కృష్ణా డెల్టాలో కరువు దరువు
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరొందిన కృషా ్ణడెల్టాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టివేశాయి. సెప్టెంబరులో పుడమితల్లికి పచ్చకోక కట్టినట్లు కళకళలాడాల్సిన పొలాలు నేడు నైచ్చి కలుపు మొక్కలతో దర్శనమిస్తున్నాయి. జూన్ ఒకటో తేదీ నాటికే కాలువలకు సాగు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చిన పాలకులు సెప్టెంబరు వచ్చినా నెరవేర్చలేదు. దీంతో ఈ ఖరీఫ్‌ను వదులుకోవాల్సిందేనా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
- కాలువలకు చుక్కనీరు విడుదల కాని వైనం
- 2.53 లక్షల ఎకరాల్లో వరిసాగు లేనట్టే!
- పశ్చిమ కృష్ణాలో 62,500 ఎకరాల్లో వరిసాగు లేదు
- రీ షెడ్యూలుకే పరిమితమైన పంట రుణాలు
- దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
మచిలీపట్నం : జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కాలువలకు నీరు విడుదల చేయకపోవటంతో వర్షాలు, బోరు నీటి ఆధారంగా ఇప్పటివరకు 3.80 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తి చేశారు. మిగిలిన 2.54 లక్షల ఎకరాల్లో వరినాట్లు ఈ ఏడాదికి లేనట్టే. ఆ విషయాన్ని వ్యవసాయాధికారులే సూచనప్రాయంగా చెప్పారు. 21 వేల ఎకరాల్లో వరి నారుమడులు పోయగా 60 శాతం నారుమడులు నీరు లేని కారణంగా చనిపోవటమో, నారు ముదిరిపోవటమో జరిగింది. ఆగస్టులో అడపా దడపా వర్షం కురిసినా మొక్కలు ఎదిగేందుకు తోడ్పడకపోవటంతో నాట్లు వేసిన పొలాల్లో వరిపైరు చావలేక, బతకలేక కొట్టుమిట్టాడుతోంది.
శివారు మండలాల్లో నాట్లు పడేనా?
సముద్రతీరం వెంబడి, కాలువ శివారున ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మొవ్వ, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి, కైకలూరు, కలిదిండి తదితర మండలాల్లో ఈ ఖరీఫ్‌లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువలకు నేటి వరకు నీరు విడుదల కాలేదు. వర్షాధారంగా పోసిన నారుమడులు 45 నుంచి 50 రోజుల వయసుకు రావటంతో వరినాట్లు వేయాలా, వద్దా అని రైతులు అయోమయానికి గురవుతున్నారు. కాలువలకు నీరు రాకుంటే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఖరీఫ్‌లో వరినాట్లు పడకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని రైతులు వాపోతున్నారు. సెప్టెంబరు 15 నాటికి వరినాట్లు పూర్తికాకుంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రబీలో సాగు చేసే 1001, 1010, 1121 రకాల వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నా కాలువలకు నీరు రాకుంటే ఈ రకం వంగడాలను కూడా ఎలా సాగు చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి 521.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 512.6 మిల్లీమీటర్లు కురిసిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 20 మిల్లీమీటర్లు తక్కువ గాని, ఎక్కువ గాని ఉంటే సాధారణ వర్షపాతం గానే పరిగణించే అవకాశం ఉంది. జూలైలో 97.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 270.6 మిల్లీమీటర్లు కురిసింది. అప్పట్లో కురిసిన వర్షం రైతులకు ఉపయోగపడలేదు. ప్రభుత్వం ఈ వర్షపాతాన్ని సైతం లెక్కల్లో చూపటం శోచనీయం.
వెంటాడుతున్న కరువు ఛాయలు
జిల్లాలో గత ఇరవయ్యేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్‌కు సెలవు ప్రకటించే పరిస్థితి నెలకొంది. దీంతో కృష్ణాడెల్టాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎవరైనా రైతు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటే రూ.10 వేలు అప్పు పుట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయం ఆశాజనకంగా లేకపోవటంతో అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది. పంటలు లేకపోవటంతో రోజువారీ పనులు కూడా రైతు కుటుంబాల్లో జీవనం అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో రూ.2396 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు రూ.1740 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చూపుతోంది.
వాటిలో 70 శాతం రీషెడ్యూలు చేసిన రుణాలేనని రైతులు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే పనులు లేక జీవనం కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు భయపడుతున్నారు.