కరువును జయించిన సిరిధాన్యాలు! | rainfall drought win a small grain crops | Sakshi
Sakshi News home page

కరువును జయించిన సిరిధాన్యాలు!

Published Tue, Oct 30 2018 5:16 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

rainfall drought win a small grain crops - Sakshi

అనంతపురం జిల్లాలో రెండున్నర నెలలు వర్షం లేకపోయినా తట్టుకొని పచ్చగా ఉన్న ఊద పంట

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.వరి వంటి పంటలు కొన్ని జిల్లాల్లో ఎండిపోయాయి. అయితే, వర్షాధారంగా సాగులో ఉన్న కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు వంటి సిరిధాన్య పంటలు మాత్రం కరువును తట్టుకున్నాయి. నెల నుంచి రెండున్నర నెలల వరకు వాన దేవుడు మొహం చాటేసినప్పటికీ.. సిరిధాన్య పంటలు తట్టుకొని బతికాయి. వర్షాభావం వల్ల ఎదుగుదల మందగించి, దిగుబడి కొంత తగ్గినప్పటికీ ఈ పంటలు రైతులను నిరాశపర చకపోవటం విశేషం. అధిక పెట్టుబడులు అవసరమైన ఇతర పంటలు రైతులను నష్టాల ఊబిలోకి నెడుతూ ఉంటే.. స్వల్ప ఖర్చుతోనే సాగైన సిరిధాన్య పంటలు మెట్ట రైతులకు కొండంత భరోసానిస్తున్నాయి. అటవీ కృషి వ్యవసాయ పద్ధతిలో డాక్టర్‌ ఖాదర్‌ వలి (మైసూరు) వద్ద శిక్షణ పొంది, ఆయన అందించిన ‘అటవీ చైతన్య ద్రావణం’ ఉపయోగించి సిరిధాన్యాలను విజయవంతంగా సాగు చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రైతుల అనుభవాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.

వత్తుగా చల్లితే కలుపు బెడద ఉండదు!
వర్షాధార వ్యవసాయ భూములు 60% వరకు ఉన్నాయి. ఇటువంటి భూములు వేలాది ఎకరాలు పడావు పడి ఉన్నాయి. 15 ఏళ్లుగా బీడుపడిన అటువంటి భూమిలో తెలంగాణకు చెందిన నలుగురు స్నేహితులు ఉమ్మడిగా కొర్రలు, అరికల వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు. విత్తనం వత్తుగా వేశారు. కలుపు తీయలేదు. ఎరువులూ వేయలేదు. పిచికారీలూ చేయలేదు. తక్కువ ఖర్చుతో, అద్భుత పోషక – ఔషధ గుణాలు కలిగిన సిరిధాన్య పంటలను కేవలం వర్షాధారంగా సాగు చేసి ఎకరానికి కనీసం 5–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తామని భరోసాతో చెబుతున్నారు. మెట్ట ప్రాంత రైతులకు, ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఈ పంటలు ఎంతో అనువైనవని వారు చెబుతున్నారు. కరువును తట్టుకోవటంతో పాటు అప్పులు చేయాల్సిన అవసరం లేని పంటలని చాటిచెబుతున్నారు.  

 నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎమ్మెస్సీ, బీఈడీ చదువుకున్న మైల నర్సింహ, త్రిపురారానికి చెందిన ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి(అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ గ్రీన్‌కార్డ్‌ కలిగిన ఈయన గత ఏడాది తిరిగివచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు), హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆనాజిపురానికి చెందిన పూదిరె భాస్కర్, అల్వాల్‌కు చెందిన అభ్యుదయ రైతు రామానుజం క్రాంతికిరణ్‌ ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన స్నేహితులు. ‘ప్రకృతి ఆధారిత వ్యవసాయం’ పేరిట రెండేళ్లుగా వాట్సాప్‌ గ్రూపును నిర్వహిస్తూ రైతుల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైసూరుకు చెందిన అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్‌ వలీ వద్దకు వెళ్లి సిరిధాన్యాల సాగులో జూన్‌లో శిక్షణ పొందివచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో సిరిధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారు. అధిక పెట్టుబడులకు అప్పులు చేసి పత్తి, వరి తదితర పంటలు సాగు చేయడానికి బదులు తక్కువ పెట్టుబడితో, అధిక లాభాలనిచ్చే సిరి«ధాన్య పంటలను సాగు చేయమని రైతులకు చెప్పడంతోపాటు.. ఈ నలుగురు మిత్రులు కూడా సాగు చేశారు.  

కౌలు భూమిలో సిరిధాన్యాలు పండిస్తున్న శ్యాం ప్రసాద్‌రెడ్డి, భాస్కర్, నర్సింహ, క్రాంతి

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఇరవై నాలుగు ఎకరాలలో, చౌటుప్పల్‌ మండలంలోని లక్కారంలో మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకొని సిరిధాన్యాల పంటలను ఈ ఏడాది జూలై ఆఖరులో విత్తారు. ఎర్ర నేల పదెకరాల్లో అండుకొర్రలు, ఏడెకరాల్లో ఊదలు, 6 ఎకరాల్లో కొర్రలు, 4 ఎకరాల్లో అరికెలు విత్తారు. మరో ఏడెకరాల నల్లరేగడి నేలలో సామలు విత్తారు. ఎర్త్‌మూవర్‌తో చదును చేయించి ట్రాక్టర్‌తో ఫ్లౌ, కల్టివేటర్‌ వేయించారు. ఎకరానికి సాధారణంగా 3 కిలోల వరకు ఈ సిరిధాన్య విత్తనాలను రైతులు చల్లుతూ ఉంటారు. అయితే, వీరు ఎకరానికి 4 కిలోల విత్తనాన్ని 3 రెట్లు ఇసుకలో కలిపి వెదజల్లారు. కొన్ని చోట్ల విత్తనం లోతుగా పడి మొలవలేదు. 70% విత్తనం మొలిచింది. తర్వాత 5 వారాల పాటు చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. మొదట్లో ఏపుగా పెరిగిన మొక్కలు తర్వాత వాడిపోవటం ప్రారంభమైంది. ఇక ఎండిపోతుందా అనుకున్న దశలో మంచి వర్షం పడింది. ఆశలు వదులుకున్న ఈ నలుగురు మిత్రులు చెలక వైపు వారం వరకు వెళ్లలేదు. తీరా వెళ్లి చూసే సరికి పంట తిప్పుకొని.. ఏపుగా పెరగటంతో ఆశ్చర్యపోయారు. తర్వాత కురిసిన ఒకటి, రెండు వర్షాలతో పంట బాగా ఎదిగింది. దీర్ఘకాలిక పంట అరిక తప్ప మిగతా 4 పంటలు కోతకు వచ్చాయి. వచ్చే వారంలో కోతలు కోయబోతున్నారు.

ఈ సిరిధాన్యాల పంటలో కలుపు తీయటం గాని, ప్రత్యేకంగా ఎలాంటి పై మందులు, రసాయన/సేంద్రియ ఎరువులు వాడ లేదు. దుక్కి, విత్తనాల కొనుగోలు, విత్తనాలు చల్లే ఖర్చులు మినహా అదనపు ఖర్చులు చేయకపోవటం విశేషం. నూర్పిళ్ల తర్వాత సిరిధాన్యాల ధాన్యాన్ని పొట్టు తీసి బియ్యంగా, రవ్వగా, పిండిగా మార్చి నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ఈ నలుగురు యువ రైతులు సమాయత్తమవుతున్నారు.
– ఎం. వేణు, సాక్షి, చిట్యాల, నల్లగొండ జిల్లా

ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి
మా గుండ్రాంపల్లి గ్రామ శివారులో ఉన్న భూములు గత 15∙ఏళ్ళుగా సాగునీరు లేక పడావు పడి ఉన్నాయి. అలాంటి భూమిని నలుగురు యువ రైతులం కౌలుకు తీసుకొని సిరిధాన్య పంటలు పండిస్తున్నాం. అంతా స్వయంగా పొలం పనులు చేస్తూ సిరిధాన్యాల విత్తనాలు చల్లాం. డబ్బు ఖర్చయ్యే ఎలాంటి రసాయన ఎరువులు, మందులు ఈ పంటలకు అసలు వాడలేదు. దీంతో మాకు ఖర్చు చాలా తగ్గిపోయింది. 5 వారాలు వర్షం లేకపోయినా, పడావు భూముల్లో పంటలు విజయవంతంగా పండించాం. విత్తనాలు వెదజల్లాం. అండుకొర్రలు, సామలు, ఊదలు బాగా పండాయి. ఎకరానికి ఐదారు క్వింటాళ్లు వస్తాయి. కొర్రలు, అరికలు 3–4 క్వింటాళ్లు వస్తాయి. పశువుల ఎరువు తోలుకొని, నాగలి సాళ్లకు వేసుకొని, అంతరసేద్యం చేసుకునే రైతులకు ఎకరానికి 7–8 క్వింటాళ్ల సిరిధాన్యాల దిగుబడి ఖాయంగా వస్తుందని నా నమ్మకం. విత్తనాలను ఉచితంగా ఇస్తాం.   
– మైల నర్సింహ (99492 59239), గుండ్రాంపల్లి, చౌటుప్పల్‌ మండలం, నల్లగొండ జిల్లా  

రెండున్నర నెలలు వర్షం లేకపోయినా..
లక్ష్మీనారాయణరెడ్డిది ఎస్‌. కొత్తపల్లి. అనంతపురం జిల్లాలో హిందుపూర్‌కు దగ్గర్లో ఉంటుంది. అటవీ కృషి పద్ధతిపై డాక్టర్‌ ఖాదర్‌ వలి గారి వద్ద శిక్షణ పొందిన తర్వాత మా పది ఎకరాలలో కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికెలను సాగు చేస్తున్నారు. మే, జూన్‌లో వర్షాలు పడిన తర్వాత జూన్‌లో 8 ఎకరాల్లో సిరిధాన్యాల విత్తనాలు వెదజల్లారు. జూన్‌ 4న నారు పోసి, జూన్‌ 24న 2 ఎకరాల్లో నీరు పెట్టి నాట్లు వేశారు. తర్వాత పూర్తిగా వర్షాధారంగానే సాగు చేశారు. జూలై, ఆగస్టులో చుక్క వర్షం కురవలేదు. సెప్టెంబర్‌ మూడో వారంలో, అక్టోబర్‌ మొదటి వారంలో రెండు వర్షాలు పడ్డాయి.  అటవీ చైతన్య ద్రావణాన్ని పంటలపై 3 సార్లు పిచికారీ చేశారు. రెండున్నర నెలలకు పైగా వర్షం కురవకపోవడం వల్ల ఆ ప్రాంతంలో వర్షాధారంగా సాగవుతున్న సీజనల్‌ పంటలు ఎండిపోయాయి. కానీ, లక్ష్మీనారాయణరెడ్డి పొలంలో సిరిధాన్య పంటలు మాత్రం బెట్టను తట్టుకున్నాయి. పెరుగుదల మందగించిందే తప్ప పంట ఎండిపోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత రెండు వర్షాలు పడ్డాయి. వాడిపోయిన పంట ఆశ్చర్యకరంగా మళ్లీ పచ్చబడి, కంకులేసింది. ఒకటి, రెండు వారాల్లో కోతలు కోయబోతున్నారు.

వరుసలుగా నాటిన అరికె పంట

నాటిన పంటే బాగుంది!
5 రకాల సిరిధాన్యాల్లో ఊదలు, అండుకొర్ర, అరికె పంటలు బాగా పెరిగాయి. కొర్ర బాగానే వచ్చింది కానీ పక్షులు పూర్తిగా తినేశాయి. మాకేమీ మిగల్చలేదు. సామలు సరిగ్గా పెరగలేదు. వెదజల్లిన పంటల కన్నా నాట్లు వేసిన పంట బాగుంది. నాటిన అరికెల దుబ్బుకు 30కి పైగా పిలకలు ఉన్నాయి. ఊద, కొర్రలో 10–15 పిలకలు వచ్చాయి. అండుకొర్ర కూడా చాలా పిలకలు వచ్చాయి. సాధారణంగా రాగులు వేస్తుంటాం. రాగి అయితే ఎండిపోయి ఉండేది. అంతకన్నా తక్కువ నీటితోనే పండేవి కాబట్టే కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ పంటలు రెండున్నర నెలలు ఎండిపోకుండా బతికి ఉన్నాయి. నెలకో వర్షం పడినా ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేవి. ఇప్పుడు ఎకరానికి 3 క్వింటాళ్ల వరకు రావచ్చనుకుంటున్నాం. ఇంతటి కరువులోనూ మాకు దక్కిన ఆ పాటి సిరిధాన్యాలే మాకు మహాప్రసాదం వంటివి. రైతులంతా ఈ పంటలు పండించుకోవాలి.

–  ఎస్‌. లక్ష్మీనారాయణరెడ్డి(99017 30600), ఎస్‌.కొత్తపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా
 
ఖరీఫ్‌లో ఒకటే వర్షం కురిసినా ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి
అటవీ చైతన్య ద్రావణంతో కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు వంటి సిరిధాన్యాలను ఈ ఖరీఫ్‌లో 40 ఎకరాల్లో సాగు చేశాం. మా దగ్గర ఒకే వర్షం పడింది. మా చుట్టు పక్కల ఇతర పంటలు ఎండిపోయాయి. మా పొలంలో సిరిధాన్యాల పంటలు బెట్టను తట్టుకొని నిలబడ్డాయి. పంట కోతకు వచ్చింది. వచ్చే వారం కోస్తాం. ఎకరానికి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇంకో రెండు, మూడు వర్షాలు పడి ఉంటే ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది.

మహబూబ్‌నగర్‌లో ఒక్క వర్షంతోనే పెరుగుతున్న సిరిధాన్య పంటలు; – బసవరాజ్‌ (93466 94156), గొరిట, నాగర్‌కర్నూల్‌ మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా

 7.5 క్వింటాళ్ల దిగుబడి
గుంటూరు జిల్లా పుల్లడిగుంట వద్ద కొర్నెపాడులో రైతు శిక్షణా కేంద్రం వద్ద నల్ల రేగడి భూమిలో 10 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్యాలను సాగు చేశాం. నేలలో ఘనజీవామృతం వేశాం. ఒకటి రెండు సార్లు జీవామృతం పిచికారీ చేశాం. వర్షాధారంగానే సాగు చేశాం. ఇటీవల సామలు నూర్చాం. ఎకరానికి 7.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొర్రలు, ఊదల కంకులు ఔరా అనిపించేంతగా చాలా పెద్దగా పెరిగాయి. ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. మెట్ట రైతులకు సిరిధాన్య పంటలు వరప్రసాదాలే. అందుకే రైతులకూ శిక్షణ ఇస్తున్నాం.
– యడ్లపల్లి వెంకటేశ్వరరావు (9849005182), అధ్యక్షుడు, రైతునేస్తం ఫౌండేషన్‌


కొర్నెపాడులోని తన పొలంలో డా. ఖాదర్‌తో యడ్లపల్లి వెంకటేశ్వరరావు

నీటి వసతి ఉన్న భూముల్లోనూ సిరిధాన్యాలను సాగు చేయవచ్చు
వర్షాధారంగా వ్యవసాయం చేసే మెట్ట ప్రాంత భూములతోపాటు.. సాగు నీటి సదుపాయం ఉన్న ఆయకట్టు భూముల్లో కూడా సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు.  నాలుగు వర్షాలు పడితే చాలు. వర్షాల మధ్య ఎక్కువ రోజులు ఎడం వచ్చినప్పటికీ తట్టుకొని బతికి మంచి దిగుబడిని అందిస్తాయి. నీటి వసతి ఉన్న భూముల్లోనూ పండుతాయి. ఏడాది పొడవునా వర్షాలు కురిసే ప్రాంతాల్లో సైతం సామలు వంటి సిరిధాన్యాలు పండుతాయి. ఎర్ర నేలలు, రాళ్ల నేలలు, నల్ల నేలల్లోనూ పండుతాయి.  
– డాక్టర్‌ ఖాదర్‌ వలీ, అటవీ కృషి నిపుణులు, మైసూరు

మిక్సీలతోనే సిరిధాన్యాల పొట్టు తీయిస్తాం
చాలా ఏళ్లుగా పడావుగా ఉన్న 30 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్య పంటలను సాగు చేశాం. డా. ఖాదర్‌ వలి గారి వద్ద నుంచి తెచ్చిన అటవీ చైతన్య ద్రావణాన్ని రెండుసార్లు పిచికారీ చేశాం.  ఇసుకలో కలిపి విత్తనం చల్లాం. కొన్ని చోట్ల పంట పల్చగా వచ్చింది. పల్చగా మొలిచిన చోట్ల కలుపు పెరిగి, పంట సరిగ్గా ఎదగలేదు. వత్తుగా మొలిచిన చోట్ల పంట బాగానే వచ్చింది. ఈ వారంలో నూర్పిడి చేయబోతున్నాం. నూర్చిన సిరిధాన్యాలను బుచ్చి పద్ధతిలో మిక్సీలతోనే శుద్ధి చేసి పొట్టు తీసి.. వినియోగదారులకు అందించాలన్నది మా ఆలోచన. సిరిధాన్యాల సాగుపై సదస్సు నిర్వహించాం. అటవీ చైతన్య ద్రావణాన్ని చాలా మంది రైతులకు ఇచ్చాం. వచ్చే ఏడాదికి సిరిధాన్యాలు సాగు చేసే చాలా మంది రైతులకు ఈ ద్రావణాన్ని, విత్తనాలను అందిస్తాం.
– దత్తా శంకర్‌ (86398 96343), ధ్యానహిత, షాబాద్, రంగారెడ్డి జిల్లా

షాబాద్‌లో సిరిధాన్య పంటలో దత్తా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement