంది. దీంతో రెండు రోజులుగా దిగాలుగా ఉంటున్న ఖాజామియా లక్షకుపైగా చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురయ్యూడు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి మానుకోటకు వెళ్లి ఐస్‌క్రీమ్‌లు తీసుకొస్తానని బయల్దేరాడు. కానీ అతడు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమీపంలోని రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకుని బోరున విలపించారు. మృతుడి భార్య మహిబూబా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బెల్లం చేరాలు చెప్పారు. గట్టుకిందిపల్లెలో మరొకరు.. గీసుకొండ : పత్తి దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గీసుకొండ శివారు గట్టుకిందిపల్లెలో శుక్రవారం జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. గ్రామానికి పులి సారంగం(40) తన ఎకరం భూమితోపాటు గ్రామంలోని మరో రైతుకు చెందిన మరో రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట సరిగా దిగుబడి రాలేదు. రెండేళ్లుగా పంటలు సరిగా పండక.. పెట్టుబడి రాక అప్పుల పాల య్యూడు. అప్పులు తీర్చలేని స్థితిలో శుక్రవారం సాయంత్రం చేను వద్ద క్రిమిసంహారక మందు తాగగా గమనించిన రైతులు 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలి పారు. మృతుడికి భార్య పద్మ, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాఫీ మాయే!
బకాయిల వసూలుకు బ్యాంకర్ల సన్నాహాలు బంగారు రుణాలపై వేలం నోటీసుల జారీ పంట రుణాల వసూలుకు సొసైటీ బృందాలు లబోదిబోమంటున్న అన్నదాతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. బకాయిల వసూలుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తుండటమే దీనికి నిదర్శనం. రైతు సాధికార సంస్థ ద్వారా ఐదేళ్లలో దశలవారీగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, ఐదేళ్ల పాటు వడ్డీ, అసలు బకాయిలు పేరుకుపోయి నష్టపోతారంటూ బ్యాంకర్లు వసూళ్లకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ.9,137 కోట్లు ఉండగా, రెండు వేల కోట్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా కుదించినట్లు సమాచారం. మిగిలినవారికి రుణమాఫీ వర్తించదని అధికారులు రికార్డులు తయారు చేసినట్లు తెలిసింది. బంగారం రుణాలపై వేలం నోటీసులు... సహకార బ్యాంకు సిబ్బంది పంట రుణాలను జబర్దస్తీగా వసూలు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేసుకుంటుండగా, వాణిజ్య బ్యాంకులు బంగారం రుణాలకు సంబంధించి వేలం నోటీసులు జారీ చేస్తున్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు డివిజన్లలో సహకార అధికారులు 425 సహకార సంఘాల వేతన కార్యదర్శులు, సిబ్బందితో రుణ వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రుణ మాఫీ ఆలస్యం అవుతున్నందున బకాయిల వసూలుకు వెంటనే రైతుల వద్దకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో రుణాలు కట్టమంటే రైతులు తిరగబడి కొడతారని పలువురు సహకార సంస్థలలో పని చేసే కార్యదర్శులు అధికారుల వద్ద మొర పెట్టుకోగా.. అయినా తప్పదని, రుణమాఫీ వల్ల రెండు రకాలుగా నష్టపోతారని రెతులకు వివరించాలని సహకార ఉన్నతాధికారులు కార్యదర్శులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఐదేళ్లలోపు దశలవారీగా రుణమాఫీ చేస్తే మొత్తం బాకీ తీరేవరకు బ్యాంకుల్లో ఉన్న బంగారం విడుదల కాదని వివరించాలని చెప్పినట్లు తెలిసింది. పంట రుణాలకు సంబంధించి సహకార సంస్థల్లో 11 శాతం వడ్డీ పడుతుందని రైతులకు వివరించాలని, ఏదో విధంగా వారికి నచ్చచెప్పి ముందుగా బాకీలు వసూలు చేయాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తూ ఇచ్చే డబ్బు బ్యాంకులకు వచ్చింది వచ్చినట్లుగా రైతుల ఖాతాల్లో పడుతుందని చెప్పి.. బకాయిలు వసూలు చేసుకునేందుకు వాణిజ్య, సహకార బ్యాంకులు మందస్తు ప్రణాళిక సిద్ధం చేశాయి. బంగారం వేలానికి ఆర్బీఐ సూచన! 15 నెలలు దాటిన బంగారు రుణాలకు సంబంధించి నగలను వెంటనే వేలం వేసి బకాయికి జమ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లకు సూచించినట్లు సమాచారం. ఒకవైపు బంగారం ధర రోజురోజుకు తగ్గటం బ్యాంకర్లను కలవరానికి గురిచేస్తోంది. తాము రుణం ఇచ్చేటప్పుడు గ్రాము రూ.4 వేలు వరకు ఉందని, అది ప్రస్తుతం రూ.2,600కు పడిపోయిందని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. బంగారం ధర మరింత తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనతో బ్యాంకర్లు జిల్లా వ్యాప్తంగా బంగారు రుణాలు తీసుకున్న రైతులందరికీ వేలం నోటీసులు ఇస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం రుణమాఫీ డబ్బు ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో జమపడుతుందని, ముందు తమ బాకీ చెల్లించి బంగారం విడిపించుకు వెళ్లమని వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు రైతులకు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 15 నెలలు దాటిన బంగారం రుణం వసూలు చేయాల్సి ఉందని లేదా వేలం వేయాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీ జరగాలంటే ఐదేళ్లు పడుతుందని, అప్పటివరకు బంగారం ఎలా బ్యాంకులో ఉంచుకుంటారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. తడిసిమోపెడవుతున్న బకాయిలు రైతు సాధికార సంస్థ ద్వారా రుణమాఫీ జరిగే సమయానికి రైతులపై వడ్డీ భారం పడనుంది. రుణమాఫీ ఆశ లేకుంటే జీరో శాతం వడ్డీపై రుణాలు చెల్లించేవారు. పంట రుణాలు వాయిదా మీరటంతో సహకార బ్యాంకులకు 11 శాతం వడ్డీ భరించాల్సి వస్తుందని బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. ఐదేళ్ల వరకు బకాయి కట్టకపోతే సగానికి సగం వడ్డీ అప్పు పెరుగుతుందని రైతులకు వివరిస్తున్నారు. రైతుల్లో ఆందోళన వాణిజ్య బ్యాంకులు నోటీసులు జారీ చేయటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకపక్క చంద్రబాబు బకాయిలు, వడ్డీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేస్తుంటే.. మరోపక్క బ్యాంకర్లు నోటీసులు ఇస్తుండటం వారిని దిక్కుతోచని స్థితిలోకి నెడుతోంది. -
రబీ లేనట్టే?
సాగునీటివనరులు ధ్వంసం నాశనమైన ఖరీఫ్ పంటలు రుణాలివ్వని బ్యాంకర్లు అప్పులు పుట్టక అన్నదాతకు అవస్థలు రబీని వదులుకునేందుకు సిద్ధం జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ కలిసిరాలేదు. చేతికొచ్చే స్థితిలో పంట హుదూద్‌కు సర్వనాశనమైపోయింది. పెట్టుబడులు పెనుగాలులకు తుడిచిపెట్టుకుపోయాయి. సాగునీటి వనరులు దెబ్బతినడంతో రబీపై ఆశలూ ఆవిరై పోతున్నాయి. మదుపులు దక్కని స్థితిలో మళ్లీ అప్పులు చేసి సాగుచేసే సాహసం చేయలేకపోతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 37వేల హెక్టార్ల్ల(93వేల ఎకరాలు). సుమారు 50వేల మంది రైతులు వరి,అపరాలతో పాటు ఇతర వాణిజ్యపంటలను ఈ కాలంలో చేపడుతుంటారు. 15వేల ఎకరాల్లో వరి, 60వేల ఎకరాల్లో అపరాలు, 5వేల ఎకరాల్లో వేరుశనగ, మరో 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తుంటారు. మరో పదివేల ఎకరాల్లో ఇతర పంటలు ఉంటాయి. వీటన్నింటికీ చెరువులు, కాలువలు వంటి సాగునీటి వనరులే ఆధారం. వర్షాలు అనుకూలించి వీటిల్లో సమృద్ధిగా నీటి నిల్వలుంటేనే పూర్తి ఆయకట్టులో సాగుకు అవకాశం ఉంటుంది. హదూద్ కారణంగా జిల్లాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సాగు నీటి వనరులన్నీ చాలావరకు దెబ్బతిన్నాయి.గ్రోయిన్లు, స్లూయిజ్‌లు, చెక్‌డామ్‌లు ధ్వంసమయ్యాయి. కాలువలు, చెరువుల గట్లు కొట్టుకుపోయాయి. రబీకి సరిపడా నీటి నిల్వలు లేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులతో రబీ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. తుపానుకు చేతికొచ్చే దశలో ఖరీఫ్ పంటలు నాశనమైపోయాయి. పెట్టుబడులు కూడా దక్కక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఈ ఏడాది ఖరీఫ్ నాట్లు ఆలస్యమయ్యాయి. ఉన్న కొద్దిపాటి పంటల కోతలు డిసెంబర్లో కానీ పూర్తికావు. అంటే అనంతరమే రైతులు సాగు పనులకు ఉపక్రమించాలి. యథార్ధంగా రబీ అక్టోబర్ మొదటి వారంలోనే ప్రారంభమవ్వాలి. ఆదిశగా వ్యవసాయాధికారుల రబీ సన్నద్ధత కానరావడం లేదు. ప్రణాళికను ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే రబీకోసం 8వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్పెట్టింది. ఇక ఇప్పటికిప్పుడు కొత్త అప్పులు పుట్టే పరిస్థితుల్లేవు. రుణమాఫీ పుణ్యమా అని బ్యాంకర్లు అన్నదాతల ముఖం చూడడం లేదు. హుదూద్‌లో పంట నష్టంపై ప్రభుత్వం నోటిఫై చేస్తే రైతుల రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. అయితే రుణమాఫీ పుణ్యమాని గత ఖరీఫ్‌లో రుణాలు తీసుకున్న రైతులను వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. దీంతో రీషెడ్యూల్ పరిధిలోకివచ్చే వారుకూడా అత్యల్పంగానే ఉంటారు. మరొక పక్క రుణమాఫీ పరిధిలోకి వచ్చే పాత బకాయిలు వడ్డీతో సహా తడిసిమోపెడ య్యాయి. ఈ బకాయిలు చెల్లిస్తే కానీ బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోవడ్డీలకు అప్పులు చేసిమరీ సాగుకు రైతులు సిద్ధంగా లేరు. ఒక వైపు నీటివనరుల్లేక..కొత్త రుణాలు పుట్టని ఈ పరిస్థితుల్లో రబీసాగుకు దూరంగా ఉండడమే మేలని రైతులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ ఏడాది రబీసాగయ్యే పరిస్థితులుకన్పించడంలేదు. -
సాయం చేసేదెవరు!
ఆదర్శ రైతులను తొలగించిన ప్రభుత్వం ఎంపీఈవోల నియామకానికి ఖరారు కాని విధివిధానాలు వ్యవసాయ సమాచారం ఇచ్చేవారు కరువు ఆందోళనలో అన్నదాతలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు అన్నదాతలను రోజురోజుకూ మరింత కుంగదీస్తున్నాయి. హామీల వర్షంతో ఆశలు రేపిన పాలకులు కొద్దికాలంలోనే వాటిని వమ్ము చేశారు. హామీలను అమలు చేయకపోగా, రైతులకు అన్ని విధాలా ఉపయోగపడుతున్న ఆదర్శ రైతు వ్యవస్థను కూడా తొలగించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో సాగు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరు సాయం చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు/మచిలీపట్నం : రైతులకు మరో కష్టం వచ్చిపడింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా.. సకాలంలో సాగునీరు రాకపోయినా అష్టకష్టాలు పడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ద్వారా కనీస సేవలు కూడా అందకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి రైతులకు కనీస సమాచారం కూడా అందడం లేదు. ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయడమే ఇందుకు కారణం. ఎరువుల వినియోగం, సబ్సిడీ పరికరాల సమాచారం తదితర అంశాలపై రైతులకు సమాచారం సకాలంలో అందేది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమాచారం ఇచ్చేవారు కరువు ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కల్పిస్తున్న ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో వివరించేవారు కరువయ్యారు. పెద్ద రైతులకు మినహా సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం అందని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వం నియమించిన ఆదర్శ రైతులను ప్రస్తుత పాలకులు తొలగించారు. వారి స్థానంలో ఎంపీఈవోలను నియమిస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయటంలో జాప్యం చేస్తోంది. ఎంపీఈవోల నియామకం ఎప్పటికి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో మండలంలో 50 మంది చొప్పున ఆదర్శరైతులు ఉండేవారు. దీంతో గ్రామస్థాయిలో రైతులకు సకాలంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండేది. వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందించే వరి విత్తనాలు, యంత్రపరికరాలు, జిప్సం, యూరియా తదితర ఎరువుల వివరాలను ఆదర్శరైతులు తమ పరిధిలోని రైతులకు తెలియజేసి అవసరమైతే వారే వెంటపెట్టుకుని తీసుకెళ్లేవారు. రైతులకు అన్ని విధాలా సాయం చేసేవారు. ప్రస్తుతం ఆదర్శరైతులు లేకపోవడంతో మండల వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ విస్తరణాధికారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలోని 49 మండలాల్లో సగానికి పైగా మండలాల్లో వ్యవసాయశాఖ విస్తరణాధికారులు లేరు. పంటలకు తెగుళ్లు వ్యాపించిన సమయంలో ఎలాంటి మందులు వాడాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే విషయం తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళితే అధికారులు, సిబ్బంది కనిపించడంలేదని రైతులు చెబుతున్నారు. ఎంపీఈవోల నియామకంలో జాప్యం ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ప్రతి మండలానికి నలుగురు, ఐదుగురు వ్యవసాయ విస్తరణ అధికారి(ఎంపీఈవో)లను కాంట్రా క్టు ప్రాతిపదికన నియమించనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ విభాగం లో డిప్లమో చేసిన వారిని ఈ పోస్టుల్లో నియమిస్తారనే ప్రచారం జరుగుతోం ది. దీనికి అనుగుణం గా స్పష్టమైన ఉత్తర్వులు జారీ కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తేనే ఎంపీఈవోల నియామకా నికి అవకాశం ఉంటుం దని వ్యవసా య శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కుబడిగా కార్యక్రమాలు ప్రతి మంగళ, బుధవారాల్లో ‘పొలం పిలుస్తోంది’, ప్రతి నెల 16వ తేదీన వ్యవసాయ మార్కెట్లలో రైతులకు సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని విధిగా రెండు గ్రామాల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ సమాచారాన్ని రైతులకు అందించే వారు లేక మొక్కుబడిగానే జరుగుతోంది. -
మొవ్వు విరిగిన కొబ్బరి రైతు
వేలాది ఎకరాల్లో కూలిన చెట్లు కోత దశలో అరటిగెలలు నేలపాలు మామిడి, జీడి తోటలకు నష్టం యలమంచిలి/నక్కపల్లి: ప్రకృతి దాడితో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. హుదూద్ దెబ్బకు కొబ్బరి,అరటి,మామిడి ,జీడి రైతులు కుదేలయ్యారు. ఆదివారం నాటి ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. యలమంచిలి, నక్కపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో చెట్లు కళ్లముందే చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. పంటచేతికొచ్చే సమయంలో అరటి తోటలు నేలకూలడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. భారీ వర్షాలు, తుపానులప్పుడు వరికి నష్టం వాటిల్లేది. ఇప్పుడు నష్టం ఉద్యానవన రైతుల వంతయింది. పంటపొలాల్లో ఎక్కడ చూసినా వర్షపునీరే కన్పిస్తోంది. నేలకొరిగిన చెరకు తోటలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చెరకు సాగు కలిసిరాక నష్టాలు చవిచూస్తున్న రైతులకు తుపాను రూపంలో మరింత నష్టం చేకూరినట్టయింది. నేలకొరిగిన చెరకును ఎత్తికట్టడం తమకు ఆర్థికంగా మరింత భారమవుతుందని యలమంచిలి ప్రాంతానికి చెందిన రైతులు వాపోతున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా అరటితోటలు నేలమట్టమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. జీడి, మామిడి తోటలు సైతం మొదళ్లకు విరిగిపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నక్కపల్లి మండలంలో వేలాది కొబ్బరిచెట్లు నేలకూలిపోయాయి. సుమారు 5వేల ఎకరాల్లో తోటలకు తీవ్రనష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం. కొన్ని చోట్ల వేళ్లతో కుప్పకూలిపోగా,మరికొన్నిచోట్ల మొవ్వుతోసహా నేలరాలిపోయాయి. ఈ చెట్లు ఎందుకూ పనిరాని పరిస్థితి. ఈదురుగాలలకు టన్నులకొద్దీ కొబ్బరికాయలు నేలరాలిపోయాయి. ఇక మామిడి తోటల్లో మధ్యకు నరికినట్టుగా చెట్లు విరిగిపోయాయి. జీడి చెట్లకు తీవ్రనష్టం వాటిల్లింది. 3వేల ఎకరాలకు పైగా మామిడి,2వేల ఎకరాలకు పైగా జీడి తోటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎన్ నర్సాపురంలో కర్రినానాజీకి చెందిన 3 ఎకరాల అరటితోట పూర్తిగా ధ్వంసమైంది. మరో వారం రోజుల్లో అరటిగెలలు కోసి మార్కెట్‌కు తరలిద్దామని భావిస్తున్న తరుణంలో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ మూడెకరాల తోటకు సుమారు రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టానని నానాజీ వాపోయాడు. కరంటు లేని సమయంలో జనరేటర్ పెట్టి నీటిని సరఫరా చేశానని ఆశించిన స్థాయిలో పంటపండిందని సంబరపడుతున్న తరుణంలో ఈదురుగాలులు తోటమొత్తాన్ని నాశనం చేశాయని కన్నీళ్లపర్యంతమయ్యాడు. దేవవరం,డొంకాడ,జగన్నాధపురం,సీతానగరం,రమణయ్యపేట,దోసలపాడు,కాగిత, చందనాడ, వేంపాడు, తదితరప్రాంతాల్లో పత్తి, బత్తాయి,కంది, చెరకు, అరటి పంటలకు భారీనష్టం కలిగింది. వేలాది ఎకరాల్లో నష్టం వందలాది ఎకరాల్లో అరటి, వేలాది ఎకరాల్లో కొబ్బరి,మామిడితోటలు నేలకూలిపోయాయి. రూ.లక్షల్లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈనష్టాన్నుంచి కోలుకోవాలంటే మరో రెండేళ్లు పడుతుంది. ప్రభుత్వం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులుచేసి పెట్టుబడులు పెట్టాం. రుణమాఫీచేయకపోగా,కనీసం రుణాలు కూడా ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుచేస్తే ప్రకృతి పగబట్టి సర్వనాశనం చేసింది. - కర్రినానాజీ, రాజబాబు,శంకర్, రైతులు -
ముంచుకొస్తున్న మరో ముప్పు
అన్నదాతలపై ప్రకృతి కోపం మూడేళ్లుగా ముంచెత్తుతున్న వరుస తుపాన్లు ఇప్పుడు దూసుకొస్తున్న హుదూద్ అన్నదాతలపై ప్రకృతి పగబడుతోంది. అతివృష్టి, అనావృష్టిలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెట్టగా.. గత మూడేళ్లుగా లైలా నీలం, హెలెన్, రూపాల్లో తుపాన్లు పంటలను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు హుదూద్ రూపంలో తుపాను విరుచుకుపడుతోంది. వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇది ఈ నెల 12న విశాఖకు సమీపంలో తీరం దాటనుంది. ఈ సమయంలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏటా నష్టాలను చవిచూస్తున్న అన్నదాతలు ఈ ఉపద్రవం ఎంత నష్టాన్ని మోసుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. విశాఖ రూరల్: ఖరీఫ్ ప్రారంభం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుల పరిస్థితి దినదిన గండంగా ఉంటోంది. అతివృష్టి, అనావృష్టి జమిలీగా వెంటాడుతున్నాయి. రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. ఏటా కరవు ఛాయలు నెలకొనడం, అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే పంట చేతికొచ్చే సమయంలో తుపాన్లు విరుచుకు పడడం పరిపాటి అవుతోంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,99,813 హెక్టార్లు. ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వరుణుని కరుణతో అష్టకష్టాకోర్చి అన్నదాతలు 1,78,743 హెక్టార్లలో పంటలు చేపట్టారు. ఇందులో ప్రధానంగా వరి 88,893 హెక్టార్లలోను, చెరకు 37,459 హెక్టార్లలోను, రాగి 20,324 హెక్టార్లలోను సాగవుతోంది. కొద్ది రోజులుగా మళ్లీ వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు మండిపోవడంతో కొన్ని పంటలు వడలిపోతుండగా, ముఖ్యంగా వరికి తెగుళ్ల బెడద ఎక్కువైంది. గత 15 రోజులుగా అన్నదాతలు ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని చినుకులు రాలినా అనుకూలమే అనుకుంటున్నారు. అయితే ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో మాదిరి హుదూద్ తుపాను రూపంలో రైతులను కలవరానికి గురిచేస్తోంది. 2010లో ఝల్, 2011లో లైలా, 2012లో నీలం, 2013లో ఏకంగా లెహర్, హెలెన్, పైలిన్ తుపానుల్లా ఎక్కడ పంటలు ముంపునకు గురవుతాయోనన్న భయం రైతాంగంలో నెలకొంది. గతేడాది భారీ వర్షాలకు పడిన నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువ ల గండ్లు నేటికీ పూడ్చలేదు. దీంతో ఇసుక బస్తాలేసి గండ్లు పూడ్చి పంటలు కాపాడుకునేందుకు రైతులు అప్పుడే సిద్ధమవుతున్నారు. -
సాగు నీరో రామచంద్రా..
మరమ్మతులకు నోచుకోని గ్రోయిన్లు సముద్రంలోకి వృథాగా ఉప్పొంగే జలాలు వేలాది ఎకరాలకు అందని సాగునీరు అన్నదాతలకు అవస్థలు ఉప్పొంగే జలాలు ఉప్పునీటి పాలవుతున్నాయి. వర్షాలప్పుడు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు బోర్లు, వర్షమే ఆధారం. నదుల్లోని నీటిని పొలాలకు మళ్లించడానికి ఏర్పాటు చేసిన గ్రోయిన్లు శిథిలమవ్వడంతో సాగునీరందక అన్నదాతలు అవస్థల పాలవుతున్నారు. వీటిని బాగు చేయడానికి ప్రతిపాదనలు పంపామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా.. ఆ పని కానరావడం లేదు. చోడవరం : జిల్లాలో రైవాడ, కోనాం, పెద్దేరు,కల్యాణపులోవ, తాండవతోపాటు మరో ఐదు మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు లక్ష ఎకరాలు సాగు భూమి ఉంది. ఇక మిగిలిన భూములన్నీ వర్షాధారమే. వర్షాలప్పుడు నీరు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, అధికారులదే. కానీ వారు పట్టనట్టు వ్యవహరించడంతో నీరో రామచంద్రా అంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఎగువ నుంచి వివిధ నదుల్లోకి వస్తున్న నీటిని నిల్వ ఉంచే గ్రోయిన్లు దెబ్బతినడంతో వేలాది కూసెక్కుల నీరు వృథాగా సముద్రంపాలవుతోంది. శారద, పెద్దేరు, బొడ్డేరు, తాండవ, తాచేరు నదులు జిల్లాలో ప్రధానమైనవి. వీటితోపాటు సుమారు 60కి పైగా ప్రధాన కొండగెడ్డలు ఉన్నాయి. పెద్దనదులపై సుమారు 25 వరకు గ్రోయిన్లు ఉన్నాయి. శారదానదిలోని కశింకోట కాశీమదుం, అనకాపల్లి గొడారి ఆనకట్ట, చెర్లోపల్లి, సీతానగరం, నర్సాపురం గ్రోయిన్లు, పెద్దేరు నదిలోని గౌరీపట్నం, శ్రీరాంపట్నం, చాకిపల్లి, భోగాపురం, పి.ఎస్.పేట, బెన్నవోలు గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో భారీ వర్షాలప్పుడు నదుల్లోని నీరు వృథాగా దిగువకు పోతోంది. చాకిపల్లి గ్రోయిన్కింద 250 ఎకరాలు, భోగాపురం కింద 350, శ్రీరాంపట్నం 200, పిఎస్పేట 250, బెన్నవోలు 275, గౌరీపట్నం గ్రొయిన్కింద వెయ్యి ఎకరాలు సాగుభూములున్నాయి. పెద్ద గ్రోయిన్ల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా శిథిలమై ఉన్నాయి. ఐదేళ్లుగా వీటిని నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. గౌరీపట్నం గ్రోయిన్‌కు నాలుగేళ్ల కిందట రూ.లక్షతో మరమ్మతులు చేపట్టినా నాణ్యతా లోపంతో రెండేళ్లకే కొట్టుకుపోయింది. మిగతా గ్రోయిన్ల పరిస్థితి దయనీయం. అసలే వర్షాధార భూములకు గ్రోయిన్లు కూడా ఉపయోగపడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా వీటికి అనుసంధానంగా ఉండే స్లూయీస్‌లు కూడా పూర్తిగా దెబ్బతినడంతో నదుల్లోని నీరు పంటకాలువలకు పారడం లేదు. పరిస్థితిని ఇరిగేషన్ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినా ఫలితం శూన్యం. జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకొని గ్రోయిన్లకు మరమ్మతులు చేపట్టి సాగునీరందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
ఆయకట్టు కాదు కనికట్టే!
జిల్లాలో కొత్త ఆయకట్టు ఊసే లేదు కృష్ణా డెల్టాకూ సకాలంలో అందని సాగునీరు డ్రెయిన్లలో తూడు కూడా తొలగించని వైనం వంద రోజుల్లో ఉమా వల్ల రైతులకు ఒరిగింది శూన్యం సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘పులిచింతల.. పోలవరం ప్రాజెక్టులు.. దుమ్ముగూడెం, తారకరామ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తాం. అన్నదాతలకు సాగునీటి కష్టాలను దూరం చేస్తాం..’ అంటూ టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించారు. జిల్లాకు చెందిన దేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రైతుల్లో కొత్త ఆయకట్టుపై ఆశలు చిగురిం చాయి. ఇందుకు తగినట్లుగానే ఆయన కూడా రెండు నెలల్లో పులిచింతల పూర్తిచేసి జిల్లాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కానీ, ఒక్క ప్రాజెక్టులోనూ పురోగతి లేదు. అదనంగా ఆయకట్టు సాగులోకి రాకపోగా, కనీసం సాగర్ నుంచి కూడా సకాలంలో సాగునీరు విడుదల చేయలేదు. కాల్వలు, డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగించలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు డ్రెయిన్లు పొంగి పొలాలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి దేవినేని ఉమాకు ముఖ్యమంత్రి ఫస్ట్ గ్రేడ్ ఇవ్వడంపై జిల్లాలోని రైతాంగం మండిపడుతోంది. వంద రోజుల్లో ఏం చేశారని ఆయనకు ఫస్ట్ గ్రేడ్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పులిచింతల, పోలవరం, దుమ్ముగూడెంపై భారీ ఆశలు జిల్లాలో ప్రధానంగా కృష్ణా డెల్టా ద్వారా ప్రస్తుతం 8.50 లక్షల ఎకరాలు సాగవుతోంది. సాగర్ కుడికాలువ ద్వారా నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లో మరో 3.78లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. మిగిలిన భూమి మెట్టగానే ఉంది. అయితే పులిచింతల, పోలవరం ప్రాజెక్టులతోపాటు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలపై జిల్లా రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూడింటి ద్వారా జిల్లాలో 7,68,000 ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించగానే రెండు నెలల్లో పులిచింతల ద్వారా సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. మూడు నెలలు గడిచినా ఇంతవరకు చుక్కనీరు విడుదల కాలేదు. దీంతో తమ సాగునీటి కల ఎప్పటికి నెరవేరుతుందోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పులిచింతల పూర్తయితే.. పులిచింతల ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో సాగునీరు అందితే జిల్లాలో 6,79,498 ఎకరాలు సాగులోకి వస్తుంది. అంటే కృష్ణా డెల్టాతో సమానంగా సాగునీరు అందుతుంది. ఎంతోకాలంగా రైతులు ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తికాకుండానే గత సంవత్సరం డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు కూడా పూర్తిగా అందలేదు. పోల‘వరం’ ఎన్నటికో..! పశ్చిమగోదావరి జిల్లాలోని రామయ్యపేట గ్రామం వద్ద నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా కృష్ణా జిల్లాకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మన జిల్లాలో 62వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కానీ, పాలకులు ఎప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారోనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం గోదావరి నదికి సమీపంలో ఖమ్మం జిల్లా కోతులకొండ గ్రామం వద్ద దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఈ పథకం పూర్తయితే కృష్ణా జిల్లాలో 27 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. ‘తారకరామ’కు ఖర్చు చేసింది రూ.5.37 కోట్లే! ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద కృష్ణానదికి సమీపంలో తారకరామ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఈ పథకం పూర్తయితే 56వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. రూ.165.65 కోట్లతో మొదలు పెట్టిన ఈ పథకానికి ఇప్పటి వరకు రూ.5.37 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సొంత నియోజకవర్గంలో ఉన్న ఈ పథకంపై కూడా మంత్రి పెద్దగా దృష్టి పెట్టలేదని స్థానిక రైతులు విమర్శిస్తున్నారు. ముందుకు సాగని ఆధునికీకరణ పనులు నాగార్జున సాగర్, డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదు. దీంతో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు డ్రెయిన్లు పొంగి పొలాలను ముంచెత్తుతున్నాయి. అష్టకష్టాలు పడి సాగు చేసిన పొలాలు నీటమునగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు నదుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, కైకలూరు, కలిదిండి మండలాలకు సాగునీరు సక్రమంగా అందటం లేదు. కాలువ చివరి భూములు కావడంతో నీరు అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందలేదని తెలుస్తోంది. దీనిపై కూడా మంత్రి దృష్టి పెడతారనుకుంటే పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దేనిలో ఫస్ట్ గ్రేడ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావుకు సీఎం చంద్రబాబు ఫస్ట్ గ్రేడ్ ఇచ్చారు. ఏ విషయాన్ని బేరీజు వేసుకుని ఆయనకు ఫస్ట్ గ్రేడ్ ఇచ్చారని జిల్లా రైతాంగం ప్రశ్నిస్తోంది. ఇరిగేషన్ శాఖ పనితీరు బాగుందనా.. లేక ప్రతిపక్షంపై అర్థంపర్థం లేని విమర్శలు చేసినందుకా.. ఏ విషయంలో ఉమాకు ఉత్తమ గ్రేడ్ ఇచ్చారనే విషయం అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వంద రోజుల పాలనలో ఇరిగేషన్ శాఖ వల్ల తమకు ఒరిగిందేమీ లేదని జిల్లాలోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఆశల చిగురు
రెండు రోజులుగా జిల్లాలో వర్షం వరి,చెరకు పంటలకు అనుకూలం ఆలస్యంగా వేసిన నాట్లకు మేలు ఖరీఫ్ ఆఖరిలో వరుణుడు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనంతో రెండు రోజులుగా జిల్లా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆలస్యంగా వేసిన వరినాట్లు ప్రస్తుతం పిలకలదశలో ఉన్నాయి. పొట్టదశవరకు నీటి ఉధృతిని తట్టుకునే ఈ పంటకు మేలు చేకూరినట్టే. అక్కడక్కడా వర్షాభావంతో వడలిపోతున్నమెట్టపంటలకు అనుకూలం. ఇంకా ఉధృతమైతేనే కొన్ని పంటలకు నష్టం. అనకాపల్లి : అల్పపీడనంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇవి పంటలకు అనుకూలం. ఆగస్టు నెలాఖరులో కురిసిన వర్షాలతో సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లోనూ వరి నాట్లు జోరుగా సాగాయి. ఆలస్యంగా నాట్లుతో ప్రస్తుతం చాలా చోట్ల వరి పిలకల దశలో ఉంది. పొట్టదశ వరకూ నీటి ఉధృతిని తట్టుకోగల స్వభావం ఉన్నందున వర్షాలు మితిమీరినా ఇప్పటికిప్పుడు ఈ పంటకు వచ్చిన నష్టం ఏమీ ఉండదని వ్యవసాయశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు నీటిని తొలగించుకుంటే మంచిదంటున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో రైతుల్లో కొంత ఆందోళన నెల కొంది. పరిస్థితి ఇప్పటికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంకా భారీ వర్షాలు నమోదయితే ముంపు కష్టాలు తప్పవేమోనని అటు రైతులు, ఇటు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదు లు, వాగులు, కొండగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నా యి. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాల్లోకి ఎగువ నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చిపడుతోంది. శుక్రవారం సాయంత్రానికి తాండవ జలాశయంలో 370 అడుగుల నీరు నిల్వ ఉంది కురుస్తున్న వ ర్షాలతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వరి, చెరకుకు మేలు నాది మునగపాక మండలం తిమ్మరాజుపేట. ఈ ఏడాది 75 సెంట్ల విస్తీర్ణంలో చెరకు సాగు చేపట్టాను. మూడేళ్లుగా చెరకుతోటలకు మొజాయిక్ తెగులు ఆశించి నష్టపోతున్నాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు దీని నివారణకు అనుకూలమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు తెగులు పోయే అవకాశం ఉంటుందని ఆశగా ఉంది. ఆలస్యంగా వేసిన వరినాట్లుకు అనుకూలం. - భీమరశెట్టి గణేష్‌నాయుడు, రైతు, పంటలకు అనుకూలం ప్రస్తుతం నమోదవుతున్న భారీ వర్షాలకు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రధానంగా చెరకు, వరి పంటలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పత్తి, కందికి మాత్రం కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పత్తిలో నీరు నిల్వ ఉంటే తొలగించాలి. నీరు తగ్గాక 3 గ్రాముల కాఫర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - సి.వి.రామారావు, ఏరువాక కేంద్రం, శాస్త్రవేత్త -
కాలువలో కన్నీళ్లు
సా..గుతున్న హంద్రీనీవా పనులు కర్నూలు రూరల్: కరువు సీమలో సిరుల పంటలు పండించేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రైతన్న ఆశలతో దోబూచులాడుతోంది. భారీ వర్షాలతో జిల్లాలోని జలాశయాలన్నీ జల కళ సంతరించుకున్నా.. హంద్రీనీవా నీరు ఖరీఫ్‌కు అండగా నిలవలేకపోతోంది. ఆయకట్టు పంటలు చివరి దశకు చేరుకున్నా.. చుక్క నీరు విడుదల కాకపోవడం అన్నదాతను నిరాశకు గురిచేస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది హంద్రీనీవా లక్ష్యం. జూలై 24, 2004న హంద్రీనీ ఫేజ్-1 పనులకు అప్పటి ప్రభుత్వం రూ.1,305 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత అంచనా వ్యయం రూ.2,774 కోట్లకు చేరుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం హంద్రీనీవా పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. సకాలంలో పనులు పూర్తి కాకపోయినా నవంబర్ 18, 2012న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ట్రయల్ రన్ చేపట్టారు. మొత్తం 114 కిలోమీటర్ల మేర మెయిన్ కాలువ, ముచ్చుమర్రి ఎత్తిపోతలతో కలిపి కాలువపై 9 లిఫ్ట్‌లు నిర్మించారు. కాలువ పరిధిలో క్రిష్ణగిరి రిజర్వాయర్ (0.161 టీఎంసీ), పత్తికొండ రిజర్వాయర్(1.126 టీఎంసీ), జీడిపల్లి రిజర్వాయర్(1.694 టీఎంసీ)లు ఉన్నాయి. స్కీమ్ నిర్మాణానికి 9493.45 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 8509.39 ఎకరాలను సేకరించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు 8081.06 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికీ 428.33 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. కాలువకు లైనింగ్ లేకపోవడంతో వర్షపు నీటి తాకిడికి గండ్లు పడ్డాయి. ప్రధాన కాలువ నుంచి పంట పొలాలకు నీటిని తీసుకెళ్లే పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులు 30 శాతం కూడా పూర్తి కాలేదు. అసంపూర్తి పనులతోనే గతేడాది ఖరీఫ్‌లో కర్నూలు, అనంతపురం జిల్లాలో 28వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ చివరి దశకు వచ్చినా సాగుకు నీరు విడుదలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం గమనార్హం. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీరు పూర్తి సామర్థ్యంకు చేరడంతో దిగువనున్న సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తోంది. హంద్రీనీవా ద్వారా సాగునీరు విడుదల చేయాలని అధికారులు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అనంపురం జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురవక ఆయకట్టు రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 25వేల ఎకరాల ఆయకట్టు.. కర్నూలు, అనంతపురం జిల్లాల దాహార్తి తీర్చేందుకు పది టీఎంసీ నీటికి ఆగస్టు నెలలో హంద్రీనీవా అధికారులు ఇండెంట్ పెట్టారు. అయితే తాగునీటి కోసమని రెండు టీఎంసీ నీటిని 700 క్యూసెక్కుల ప్రకారం నీటిని మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేస్తున్నారు. పాలకుల తీరుతో సాగునీటి కోసం నిర్మించిన హంద్రీనీవా తాగునీటి పథకంగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేడు హంద్రీనీవా కాలువపై మంత్రి పర్యటన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం హంద్రీనీవా కాలువపై పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహం నుంచి బయలుదేరి మల్యాల చేరుకుంటారు. అక్కడి నుంచి గుంతకల్లు.. ఆ తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ వరకు కాలువను పరిశీలించనున్నారు. -
కాటేసిన కరెంట్ తీగ
పత్తికొండ టౌన్: కరెంటు తీగ యమపాశమై కాటు వేసింది. ఇతరులను రక్షించబోయి ఓ అన్నదాత మృత్యు ఒడికి చేరిన సంఘటన పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో బోయ మేడికుందు రామయ్య(38) మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..గ్రామానికి చెందిన బోయ మేడికుందు బజారి కుమారుడు రామయ్య కొన్ని నెలలుగా బైపాస్‌రోడ్డుకు సమీపంలో ఉన్న పొలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేసుకొని కాపురం ఉంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ కోసం తీగ లాగారు. కరెంటు తీగకు సపోర్టుగా ఏర్పాటు చేసిన జీ వైర్ సోమవారం రాత్రి తెగిపడింది. మంగళవారం ఉదయం తెగిపడిన విద్యుత్ వైరును గమనించిన రామయ్య అక్కడకు ఎవరూ వెళ్లవద్దని కుటుంబ సభ్యులను వారించాడు. చుట్టుపక్కల పొలాలకు వెళ్లేవారికి కూడా కరెంటుతీగ తెగింది, ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించాడు. పిల్లలు ఎవరైనా అటుగా వెళ్తే ప్రమాదం జరుగవచ్చు అని భావించి వైర్‌ను కట్టెతో పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తూ తీగ రామయ్యకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త గిలగిల కొట్టుకుంటుండటం గమనించిన భర్త తుసి కాపాడేందుకు ప్రయత్నించగా ఆమెకు కూడా విద్యుత్‌షాక్‌కు గురైంది. క్షతగాత్రురాలిని వెంటనే చికిత్సనిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పత్తికొండ ఎస్ఐ మున్నా సాహెబ్ పరిశీలించారు. విద్యుత్‌శాఖ ఏఈ రవీంద్రానాయక్ సిబ్బందితో కలిసి తెగిపడిన విద్యుత్‌లైనును సరిచేశారు. నలక దొడ్డి సర్పంచ్ బి. లోకనాథ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రామయ్య మృతితో అటికెలగుండు గ్రామంలో విషాదం నెలకొంది. -
శివారులు ఎడారులు
శివారు ప్రాంతాలకు చేరని సాగునీరు ఎండిపోతున్న నారుమడులు ఆయిల్ ఇంజిన్లతో నీరుతోడినా ప్రయోజనం శూన్యం శివారులో నారుమడులే పోయని గ్రామాలెన్నో ఎకరాకు రూ.5వేలు అదనపు ఖర్చులు ఆందోళనలో అన్నదాత సారూ.. మీరే మా సమస్య పరిష్కరించాలి. నీరు అందక నాట్లు వేయలేకపోతున్నాం. అక్కడక్కడా నాట్లు వేసిన పొలాలు నెర్రెలిస్తున్నాయి. పంటలు పండించుకునేందుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించాలి. లేకపోతే పంటలు పండక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఇదీ ఆదివారం 14వ నంబరు పంటకాలువను పరిశీలించేందుకు వచ్చిన ఇరిగేషన్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు ఎదుట కోడూరు మండలం ఊటగుండం రైతుల ఆవేదన... మచిలీపట్నం/చల్లపల్లి : ఒక్క ఊటగుండం రైతులు మాత్రమే కాదు.. శివారు ప్రాంతాల్లోని అన్నదాతలందరి పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఒకవైపు సాగునీరు విడుదల చేశామని పాలకులు చెబుతున్నా.. సెప్టెంబరు నెల వచ్చినా శివారు ప్రాంతాలకు మాత్రం చుక్క నీరు చేరలేదు. దీంతో పచ్చగా కళకళలాడ్సిన వేలాది ఎకరాల పొలాలు నెర్రెలిచ్చి ఎడారులుగా మారుతున్నాయి. పాలకుల పర్యవేక్షణాలేమి, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఎగువన ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిండినా, కాలువలకు కొసరి కొసరి సాగునీటిని విడుదల చేస్తూ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాలువలకు ఎంత నీరు విడుదల చేస్తే శివారు భూములకు సక్రమంగా నీరు అందుతుందనే విషయాన్ని అంచనా వేయలేని నీటిపారుదల శాఖ అధికారుల వైఖరి తమకు శాపంగా మారిందని మండిపడుతున్నారు. కరుణించని వరుణుడు ఈ ఏడాది వరుణుడు కూడా కరుణించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. సెప్టెంబరు 7వ తేదీలోపు జిల్లాలో 554.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 420.0 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. కంకిపాడు, పామర్రు, గూడూరు, కలిదిండి, మొవ్వ మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది. 40 శాతం నీరు కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తే, మిగిలిన 60శాతం వర్షంపై ఆధారపడి సాగు చేయాల్సి ఉందని, వర్షం లేకపోవటంతో సాగునీటిని సక్రమంగా అందించలేకపోతున్నామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. శివారులో ఎండుతున్న నారుమడులు కాలువ చివరన ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర మండలాల్లో ఇప్పటికీ వరినాట్లు వేస్తూనే ఉన్నారు. కోడూరు మండలంలోని ఊటగుండం, రామకృష్ణాపురం, ఇరాలి, హంసలదీవి, ఉల్లిపాలెం, సాలెంపాలెం, నారేపాలెం, విశ్వనాథపల్లి, వి.కొత్తపాలెం, మందపాకల, పోటుమీద, నాగాయలంక మండలం ఏడిమొగ, టి.కొత్తపాలెం, గణపేశ్వరం, పర్రచివర తదితర గ్రామాలకు ఇంకా సాగునీరు చేరలేదు. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన రైతులు నారుమడులు కూడా పోసుకోలేదు. మచిలీపట్నం మండలంలో 25 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. గత పది రోజులుగా 9/3, 9/4, 9/5, 9/6, 9/7 కాలువలకు చుక్కనీరు రావటం లేదు. దీంతో తుమ్మలచెరువు, వాడపాలెం, చిన్నాపురం, నెలకుర్రు, కానూరు, తాళ్లపాలెం తదితర గ్రామాల్లో వరినాట్లు పూర్తి చేసిన పొలాలు, నారుమడులు ఎండిపోతున్నాయి. కోన, పాతేరు తదితర గ్రామాలకు సాగునీరు చేరకపోవటంతో నారుమడులు పోసుకోలేదు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు, ముంజులూరు తదితర గ్రామాల్లో వరినాట్లు జరుగుతున్నాయి. ఈ మండలంలో 18 వేల ఎకరాల్లో వరిసాగు ఉండగా, 10వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. కృత్తివెన్ను మండలం 10వేల ఎకరాలు సాగు ఉండగా అన్ని గ్రామాల్లో వరినాట్లు వేస్తున్నారు. బంటుమిల్లి చానల్‌కు గత నాలుగైదు రోజులుగా సాగునీటి విడుదలను గణనీయంగా తగ్గించటంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. నాట్లు వేయకముందే వంతులవారీ పద్ధతిలో సాగునీటి అందిస్తామని ప్రకటించిన నీటిపారుదల శాఖ అధికారులు శివారు ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయకుండా తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆయిల్ ఇంజిన్లే దిక్కు దివిసీమలోని పలు ప్రాంతాల్లో పంటకాలువల ద్వారా సరిగా సాగునీరు అందక పోవడంతో ఆయిల్ ఇంజిన్లతో తోడుకుని నాట్లు వేసుకుంటున్నారు. కొన్నిచోట్ల మండుతున్న ఎండల వల్ల ఉదయం తోడిన నీరు సాయంత్రానికి ఎండిపోతుండటంతో రెండుసార్లు దమ్ము చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరాకు అదనంగా రూ.5వేలు ఖర్చు అవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువలకు సక్రమంగా సాగునీరు అందిస్తే తమకు ఈ దుస్థితి ఉండదని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దివిసీమలో 1.05లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉండగా నీటి కొరత వల్ల ఇప్పటి వరకు 45వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తిచేశారు. నారు ముదురుతోంది దివిసీమలోని పలు ప్రాంతాల్లో వేసిన నారు ముదిరిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా 25 నుంచి 30రోజుల మధ్య నారును ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వేసిన నారు 35 నుంచి 40 రోజులు దాటిపోతున్నా పొలాలకు సాగునీరందకపోవడంతో ఏమిచేయాలో రైతులకు దిక్కుతోచడంలేదు. ఎండలు పెరుగుతుండటంతో నారుమళ్లకు రోజూ ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడటానికి రైతులు అదనపు భారాన్ని మోస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాట్లు పూర్తయ్యే వరకు సాగునీటిని సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు. దమ్ము చేసిన పొలం ఎండిపోయింది పక్క రైతును బతిమిలాడుకుని ఆయిల్ ఇంజిన్‌తో నీరు తోడాను. నాట్లు వేసేందుకు దమ్ము చేయించాను. మరుసటి రోజు నాటేయడానికి వెళితే పొలంలో చుక్కనీరులేదు. ఎండిపోయి మట్టి బయటపడింది. మళ్లీ దమ్ము చేయిద్దామనుకుంటే నీరందడంలేదు. ఏమిచేయాలో తెలియడంలేదు. - శీలం వెంకటేశ్వరరావు, పిట్లలంక, కోడూరు మండలం ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు సాగునీటి కోసం ఈ ఏడాది పడుతున్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. నీటి ఎద్దడిని గ్రహించి వెదజల్లే పద్ధతిన సాగుచేశాను. నీరందక మొక్కలు ఎండిపోయి చనిపోయాయి. నారు తెచ్చి నాట్లు వేద్దామనుకున్నా పొలాలు తడవడానికి నీరు లభించడం లేదు. ఈ ఏడాది సాగునీటికి ఖర్చుపెట్టినట్టు నాజీవితంలో ఎప్పుడూ పెట్టలేదు. - గుమ్మడి భీమారావు, పుచ్చగడ్డ, చల్లపల్లి మండలం -
సాగు సందడి
వరుస వర్షాలతో జిల్లాలో ఊపందుకుంటున్న వరినాట్లు 1.80 లక్షల హెక్టార్లకు సాగు పెరుగుతుందని అంచనా! పల్లెల్లో ఎక్కడ చూసినా ముమ్మరంగా వ్యవసాయపనులు సాధారణ వర్షపాతానికి చేరువలో కరువు మండలాలు ఇన్నాళ్లూ ఖరీఫ్‌కు ముఖం చాటేసిన వరుణుడు సీజన్ చివర్లో అన్నదాతల్లో ఆనందం నింపుతున్నాడు. కరువు ఛాయలు అలముకున్న దశలో కనికరించి వర్షిస్తుండడంతో జిల్లాలో వ్యవసాయపనులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన పంటపొలాలు మళ్లీ ముమ్మర పనులతో సందడిగా మారుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : గడచిన నాలుగు రోజులుగా జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కాలువలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అన్నదాతలు ధీమాగా వ్యవసాయ పనులకు దిగుతున్నారు. సాధారణ ఖరీఫ్ విస్తీర్ణమైన 2.8 లక్షల హెక్టార్ల సాగు కాస్తా 1.10 లక్షల హెక్టార్లకు తగ్గవచ్చన్న వ్యవసాయశాఖ అధికారుల భయాందోళనలు పటాపంచలైపోయాయి. ప్రస్తుతం అన్నిచోట్లా సాగునీరు లభ్యమవుతుండడంతో ఖరీఫ్ విస్తీర్ణం 1.80 లక్షల హెక్టార్లకు మించవచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ నాటికి చాలాపొలాల్లో వరి పంట పొట్టదశకు చేరుకుంటుంది. కానీ ఈసారి కరువు ఛాయల నేపథ్యంలో కనీసం నాట్లు కూడా పడలేదు. 13 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ శాతం నమోదైంది. కాని ఇప్పుడు వరుస వర్షాలతో కరవు మండలాల జాబితా 13 నుంచి దాదాపు సగం వరకు పడిపోవచ్చని, తద్వారా ఖరీఫ్‌కు ఢోకా ఉండదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 407.7 మిల్లీమీటర్లు కాగా మొన్నటి వరకు 295.5 మిల్లీమీటర్లు నమోదైంది. ప్రస్తుత వర్షాలతో అది 350 మిల్లీమీటర్లు దాటిపోనున్నట్టు విశ్లేషిస్తున్నారు. మరోపక్క ఇన్నాళ్లూ నాట్లు పడని నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల సరఫరాపై దృష్టిపెట్టని అధికారులు ప్రస్తుత వర్షాలతో ఆగమేఘాలపై వీటిని రప్పిస్తున్నారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల డిమాండ్‌పై ఆరా తీస్తున్నారు. ఈ విధంగా వచ్చిన మొత్తం ఇండెంట్ ఆధారంగా సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇదిలాఉంటే వరితోపాటు మొక్కజొన్న, ఇతర కూరగాయ పంటలకు సైతం ప్రస్తుత వర్షాలు ఊపిరిపోయడంతో దాదాపు అన్ని పంటల సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. -
క్రాప్ హాలిడే!
బిళ్లపాడు గ్రామంలో సాగు చేయలేమని చేతులెత్తేసిన అన్నదాతలు నీళ్లులేక నైస్తున్న పొలాలు గుడివాడ : ఓవైపు వర్షాభారం.. మరోవైపు సాగునీటి విడుదలలో జాప్యం వల్ల విసిగిపోయిన గుడివాడ మండలం బిళ్లపాడు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తమది రైతురాజ్యం, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్.. అంటూ ఊదరగొట్టిన టీడీపీ ప్రభుత్వం రైతుకిచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయకపోగా, కనీసం సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయించలేకపోయిందని ఆ గ్రామ రైతులు విమర్శిస్తున్నారు. సాగుతో పచ్చగా కళకళలాడాల్సిన పంట చేలు ప్రతికూల పరిస్థితుల వల్ల బీటలు వారడంతో వారు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. బిళ్లపాడులో కన్నుల కోడు ఆయకట్టు కింద దాదాపు 1,500 ఎకరాలు సాగవుతుంది. ఈ ఏడాది మాత్రం పంటబోదె పూర్తిగా పూడుకుపోవడంతో నాట్లు పడే పరిస్థితి లేకుండాపోయింది. అసలే సాగునీరు విడుదల కాలేదని.. ఒకవేళ ఆలస్యంగా అయినా నీరు విడుదల చేస్తే ఆ కాస్త నీరూ పూడుకుపోయిన పంటబోదె నుంచి చేలకు అందడం గగనమే అవుతుందని రైతులు చెబుతున్నారు. ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో నష్టాల బారిన పడలేక క్రాప్ హాలీడేకు నిర్ణయించుకున్నట్లు రైతులు చెబుతున్నారు. నెర్రెలిస్తున్న పంట చేలు కొంతమంది రైతులు మోటార్ల సహాయంతో నాట్లు వేసినప్పటికీ అనంతరం సాగునీరు అందకపోవడంతో ఆకుమడులు ఎండిపోతున్నాయి. పచ్చగా ఉండాల్సిన చేలు, గోధుమ రంగులోకి మారిపోతున్నాయి. చుక్కనీరు అందక నేల నెర్రెలిస్తోంది. ఎంతకాలమని మోటార్ల సహాయంతో పంటచేలు తడుపుతామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే... ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడంలేదని, సాగునీరందక పంటలు కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడంలేదని రైతు అవ్వారు రాంపండు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకాలం అష్టకష్టాలు పడి సాగు చేశాం.. కానీ ఇక ఆ పని చేయడానికి ధైర్యం చాలడంలేదని ఆయన సాగుపై తన నిస్సహాయత వ్యక్తంచేశారు. ఒకప్పుడు తెగుళ్లు, ప్రకతి వైపరీత్యాలు మాత్రమే బాధించేవని... ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ చేతకాని తనంతో అనేక సమస్యలతో సతమతమవుతున్నామని గొరిపర్తి నాగేశ్వరరావు అనే కౌలురైతు వ్యాఖ్యలు జిల్లాలో పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి. -
కరువు ఛాయలు
38 మండలాల్లో వర్షాభావం 1,11,401 హెక్టార్లలోనే పంటలు ప్రత్యామ్నాయానికి ప్రతిపాదనలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఈసురోమంటున్నారు. 38 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సాధారణంలో సగం కూడా వర్షం పడలేదు. సెప్టెంబర్ 15వ తేదీనాటికి వర్షాలు పుంజుకుంటేనే పరిస్థితి మెరుగవుతుంది. లేదంటే కరువుగా పరిగణించాల్సి ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జిల్లా రైతుల పాలిట శాపమవుతున్నాయి. విశాఖ రూరల్: వరుణుడు ముఖం చా టేశాడు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కేవలం 39శాతమే పంటలు సాగయ్యాయి. నీటి వనరులు ఉన్న మండలాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,80,783 హెక్టార్లు. ఇంతవరకు కేవలం 1,11,401 హెక్టార్లలోనే పంటలు చేపట్టారు. జిల్లాలో ఈ నెల లో సాధారణ వర్షపాతం 196.5 మిల్లీమీటర్లు. 66 శాతం తక్కువగా కేవలం 68.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. వర్షాలు లేకపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఏజెన్సీ మినహా అన్ని మండలాల్లో పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా లేదని అధికారులే చెబుతున్నారు. సెప్టెంబర్ 15 తరువాత కరువే జిల్లాలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు వేచి చూడాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మూడేళ్లుగా సెప్టెంబర్ తరువాతే భారీగా వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్‌లో వర్షాలు పడితే సాగు విస్తీర్ణం 1.70 లక్షలకు చేరుకొనే అవకాశముంటుందని, యా జమాన్య పద్ధతులు పాటించడం ద్వా రా నాట్లు చేపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 15 వరకు వర్షాలు పడనిపక్షంలో జిల్లాలో కరువుగా పరిగణించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామంటున్నారు. ఇటీవల అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధాన స్థానంలో జరిగిన జిల్లా టీఅండ్వీ సమావేశంలోనూ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని నిర్ధారించారు. ఇక్కడ ఇంకో మెలిక ఉంది.ఆలస్యంగా నాట్లుతో నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల కారణంగా పంటలు నీటిపాలయ్యే ప్రమాదం తప్పదు. గతేడాది ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో కూడా సెప్టెంబర్ వరకు వర్షాలు పడకపోవడంతో 30 మండలాల్లో కరువు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు కారణంగా ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదేమైనా వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయలేని ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటి రెండు వారాల వరకూ వర్షాల కోసం వేచి చూసి, ఆపై ప్రత్యామ్నాయ ప్రణాళిక మేరకు అపరాల సాగుకు వెళ్లాలని వ్యవసాయ శాఖ ఒక అంచనాకు వచ్చింది. 38 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు వర్షాభావ పరిస్థితులు కారణంగా జిల్లాలో 38 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు నిర్ణయించారు. 19,700 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించారు. వరి, మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, రాజ్మా పంటలకు సంబంధించి స్వల్పకాలిక విత్తనాల అవసరాలను గుర్తించారు. ఇందులో తక్కువ కాల పరిమితి వరి విత్తనాలు 4700 క్వింటాళ్లు, అలాగే ఇతర పంటలకు సంబంధించి 8800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదించి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపారు. ఈ వారంలో వీటి కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదికి నాట్లు లేనట్టే.. నాది చీడికాడ మండలం అర్జునగిరి. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. అందులో వరి సాగుకు నారు పోశాను. వర్షాభావంతో అది ఎర్రబడిపోయింది. చిగుర్లు ఎం డిపోయి గిడసబారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నారు బతికినా నాట్లుకు పనికిరాదు. మళ్లీ నారు పోద్దామన్నా..వరుణుడు కరుణిస్తాడో లేదో..?. ఈ ఏడాదికి నాట్లు పడే అవకాశం లేనట్టే. ఇప్పటికే రూ.6వేలు వరకు నష్టపోయాను. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి నాలాంటి రైతులను ఆదుకోవాలి. - పరవాడ నాయుడు -
సవాలక్షన్నర ఆంక్షలు!
రుణమాఫీపై రోజుకో నిబంధన నిన్న ఆధార్‌తో లింకు నేడు ఆన్లైన్ బ్యాంకుల్లో ఖాతాలు కావాలంటూ కొత్త రాగం రుణం తీసుకున్న రైతు నుంచి మళ్లీ ఆధారాల సేకరణా? 30 నిబంధనలు విధించిన ప్రభుత్వం మండిపడుతున్న అన్నదాతలు మచిలీపట్నం/పామర్రు : రుణమాఫీ అమలుకు ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. అన్ని అర్హతలు ఉండి బ్యాంకు ద్వారా పంట రుణం పొందిన రైతుల నుంచి ఆనేక ఆధారాలను మళ్లీ కోరుతోంది. కుటుంబానికి రూ.లక్షన్నరకు కుదించిన రుణమాఫీ ప్రక్రియను మరింత జాప్యం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైతులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,29,186 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.9,137 కోట్ల రుణాలను తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని, రైతులెవరూ రుణాలు చెల్లించవద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ చేయకుండా, విధివిధానాలను ఖరారు చేసేందుకు కోటయ్య కమిటీని నియమించారు. రాష్ట్రంలో రూ.87వేల కోట్ల పంట రుణాలు ఇవ్వగా కోటయ్య కమిటీ వీటిని రూ.35 వేల కోట్లకు తగ్గించింది. అనంతరం ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని మాఫీ చేయడానికి అనేక ఆంక్షలు విధించింది. కేడీసీసీలో పొదుపు ఖాతా ప్రారంభించాలి.. గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో 1.60 లక్షల మంది రైతులు గత ఏడాది రూ.1,100 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వీరు పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు పొందారు. ఈ రైతులంతా తమ మండలంలో, లేదా సమీపంలోని ఆన్లైన్ ఉన్న కేడీసీసీ బ్రాంచ్‌లో పొదుపు ఖాతా ప్రారంభించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. రుణమాఫీ జరిగితే రైతు పేరున వచ్చిన నగదును కేడీసీసీ బ్రాంచ్‌లో ఉన్న ఖాతాలో జమ చేస్తారని చెబుతున్నారు. పీఏసీఎస్‌లో రుణం తీసుకున్న ఖాతా నంబరు ఉండగా అందులోనే రుణమాఫీ సొమ్మును జమచేయవచ్చు కదా.. అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 28వ తేదీలోపు పీఏసీఎస్ కార్యదర్శికి అన్ని వివరాలు అందజేస్తే ఆయనే రైతు పేరున కేడీసీసీ బ్రాంచ్‌లో పొదుపు ఖాతా ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇటీవల ప్రభుత్వం 30 నిబంధనలతో ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసినట్లు కేడీసీసీ బ్యాంకు సీఈవో తోట వీరబాబు ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యమైన ఇబ్బందులు ఇవీ.. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోయినా అడంగల్ కాపీ ద్వారా డాక్యుమెంటేషన్ చేసుకుని పీఏసీఎస్‌ల ద్వారా పంట రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం రుణం తీసుకున్న ప్రతి రైతు పట్టాదారు పాస్‌పుస్తకం నకళ్లను అందజేయాలనే నిబంధన పెట్టారు. పట్టాదారు పాస్‌పుస్తకం లేకుంటే డాక్యుమెంటేషన్ ఆధారంగా ఇచ్చిన పంట రుణానికి రుణమాఫీ వర్తిస్తుందా.. లేదా.. అన్న అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. కొందరు రైతులకు ఆధార్‌కార్డులు ఇంకా రాలేదు. ఆధార్‌కార్డు లేకుంటే రుణమాఫీ చేస్తారా.. లేదా.. అనే అనుమానాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా 2014 జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీలోగా పంట రుణాలు చెల్లించి తిరిగి రుణాలు తీసుకుంటే రుణమాఫీ జరగదనే నిబంధన ప్రభుత్వం విధించింది. గతంలో పంట రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినా రుణమాఫీ చేస్తామని ప్రకటించారని ఇప్పుడు మళ్లీ ఈ నిబంధన ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతులకు శాపం.. రుణమాఫీ అమలుపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించటం కౌలు రైతులకు శాపంగా మారింది. రుణమాఫీ వర్తించాలంటే రుణం తీసుకున్న రైతు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం నకళ్లను అందజేయాలని తాజాగా నిబంధన విధించారు. కౌలురైతు పేరున భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం ఎలా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2011-12 సంవత్సరంలో 48,581 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయగా, వారిలో 8,526 మంది రూ.15.65 కోట్లు రుణాలు పొందారు. 2012-13లో 34,447 మంది రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వగా, వారిలో 7,431 మంది రూ.15.04 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీరందరికీ వారి పేరున పట్టాదారు పాస్‌పుస్తకాలు లేవు. ఈ నేపథ్యంలో కౌలురైతులకు రుణమాఫీ జరుగుతుందా.. లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి సాగదీత ధోరణి ప్రభుత్వం రుణమాఫీపై సాగదీత ధోరణితో వ్యవహరిస్తోంది. జిల్లాలో రూ.9,137 కోట్ల పంట రుణాలు రద్దు కావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.5వేల కోట్లలో వెయ్యి కోట్ల రూపాయలు నాన్‌ప్లాన్ గ్రాంట్ కింద ఉన్నాయని, ఈ లెక్కన రుణమాఫీకి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 4వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించినట్లయ్యిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. గతంలో రుణమాఫీ జరిగిన సమయంలో రైతులు ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే అదే బ్యాంకులో రుణమాఫీకి సంబంధించిన సొమ్ము జమ చేశారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం పీఏసీఎస్‌లో రైతు పేరున బ్యాంకు ఖాతాలు ఉన్నా, మళ్లీ ఆన్లైన్ సదుపాయం ఉన్న బ్రాంచిలో పొదుపు ఖాతా ప్రారంభించాలని చెప్పడం రుణమాఫీ ప్రక్రియను జాప్యం చేసేందుకేనని ఆయన విమర్శించారు. ఏదో ఒకసాకు చూపి రైతులను మోసం చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
బడ్జెట్ కేటాయింపులపై రైతుల పెదవి విరుపు
బడ్జెట్ కేటాయింపులపై రైతుల పెదవి విరుపు సర్కార్ వైఖరిపై వెల్లువెత్తుతున్న నిరసన బ్యాంకర్ల వైఖరితో అన్నదాతలో అయోమయం సాక్షి, విజయవాడ : జిల్లాలో రుణమాఫీ కింద రద్దు కావాల్సిన రైతుల బకాయిలు రూ.9,137 కోట్లు ఉంటే... బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఇందుకోసం కేటాయించడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రం మొత్తానికి కేటాయించిన ఆ నిధులతో జిల్లాలోని రైతులకు ఎంతమేరకు రుణమాఫీ జరుగుతుందనే విషయం గందరగోళంగా మారింది. రైతు రుణాలన్నీ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని పూర్తిగా విస్మరించి రైతులను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు ప్రస్తుత అవసరాలకు రుణాలు ఇవ్వకుండా పాత బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇంకోవైపు సీజన్ సగంలోకి వచ్చేసినా కొన్ని ప్రాంతాల్లో నాట్లు పడని పరిస్థితి. దీంతో రైతు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. తగ్గిన సాగు విస్తీర్ణం... జిల్లాలో 6.34 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్ సాగు చేస్తారు. సీజన్ మొదలై దాదాపు మూడు నెలలు గడిచింది. బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి సుమారు 4 లక్షల ఎకరాలు సాగులోకి రాగా ప్రస్తు తం కేవలం1.10 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. జూన్ నెల నుంచి నవంబర్ వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుంది. దీనికి అనుగుణంగా బ్యాంకర్లు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్‌గా నిర్ణయించుకుని రుణాలు మంజూరు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది. తగ్గిపోయిన రుణాలు ... గతేడాది ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో ఇచ్చిన రుణాలు నామమాత్రంగా ఉన్నాయి. అది కూడా పాత రుణాలు పూర్తిగా చెల్లించిన వారికి, సగభాగం చెల్లించిన వారికి మాత్రమే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రుణాలు మంజూరు చేశారు. గతేడాది జిల్లాలో 3,94,912 మంది రైతులకు రూ. 2,402 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు. వీటిలో రూ.2,046 కోట్లు పంట, బంగారు నగలపై తీసుకున్న రుణాలు కాగా రూ.366 కోట్లు వ్యవసాయ రుణాలు. ఈ ఏడాది జూలై వరకు 99 వేల మంది రైతులకు మాత్రమే రుణాలు మంజూరు చేశారు. వీరిలో పాత రుణాలు చెల్లించిన వారు 70 శాతం మందికిపైగా ఉన్నారు. పాత అప్పు చెల్లిస్తేనే కొత్త అప్పులిస్తామని చెబుతూ బ్యాంకర్లు దాదాపు నెలరోజులుగా రుణాలు మంజూరు చేయడం లేదు. ఇప్పటి వరకు పంట రుణాలు, బంగారు నగల తాకట్టుపై కేవలం రూ.605 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. అలాగే వ్యవసాయ రుణాలు రూ.206 కోట్లు మాత్రమే ఇచ్చారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహారావు సాక్షితో మాట్లాడుతూ పాత రుణాలు తీర్చితేనే కొత్త రుణాలు ఇవ్వాలని తమకు ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు ఉన్నాయని, వాటికనుగుణంగానే తాము రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఖరీప్ సీజన్ సాగు ప్రశార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు రుణమాఫీ కోసం ఉద్యమబాట పట్టనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రుణమాఫీపై నమ్మకం పోయింది రైతుల రుణమాఫీ కోసం రూ.45వేల కోట్లు అవసరమని చెబుతున్నారు. తీరా బడ్జెట్లో ఇందుకోసం కేవలం రూ.5వేలు కోట్లు మాత్రమే కేటాయించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఈ చర్యల వల్ల రుణమాఫీపై నమ్మకం పోతుంది. - విశ్వనాథుని సత్యనారాయణ, రైతు, కృష్ణాపురం, కోడూరు మండలం రుణమాఫీ చేసే వరకూ నమ్మకం లేదు ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని చెప్పడంతో అందరూ చంద్రబాబు నాయుడిని గెలిపించారు. రుణమాఫీపై రోజుకో రకంగా మాట్లాడుతున్నారు. ఎప్పటిలోపు రుణమాఫీ చేస్తారో ఇంత వరకు తేల్చలేదు. రుణమాఫీ చేసే వరకూ నమ్మకం లేదు. - పోలాబత్తిన వెంకటేశ్వరరావు, పిట్టల్లంక, కోడూరు మండలం -
బాబు కొత్త ఎత్తు
రుణమాఫీకి షరతుల మెలిక జిల్లాలో మొత్తం రుణాలు రూ.1893 కోట్లు 31 అంశాల ఆధారంగా అర్హుల జాబితా అమలెప్పుడన్నది విస్పష్టం అన్నదాతల ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోడానికి చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు. మహిళల కోపాగ్ని నుంచి బయటపడేందుకు మరో పన్నాగం పన్నారు. రుణ మాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో తాత్కాలిక ఉపశమనానికి ప్రభుత్వం జీవో 174ను జారీ చేసింది. రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షలవంతున పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా రద్దు చేయకుండా.. ఒక్కోదానికి రూ.లక్ష వంతున మూలధనంగా ఇస్తామనడం తాజా ఉత్తర్వుల సారాంశం. ఇది ఎప్పటిలోగా అమలు చేస్తామన్నది మాత్రం అందులో పేర్కొనకపోవడం ప్రభుత్వ కుటిల నీతికి నిదర్శనం. ఈ ఉత్తర్వులను బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు. జీవోలు ఇస్తే రుణమాఫీ జరిగిపోదని, డబ్బులు బ్యాంకుల్లో జమయినప్పుడే రద్దవుతాయని పేర్కొంటున్నారు. విశాఖ రూరల్: రుణమాఫీపై స్పష్టత కొరవడడంతో జిల్లాలోని రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు అయోమయానికి గురవుతున్నారు. షరతులతో కూడిన జీవోలతో మరోసారి మో సం చేస్తున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున రుణ మాఫీ చేస్తానని జూన్ 10న ఉత్తర్వులు(జీవో నెంబర్ 31) జారీ చేశా రు. డ్వాక్రా రుణాల మాఫీ చేయలేమని తెల్చిచెబుతూ ఈ నెల 2న ఉత్తర్వులు(జీవో నెంబర్ 164) వచ్చాయి. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున మూల ధనంగా ఇస్తామని అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా ఆ రెండు ఉత్తర్వుల్లో పేర్కొ న్న అంశాలనే పునరుద్ఘాటిస్తూ కేవలం రైతులు, మహిళలు ఆగ్రహాన్ని, నిరసనల నుంచి తప్పించుకోడానికి కొత్తగా జీవో 174ను జారీ చేసింది. కానీ, రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తామన్నది.. డ్వాక్రా సంఘాలకు ఎప్పుడు మూలధనం అందిస్తామన్న విషయాన్ని మా త్రం స్పష్టంగా పేర్కొనలేదు. పంట రుణాలు రూ.1040 కోట్లు. 56,134 డ్వాక్రా సంఘాలు రూ.853 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి. మొత్తంగా రూ.1893 కోట్లు జిల్లాలో రుణ మాఫీ చేయాల్సి ఉంది. ఇందుకు లబ్ధిదారుల గుర్తింపునకు 31 అంశాల ప్రొఫార్మా రూపొందించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్లను కూడా అందులో చేర్చారు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా రుణమాఫీ వర్తించదు. 2013 డిసెంబర్ 31వరకు తీసుకున్న పంట రుణాలు, 2014 మార్చి 31 నాటికి పేరుకుపోయిన బకాయిలకు రుణమాఫీ వర్తింప చేస్తామని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 14 రోజుల్లో జాబితా కలెక్టర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కలిసి మాఫీకి అర్హులను ఎంపిక చేయాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్ జారీ చేసిన 14 రోజుల్లోగా జాబితాను రూపొందించాలని నిర్దేశించింది. ప్రతీ రైతు పట్టాదారు పాసుపుస్తకంలోనూ తీసుకున్న పంటరుణం.. మాఫీ చేసే మొత్తాన్ని విధిగా నమోదు చేయాలి. రుణ మాఫీ చేసే మొత్తాన్ని ఆయా రైతుల సర్వే నెంబర్ల వారీగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని చెప్పింది. ఆ తర్వాత 31 అంశాల ఆధారంగా రూపొందించిన ప్రొఫార్మాలో నమోదు చేయాలని, భర్త, భార్య, ఆధారపడిన పిల్లలను ఒక కుటుంబంగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలకు మించకుండా రుణమాఫీ వర్తింపచేస్తామని చెప్పింది. మహిళల ఆగ్రహం డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా ఒకో సంఘానికి రూ.లక్షకు మించకుండా మూలధనంగా ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నమొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఓట్లేయించుకుని.. ఇప్పుడు నట్టేట ముంచారని మండిపడుతున్నారు. రూ.లక్ష వంతున మూలధనం అందించడం వల్ల కేవలం 15 శాతం సంఘాల్లో మహిళలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఆ మూలధనం కూడా ఎప్పటిలోగా అందిస్తామన్నది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. ఈ ఉత్తర్వుల వల్ల ఎలాంటి ప్రయోజకం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. -
తీరనున్న రైతు కష్టాలు
►మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధుల మంజూరు ►త్వరలోనే ప్రారంభం కానున్న పనులు ►హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు సిద్దిపేట అర్బన్: రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ వ్యవసాయ మార్కెట్ నిర్మాణం సిద్దిపేటలో జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం బుధవారం రూ. 12 కోట్ల నిధులను (ప్రొ.నం.ఎస్2/01/2014) మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సిద్దిపేట మార్కెట్ మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో సుమారు వంద గ్రామాల నుంచి ఇక్కడికి రైతులు వరి ధాన్యం, మొక్కజొన్నలు, పత్తి, కందులు, పెసర్లు, పొద్దుతిరుగుడు తదితర పంటలను భారీగా ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే తెచ్చిన పంటలన్నింటినీ మార్కెటింగ్ చేసే సదుపాయాలు ఇక్కడ లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్దిపేటలో భారీ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక ను సిద్ధం చేశారు. సమైక్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, హరీష్‌రావుకు మార్కెటింగ్ శాఖమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడంతో ఆయన కలల ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి చేసిన ఆదేశాలతో అధికారగణం శరవేగంగా కదిలింది. జిల్లా స్థాయి అధికారులతోపాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు మోడల్ మార్కెట్ నిర్మాణంపై వేగంగా ప్రతిపాదనలు అందజేశారు. డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మార్కెటింగ్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సిద్దిపేటలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రభుత్వం మోడల్ మార్కెట్ నిర్మాణానికి రూ.12 కోట్లు విడుదల చేసింది. భారీ షెడ్లు.. సీసీ రోడ్లు.. సిద్దిపేటలో నిర్మించనున్న మోడల్ మార్కెట్‌తో రైతులతోపాటు వ్యాపారులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్ రోడ్‌లోని పత్తి మార్కెట్ పక్కన ఆదర్శ వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులో నాలుగు భారీ షెడ్లు, గోదాములతో కూడిన వ్యాపార దుకాణాలను నిర్మిస్తారు. వీటికి సీసీ రోడ్లు, గేట్లను ఏర్పాటు చేస్తారు. ధాన్యం భారీగా వచ్చి షెడ్లు సరిపోకపోతే పంటల నిల్వకు, కుప్పలు పోయడానికి ప్రత్యేక ఫ్లాట్ ఫామ్‌లు నిర్మిస్తారు. రైతులకు విశ్రాంత గృహాలు, సెక్యూరిటీ గదులు, వాహనాల పార్కింగ్ స్థలాలు, మూత్రశాలలు, క్యాంటిన్ మొదలగు సౌకర్యాలు కల్పిస్తారు. వీటితో పాటు నంగునూరు సబ్ మార్కెట్ యార్డులో కాంపౌండ్ వాల్ పూర్తికి, షెడ్లు, ఫ్లాట్ ఫామ్‌లు, రోడ్లు నిర్మాణానికి రూ. 1.40 కోట్లను కేటాయించారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తైతే రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మించుతున్న తరుణం
15 దాటితే ప్రత్యామ్నాయ పంటలే.. వర్షాభావంతో 30 శాతమే పంటల సాగు 3400 హెక్టార్లలోనే వరి 45 శాతం తక్కువగా వర్షపాతం అన్నదాతలతో వరుణుడు ఆటలాడుతున్నాడు. అదనుదాటిపోతోంది. ఖరీఫ్ తరుణం మించిపోతోంది. చినుకుపడక పంట భూములు బీడువారుతున్నాయి. మైదానంలోని గెడ్డలు, చెరువులు అడుగంటిపోతున్నాయి. కలిసిరాని కాలం రైతన్నకు గుండెకోతను మిగుల్చుతోంది. ఏజెన్సీ,జలాశయాల ఆయకట్టు ప్రాంతాల్లో మినహా ఎక్కడా పొలాల్లో ఏరువాక సాగడం లేదు. మబ్బుపట్టిన వాతావరణంపోయి రెండు రోజులుగా చుర్రుమంటోంది. వరినారు మళ్లు ఎండిపోతున్నాయి. ముదిరిపోతున్న నారును చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. విశాఖ రూరల్/నక్కపల్లి రూరల్ : ప్రభుత్వం తప్పుడు హామీలతో రైతులను నిలువునా ముంచితే.. ప్రకృతి కూడా పగబట్టినట్టు కనిపిస్తోంది. ఖరీఫ్ రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. చెరువుల్లో చుక్క నీరు లేదు. నారు మడులు ఎండిపోతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోతున్నా పెద్దగా వర్షాలు లేవు. రెండు రోజులుగా ఎండలు మం డిపోతున్నాయి. ఖరీఫ్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు అందకపోయినా..అప్పోసప్పో చేసి పంటలు వేద్దామనుకున్నా.. వర్షాభావ పరిస్థితులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో వరి కేవలం 3400 హెక్టార్లే. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ సమయానికి 3,771 హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయి. గత వారం వరుసగా నాలుగు రోజులు వర్షాలు పడడంతో ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సాధారణ వర్షపాతం కంటే 45 శాతం తక్కువ వర్షం జిల్లాలో కురిసింది. ఆగస్టు 15 వరకు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే స్వల్పకాలిక పంటలు చేపట్టాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ పేర్కొంటున్నారు. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. ఇందులో లక్షా 10 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో చెరకు, 25 వేల హెక్టార్లలో రాగులు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32,400 హెక్టార్లలో ఇతర పంటల సాగుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పటి వరకు వరి 3400 హెక్టార్లలోను, చెరకు 30,450 హెక్టార్లలోను, రాగులు 5415 హెక్టార్లలోను, మొక్కజొన్న 3100 హెక్టార్లలో మొత్తంగా అన్నీ కలిపి 30 శాతంతో 56,500 హెక్టార్లలో సాగు చేశారు. విత్తనాలకూ కొరత రైతులను విత్తనాల కొరత వేధిస్తోంది. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో విత్తనాలు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రధానంగా అధిక కాలపరిమితి విత్తనాలు ఆర్జీఎల్ 2537, 1001 విత్తనాలపైనే రైతులు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వాటి నిల్వలు నిండుకున్నాయి. అలాగే రైతులు ప్రధానంగా వినియోగించే బీపీటీ 3291(సోనామసూరి) విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఖరీఫ్ అదను దాటుతుండడంతో స్వల్పకాల విత్తనాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 తరువాత కూడా పరిస్థితి ఇలానే ఉంటే ప్రత్యామ్నాయంపై దృష్టి పెడతామని అధికారులు చెబుతున్నారు. స్వల్పకాల విత్తనాలనైనా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తప్పు రైతులదా..చంద్రబాబుదా..?
బ్యాంకు అధికారులను నిలదీసిన అన్నదాతలు రుణాలు చెల్లించి అధిక వడ్డీల నుంచి బయట పడాలన్న బ్యాంకు అధికారులు ససేమిరా అంటూ తెగేసి చెప్పిన రైతులు చీడికాడ: ‘సక్రమంగా రుణాలు చెల్లించుకుంటున్న మమ్మల్ని కట్టొద్దని, అధికారంలోకి వస్తే మాఫీ చెస్తామన్న చంద్రబాబుది తప్పా.. ఆ మాటలు నమ్మి మోసపోయిన మాది తప్పా... ’అంటూ ఆంధ్రా బ్యాంకు అధికారులును రైతులు నిలదీసిన సంఘటన మండలంలోని అర్జునగిరిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. బకాయిలు వసూళ్లకు ఉదయాన్నే చోడవరం ఆంధ్రా బ్యాంకు అధికారులు పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమయ్యారు. మేనేజర్ శంకరరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోగా రుణాలు చెల్లించి చక్రవడ్డీల భారం నుంచి బయట పడాలన్నారు. అప్పుడే పంటల బీమా వర్తిస్తుందని, లేకుంటే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని పేర్కొన్నారు. రుణాల చెల్లింపులో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన ఇక్కడి రైతులు మొండి బకాయిదారులుగా ఎందుకు మారారని మేనేజర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రైతులు పరువాడ నాయుడు,చొక్కాకుల సూరిబాబు, నర్సింహామూర్తిలు మాట్లాడుతూ పంటలు పండక పోయినా అప్పులు చేసైనా ఏటా రుణాలు చెల్లించి, మళ్లీ తీసుకునేవారమన్నారు. మూడేళ్లుగా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగి రుణాలు కట్టొద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలు మొత్తం మాఫీ చెస్తామనిచెప్పి నేడు మాటతప్పింది ఎవరంటూ రైతులు ఎదురు తిరిగారు. దీనికి మేనేజర్ మాట్లాడుతూ తాము రాజకీయనాయకులం కాదని.. ముందు మీరు రుణాలు చెల్లించండి తరువాత రుణమాఫీ సొమ్మును మీకిచ్చేస్తామన్నారు. అయితే ఆ సొమ్మునే మీరు జమచేసుకొండంటూ రైతులు బదులిచ్చారు. ప్రస్తుతం రైతులు రుణాలు చెల్లించే స్థితిలేదన్నారు. మీకు నచ్చిన పని చేసుకోండంటూ రైతులు తెగేసి చెప్పడంతో అధికారులు చెసేదేమి లేక అక్కడ నుంచి నిష్ర్కమించారు. -
అన్నదాతకు ఆసరా ఇవ్వండి
నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించండి పట్టణ, గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చండి లోక్‌సభలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ సాక్షి ప్రతినిధి, తిరుపతి : దుర్భిక్షంతో తల్లడిల్లుతోన్న రైతులను ఆదుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లోక్‌సభలో కరవుపై జరిగిన చర్చలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరు కాలేదన్నారు. తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. వర్షాభావం వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కింద రైతులు, రైతు కూలీలకు భారీ ఎత్తున పని కల్పించాలని సూచించారు. వరుస కరవుతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని.. కనీసం తాగునీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె, రాయచోటి, రాజంపేట వంటి పట్టణాల్లో 15 రోజులకు ఒకసారి నీళ్లందిస్తున్న విషయాన్ని లోక్‌సభ దృష్టికి తెచ్చారు. రాజంపేట నియోజకవర్గం పరిధిలోనే కాకుండా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తక్షణమే చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలో టమాటా వంటి కాయగూర పంటలు విస్తారంగా సాగుచేస్తారన్నారు. టమాటా అధికంగా దిగుబడి వచ్చినప్పుడు ధర దక్కక.. తక్కువ దిగుబడి ఉన్నప్పుడు ఎక్కువగా ధర ఉండటం వల్ల రైతులు లాభపడటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నా.. ప్రజలకు కూరగాయల ధరలు అందుబాటులో ఉండాలన్నా తక్షణమే నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజీ గోదాము నిర్మించాలని డిమాండ్ చేశారు. -
జిల్లా అంతటా భారీ వర్షాలు
-
చినుకు కురిసె.. రైతు మురిసె
►జిల్లాలో విస్తారంగా వర్షాలు ముమ్మరంగా ఖరీఫ్ పనులు ►జులై నెల సగటు వర్షపాతంకంటే ఇప్పటికీ 44 శాతం తక్కువే ►వెదజల్లే విధానం మేలంటున్న వ్యవసాయ శాఖ అధికారులు సాక్షి, ఏలూరు : ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న వాన కొన్ని గంటలైనా కురవాలని ఎన్నాళ్లగానో అన్నదాతలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వచ్చారు. సాగునీరు కరువై వ్యవసాయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెలాఖరులోపు ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోతే వరి సాగు కుదరదని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోక తప్పదని ఆందోళపడుతున్న తరుణంలో నేలను వాన పలకరించింది. అది రైతు మురిసేలా చేసింది. ఇప్పటికీ తక్కువే జిల్లాలో ఆదివారం ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో రైతులు ఖరీఫ్ పనులను ముమ్మరం చేశారు. వడివడిగా దమ్ములు చేస్తున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో వర్షాలు పలుకరిస్తుంటాయి. కానీ ఈ ఏడాది మొహం చాటేశా యి. ఈ నెల రెండో వారంలో ఒకసారి వర్షం పలకరించినా ఇంతలా కురవలేదు. ఇప్పుడు మాత్రం కాస్త నిలిచి కురవటంతో రైతుల్లో సాగుపై నమ్మకం ఏర్పడింది. ఈ సమయంలో సుమారు 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేది ఆదివారం 21.3 మిల్లీమీటర్లు కురిసింది. ఈ రోజు వర్షపాతం సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే ఈ నెలలో నెమోదు కావాల్సిన వర్షపాతం మాత్రం తక్కువగానే ఉంది. జులై 1 నుంచి 27 వరకు 214.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 120.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన ఇప్పటికీ 43.73 శాతం వర్షపాతం తక్కువగానే ఉంది. డెల్టాలో సాగుకు నీటి కొరత లేదు ఎగువ ప్రాంతాల్లో వానల వల్ల గోదావరిలో నీరు సమృద్ధిగా చేరుతోంది. దీంతో పశ్చిమ డెల్టాకు 7వేల క్యూసెక్కులకుపైగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల డెల్టా కింద భూములకు సాగునీటి కొరత లేదు. నిన్నమొన్నటి వరకూ విద్యుత్ కోతలతో సాగునీటికి దూరమైన మెట్టప్రాంత రైతులకు కొద్ది రోజులుగా కాస్త ఊరట లభించింది. జిల్లాలో దాదాపు 87 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులతో బోర్లపై ఆధారపడి సుమారు 52 వేల హెక్టార్లలో రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి రెండు విడతల్లో రోజుకి 6 నుంచి 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. -
ఉపశమనం
జిల్లా అంతటా వర్షం 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు నారుమడులకు, వరినాట్లు పూర్తి చేసిన పొలాలకు మేలు ఖరీఫ్‌పై చిగురిస్తున్న ఆశలు ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. అన్నదాతకు ఉపశమనం లభించింది. జిల్లా అంతటా రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో నారుమడులు జీవం పోసుకుంటున్నాయి. నాట్లు వేసిన పొలాలు కళకళలాడుతున్నాయి. ఖరీఫ్ సాగుపై రైతన్నలకు ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం : ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వేసవి తరువాత రెండు రోజులపాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ముసురుపట్టడంతో ఖరీఫ్ సీజన్‌కు వాతావరణం అనుకూలంగా మారిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సాగునీటి కాలువలకు నీరు విడుదలకాకపోయినా వెదజల్లే పద్ధతి ద్వారా దాదాపు 25వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిచేశారు. వర్షాధారంగానే దాదాపు 50వేల ఎకరాల్లో రైతులు నారుమడులు పోశారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తిచేసిన పొలాలకు, నారుమడులకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆగస్టు నెల సమీపిస్తుండటంతో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఉన్నారు. వాతావరణం ఇలాగే కొనసాగితే వర్షాధారంగా అయినా పంటలు సాగు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని రైతులు అంటున్నారు. 41,250 ఎకరాల్లో వరినాట్లు ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉంది. జూన్, జూలైల్లో వర్షపాతం తక్కువగా నమోదవటంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. వెదజల్లే పద్ధతి, బోరునీటి ఆధారంగా 41,250 ఎకరాల్లో వరినాట్లు ఇప్పటివరకు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెడన, గుడ్లవల్లేరు, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, ఘంటసాల, మొవ్వ, ఉంగుటూరు, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో బోరు నీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు. జూలై 27వ తేదీ నాటికి జిల్లాలో 286.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 144.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో పైరు, నారుమడులకు పోషకాలు సక్రమంగా అందక, నీరు లేక పైరు ఎండిపోయే దశకు చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పైరుకు ప్రాణం పోసినట్లయింది. ఇప్పటి వరకు 18,750 ఎకరాల్లో వరినారుమడులు పోశారు. ఈ వర్షాల వల్ల మిగిలిన ప్రాంతాల్లోనూ నారుమడులు పోసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. చెరకు మొక్కల ఎదుగుదలకు దోహదం ఈ ఖరీఫ్ సీజన్లో 37,500 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా 40వేల ఎకరాలకు ఈ సాగు పెరిగింది. మొక్కతోటల్లో వర్షాలు లేకపోవటంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. వర్షాలు కురుస్తుండటంతో చెరకు తోటలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ జేడీ బి.నరసింహులు, డీడీ బాలునాయక్ తెలిపారు. పత్తికి మేలు పశ్చిమ కృష్ణాలోని నందిగామ, జగ్గయ్యపేట, వీరులపాడు, కంచికచర్ల, గంపలగూడెం, తిరువూరు, మైలవరం, జి.కొండూరు తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 75వేల ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. ఈ ఖరీఫ్ సీజన్లో 1.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా. వర్షాభావం కారణంగా పత్తిసాగు గణనీయంగా తగ్గింది. పత్తిని పక్కనపెట్టిన రైతులు సుబాబుల్ సాగుపై మక్కువ చూపుతున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో పత్తి మొక్కల్లోనూ ఎదుగుదల లోపించింది. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు కురవకపోవటంతో మారాకు దశలో ఉన్న పత్తి మొక్కలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి మొక్కల ఎదుగుదలకు మేలు చేస్తాయని, ఇదే వాతావరణం కొనసాగితే మొక్కలు త్వరితగతిన ఎదుగుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు జిల్లాలో ఆదివారం 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పమిడిముక్కలలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎ.కొండూరు-64.8, రెడ్డిగూడెం-61.4, కలిదిండి-57.4, తిరువూరు-54.2, ముదినేపల్లి-45.6, విస్సన్నపేట-42.6, నూజివీడు-38.6, బంటుమిల్లి-37.6, ముసునూరు-36.2, కైకలూరు-36.2, చాట్రాయి-35.2 మైలవరం-35.0, కంకిపాడు-31.2, జి.కొండూరు 30.4, పామర్రు-28.6, గన్నవరం-27.6, ఆగిరిపల్లి-26.2, చల్లపల్లి-24.4, బాపులపాడు-24.2మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. విజయవాడ-24.0, గూడూరు-24.0, ఘంటసాల-22.4, ఉయ్యూరు-21.4, మచిలీపట్నం-20.6, గంపలగూడెం-20.4, పెదపారుపూడి-19.2, కోడూరు-18.2, పెనమలూరు-15.8, గుడివాడ-14.8, వీరులపాడు-11.6, గుడ్లవల్లేరు-11.2, కృత్తివెన్ను-10.2, ఉంగుటూరు-10.2, మోపిదేవి-9.2, నందివాడ-8.2, మొవ్వ-6.8, అవనిగడ్డ-6.4, వత్సవాయి-5.8, తోట్లవల్లూరు-5.4, పెడన-5.2, కంచికచర్ల-5.2, ఇబ్రహీంపట్నం-5.0, నాగాయలంక-4.4, నందిగామ-4.4, పెనుగంచిప్రోలు-4.0, చందర్లపాడు-3.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
రుణమో..రామచంద్రా
మాఫీపై అయోమయం బ్యాంకు అధికారులకు అందని ఉత్తర్వులు ఖరీఫ్ రుణాలు ఇప్పట్లో ఇచ్చేది లేదంటున్న బ్యాంకర్లు వాయిదా మీరిన పంట రుణాలపై వడ్డీభారం డ్వాక్రా సంఘాలదీ అదే తీరు మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం సాచివేత ధోరణి రైతుల పాలిట శాపంగా మారింది. పాత రుణాలను రద్దు చేసి కొత్తవాటిని మంజూరు చేస్తారని ఆశపడిన అన్నదాతకు తీరని వేదనే మిగిలింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పంట రుణాలపై స్పష్టత లేదు. అసలు రుణాలు ఇస్తారా.. లేదా.. అనే విషయం కూడా తేల్చడంలేదు. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు జిల్లాలో పంట రుణాలు రూ.2,352 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు రూ.3,276 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం పంట రుణాలను ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ లెక్కన రూ.700 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.50వేలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ రకం రుణాలు రూ.900 కోట్లు మాఫీ అయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇప్పటి వరకు బ్యాంకు అధికారులకు చేరలేదు. గతంలో రుణాలు రీషెడ్యూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. స్పష్టత వచ్చే వరకు రుణాలు ఇచ్చేది లేదు రుణమాఫీ, రీషెడ్యూలుపై అయోమయం నెలకొంది. రిజర్వు బ్యాంకు నుంచి గానీ, తమ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణాలు ఇవ్వాలని ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయా జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్లు, చీఫ్ మేనేజర్లతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో రుణమాఫీ, పంట రుణాల మంజూరుపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే పంట రుణాల మంజూరుకు అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 12.50 నుంచి 14.50 శాతం వరకు వడ్డీ చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రైతులెవరూ రుణ బకాయిలు చెల్లించలేదు. ఈ ఏడాది జూన్ 30నాటికే పంట రుణాలు వాయిదా మీరాయి. వాయిదా మీరితే 12.50 శాతం నుంచి 14.50 శాతం వరకు వడ్డీ భారం పడుతుందని బ్యాంకు అధికారులు చెబు తున్నారు. ఇప్పటికే తమ రుణాలు వాయిదా మీరాయని ప్రభుత్వం ఎప్పటికి రుణమాఫీ చేస్తుందోనని, వడ్డీ భారాన్ని భరిస్తుందా.. లేదా.. అనేది ప్రశ్నార్థకమే. డ్వాక్రా సంఘాలదీ అదే తీరు జిల్లాలో 56,808 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 6.24 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరు రూ.938 కోట్ల మేర వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ లేదా రీషెడ్యూలు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గత మూడు, నాలుగు నెలల నుంచి డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించటం లేదు. దాదాపు రూ.32 కోట్లు బకాయి పడ్డారు. ఈ నగదుకు రూపాయి వడ్డీ చొప్పున వసూలు చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నిర్దేశించిన తేదీలోపు రుణం చెల్లించకపోవటంతో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణంపై కూడా రూపాయి వడ్డీ పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రద్దు చేస్తానన్న రూ.లక్ష మొత్తాన్ని వారి ఖాతాలో డిపాజిట్ సొమ్ముగానే పరిగణించే అవకాశం ఉంది. నాలుగు నెలల నుంచి సక్రమంగా రుణం చెల్లించని నేపథ్యంలో అన్ని డ్వాక్రా సంఘాలు రుణమాఫీ జరిగిన అనంతరం ఆరు నెలల పాటు సకాలంలో రుణం చెల్లిస్తేనే వారికి మళ్లీ కొత్తగా రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం అటు రైతులకు, ఇటు డ్వాక్రా సంఘాల సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆయా వర్గాలవారు పెదవి విరుస్తున్నారు. -
తరుముకొస్తున్న బీమా
31లోపు ప్రీమియం చెల్లించాలి గడువు పొడిగించాలనిరైతు నేతల విజ్ఞప్తి తమకు ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు అయోమయంలో అన్నదాతలు గుడివాడ : అన్నదాతను వరుస సమస్యలు గుక్కతిప్పుకోనివ్వడంలేదు. ఇప్పటికే రుణ‘మాయ’లో చిక్కుకున్న రైతన్న ఖరీఫ్ సాగుకు కొత్త అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ధీమాను పెంచే పంటల బీమా పథకం ప్రీమియం చెల్లిం పునకు గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31వ తేదీతో పంటల బీమా పథకం ప్రీమియం చెల్లించాలని వ్యవసాయాధికారులు కోరినా ఎవరూ చెల్లించే పరిస్థితిలో లేరు. జిల్లావ్యాప్తంగా 6.30 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పంటరుణాల మాఫీపై స్పష్టత ఇవ్వకపోవటం వల్లే రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. వెంటనే రుణాలు మాఫీ అవుతుందా.. లేదా.. ఎంత రుణం మాఫీ అవుతుంది.. తదితర విషయాలు తెలియక రైతులు తికమకపడుతున్నారు. ఈ తరుణంలో ఖరీఫ్ సమయం కాస్తా పూర్తి అవుతున్నా ఇంతవరకు బ్యాంకుల నుంచి రైతులు పైసా రుణం పొందలేదు. ఇప్పటి వరకు జిల్లా వాసులంతా బ్యాంకుల నుంచి పొందే వ్యవసాయ రుణం నుంచే పంటల బీమాకు ప్రీమియం చెల్లించటం ఆనవాయితీ. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు రైతుల్ని పట్టి పీడిస్తున్నాయి. ఏటా ఖరీప్‌కు ఏప్రిల్ నుంచి జూలై ఆఖరు వరకు వ్యవసాయ రుణాలు పొందుతుంటారు. ప్రీమియం చెల్లింపు ఇలా.. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని కొత్త పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పంట ఆయా స్టేజీల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా బీమా కంపెనీల నిబంధనలకు లోబడి రైతులకు పరిహారం చెల్లిస్తారు. ఇందుకోసం ప్రతి రైతు తీసుకున్న రుణంలో 12.5 శాతం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో రైతులు 5 శాతం చెల్లించాలి. ప్రభుత్వం 7.5 శాతం చెల్లిస్తుంది. వరి రైతుకు బ్యాంకుల నుంచి ఎకరాకు రూ.18,260 వ్యవసాయ రుణం పొందవచ్చు. దీని ప్రకారం ఎకరానికి పంటల బీమాకు ప్రీమియంగా రూ.2,283 బీమా కంపెనీకి చెల్లించాలి. రైతు వాటా(5 శాతం) రూ.913 చెల్లించాలి. ప్రభుత్వం 7.5శాతం చొప్పున రూ.1,370 చెల్లిస్తుంది. ప్రతి రైతు బ్యాంకు నుంచి రుణం పొందినప్పుడు గానీ, లేదా నేరుగా అయినా ప్రీమియంను చెల్లించి పంటల బీమా సదుపాయం పొందవచ్చు. కౌలు రైతులు కూడా ప్రీమియం చెల్లించి ఈ పంటల బీమాను పొందవచ్చు. గడువు పొడిగిస్తే మేలు నిత్యం ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతన్నకు బీమా ధీమా లేకపోతే తీరని నష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల రైతులు కొత్తగా రుణాలు పొందలేక పోయారు. పాత బకాయిలు చెల్లించని కారణంగా కొత్త రుణాలు ఇవ్వటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటల బీమా పథకానికి మరో రెండు నెలలు గడువు పొడిగించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్చేస్తున్నారు. గడువు పెంపుపై ఎలాంటి ఉత్తర్వులు లేవు ఈ నెల 31వ తేదీతో పంట బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు గడువు ముగుస్తుంది. ఆసక్తి గల రైతులు నేరుగా అయినా చెల్లించుకోవచ్చు. గడువు పొడిగిస్తూ మాకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. వెంటనే ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందాలని రైతులకు సూచిస్తున్నాం. - నర్సింహులు, వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ -
సందిగ్ధం..!
వెదజల్లాలా.. నారుపోయాలా.. తేల్చుకోలేని రైతాంగం కుళ్లిపోతున్న వెదజల్లిన విత్తనాలు నారుమళ్లకు సాగునీరు కరువు చల్లపల్లి : ఎన్నడూలేని విధంగా ఈసారి రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సాగునీటి విడుదలపై అయోమయం నెలకొంది. మరోవైపు వర్షాలు కూడా కురవడం లేదు. ఖరీఫ్ సీజన్ దాటిపోతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగుకు ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలియక అన్నదాతలు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు వెదజల్లే పద్ధతిన సాగు చేయగా తడి, పొడి కలయిక వల్ల విత్తనాలు కుళ్లిపోతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో నారుమడులు పోసేందుకు సాగునీరందక పడరాని పాట్లు పడుతున్నారు. సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయశాఖాధికారులు సరైన సూచనలు, సలహాలను అందించక పోవడం వల్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. అయోమయం.. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 85వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిని అనుసరించగా, 13,200 ఎకరాల్లో వరి నారుమళ్లు పోసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, పెడన, పామర్రు మండలాల్లో వెదజల్లే పద్ధతిన విత్తనాలు చల్లారు. కొన్నిచోట్ల సరిగా నీరందకపోవడంతో సగం తడి, సగం పొడిగా ఉన్న విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మరికొన్నిచోట్ల సాగునీరందక పోవడంతో విత్తనాలు సరిగా మొలవక మళ్లీ నారుమళ్లు పోసుకుంటున్నారు. దీనివల్ల ఎకరాలకు రూ.2వేల నుంచి రూ.3వేల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సగం సాగుపనులు మాత్రమే చేశారు. గత ఏడాది ఇప్పటికి 35శాతం సాగుపనులు జరగ్గా, ప్రస్తుతం 15 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కలవరపెడుతున్న నీటిఎద్దడి నారుమళ్లు పోసుకునేందుకు సన్నద్ధమవుతున్న రైతులను సాగునీటి ఎద్దడి కలవర పెడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఇంజిన్లతో నారుమళ్లు పోసిన రైతులు నారు చేతికొచ్చింది. పొలాలు తడిపేందుకు సాగునీరు లేకపోవడంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ పద్ధతిన సాగుచేస్తే ప్రయోజనమో వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వరుణుడిపైనే భారం ఈ నెల 8, 9, 10 తేదీల్లో జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈనెల 11న అల్పపీడనం ఏర్పడినప్పటికీ మూడు రోజులు మబ్బులతో ఊరించి చినుకురాలకుండానే ముఖం చాటేశాయి. ఈ నెల 20వ తేదీకి జిల్లాలో 205.4 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, 116.5 మి.మీ మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 46 శాతం తక్కువగా నమోదైంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి, అల్పపీడనం ఏర్పడ్డాయని, వీటివల్ల వర్షాలు పడతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పట్లో పంటకాలువలకు సాగునీరు విడులయ్యే పరిస్థితి లేకపోవడంతో వరుణుడిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.