కాటేసిన కరెంట్ తీగ
పత్తికొండ టౌన్:
కరెంటు తీగ యమపాశమై కాటు వేసింది. ఇతరులను రక్షించబోయి ఓ అన్నదాత మృత్యు ఒడికి చేరిన సంఘటన పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో బోయ మేడికుందు రామయ్య(38) మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..గ్రామానికి చెందిన బోయ మేడికుందు బజారి కుమారుడు రామయ్య కొన్ని నెలలుగా బైపాస్‌రోడ్డుకు సమీపంలో ఉన్న పొలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేసుకొని కాపురం ఉంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ కోసం తీగ లాగారు. కరెంటు తీగకు సపోర్టుగా ఏర్పాటు చేసిన జీ వైర్ సోమవారం రాత్రి తెగిపడింది. మంగళవారం ఉదయం తెగిపడిన విద్యుత్ వైరును గమనించిన రామయ్య అక్కడకు ఎవరూ వెళ్లవద్దని కుటుంబ సభ్యులను వారించాడు. చుట్టుపక్కల పొలాలకు వెళ్లేవారికి కూడా కరెంటుతీగ తెగింది, ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించాడు. పిల్లలు ఎవరైనా అటుగా వెళ్తే ప్రమాదం జరుగవచ్చు అని భావించి వైర్‌ను కట్టెతో పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తూ తీగ రామయ్యకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త గిలగిల కొట్టుకుంటుండటం గమనించిన భర్త తుసి కాపాడేందుకు ప్రయత్నించగా ఆమెకు కూడా విద్యుత్‌షాక్‌కు గురైంది. క్షతగాత్రురాలిని వెంటనే చికిత్సనిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పత్తికొండ ఎస్‌ఐ మున్నా సాహెబ్ పరిశీలించారు. విద్యుత్‌శాఖ ఏఈ రవీంద్రానాయక్ సిబ్బందితో కలిసి తెగిపడిన విద్యుత్‌లైనును సరిచేశారు. నలక దొడ్డి సర్పంచ్ బి. లోకనాథ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రామయ్య మృతితో అటికెలగుండు గ్రామంలో విషాదం నెలకొంది.