Crops Cultivation
-
రైతుకు అండగా ప్రభుత్వం లాభాలు అందిస్తున్న చాక్లెట్ పంట..
-
రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
-
15 ఏళ్లుగా బెండ సాగు.. నెలకు 50 వేలు లాభం
-
పంటల మార్పిడితో అధిక లాభాలు
-
తుది దశకు ఈ–క్రాప్ నమోదు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రైతులు తమ వేలిముద్రలు (ఈకేవైసీ) నమోదుకు సోమవారం వరకు గడువు ఇచ్చారు. సామాజిక తనిఖీ కోసం ఈ–క్రాప్ జాబితాలను మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, పంట సాగు తదితర వివరాల నమోదులో ఎక్కడైనా పొరపాట్లు చోటుచేసుకున్నట్టు గుర్తిస్తే వాటిని సరి చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇస్తారు. నవంబర్ 1వ తేదీ నుంచి తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటి ఆధారంగానే పంటల కొనుగోళ్లకు శ్రీకారం చుడతారు. పంటల బీమా, నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు కూడా తుది జాబితా ప్రకారమే అందిస్తారు. పకడ్బందీగా నమోదు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు వేళ ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈసారి ఈ–క్రాప్ నమోదులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో తయారు చేసిన యాప్ ద్వారా జాయింట్ అజమాయిషీ కింద ఆగస్టు 8న ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్‌ల్యాండ్ డేటాతో పాటు పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాప్ నమోదు చేశారు. ఖరీఫ్‌లో 48 లక్షల మంది రైతులు పంటలు సాగు చేస్తుండగా.. ఇప్పటివరకు 41 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను సరిచూసుకుని వేలిముద్రలు (ఈకేవైసీ) నమోదు చేసుకున్నారు. వరితో సహా నోటిఫైడ్ పంట వివరాలు 100 శాతం పూర్తి కాగా, ఈకేవైసీ నమోదు 95 శాతానికి పైగా నమోదైనట్టు చెబుతున్నారు. -
చివరి దశకు ఖరీఫ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ చివరి దశకు చేరుకుంటోంది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలబడడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటలు సాగు చేస్తున్నారు. సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన ప్రభుత్వం ఏ దశలోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటికే 79 శాతం మేర పంటలు సాగయ్యాయి. మరోవైపు.. ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంతో పాటు పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాఫీగా సాగుతోంది. శివారు భూములకు సమృద్ధిగా సాగునీరు ఇక సీజన్ సాధారణ వర్షపాతం 556 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 424.6 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ, 429.9 ఎంఎం అధిక వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 454 ఎంఎంకు 466.6 ఎంఎం.., రాయలసీమలో 200 ఎంఎంకు 257.5 ఎంఎం వర్షపాతం కురిసింది. సాధారణం కంటే రాయలసీమలో 28 శాతం, కోస్తాంధ్రలో 2.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులకు వరదలు పోటెత్తడంతో శివారు భూములకు సైతం సమృద్ధిగా సాగునీరు అందుతోంది. ఫలితంగా తెగుళ్లు బెడద ఎక్కడా కన్పించడంలేదు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకోగా మిగిలిన పంటలు కూడా కాయకట్టే దశకు చేరుకున్నాయి. 30 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 92.04 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా.. ► వరి సాధారణ విస్తీర్ణం 38.98 లక్షల ఎకరాలు అయితే ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ► అపరాలు సాధారణ విస్తీర్ణం 8.28 లక్షల ఎకరాలు కాగా, 4.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ► నూనెగింజల సాగు విస్తీర్ణం 17.96 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ► ఇక ఇతర పంటల విషయానికి వస్తే 14.70 లక్షల ఎకరాల్లో పత్తి, 2.82 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.55 లక్షల ఎకరాల్లో మిరప, 93వేల ఎకరాల్లో చెరకు, 45వేల ఎకరాల్లో ఉల్లి, 35 వేల ఎకరాల్లో పసుపు పంట సాగయ్యాయి. పెరిగిన ఆముదం, నువ్వులు, సోయాబీన్ సాగు ఈ ఏడాది వేరుశనగ సాగు తగ్గగా, ఆ మేర ఆముదం, నువ్వులు, సోయాబీన్ రికార్డుస్థాయిలో సాగయ్యాయి. ► వేరుశనగ సాధారణ విస్తీర్ణం 16.84 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 13.42 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 15.37లక్షల ఎకరాల్లో సాగైంది. ► ఈ ఏడాది వేరుశనగ రైతులు ఇతర పంటల సాగువైపు మళ్లారు. ఫలితంగా నువ్వులు సాధారణ విస్తీర్ణం 32వేల ఎకరాలు అయితే.. ఇప్పటివరకు 42వేల ఎకరాల్లో సాగైంది. ► అలాగే, ఆముదం సాధారణ విస్తీర్ణం 59వేల ఎకరాలు కాగా, 63వేల ఎకరాల్లో సాగైంది. ► పొద్దుతిరుగుడు సాధారణ విస్తీర్ణం 9,645 ఎకరాలు అయితే ఇప్పటివరకు 15,932 ఎకరాల్లో సాగైంది. ► ఇక సోయాబీన్ సాధారణ విస్తీర్ణం 3,665 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 22,607 ఎకరాల్లో సాగైంది. ఈ–క్రాపింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 46.79 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 15.12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు 10,427 ఎకరాల్లో మల్బరీ (పట్టు) పంటల సాగును నమోదు చేశారు. సెప్టెంబర్‌లోనూ సమృద్ధిగా ఎరువులు.. సీజన్‌కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటివరకు 17.21 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 9.99 లక్షల టన్నుల అమ్మకాలు జరగగా, ఇంకా 7.22 లక్షల టన్నులు (యూరియా 3.24 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 2.76 లక్షల టన్నులు, డీఏపీ 67,394 టన్నులు, ఎంఓపీ 29,785 టన్నులు) అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1.98 లక్షల టన్నుల ఎరువులను నిల్వచేయగా, ఇప్పటివరకు 1.23 లక్షల టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. ఇంకా 74,823 టన్నులు (యూరియా–43,478 టన్నులు, డీఏపీ–15,627 టన్నులు, కాంప్లెక్స్–11,493 టన్నులు, ఎంఒపీ–4128 టన్నులు, ఎస్ఎస్పీ–97 టన్నులు) నిల్వలు ఉన్నాయి. సెప్టెంబర్æలో 5.22 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఆ మేరకు కేంద్రం కేటాయింపులు జరిపింది. ఈ నిల్వలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. -
Andhra Pradesh: రైతన్నలకు రూ.92,000 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: వర్షాలు, తుపాన్ల బారిన పడి రైతన్నలు పంటలు నష్ట పోరాదనే ఉద్దేశంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోంది. మరోవైపు ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ.71,000 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలుగా మరో రూ.21,000 కోట్లను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లాలవారీగా బ్యాంకర్ల కమిటీ సమావేశాలను నిర్వహించి లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసింది. ఈ ఏడాది 5.8 లక్షల మంది కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్) కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్బీకేల వారీగా కౌలు రైతులను గుర్తించి సీసీఆర్ కార్డులను జారీ చేయడంతోపాటు ఇ–క్రాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. గోదావరి డెల్టాకు విడుదలైన సాగునీరు ఖరీఫ్‌లో ముందస్తు సాగునీటి విడుదలకు సంబంధించి ఆయకట్టు వారీగా తేదీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు విడుదల చేసేలా సాగునీటి శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే గోదావరి డెల్టాకు సాగునీటిని ఈ నెల 1వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు సాగునీటి విడుదలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆర్బీకేల స్థాయిలో ఈ నెలలో తొలి శుక్రవారం, మండల స్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశాలను విధిగా నిర్వహించాలని పేర్కొంది. పంటల ప్రణాళికలను ఖరారు చేసి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్బీకేల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నాణ్యత పరీక్షలు నిర్వహించిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 84,542 క్వింటాళ్ల పచ్చి ఎరువు విత్తనాలు, 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 1,71,234 క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 19.02 లక్షల టన్నుల ఎరువులను ఖరీఫ్‌లో పంపిణీ చేయనున్నారు. -
గిరి సీమల్లో సిరుల సేద్యం
కొండవాలు ప్రాంతాల్లో సంప్రదాయ పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న అడవి బిడ్డలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ తమ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిశోధనా ఫలితాలను పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునిస్తోంది. దీంతో వారు సాగులో మెళకువలు, సాంకేతిక శిక్షణ పొందుతూ సంతృప్తికర స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ పిల్లలనూ బాగా చదివించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సాగులో సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: సమగ్ర వ్యవసాయ విధానంలో వరి ఆధారిత పంట–పాడి–మత్స్య సాగు చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అడవి బిడ్డలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీడి మామిడి అంటు కట్టు విధానం, అపరాలు, చేపల సాగు, రబ్బర్, చిరు ధాన్యాలు, జీడి మామిడి ప్రాసెసింగ్, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, నర్సరీ పెంపకంతో పాటు పనసతో సహా వివిధ రకాల పంటల విలువాధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్ తయారీపై గడిచిన మూడేళ్లుగా గిరిజనులకిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంతలాగంటే.. మత్స్య సంపద ద్వారా 57 శాతం, వరి సాగు ద్వారా 24 శాతం, ఉద్యాన పంటల ద్వారా 5.13 శాతం, మేకల పెంపకం ద్వారా 4.8 శాతం ఆదాయాన్ని వీరు ఆర్జిస్తున్నారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో ఏజెన్సీలో చిరుధాన్యాల సాగు రెండేళ్లలో గణనీయంగా పెరిగింది. వీటిని ప్రాసెస్ చేసి అమ్మడం ద్వారా గిరిజనులు ఏటా రూ.27వేల ఆదాయాన్ని అదనంగా ఆర్జించగలుగుతున్నారు. అలాగే.. ► రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు కేవీకే ద్వారా సాగులో మెళకువలపై అధికారులు రెండేళ్లుగా శిక్షణనిస్తూనే రబ్బర్ టాపింగ్, ప్రాసెసింగ్ పరికరాలు సమకూర్చుతున్నారు. దీంతో నేడు ఎగుమతి చేయదగ్గ నాణ్యమైన రబ్బర్ షీట్లను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఆరునెలల పాటు సేకరించే రబ్బర్ పాల ద్వారా ఒక్కో రైతు రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్నారు. తేనెటీగల పెంపకం యూనిట్లో ఉత్పత్తిని పరిశీలిస్తున్న గిరిజన రైతులు ► అటవీ ప్రాంతంలో విరివిగా లభించే అడ్డాకుల ద్వారా గిరి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న సంకల్పంతో మారేడుమిల్లి మండలం బోధగండి పంచాయతీ మంగంపాడు గ్రామంలో విస్తరాకుల పరిశ్రమను ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు ఒక్కో మహిళ రూ.3వేల పెట్టుబడితో నెలకు రూ.18వేలు ఆర్జిస్తోంది. ► పెరటి కోళ్ల పెంపకం ద్వారా మరింత ఆదాయం ఆర్జించేందుకు వీలుగా హైదరాబాద్‌లోని జాతికోళ్ల పరిశోధనా కేంద్రం నుంచి శ్రీనిధి, వనశ్రీ, వనరాజా, గాగస్, అశీల్, కడక్‌నాథ్ వంటి మేలు జాతి కోడి పిల్లలను అధికారులు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. వీటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఇలా ప్రతిఏటా 2వేల కోళ్లను 200 గిరిజన మహిళలకు అందజేస్తుండడంతో ఇళ్ల వద్దే ఉంటూ గిరిజన మహిళలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► మేకలు, గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు హింగోలిలో కేవీకే అభివృద్ధి చేసిన అధిక వ్యాధి నిరోధకశక్తి కలిగిన ఉస్మానాబాది రకం మేకలను ఒక్కొకరికి మూడు చొప్పున ఇస్తున్నారు. 10–12 నెలల వయస్సు వరకు పెంచిన తర్వాత ఒక్కోదాన్ని రూ.8వేల నుంచి రూ.10వేల విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► ఇక పనస విలువాధారిత ఉత్పత్తుల తయారిపైనా శిక్షణనివ్వడంతో గిరిజనులు ప్రతినెలా రూ.12వేల అదనపు ఆదాయం పొందుతున్నారు. ► తేనెటీగల పెంపకంపైనా శిక్షణనివ్వడంతో సొంత పొలాలతో పాటు అటవీ ప్రాంతంలో కూడా విలువాధారిత తేనె ఉత్పత్తును తయారుచేస్తున్నారు. తద్వారా ఏటా రూ.40 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ► అంతేకాదు.. పుట్ట గొడుగుల పెంపకం యూనిట్లను ఏర్పాటుచేసి పాల పుట్ట గొడుగులు, గులాబీ, తెలుపు ముత్యపు చిప్ప పుట్ట గొడుగుల పెంపకంపై తర్ఫీదు ఇస్తున్నారు. గిరిజన రైతులకు మేకల యూనిట్‌ను అందజేస్తున్న అధికారులు పెట్టుబడి పోనూ 50వేలు మిగులుతోంది నేను పదో తరగతి చదువుకున్నా. నాకున్న రెండున్నర ఎకరాల్లో వర్షాధారంపై ఆధారపడి కొర్రలు, రాగులు పండించి సంతలకుపోయి అమ్ముకుంటే పెట్టుబడి పోను రూ.17,500 మిగిలేది. ప్రభుత్వం మినీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అందించింది. ప్రాసెసింగ్ చేసి ఎలా అమ్మాలో స్థానిక కేవీకే ద్వారా శిక్షణ పొందాను. ఇప్పుడు అదనంగా మరో రూ.32,300 ఆదాయం వస్తోంది. మొత్తం మీద రూ.49,800 మిగులుతోంది. – పల్లలబొజ్జ్డి నారాయణరెడ్డి, బొద్దగుంట, వై.రామవరం మండలం మేకల పెంపకంతో అదనపు ఆదాయం గతంలో నాలుగు ఎకరాల్లో వరి, మినుము, కందులు సాగుచేసేవాడిని. పంట పండితే నాలుగు డబ్బులు లేకుంటే పస్తులుండాల్సి వచ్చేది. స్థానిక కేవీకే ద్వారా ఉస్మానాబాదీ రకానికి చెందిన రెండు మేకలు, ఓ మేకపోతు తీసుకున్నా. ఈతకు రెండు పిల్లల చొప్పున ఏడాదికి నాలుగు పిల్లలు వస్తున్నాయి. మరోవైపు.. వ్యవసాయం ద్వారా ఏటా రూ.55వేల ఆదాయం.. ఏటా 3–4 మేకలను అమ్ముకోవడం ద్వారా అదనంగా మరో రూ.24వేలు వస్తోంది. – కంగల రామస్వామి దొర, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం నెలకు రూ.11,500 ఆదాయం రెండేళ్ల క్రితం మాకు శ్రీనిధి, వనశ్రీ, గఘస్ కోళ్లను అందించారు. పొలం పనులు చేసుకుంటూ వాటిని పెంచుకుంటున్నా. ఏడాది వయస్సున్న కోడిని రూ.500 నుంచి రూ.600లకు అమ్ముతున్నా. గుడ్లు, కోళ్ల అమ్మకాల ద్వారా నెలకు రూ.11,500 నికర ఆదాయం వస్తోంది. – కాలుం రామతులసి, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం సొంతంగా మార్కెటింగ్ మూడేళ్ల క్రితం తేనెటీగల పెంపకాన్ని చేపట్టా. శిక్షణ, సాంకేతిక సలహాలతో సొంత పొలంతో పాటు అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం యూనిట్లు పెట్టా. 3 నెలలకోసారి 60 కేజీల తేనె, 20 కేజీల మైనం తీస్తున్నా. వాటి ద్వారా నెలకు రూ.16వేల చొప్పున ఆర్జిస్తున్నా. గతేడాది నుంచి తేనె విలువా«ధారిత ఉత్పత్తులైన మురబ్బ, అల్లం తేనె, విప్పపువ్వు తేనేలతో పాటు మైనంతో తయారుచేసిన క్రాక్‌క్రీమ్, లిప్‌బామ్ వంటి ఉత్పత్తులను తయారుచేసి ‘గిరిమధుర నేచురల్ ప్రొడక్టŠస్’ పేరిట మార్కెటింగ్ చేస్తున్నా. – జగతా భావన కృష్ణ, రంపచోడవరం సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం ప్రభుత్వాదేశాల మేరకు గిరిజనుల్లో ఆదాయ వనురులను పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున విస్తరణ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటునూ అందిస్తున్నాం. – డాక్టర్ టి. జానకీరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం ఇంటి వద్దే జాతి కోళ్లు పెంచుకుంటున్న గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామానికి చెందిన ఎం. సావిత్రి కుటుంబ సభ్యులు 13మంది సంఘంగా ఏర్పడి వరి, జీడి మామిడి పంటలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక సామాజిక చెరువులో బొచ్చు, గడ్డిమోసు, శీలావతి వంటి చేçపలను సాగుచేస్తున్నారు. ఇలా ఏటా ఆహార ధాన్యాల ద్వారా రూ.34వేలు, కూరగాయల సాగు ద్వారా రూ.24 వేలు, మత్స్యసాగు ద్వారా రూ.73వేలు ఆర్జిస్తున్నారు. కడక్‌నాథ్, గాఘస్ కోళ్ల పెంపకం ద్వారా మరో రూ.16,800 ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం పందిరిమామిడి గ్రామానికి చెందిన కత్తుల సోమిరెడ్డి. గతంలో వీళ్లు 70మంది కలిసి కూరగాయలు పండిస్తే ఒక్కొక్కరికి రూ.7వేలకు మించి వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రబ్బరు సాగు, ప్రాసెసింగ్‌లో శిక్షణ పొంది ప్రాసెసింగ్ యూనిట్ తీసుకున్నారు. ఇప్పుడు నాణ్యమైన రబ్బరును ఉత్పత్తి చేస్తూ ఓ సంఘంగా ఏర్పడ్డారు. కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా.. గడిచిన ఆర్నెల్లలో 1,200 కేజీల రబ్బరును ప్రాసెస్ చేసి ఎగుమతి చేయడంద్వారా ఒక్కొక్కరం రూ.2.5 లక్షలు ఆర్జించామని.. ఖర్చులు పోనూ ఒక్కో రైతుకు రూ.1.50 లక్షలు మిగులుతోందని సోమిరెడ్డి చెబుతున్నాడు. -
Red Globe Grapes: ప్రయోగం ఫలించింది..
శింగనమల(అనంతపురం జిల్లా): రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రైతులు సైతం పంటల సాగులో నూతన పంథాను అవలంబిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుపై దృష్టి సారించి.. జిల్లాలోనే కాక పొరుగున ఉన్న రాష్ట్రాల్లోనూ ఆ తరహా పంటలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రైతు చంద్రప్రకాష్‌రెడ్డి (బాబు) సరికొత్త ద్రాక్ష రకాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగదశలోనే ఆశించిన ఫలితాన్ని సాధించారు. చదవండి: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు రెడ్‌గ్లోబ్ ద్రాక్ష పంట ఆస్ట్రేలియా రకం రెడ్ గ్లోబ్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకే పరిమితమైన రెడ్ గ్లోబ్ రకం ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ద్రాక్ష రకాన్ని సాగు చేస్తే ఎలా ఉంటుందని రైతు చంద్రప్రకాష్ రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా రెడ్ గ్లోబ్ సాగు చేస్తున్న రైతుల గురించి ఆరా తీస్తూ కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి వెళ్లారు. అక్కడ ఓ రైతు సాగు చేస్తున్న రెడ్ గ్లోబ్ ద్రాక్షను పరిశీలించారు. 2019లో రూట్స్ తీసుకొచ్చి నాటారు. 2020లో రెడ్‌గ్లోబ్ అంటు కట్టించారు. ఒక్కొక్క అంటుకు రూ.150 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆరు వేల అంటు మొక్కలు నాటారు. పందిరి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ రకం పంట జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందో.. లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే అనూహ్యంగా పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు వచ్చింది. ఓ ప్రయోగం చేద్దామనుకున్నా.. రెడ్ గ్లోబ్ ద్రాక్ష రకం గురించి తెలియగానే ఎలాగైనా ఈ పంట సాగు చేయాలని అనుకున్నా. చిక్కబళ్లాపురంలో ఈ పంట సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికెళ్లి చూశాను. ఎర్ర నేలలు అనుకూలమని తెలిసింది. దీంతో నాకున్న 50 ఎకరాల్లో ఓ ఐదు ఎకరాల్లో ప్రయోగం చేద్దామని అనుకున్నా. అంటు మొక్కలు తీసుకొచ్చి ఆరు ఎకరాల్లో నాటాను. పశువుల పేడ ఎరువు వాడాను. దిగుబడి ఆశించిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నా.ఈ లెక్కన తొలి కోతలో పెట్టుబడులు చేతికి వస్తే.. ఆ తర్వాత వరుస లాభాలు ఉంటాయి. ఆరు నెలల పాటు పంట కోతలు ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో రెడ్ గ్లోబ్ ద్రాక్ష కిలో రూ.300 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. అయితే జిల్లాలో సరైన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో ముంబయి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మార్కెట్‌కు తరలిస్తున్నా, కిలో రూ.180 నుంచి అమ్ముడుబోతోంది. – చంద్రప్రకాష్‌రెడ్డి, రైతు, గుమ్మేపల్లి, శింగనమల మండలం -
తీరొక్క పంటలు
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని రైతులు కొత్త సాగుబాట పట్టారు. సంప్రదాయ వరి పంటకు ప్రత్నామ్యాయంగా భిన్నరకాలను పండిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటున్నారు. తమకున్న పొలంలో రకరకాల పంటమార్పిడులతో ప్రయోగాలు చేస్తున్నారు. చేతికందిన పంటకు తామే సొంతంగానే మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతులు అనుసరిస్తుండటంతో వీరి ఉత్పత్తులకు డిమాండ్ పలుకుతోంది. కోదాడరూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో రైతు వెంకటేశ్వరావు ఎకరంలో మైసూర్ మల్లిక అనే దేశవాళి వరి రకాన్ని సాగుచేస్తున్నాడు. నాలుగేళ్లుగా సేంద్రియ పద్ధతిలో ఈ రకం వరితోపాటు, కూరగాయలు, ఆకుకూరలు, చెరకు కూడా పండిస్తున్నాడు. తన పొలంలో వచ్చిన ఉత్పత్తులను కోదాడ పట్టణంలో సొంతంగా దుకాణం పెట్టుకుని అమ్ముతున్నాడు. ఆయన ఉత్పత్తులు, పంటలపై వినియోగదారులకు కూడా నమ్మకం కలగడంతో వెంటనే అమ్ముడుబోతున్నాయి. వెంకటేశ్వర్రావు జహీరాబాద్ నుంచి మైసూర్ మల్లిక విత్తనాలను తెప్పించి నారు పెంచాడు. పురుగు, దుక్కి మందులు వాడలేదు. అవసరమైనప్పుడు వేరుశనగ చెక్కను డ్రమ్ము నీటిలో నానబెట్టి దానిని బావిలో వదిలి ఆ నీటిని పంటకందించాడు. పైరు మూడు నుంచి మూడున్నర అడుగుల ఎత్తుకు పెరిగింది. ప్రస్తుతం వరి కోతకు వచ్చిందని దిగుబడి 20 బస్తాలు (14 – 15 క్వింటాళ్లు) వస్తుందని అంచనా. ఈ రకం బియ్యం కేజీ రూ.100 నుంచి రూ.120 వరకు అమ్ముడుబోతోంది. ఎకరాకు 14–15 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. వాటిని మిల్లుపట్టిస్తే క్వింటాకు 65 కేజీల బియ్యం వస్తాయి. అటుఇటుగా 10 క్వింటాళ్ల బియ్యం వస్తుంది. క్వింటా బియ్యం రూ.10వేల చొప్పున అమ్మినా రూ.లక్ష వస్తుందని, పెట్టుబడికి రూ.20 వేలు ఖర్చయినా.. రూ.80 వేల నికర ఆదాయం ఉంటుందని రైతు చెబుతున్నాడు. కాగా, ఈయన మరో రెండున్నర ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నాడు. దీన్ని తన షాప్‌లోనే జ్యూస్తీసి విక్రయిస్తున్నాడు. పంటల్లో తెగుళ్ల నివారణకు బియ్యం కడిగిన నీళ్లు, ఎర్రమట్టి నీళ్లు, పొగాకు కాడలు నానబెట్టి తీసిన నీళ్లు, అల్లం వెళ్లుల్లి పేస్ట్, నత్తల గవ్వలు కరగబెట్టిన నీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నాడు. పల్లీసాగు తీరే వేరు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం కోమటిపల్లికి చెందిన రైతుకు భూక్యా మోహన్‌నాయక్‌కు వేరుశనగ సాగు కలిసొచ్చింది. కోమటిపల్లిలో ఆయనకు మూడెకరాల పొలం ఉంది. ఏడాది నుంచి వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ వేస్తున్నాడు. ఆయన అనుసరించిన మేలైన సాగు విధానాలతో ఎకరాకు 5.50 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడెకరాల్లో ఖర్చులుపోను రూ.1.2 లక్షల వరకు మిగిలింది. ప్రస్తుతం మార్కెట్లో నూనెకు డిమాండ్ ఉన్నందున మళ్లీ ఈ పంటే వేశాడు. పల్లి క్వింటా రూ.6,190 నుంచి రూ.6,917 పలుకుతోందని, మూడు నెలల్లో పంట చేతికొస్తుందని, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలు పొందొచ్చని మోహన్ అంటున్నాడు. బొప్పాయి ‘పండు’గ ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన చెరుకూరి రామారావుకు వ్యవసాయంపై మక్కువ. ఈయన పదేళ్ల క్రితం నుంచే పండ్ల తోటలు, కూరగాయల పంటలు సాగుచేస్తున్నాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కండక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి 2005లో వారసత్వంగా వచ్చిన ఐదెకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు సాగుచేశారు. ఆ తర్వాత తనకో ప్రత్యేకత ఉండాలని కూరగాయలు, పండ్ల తోటలను ఎంచుకున్నారు. జామ, బొప్పాయి, అరటి, నిమ్మ, చెరకు, సీతాఫలం, పుచ్చ వంటి పంటలతో పాటు కూరగాయల పంటలు తీగజాతి పంటలు బీర, సొర, కాకర, బోడ కాకర, వంగ, బెండ, దోస వంటి అనేక పంటలతో మార్పిడి చేస్తూ సాగు చేస్తుంటారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం మరో ప్రత్యేకత. వ్యవసాయంలో ఆదాయంతో ఐదెకరాల నుంచి నేడు 20 ఎకరాలకు ఎదిగారు. కాగా, ఆయన సాగుచేసే పంటల్లో బొప్పాయి ప్రత్యేకం. దీని సాగుకు ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చవుతుండగా 30 టన్నుల దిగుబడి సాధిస్తూ రూ.3 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. -
రబీ.. రయ్ రయ్
సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తోంది. లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణం ఇప్పటికే సాగులోకి వచ్చింది. రబీ అధికారికంగా అక్టోబర్ ఒకటిన మొదలైనా నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో పంటలు వేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి, పునాస పంట కోతలు ప్రారంభం కాగా.. రైతులు రెండో పంట వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఓ వైపు ఖరీఫ్ పంటల్ని ఒబ్బిడి చేసుకుంటూనే.. మరోవైపు రబీ పంటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా సాగయ్యే వాటిలో వరి, శనగ, మినుము తదితర పంటలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందజేసిన రైతు భరోసా సాయంతో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందుబాటులోకి రావడంతో రైతులు కాడీ, మేడీ పట్టి ముందుకు సాగుతున్నారు. రబీలో సాగు విస్తీర్ణం 22.75 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 1.07 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ సీజన్‌కు అవసరమైన 15 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సబ్సిడీపై సరఫరా చేస్తోంది. 2,71,612 క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేయగా.. ఇప్పటికే 69,389 మంది రైతులు ఆర్బీకేల ద్వారా సబ్సిడీ విత్తనాలను అందుకున్నారు. రబీకి అవసరమైన యూరియా సహా అన్నిరకాల ఎరువుల్ని అందుబాటులో ఉంచినట్టు వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. సాగులోకి వచ్చిన పంటల వివరాలివీ.. రబీలో వరి సాగు విస్తీర్ణం 7.12 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 24 వేల హెక్టార్లలో వేశారు. 11 వేల హెక్టార్లలో నూనె గింజలు, 32వేల హెక్టార్లలో శనగ, 4 వేల హెక్టార్లలో అపరాలు, మిగతా విస్తీర్ణంలో ఇతర పంటల్ని ఇప్పటికే విత్తారు. ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. -
ఖరీఫ్ సాగుపై చిగురించిన ఆశలు
సాక్షి, అమరావతి బ్యూరో: సకాలంలో వర్షాలు కురవడంతో రైతుల పంటల సాగులో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పల్నాడు వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. పల్నాడు ప్రాంతంలో రైతులు పత్తి విత్తనాలు ముమ్మరంగా నాటుతున్నారు. పశి్చమ డెల్టా ప్రాంతంలో వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో వెద పద్ధతిలో వరి సాగుచేస్తున్నారు. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్‌నెట్‌లో మిరప నారు పోస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముందస్తు ఖరీఫ్ కింద, పెసర, మినుము, నూగు పంట సాగుచేశారు. పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించి 6,140 ఎకరాల్లో పంట సాగు అయింది. గత ఏడాది పత్తి, పసుపు పంటలకు ఆశించిన మేర ధర లేదు. దీనికి తోడు పత్తి పంటకు గులాబీ రంగు పురుగు కొన్ని ప్రాంతాల్లో సోకవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో మిరప పంటకు సంబంధించి ధరలు ఆశాజనకంగా ఉండటం, దిగుబడులు సైతం బాగానే వచ్చాయి. దీంతో ఈ ఏడాది రైతులు మిరప పంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పత్తి పంట సాగు కొంత మేర తగ్గి, మిరప పంట సాగు పెరుతోందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట సాగు లక్ష్యం 12,68,970 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పత్తి పంటకు సంబంధించి సాగు లక్ష్యం 4,50,000 ఎకరాలు, మిరప పంట సాగు లక్ష్యం 1,89,265 ఎకరాలుగా నిర్ణయించారు. జిల్లాలో పంటల సాగు ఇలా జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 83.4 మిల్లీమీటరు. 114.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 32 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పదునైంది. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, దుర్గి, రెంట చింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, ఫిరంగిపురం, క్రోసూరు, యడ్లపాడు మండలాల్లో 26,142.5 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. పశి్చమ డెల్టా పరిధిలోని వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో 255 ఎకరాల్లో వెద పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఇవి కాకుండా ముందస్తు ఖరీఫ్ కింద పెసర పంట 1032.5 ఎకరాలు, మినుము పంట 3422.5 ఎకరాలు, నువ్వులు 1740 ఎకరాల్లో మొత్తం 6,195 ఎకరాల్లో పంట సాగు చేశారు. పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన పంటలు 6,485 ఎకరాల్లో సాగు అయ్యాయి. మిరప నారు 187.5 ఎకరాల్లో పోశారు. చిరు ధాన్యాల పంటలు 357.5 ఎకరాలు, పసుపు పంట 1505 ఎకరాల్లో సాగు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 46,557.5 ఎకరాల్లో సాగయ్యాయి. ఉత్సాహంగా పంటల సాగు... ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా రైతులు పంటల సాగు చేస్తున్నారు. జూన్ నెల చివరి నాటికి పట్టిసీమ నీరు రావడంతో పశి్చమ డెల్టా రైతులు వెద పద్ధతితోపాటు, వరి నారు పోసుకునేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు త్వరగానే నిండుతాయని రైతులు ఆశిస్తున్నారు. దీని ద్వారా ఈ ఏడాది పంటలకు సంబంధించి సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తున్నారు. పంట రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ప్రొత్సహిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో అన్నదాతలు పంటలు సాగు చేస్తూ ముందుకు వెళుతున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో 14వేల క్వింటాళ్ల వరి, 1540 క్వింటాళ్ల మిరప, 12.84 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, రైతులకు అందుబాటులో ఉంచాం. ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కలి్పస్తూ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాం. – విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు -
పంట కొనుగోళ్లలో పశ్చిమ నం.1
-
చిరువాక!
మృగశిర కార్తె రాకకు ముందు నుంచే అడపా దడపా వానలు కురుస్తున్నాయి. ఏరువాక పౌర్ణమితో అన్నదాతలు పనులు సాగించారు. నేలతల్లికి ప్రణమిల్లి అరకలు కట్టడం ప్రారంభించారు. వర్షాధారపంటల సమయమొచ్చిందని గ్రామాల్లో కోయిల కుహు కుహూలు వినిపిస్తున్నా.. చాలా మంది రైతుల ఇంట కాలు దువ్వి రంకేసే ఎద్దులే లేకుండా పోయాయి. పూర్తిగా ఎద్దులతోనే సేద్యం చేసే కాలం మళ్లీ రావాలని అందరూ కోరుకుందామని అంటున్నారు వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లె గ్రామ అభ్యుదయ రైతు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు కొమ్మూరి విజయకుమార్. వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు అయిన ఆయన చిరుధాన్యపు పంటల వర్షాధార సాగులో మెళకువలు ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే.. ‘సోమవారం నుంచి మృగశిర కార్తెలోకి ప్రవేశించాం. తొలకరి చినుకులు పడుతున్నందున ముందస్తు సేద్యాలు (దుక్కులు) చేసుకుంటే మంచిది. సేద్యం వలన భూమి గుల్లబారుతుంది. గడ్డి గింజలు మొలుస్తాయి. మృగశిర కార్తె (ఈ నెల 21న) అమావాస్యతో ముగుస్తుంది. 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభవుతుంది. ఆరుద్రలో వానాకాలపు పంటలు ఆనందంగా సాగు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు సాగుచేసే రైతులంతా ముందస్తుగా భూమిని తేలికగా దున్నుకోవాలి. లోతు దుక్కి అవసరం లేదు. ఆరుద్ర కార్తె ప్రారంభమైన వెంటనే చిరుధాన్యపు పంటలను సాగు చేసుకోవచ్చు. ఆరుద్రలోనే ఆరికలు చిరుధాన్యాల్లో ఏకైక దీర్ఘకాలిక పంట ఆరిక (అరిక). పంట కాలం 150 నుంచి 160 రోజులు. చలి ముదరక ముందే పంట చేతికి రావాలి. అందుకే ఈ పంటను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరుద్ర కార్తెలోనే విత్తుకోవాలి. ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం. చిరుధాన్య పంట ఏదైనా ఒంటరిగా కాకుండా కచ్చితంగా అంతరపంటలు కూడా వేసుకోవాలి. ఆరికలో అంతర పంటలుగా కంది, సీతమ్మ జొన్న, అలసందలు, అనుములు, ఆముదాలు సాగు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. అలాగే చేనిమటిక, గోగులు కూడా వేసుకోవచ్చు. అంతర పంటలు వేసినా ఆరిక ధాన్యం ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జడ కొర్ర, ఎర్ర కొర్ర మేలు కొర్ర పంటకు తేలికపాటి సేద్యం సరిపోతుంది. విత్తనాలు ఎకరాకు మూడు కిలోలు వేసుకోవాలి. పంట కాలం 80–90 రోజులు. జడకొర్ర, ఎర్రకొర్రలు మంచి దిగుబడిని ఇస్తాయి. ఎకరాకు 6–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంటకు పశువుల ఎరువు లేదా పొలంలో గొర్రెలు, ఆవులను మంద కట్టిస్తే ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పురుగుమందులు, రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. రుచికరం.. సామ భోజనం చిరుధాన్యపు పంటల్లో రాజుగా పేరు పొందింది సామ. సామ బియ్యపు భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. పంట కాలం 100–115 రోజులు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. దిగుబడి 5–7 క్వింటాళ్లు వస్తుంది. బరిగెలు బంగారం బరిగెల (ఒరిగెల) గింజలు బంగారు వర్ణంలో ఉంటాయి. విత్తిన 70 రోజులకే పంట చేతికి వస్తుంది. తేలికపాటి సేద్యం చేస్తే సరిపోతుంది. విత్తనం ఎకరాకు మూడు కిలోలు చాలు. దిగుబడి 8–10 క్వింటాళ్లు వస్తుంది. పశువులు ఈ మేతను బాగా ఇష్టపడతాయి. ఊద.. ఎరువును బట్టి దిగుబడి ఊదల పంట కాలం 120 రోజులు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. పశువుల ఎరువు, చెరువుమట్టి తోలి పంట పెడితే 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పశువుల ఎరువు ఎక్కువ పొలానికి తోలి సాగు చేస్తే రెట్టింపు దిగుబడి వస్తుంది. ఊద గడ్డి పశువులు ఇష్టంగా తింటాయి. సేంద్రియ సేద్యంలో ఈ పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించవు. అండుకొర్రలు.. ఎప్పుడైనా విత్తుకోవచ్చు అండుకొర్రల అసలు పేరు అంటుకొర్రలు. పూర్వం నుంచి కర్ణాటక రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో పండించేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం పొందింది. ఎకరం సాగుకు 3 కిలోల విత్తనం చాలు. ఈ పంటను ఏడాది పొడవునా ఎప్పుడైనా విత్తుకోవచ్చు. పంట కాలం 100–105 రోజులు. జిగురు చౌడు భూములు మినహా అన్ని రకాల నేలల్లో అండుకొర్ర పండుతుంది. ఎకరానికి ఆరికలు 4 కిలోలు, మిగతావన్నీ 3 కిలోల విత్తన మోతాదు వేసుకోవాలి. విత్తే సమయంలో కిలో విత్తనానికి 4 కిలోల ఇసుక గానీ లేదా 4 కిలోల బియ్యపు నూకలు గానీ కలిపి గొర్రుతో వెద పెట్టడం గానీ, చల్లుకోవడం గానీ చేయాలి. చిరుధాన్య విత్తనాలను నానబెట్టి గానీ గానీ, నారు పోసి గానీ సాగు చేయకూడదు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు నాణ్యమైన రైతువారీ విత్తనం వేసుకోవడం ఉత్తమమ’ని విజయకుమార్ (98496 48498) సూచిస్తున్నారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, అగ్రికల్చర్, వైఎస్సార్ జిల్లా -
సూక్ష్మస్థాయిలో పంటల సాగుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మస్థాయిలో పంటల సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. మండలాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పరిధి మేరకు ఉన్న క్లస్టర్లను ఆధారం చేసుకుని ఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో అంచనా వేసే కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఆ ప్రక్రియ పూర్తి చేసి సమగ్ర నివేదికివ్వాలని వ్యవసాయ శాఖ శుక్రవారం జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ నిపుణులతో కలసి ఏ పంట ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై నివేదిక రూపొందించారు. దీనిపై ఇటీవల సీఎం కేసీఆర్ చర్చించి పలు మార్పులు చేశారు. ఆ ప్రకారం ఇప్పుడు క్లస్టర్ల వారీగా సాగు విస్తీర్ణం వివరాలను వ్యవసాయశాఖ సేకరిస్తుంది. ఆ మేరకు క్లస్టర్ల వారీగా పంటల సాగు వివరాలను ఏఈవోలు నివేదిస్తారు. ఏ పంట ఎన్ని ఎకరాలు.. రాష్ట్రంలో 2,600 వరకు ఏఈవో స్థాయి క్లస్టర్లు ఉన్న విషయం విదితమే. ఒక్కో క్లస్టర్ పరిధిలో 5 వేల ఎకరాలున్నాయి. మొత్తంగా దాదాపు 1.30 కోట్ల ఎకరాలున్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు ఆ మొత్తం విస్తీర్ణంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారన్న దానిపై ఏఈవోలు సమాచారం సేకరిస్తారు. ఏఈవోలు సంబంధిత క్లస్టర్లలోని గ్రామాలకు వెళ్లి రైతులు వేసే పంటలు, వేయాల్సిన వాటిపై సమాచారం తీసుకుంటారు. అవసరమైతే వేయాల్సిన పంటలపై రైతులను ఒప్పిస్తారు. గ్రామాల వారీగా పంటల సాగు విస్తీర్ణం, ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేస్తారన్న దానిపై సూక్ష్మస్థాయి అంచనాకు వస్తారు. ఆ వివరాలను మండల స్థాయిలోనూ క్రోడీకరించి జిల్లా వ్యవసాయశాఖకు అందజేస్తారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను ముందస్తుగా జిల్లాల వారీగా సిద్ధం చేసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి 61.24 లక్షల ఎకరాల నుంచి గరిష్టంగా 70 లక్షల ఎకరాలు అంచనా వేస్తున్నారు. కందులు 13 లక్షల ఎకరాల నుంచి 15 లక్షల ఎకరాలు, వరి 40 లక్షల ఎకరాల నుంచి 41 లక్షల ఎకరాలు, పెసర 1.98 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ వానకాలంలో జొన్నలు 1.54 లక్షల ఎకరాలు, మినుములు 59 వేల ఎకరాలు, ఆముదం 92 వేల ఎకరాలు, వేరుశనగ 42 వేల ఎకరాల్లో సాగు చేసేలా ప్రతిపాదించారు. రూ. 400 కోట్ల రుణమాఫీ.. ఇక రూ.25 వేల లోపున్న రైతుల రుణమాఫీ సొమ్ము జమ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.400 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదటి విడతలో దాదాపు 6 లక్షల మంది రైతులకు రూ.25 వేల చొప్పున రూ.1,200 కోట్ల మాఫీ సొమ్మును జమ చేయాల్సి ఉంది. వారం రోజుల్లోపు మొదటి విడత రుణమాఫీ పూర్తి చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
సాగు రూపు మారాలి : కేసీఆర్
వ్యవసాయాభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా రైతులకు కావాల్సినవి సమకూర్చుతున్నాం. దీనివల్ల పంటలు బాగా పండుతున్నాయి. వాటికి కనీస మద్దతు ధర వచ్చేలా చేస్తున్నాం. ఇది సరిపోదు. ఇంకా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలతలున్నాయి. ఎక్కువ మంది జనం ఈ రంగంపైనే ఆధారపడ్డారు. అందువల్ల ఎక్కువ దృష్టి వ్యవసాయం మీదనే పెట్టాలి. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శకం చేయాల్సి ఉంది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘జనాభాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంలోనే ఉండడం ప్రగతికి సంకేతం కాదు. అందువల్ల పారిశ్రామికీకరణ జరగాలి. తెలంగాణ వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణకు ఎంతో అనుకూలం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరి శ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేట్లు కృషి జరగాలి. దీనివల్ల అటు పారిశ్రామిక రంగం, ఇటు సేవారంగాలు కూడా విస్తరిస్తాయి’అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయం పరిణతి సాధించడానికి ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తుందని ప్రకటించారు. నిరంతరం మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడిసరుకు అందించే విధంగా, వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోయేలా, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని ఆయన ఆకాంక్షిం చారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవ సాయం రూపురేఖలు మారాలని సూచించారు. ప్రజల అవసరాలు, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణలో జరగాల్సిన పంటల సాగు–అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో నిపుణులతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, అగ్రి బిజినెస్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీమా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మిగతా డైరెక్టర్ శ్రీనివాసాచారి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సలహాదారు గోపీనాథ్ కోనేటి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తదితరులతో చర్చించారు. ఎలాంటి మార్పులు చేయాలి.. పంటల సాగులో ఏ రకమైన మార్పులు తీసుకురావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటను యథావిధిగా మార్కెట్‌కు పంపకుండా దానికి అదనపు విలువ జత చేయడానికి ఇప్పుడున్న పద్ధతులేంటి? కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ప్రపంచం నుంచి పోటీ తట్టుకుని నిలబడేలా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు రావడానికి ఏం చేయాలి? ఎరువులు–రసాయనాల వాడకంలో రావాల్సిన మార్పులు ఏంటి? పంటల మిగులు ఉండకుండా ఏం చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నిపుణులు పలు సూచనలు చేశారు. రానున్న రోజుల్లో మరింత విస్తృత స్థాయిలో ఇలాంటి చర్చలు చాలా జరిపి, తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు. ‘తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేది. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కాస్త ఊరట లభించింది. ఇప్పుడిప్పుడే రైతాంగంలో నమ్మకం ఏర్పడుతోంది. వ్యవసాయంలో సంస్కరణల శకం ఈ ఏడాది వర్షాకాలం పంటతో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా రైతుల శ్రేయస్సు కోసమేననే విశ్వాసం వారిలో ఉంది. సాగునీరు ఉంది. పెట్టుబడి ఉంది. ప్రభుత్వంపై నమ్మకం ఉంది. నైపుణ్యం కలిగిన రైతాంగం ఉంది. ఏ పంటైనా పండించే నేలలున్నాయి. ఇన్ని సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, అగ్రి బిజినెస్, అగ్రి ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. నాణ్యమైన సరుకులతో తెలంగాణ బ్రాండ్.. ‘రైతులు పండించిన పంటను యథావిధిగా ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్నాం. కానీ ఆ పంటకు అదనపు విలువ జత చేయడం వల్లే ఎక్కువ ధర వస్తుంది. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు ఏర్పాటు చేస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కావాల్సిన ముడి సరుకును నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం కావాలి. నాణ్యమైన సరుకులు తయారు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్‌కు ఓ ఇమేజ్ ఏర్పడుతుంది. అది అంతర్జాతీయంగా మార్కెటింగుకు ఉపయోగపడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటలు మార్చుకుని వేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం రైతులకు అలవాటు కావాలి. దీనివల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. పీడచీడలు తక్కువగా ఉంటాయి. ఇవన్నీ రైతులకు విడమరిచి చెప్పాలి. ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలి. ప్రస్తుతం రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారు. తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు చెప్పాలి. ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండదనే విషయం కూడా వారికి అర్థమయ్యేట్లు వివరించాలి. క్రాప్ కాలనీలు ఉన్నచోటనే ఆ పంటకు సంబంధించిన ఆగ్రో ఇండస్ట్రీ/ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలి’అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ పాల్గొన్నారు. -
నియంత్రిత సాగే రైతు‘బంధు’ : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘రైతులంతా ఒకే పంట వేస్తే డిమాండ్ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. ఏ సీజన్లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉందో ఆగ్రో బిజినెస్ విభాగం వారు నిర్ధారించారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తుంది. ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదు’అని సీఎం పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానంపై ఆయన గురువారం ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ‘రాష్ట్రంలో గతేడాది తరహాలోనే వర్షాకాలంలో40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి. గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లోకంది పంట వేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గతేడాది మాదిరిగానే వేసుకోవచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చు. వర్షకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు కాబట్టి, అది వద్దు. యాసంగిలో మక్కలు వేసుకోవచ్చు. వర్షాకాలంలో మక్కలు వేసే అలవాటు ఉన్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి. వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా రకం వేసుకోవాలి. 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉంది. దానిని కూడా పండించాలి’అని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం సమీక్షలో పాల్గొన్న రైతు బంధు సమితుల అధ్యక్షులు, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు 2,602రైతు వేదికలు.. రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తన వ్యవసాయ క్లస్టర్ అయిన ఎర్రవెల్లిలో సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తానని సీఎం ప్రకటించగా.. రాష్ట్రంలోని మంత్రులందరితో పాటు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా సొంత ఖర్చుతో రైతు వేదికలను నిర్మించడానికి ముందుకొచ్చారు. గురువారం ప్రగతి భవన్లో నియంత్రిత సాగుపై జరిగిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశంలో సీఎం సూచనలివీ... ►ఈ వర్షాకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలి. ►నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు వచ్చే నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు, సింగిల్ విండో చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచులను ఈ సదస్సులకు ఆహ్వానించాలి. ►ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేయాలనే విషయం ముందే నిర్ధారిస్తారు. ఆ పంటలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేర్చాలి. విత్తనాభివృద్ధి సంస్థ ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరించాలి. ►మంచి వంగడాలు తయారు చేయడానికి, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ కమిటీలను త్వరలో నియమిస్తాం. ►రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడం కోసమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ప్రభుత్వం సెజ్‌లను ఏర్పాటు చేస్తోంది. రైసు మిల్లులు, దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. ఈ సెజ్‌ల పక్కనే గోదాముల నిర్మాణం చేపట్టాలి. సెజ్‌లు, గోదాములున్న ప్రాంతంలో ఇళ్ల లేఔట్‌కు అనుమతి ఇవ్వొద్దు. ►కల్తీ విత్తన వ్యాపారుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. అలాంటివారిని గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేసి, జైలులో వేయాలి. ప్రజా ప్రతినిధులెవ్వరూ కల్తీ విత్తన వ్యాపారులను కాపాడే ప్రయత్నం చేయొద్దు. ►ఈ నెల 25లోగా ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల నియమాకం పూర్తిచేయాలి. ►గోదావరి ప్రాజెక్టుల కింద సత్వరం నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకాలు సాగు చేయాలి. కృష్ణా ప్రాజెక్టు పరిధిలో ఆలస్యంగా నీరు వచ్చే ప్రాంతాల్లో స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలి. ►పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలోనే కోటి బెయిళ్ల సామర్థ్యం కలిగిన 320 జిన్నింగు మిల్లులున్నాయి. 70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా మద్దతు ధరకు ఢోకా ఉండదు. పత్తి ఎక్కువ పండి, జిన్నింగ్ మిల్లులు లేని ప్రాంతాలు గుర్తించి, అక్కడ కొత్త మిల్లులు వచ్చేలా పరిశ్రమల శాఖ చొరవ చూపాలి. ►రాష్ట్రంలో పచ్చి రొట్ట ఎరువు సాగును ప్రోత్సహించాలి. ►జిల్లాలవారీగా అగ్రికల్చర్ కార్డును రూపొందించాలి. దాని ప్రకారమే పంటలను సాగు చేయాలి. ►జిల్లా, మండల, గ్రామాల వారీగా హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పాడి ప్లాంటేషన్ మిషన్స్ తదితర వ్యవసాయ యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలి. ►అన్ని జిల్లాల్లో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ►జిల్లా, డివిజన్, మండల, క్లస్టర్ స్థాయి వ్యవసాయ అధికారులకు ప్రతీ నెలా వాహన అలవెన్సు/ప్రయాణ భత్యం ఇవ్వాలి. ► మార్కెట్లలో వెంటనే పసుపు యార్డులు తెరిచి, క్రయ విక్రయాలు కొనసాగించాలి. -
సైలేజీ గడ్డి సీజన్ ఇదే!
పచ్చిమేత లేకుండా పాడి లాభసాటి కాదు. అయితే, సంవత్సరం పొడవునా మనకు పిచ్చమేత లభ్యం కాదు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మనకు కొరత మరీ ఎక్కువ. అందుచేత జనవరి నెలలోనే మాగుడు గడ్డి / సైలేజీ గడ్డి / పాతర గడ్డిని తయారు చేసుకొని, పచ్చి గడ్డి కొరత ఉండే నెలల్లో వాడుకుంటే పాల దిగుబడి తగ్గిపోకుండా ఉంటుంది. సైలేజీ గడ్డి తయారీ ఇలా.. ► పచ్చి మేత పుష్కలంగా ఉన్నప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి, గుంతలో వేసి, గాలి చొరపడకుండా కప్పి పెట్టి, పోషక విలువలు తగ్గకుండా కాపాడుకొని, అవసర సమయాల్లో పశువులకు మేపుకొనే గ్రాసాన్నే సైలేజీ గడ్డి అంటారు. ► ఎక్కువ పిండి పదార్థాలు కలిగి, సుమారుగా మాంసకృత్తులు కలిగిన పశుగ్రాసాలు అనువైనవి. ఉదా: జొన్న, మొక్కజొన్న, నేపియర్, గిన్నీ గడ్డి, సజ్జ మొదలైనవి. అలాగే గుర్రపుడెక్క, చెక్క తట్టాకు, గుంతకల్లుడు ఆకు, చెట్టింటాకు లాంటి కలుపు మొక్కలను కూడా సైలేజీకి వాడవచ్చు. ► సైలేజీ గడ్డిలో ఎండుగడ్డిని కూడా 1:4 నిష్పత్తిలో వాడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టన్ను పశుగ్రాసానికి సుమారు 30 కిలోల మొలాసిస్ వాడితే మంచిది. మొలాసిస్ లభ్యం కానప్పుడు బెల్లం నీటిని కూడా వాడవచ్చు. ఈ ద్రావణాన్ని పశుగ్రాసం పైన పిచికారీ చేసుకొని సైలేజీని తయారు చేసుకోవాలి. ► సైలేజీ తయారీకి 35 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ఎక్కువ మాంసకృత్తులున్న పశుగ్రాసాలు– లూసర్ను, బర్సీము, అలసంద, పిల్లిపెసర లాంటివి సైలేజీకి పనికిరావు. ► సైలేజీ తయారీకి వాడే గుంతలు 3 రకాలు.. అపార్ట్మెంట్ పద్ధతి, గుంత కాల్వ పద్ధతి, బంకర్ పద్ధతి. ► రైతు తన అవసరాన్ని బట్టి సైలేజీని తయారు చేసుకోవచ్చు. సైలేజీ తయారీకి వాడే గుంత ముఖ్యంగా పశువుల సంఖ్య, నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ► ఒక్కో రోజుకు సుమారుగా 20 కిలోల సైలేజీని పశువుకు మేపుకోవచ్చు. ► గుంత పరిమాణాన్ని నిర్ణయించడానికి సూత్రం– ఉదా: ఒక రైతు దగ్గర 3 పాడి పశువులున్నాయి. వేసవిలో 3 నెలల పాటు సైలేజీ అవసరం అనుకుంటే, ఒక్కోపశువుకు రోజుకు 20 కిలోలు. 90“20=1,800 కిలోల అవసరం. అదే 3 పశువులకు 5,400 కిలోలు అవసరం. ఈ సైలేజీ తయారు చేసుకోవడానికి 8,100 కిలోల పశుగ్రాసం అవసరం. ఒక ఘనపు అడుగులో 20–23 కిలోల పశుగ్రాసాన్ని పాతర వేయొచ్చు. కాబట్టి, దాదాపు 350 ఘనపుటడుగుల గుంత అవసరం. అంటే.. 12 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉన్న గుంత అవసరం. సైలేజీ గడ్డి తయారీలో జాగ్రత్తలు ► పశుగ్రాసాన్ని నింపేటప్పుడు గుంతలో గాలి చొరబడకుండా చూడాలి. ► గుంతలో నీరు లేకుండా, చేరకుండా చూడాలి. ► సైలేజీ తయారీలో పశుగ్రాసాల్లో 65 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ► జొన్న, మొక్కజొన్న చొప్ప సైలేజీ గడ్డి తయారీకి చాలా అనుకూలం. సైలేజీ గుంతను 3–4 రోజుల వ్యవధి లోపలే నింపాలి. అంతకన్నా ఆలస్యం కాకూడదు. ► జొన్న, మొక్కజొన్న, నేపియర్ గడ్డి రకాలు వాడినట్లయితే.. టన్నుకు 3 కిలోల యూరియా కలిపితే మంచిది. ► డోములాగా గుంత పై భాగాన్ని 2–3 అడుగుల ఎత్తు వరకు నింపవచ్చు. ► సైలేజీ నింపిన తర్వాత 2–3 అంగుళాల వరకు మట్టితో కప్పినట్లయితే, వత్తిడి వల్ల గుంతలోని గాలి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. ► 2–3 నెలల వ్యవధిలో సైలేజీ తయారవుతుంది. ► 2–3 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ► గుంత తెరచిన తర్వాత సైలేజీని ఒక నెల లోపల వాడాలి. లేదంటే బూజు పడుతుంది. బూజు పట్టిన సైలేజీ గడ్డిని పశువులకు మేపకూడదు. ప్రతిరోజూ పశువుకు 20 కిలోలతో బాటుగా, పచ్చిమేత ఒక భాగం, ఎండు మేత ఒక భాగం కలిపి మేపుకుంటే మంచిది. ప్రాణ వాయువు లేకుండా బ్యాక్టీరియా కారణంగా జరిగే రసాయనిక చర్య ద్వారా సైలేజీ గడ్డి తయారవుతుంది. ఈ ప్రక్రియ వల్ల సువాసనలతో కూడిన ఆమ్లాలు కూడా ఉత్పత్తవుతాయి. అందుకే సైలేజీ గడ్డి మంచి సువాసన కలిగి ఉంటుంది. పశువులు ఇష్టంగా తింటాయి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి సైలేజి తయారీకి సిద్ధం చేసిన గడ్డి ముక్కలు -
పాతాళంలో జలం..అయినా పంటలు పుష్కలం..!
సాక్షి, అమరావతి బ్యూరో: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతే ఆ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతుంది. కానీ.. అందుకు భిన్నంగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం మాత్రం పచ్చని పంటలతో కళకళలాడుతోంది. అలాగని ఆ మండలంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. కేవలం వర్షాలు బోరు బావులు మాత్రమే అక్కడి రైతులకు ఆధారం. ఆ మండలంలో 1990 వరకు భూగర్భ జలాలు అందుబాటులోనే ఉండేవి. ఆ తర్వాత బోర్లు వేయడంతో నీటి వినియోగం బాగా పెరిగింది.. 1999లో 21.67 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2019 నాటికి 110 మీటర్లు, కొన్నిచోట్ల 150 మీటర్ల లోతుకు కూడా వెళ్లిపోయాయి. భూగర్భ జలాల రాష్ట్ర సగటు 12.82 మీటర్లు కాగా.. రాష్ట్ర సగటు కంటే 8 నుంచి 12 రెట్లు దిగువకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ మండలంలో 5,352 బోర్లున్నాయి. వీటిలో చాలా బోర్లు వెయ్యి అడుగుల లోతుకు తవ్వారు. ఒకప్పుడు గరిష్టంగా 5 హార్స్పవర్ (హెచ్‌పీ) మోటార్లను వాడేవారు. ఇప్పుడుగా 15, 20 హెచ్‌పీ మోటార్లను వాడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో ఒక్క కొర్లకుంట మినహా మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వాల్టా చట్టం అమలు చేస్తూ అధికారులు కొత్త బోర్ల ఏర్పాటుపై నియంత్రణ విధించారు. ప్రస్తుతం ఉన్న బోర్లు మరింత లోతుకు తవ్వకుండా ఆంక్షలు పెట్టారు. ఈ మండలాన్ని డార్క్ ఏరియాగా ప్రకటించారు. అక్కడ ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. 60 రకాల పంటలతో.. ఈ మండలంలో 13,351 హెక్టార్లలో 60 రకాల పంటలు సాగవుతున్నాయి. బోర్లు వేయకముందు ఇక్కడ పది రకాల పంటలే పండించేవారు. ఏటా రెండు, మూడు పంటలు వేసి గణనీయమైన, నాణ్యమైన దిగుబడులనూ సాధిస్తున్నారు. వీటిలో మొక్కజొన్న, ఆయిల్‌పామ్, వరి, మామిడి, అరటి, పొగాకు, మిర్చి, కొబ్బరి, పత్తి, నిమ్మ, జామ, కూరగాయలు, చెరకు, వేరుశనగ, బొప్పాయి, మినుములు, పెసలు, జీడిమామిడి, బీర, ఉలవలు, టమాటా, కేప్సికం, సుబాబుల్, జొన్న, కంది, బీన్స్, పసుపు, మల్లె, చామంతి, రేగు, ములక్కాడ, పొద్దు తిరుగుడు, కాకర వంటివి ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా నీరు అధికంగా అవసరమయ్యే ఆయిల్‌పామ్ 2,345 హెక్టార్లలోను, వరి 2,200 హెక్టార్లలోను సాగవుతున్నాయి. నేల గొప్పదనమే ఇది ముసునూరులో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నా నీటి లభ్యతతో పాటు పంటలు పండడానికి అక్కడ ఎర్ర ఇసుక నేలలే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేల కింద ఇసుక రాతి పొరలున్నాయి. ఇవి ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల భూమిలో లోతుకు వెళ్లినా సమృద్ధిగా నీళ్లు లభిస్తున్నాయి. జలశక్తి అభియాన్‌లో ఎంపిక.. కేంద్ర జలశక్తి అభియాన్ పథకంలో ముసునూరు మండలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి దోహదపడే నీటి పొదుపు చర్యలు పాటించడం, పొలంలో ఫారం పాండ్స్ ఏర్పాటు, నీటి వినియోగం తక్కువయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం వంటివి సిఫార్సు చేస్తూ అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు క్రమంగా డ్రిప్ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపుతుండటంతో సుమారు 7వేల హెక్టార్లలో నీటిని పొదుపు చేస్తున్నారు. మండలంలోని ముసునూరు, సూర్యపల్లి, వేల్పుచర్లల్లో పిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలాల స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం.. చింతలపూడి పథకం ద్వారా గోదావరి జలాలను సాగర్ ఎడమ కాలువలోకి మళ్లించి.. తమ్మిలేరు వాగు పరీవాహక ప్రాంతంలోని లోపూడి, గుళ్లపూడి, గుడిపాడు, వలసపల్లి, ఎల్లాపురం గ్రామాలకు కలిపితే చెరువులు నిండి భూగర్భ జలాల వృద్ధికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్ పుణ్యం కట్టుకోవడం వల్ల చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. – రేగుల గోపాలకృష్ణ, అధ్యక్షుడు, ముసునూరు పీఏసీఎస్ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం భూగర్భ జలాల పెంపుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ ఆవశ్యకతను వివరిస్తున్నాం. రెండు వేల మంది రైతులకు శాస్త్రవేత్తలతో కలిసి కిసాన్ మేళా నిర్వహించాం. ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు వస్తున్నాయి. – బి.శివశంకర్, మండల వ్యవసాయాధికారి, ముసునూరు 30 ఏళ్ల క్రితం 25 అడుగుల్లోనే నీరు 30 ఏళ్ల క్రితం మా ప్రాంతంలో 25 అడుగుల్లోనే నీరుండేది. అప్పట్లో బోర్లు వేయడానికి 100 అడుగులు తవ్వితే సరిపోయేది. ఇప్పుడు 600 అడుగుల తోతుకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల 15–20 హెచ్‌పీ మోటార్లు బిగించి నీరు తోడుతున్నారు. చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. – ఎం.సుబ్బారావు, రైతు, గుడిపాడు, ముసునూరు మండలం -
వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..
వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న మోస్తరు వర్షాలతో రైతులు ఆనంద పడుతున్నారు. రెండు నెలలుగా వరుణుడు కరుణించకపోవడంతో దిగాలుగా ఉన్న రైతులు ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. కొందరు ఇప్పటికీ విత్తనాలు వేస్తుండగా.. మరికొందరు గుంటుక తోలుతున్నారు. సాక్షి, మెదక్ : ఈ సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షం పడకపోవడంతో చెరువులు, కుంటలు బోసిగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముసురేసిన వాన ఆరుతడి పంటలకు ఊపిరి పోస్తుండగా.. నల్లరేగడి నేలలో వేసిన పత్తికి దెబ్బేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైంది. భారీ వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవడంతోపాటు భూగర్భ జలమట్టం పెరిగితేనే రైతులు ఈ ఖరీఫ్‌లో గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయి. లోటు వర్షపాతమే.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 8303.3 మిల్లీ మీటర్లు.. ఇప్పటివరకు కురిసింది 7604.2 మి.మీటర్లే. ఈ మేరకు లోటు వర్షపాతం 699.1 మి.మీలు. సగటున లెక్కేస్తే జిల్లాలో సాధారణ వర్షపాతం 415.2 మి.మీలు.. కురిసింది 380.2 మి.మీలు మాత్రమే. అంటే లోటు వర్షపాతం ఎనిమిది శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఐదు మండలాల్లో అత్యల్పం.. జిల్లాలో 20 మండలాలు ఉండగా.. ఏడు మండలాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ కురిసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 13 మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. జిల్లాలో పాపన్నపేట మండలంలో ఇప్పటివరకు అధిక వర్షపాతం 43.7 శాతం నమోదైంది. మొత్తం మూడు మండలాల్లో అధిక, 12 మండలాల్లో సాధారణం, మిగిలిన 5 మండలాల్లో అత్యల్పంగా వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వరి సాగు పెరిగే అవకాశం.. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు అన్ని పంటలు కలిపి అంచనా 83,373 హెక్టార్లు.. ఇప్పటివరకు 55,109 హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వరి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో వరి సాగు అంచనా 34,985 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 20,000 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. వరి నాటేందుకు ఆగస్టు 15 వరకు సమయం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్న క్రమంలో ఇంకా సుమారు 8,000 హెక్టార్ల మేర సాగు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంచనాలు తారుమారు.. రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వేసిన పంట అంచనాలు తారుమారయ్యాయి. ఆరుతడి పంటలకు చెందిన రాగులు, కొర్రలను గతంలో తక్కువగా పండించేవారు. వీటికి వ్యవసాయాధికారులు అంచనా కూడా వేయలేదు. కానీ జిల్లాలో ఇప్పటివరకు పలువురు రైతులు 100 హెక్టార్లలో రాగులు, 110 హెక్టార్లలో కొర్రలు సాగు చేశారు. 600 హెక్టార్లలో జొన్న సాగు చేస్తారనే అంచనా కాగా.. 410 హెక్టార్లలో సాగైంది. అదేవిధంగా.. జిల్లాలో 13,000 హెక్టార్లలో పత్తి సాగవుతుందని భావించగా.. 17,000 హెక్టార్లలో రైతులు పంట వేశారు. 22,000 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా.. 13500 హెక్టార్లలో మాత్రమే మక్క సాగైంది. పలువురు మక్క రైతులు పత్తి వైపు దృష్టి సారించడంతో జిల్లాలో తెల్లబంగారం సాగు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రతిరోజూ వర్షం కురుస్తోంది. వరి సాగు పెరిగే అవకాశం ఉంది. రేగడి భూముల్లో పత్తి పంట వేసిన వారు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వాతావరణంలో తేమతో పలు పంటలకు అగ్గితెగులు వంటివి సోకుతాయి. ఈ మేరకు రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. – రెబల్సన్, జిల్లా నోడల్ అధికారి -
ముసురు మేఘం.. ఆశల రాగం..
అంతా కోలాహలం.. ఎటుచూసినా సాగు సంబరం.. మబ్బుల మాటున నీటి కుండ చిరుజల్లులై జాలు వారుతుంటే అన్నదాతల గుండె ఆశల సవ్వడి చేస్తోంది. ముసురేసిన మేఘమాల ముత్యాల వాన కురిపిస్తుంటే పుడమి తల్లి నుదుటిన నీటి బొట్టు పచ్చని బొట్టై మెరుస్తోంది. ముడుచుకున్న మొగ్గ చినుకు స్పర్శ తాకగానే ఒళ్లు విరుచుకుని వయ్యారాలు ఒలకబోస్తోంది. ఎదురింటి కృష్ణన్న, పక్కింటి రామన్న.. వెనకింటి సుబ్బన్న తలపాగా చుట్టి, పంచె ఎగ్గట్టి కదులుతుంటే.. పొలాల దారుల్లో పూల వాన స్వాగతం పలుకుతోంది. పంట చేలల్లో పల్లె పడుచు కూనిరాగాల్లో నండూరి ఎంకి పాటకు.. జాలువారిన చినుకు చిటపటల దరువేస్తోంది. ఇప్పటికే గలగలమంటూ పరుగులు పెడుతున్న కృష్ణమ్మ, గోదావరి నదుల అలలపై చిరుజల్లుల నాట్యం చేస్తోంది. ఈ ఏడాది వాన వెల్లువై కర్షకుడి కంట కష్టాల కన్నీటిని కడిగేస్తానంటూ వాతావరణ శాఖ ద్వారా మేఘ సందేశం పంపిందియ సాక్షి, గుంటూరు: వర్షాలకు పుడమికి పచ్చని రంగు అందినట్లు పొలాలు కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత పదిహేను రోజుల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటిదాకా డీలా పడిన రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. అన్ని రకాల పొలాలు పదునెక్కాయి. ఉందిలే మంచి కాలం ముందుముందునా అంటూ అన్నదాతలు నాగలి చేతపట్టి పొలంలోకి రెట్టింపు ఉత్సాహంతో అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు కొందరు వెద పద్ధతిలో నాట్లకు శ్రీకారం చుట్టగా...మరి కొందరు రైతులు విత్తనాలు చల్లుకునే పనిల్లో నిమగ్నమయ్యారు. తీర ప్రాంతాల్లోని రైతులు పొలాల్లో ఎరువులు చిమ్ముకోవడం, పొలాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై ఎరువులు తొలుకోవడం, వాటిని చిమ్ముకునే పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా కురిసిన వర్షాలకు నార్లు పోసుకున్న రైతులు నారుమడులను జాగ్రత్త చేసుకుంటున్నారు.జిల్లాలో గురువారం రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరం, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పెదకూరపాడు, తాడికొండ, వేమూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. మాచర్ల, రేపల్లె, బాపట్ల, గురజాల, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో జల్లులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పంటలకు మేలు ఖరీఫ్ సీజన్లో వేసిన మెట్ట పంటలకు వర్షం మరింత మేలు చేకూర్చనుంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో రైతులు పత్తి, మిరప పంటలు వేశారు. పంటలు వర్షాభావ పరిస్థితులను అధిగమించడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. వాణిజ్య పంటలు సకాలంలో వేయడం అందుకు అనుగుణంగా వర్షం కురుస్తుంటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం గుంటూరు నగరంలోని శివారు కాలనీ, ఎక్స్టెన్షన్ ఏరియాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది. డ్రెయిన్లు, మురుగు కాలువలు పొంగి పొర్లాయి. దీంతో ట్రాఫిక్‌కు పలు ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివారు కాలనీలో రహదారులు చిత్తడిమయంగా మారాయి. యూజీడీ పనులు జరిగిన ఏరియాల్లో గుంతల్లో నీరు భారీగా చేరింది. -
అప్పుల భారంతో అన్నదాతల ఆత్మహత్య
లింగపాలెం/రెంటచింతల (మాచర్ల)/బెళుగప్ప/శ్రీరంగరాజపురం: అప్పుల భారంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు, మరో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, సాగుభూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఇంకో రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వివరాలివి. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతు బోయ పాండురంగ (32)కు 10 ఎకరాల పొలం ఉంది. అదే గ్రామంలో మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 13 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తుండగా, తీవ్ర వర్షాభావం కారణంగా నాలుగేళ్ల నుంచి నష్టాల పాలయ్యారు. దీనికి తోడు తన పొలంలో బోరు వేయించడానికి రూ.లక్ష వరకు ఆ గ్రామానికి చెందిన వారినుంచి అప్పు చేశారు. బోర్లలో చుక్కనీరు కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. పంట పెట్టుబడి కోసం బయట వ్యక్తులతో చేసిన అప్పుల మొత్తం రూ 3.70 లక్షలకు చేరింది. అప్పులు తీర్చే దారిలేక పాండురంగ శనివారం తన పొలంలోనే వేప చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి హనుమంతప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. పాండురంగ మృతి స్థానికులను కలచివేసింది. ఇద్దరు కౌలు రైతుల బలవన్మరణం అప్పుల భారంతో ఇద్దరు కౌలు రైతులు శనివారం ఆత్మహత్యకు ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసన్నపాలెంకు చెందిన కౌలు రైతు కొమ్ము నాగరాజు (38) ఆరేళ్లుగా గ్రామంలోని కూరపాటి లక్ష్మికి చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని నాటు పొగాకు సాగు చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో నాగరాజు అప్పుల పాలయ్యారు. పంట రుణం కోసం బంగారాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టడంతో భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనోవేదనకు గురైన నాగరాజు శనివారం పురుగు మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే నాగరాజు మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మాజీగూడెం ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన మల్లెం సాంబయ్య (62) తనకున్న 30 సెంట్ల పొలంతో పాటు మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని తన కుమారులు నరసింహరావు, రమేష్‌తో కలిసి ఏటా వరి సాగు చేస్తున్నారు. సాగు కలిసి రాకపోవడంతో రూ.12 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. గత రబీలో పైరు ఆశాజనకంగా ఉన్న సమయంలో కాలువలకు సాగునీటి విడుదల నిలిచిపోయింది. కళ్లముందే పంట నిలువునా ఎండిపోయింది. పంట దెబ్బతినడం, అప్పులు కొండలా పేరుకుపోవడంతో మనోవ్యథకు గురైన సాంబయ్య శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బావులు ఎండిపోవడంతో.. అప్పులు పేరుకుపోవడం, గొట్టపు బావులు ఎండిపోవడంతో చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం మూలూరు గ్రామానికి చెందిన వెంకటేశులరెడ్డి (56) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటేశులరెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉండటంతో వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గొట్టపు బావులు వేసేందుకు 7 సంవత్సరాల క్రితం సుమారు రూ.4 లక్షలు అప్పు చేశాడు. రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.2.70 లక్షల పంట రుణం తీసుకున్నాడు. వర్షాభావంతో 6 నెలల క్రితం బోర్లు ఎండిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పు ఎలా తీర్చాలో అర్థంకాని వెంకటేశులురెడ్డి మనస్తాపానికి గురై శనివారం గ్రామం సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. భూమి వివరాలను ఆన్లైన్ చేయకపోవడంతో.. వంగర: సాగులో ఉన్న భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయమని పదే పదే వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వెలుగు కార్యాలయంలో శనివారం ఈ ఘటన జరిగింది. సంగాం గ్రామానికి చెందిన బోను లక్ష్మీనారాయణమ్మ పేరుతో ఉన్న సాగు భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె కుమారుడు మధు 40 రోజులుగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డెప్యూటీ తహసీల్దార్ బి.గోవిందరావు వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి బైఠాయించారు. తమ సమస్యను పట్టించుకోలేదంటూ అసహనానికి గురైన మధు టిన్నుతో తెచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. డీటీ గోవిందరావుతోపాటు అక్కడ ఉన్న వారు అడ్డుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. భూములను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బండారు రామారావు హామీ ఇచ్చారు. -
సాగు.. బాగు
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితుల్లోనూ రబీలో ఆహార ధాన్యాల సాగు ఆశాజనకంగా ఉంది. అందులో వరి నాట్లు కూడా లక్ష్యాన్ని చేరుకున్నాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 29.67 లక్షల (89%) ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం సర్కారుకు పంపిన నివేదికలో వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 26.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.65 లక్షల (94%) ఎకరాల్లో సాగైనట్లు తెలిపింది. ఆహారధాన్యాల సాగులో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం రబీలో 17.65 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.50 లక్షల (99%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, 3.22 లక్షల (78%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు అత్యధికంగా 3.25 లక్షల (104%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో శనగ సాగు 117 శాతం సాగైంది. నూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 4.47 లక్షల ఎకరాలు కాగా, 3.27 లక్షల (73%) ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. తీవ్ర వర్షాభావం... జనవరిలో విస్తృతంగా వర్షాలు కురిసినా.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటడంతో అనేక చోట్ల పంటలు ఎండుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిర్మల్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న కోత దశలో ఉన్నప్పటికీ కత్తెర పురుగు సోకి దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొందని నివేదిక వెల్లడించింది. పలు చోట్ల శనగ, పెసర, మినుములు, వేరుశనగ పంటలు కోత దశలో ఉన్నాయి. మిర్చి నాలుగో తీత దశలో ఉంది. -
ఎండుతున్న ఆశలు..!
చెన్నారావుపేట: దేవుడు వరమించిన పూజారి కరుణించలేదనే సమేత రైతుల పట్ల నిజమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతుల కోసం ఇవ్వడంతో కష్టాలు పోయాయి అనుకున్నారు. కానీ బావులల్లో భూగర్భ జలాలు లేకపోవడంతో రైతుల ఆశలు ఎండకు ఆవిరై పోయినట్టు తయారైంది. చెరువులు, కుంటలలో నీళ్లు ఎండిపోతుండటంతో బావులల్లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వస్తే పంటలను బతికించుకోవచ్చని కలలు కన్న రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బోర్లు వేసుకొని పంటలు రక్షించుకుందామంటే అందనంత దూరంలోకి జలాలు అడుగంటిపోయి.. నీళ్ల చుక్క రాని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదలకు కృషి చేస్తే పంటలు చేతికొస్తాయని రైతులు కోరుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ శివారులోని బూరుగుకుంట తండాకు చెందిన బానోతు మురళికి గ్రామ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 2 ఎకరాలు భూమిలో వరి పంట వేశాడు. ఎకరంలో పసుపు పంట వేశాడు. బావిలో నీళ్లున్నాయనే ఆశతో పంట వేశాడు. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు వేసినా పడకపోవడంతో చేసేది ఏమి లేక చేతులెత్తేశాడు. ఎస్సారెస్పీ జలాలు వచ్చిన తన పంట పండుతుందని ఆశ పడ్డాడు. నీళ్లు రాకపోవడంతో చేసేది ఏమి లేక తన పశువులను, గేదెలను మేపుతున్నాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి... ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు.. రెండు ఎకరాలలో వరి నాటు వేశాను పంట మంచిగా పెరిగింది. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో రెండు బోర్లు రూ.1 లక్ష పెట్టి వేయింనా పడలేదు. వరి పంటలకు రూ.23 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. మంచిగా ఉన్న నీళ్లులేక ఎండిపోతుండంతో గుండె బరువెక్కింది. ఎడుద్దామనుకున్న ఏడుపు రావడం లేదు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు వచ్చిన కొంత మేర పంటను బతికించుకోవచ్చన్న ఆశ ఉంది. – బానోతు మురళి, యువ రైతు -
దస్తగిరి కుటుంబానికి దిక్కెవరు?
పంటల సాగుకు చేసిన అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం దుర్భరమైన జీవితం గడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి భార్య, నలుగురు పిల్లలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ గ్రామానికి చెందిన దస్తగిరి(40) అప్పుల బాధతో పొలంలో పురుగుల మందు తాగి 2016 సెప్టెంబర్ 12న మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను, ఒక కుమారిడిని పోషించుకునేందుకు అతని భార్య దానమ్మ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దస్తగిరికి రెండెకరాల పొలముంది. దీనికి తోడు మరో ఐదెకరాలను ఎకరా రూ. 30 వేలకు కౌలుకు తీసుకుని 2014, 2015, 2016 సంవత్సరాలలో వ్యవసాయం చేశాడు. ఏడెకరాలలో పత్తి పంట సాగు చేశారు. పంటల సాగుకు ఏడాదికి రూ. లక్ష అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. వచ్చిన అరకొర దిగుబడులతో రైతు దస్తగిరి కొంతమేర అప్పులు తీర్చుతూ వచ్చాడు. అయితే పంటల సాగు, ఇంటి నిర్మాణంకు, ఇద్దరు కూతుళ్ల వివాహానికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 3 లక్షలు అప్పు చేశాడు. అదేవిధంగా సి.బెళగల్‌ని బంగారు అంగళ్ళ దగ్గర రెండవ కూతురు లుదియాకు చెందిన రెండు తులాల బంగారాన్ని తాకట్టుపెట్టి రూ. 46 వేలు అప్పు తీసుకున్నాడు. తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, గ్రామస్తుల దగ్గర పంటలకు, కుటుంబ పోషణకు దస్తగిరి రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పలు ఎలా చెల్లించాలోనని మధనపడేవాడని భార్య దానమ్మ, కుమార్తెలు తెలిపారు. దానమ్మ కూలి పనులు చేసుకుంటూ నలుగురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమారుడు దీవనరాజు కోడుమూరులోని ఎస్సీ వసతి గృహంలో వదిలారు). అయితే రైతు చనిపోయి రెండేళ్లు పూర్తయినా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం తమను కరుణించి పరిహారం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు దానమ్మ కోరుతోంది. – బి.గోవిందు, సాక్షి రిపోర్టర్, సి.బెళగల్, కర్నూలు జిల్లా -
కేంద్రం పరిమితులతోనే రైతులకు ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: పంటల ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మార్కెటింగ్ ఈ–సర్వీసెస్‌ను ప్రారంభించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. కేంద్రం మద్దతు ధర పెంచిందని, అయితే కొనుగోళ్ల విషయంలో పరిమితులు విధిస్తోందని.. దీనివల్లే రైతులకు సమస్య ఎదురవుతోందని చెప్పారు. రెండేళ్ల నుంచి రికార్డు స్థాయిలో ప్రభుత్వం తరఫున కొంటున్నామన్నారు. కేంద్రం పరిమితి విధించడానికి ఎగుమతి దిగుమతి విధానాలు తదితర అంతర్జాతీయ కారణాలున్నాయన్నారు. అయితే ఇవి రైతులకు సంబంధం లేనివి అయినప్పటికీ వారిపైనే ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ విషయాలు రైతులకు అధికారులు వివరించాలన్నారు. మార్కెటింగ్‌శాఖ ఆందుకు సిద్ధంగా ఉండాలని, ధరల విషయంలో ముందుగానే అంచనాలు వేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీసారి సమీక్షించుకోవాలి.. వ్యవసాయ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చేరుతాయని, వాటి ధరలో రైతు వాటా ఏడాదికేడాది ఎంత పెరుగుతుందనేది ముఖ్యమని పార్థసారథి చెప్పారు. ప్రతిసారీ దీన్ని సమీక్షించుకుని రైతులకు గిట్టుబాటు కల్పిస్తున్నామా లేదా చూసుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం తరఫున సాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లలో గత నాలుగేళ్లలో రూ.370 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ సర్వీసెస్ ఉపయోగపడుతోందన్నారు. అన్నీ ఆన్లైన్లో చూసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ–నామ్లో రాజకీయ ఒత్తిడులు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా మోడల్ యాక్ట్ విషయంలో జవాబుదారీతనం ఉండాలని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, పద్మహర్ష తదితరులు పాల్గొన్నారు. -
కత్తెర పురుగును కంట్రోల్ చేశాం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా కత్తెర పురుగును కంట్రోల్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొక్కజొన్న, జొన్న పంటలను ఆశిస్తున్న కత్తెర పురుగు పెరగకూడదని శాస్త్రవేత్తలను ఆదేశించామని అన్నారు. దీని నివారణకు పురుగు మందులు లేవని తెలిపారు. రసాయనాల ద్వారా సాధ్యం కాని కత్తెర పురుగు నివారణ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో శనివారం ప్రారంభమైన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి, ప్రోత్సహిస్తున్న పాలేకర్‌ను చంద్రబాబు అభినందించారు. ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 3,015 గ్రామాల్లో 5.23 లక్షల మంది రైతులు 5.04 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2013–14లో వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.1.28 లక్షల కోట్ల ఆదాయం ఉండగా, 2017–18కి ఈ ఆదాయం రూ.2.53 లక్షల కోట్లకు చేరిందని చంద్రబాబు తెలిపారు. ఎకరాలో రూ.6 లక్షల దాకా ఆదాయం ప్రపంచమంతటా ఆహార భద్రతకు సంబంధించి సంక్షోభం నెలకొందని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ అన్నారు. భూతాపం పెరుగుతోందని, వ్యవసాయ భూమి తగ్గుతోందని వివరించారు. ఒక ఎకరా భూమిలో పంటల సాగు ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయం వచ్చేలా రైతులు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. -
మినుము సాగుకు అదును ఇదే..
విజయనగరం ఫోర్ట్: మినుము పంట సాగుకు అదును ఇదేనని విజయనగరం మండల వ్యవసాయ అధికారి గాలి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మినుము సాగు విధానం, అధిక దిగుబడుల సాధనపై పలు సూచనలిచ్చారు. ఆయన మాటల్లోనే... సాగుకు అనువైన నేలలు.. మాగాణి, మెట్ట భూములు మినుము పంటకు అనుకూలం. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ నేలల్లో మినుము పంటను వేసుకోవాలి. విత్తడం ఇలా.. మరి మాగాణాల్లో అయితే వరి కోయటానికి 4, 5 రోజుల ముందు విత్తనాలను వెదజల్లుకోవాలి. ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం, ఎరువులు వేయడం వంటివి చేయరాదు. అధిక మోతాదులో విత్తనాన్ని వాడాలి. మెట్ట భూముల్లో అయితే తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయేనేలలు మినుముకు అనుకూలం. భూమిని బాగా దుక్కిచేయాలి. విత్తనం దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి భూమిలో కలియదున్నాలి. వరి మాగాణాల్లో అయితే విత్తనాలను వెదజల్లాలి. మెట్ట భూముల్లో అయితే వరుసల మ«ధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కలు మధ్య 10 సెం.మీ అంతరంతో గొర్రుతో గాని సీడ్ డ్రిల్‌తో గాని విత్తాలి. రకాలు... ఎల్ఐజీ–645: ఈ రకం పంట కాలం 85 నుంచి 90 రోజులు. హెక్టారుకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లావుపాటి పాలిసీ రకం. ఎండు తెగులను తట్టుకుట్టుంది. ఎల్.బి.జి –402: ఈ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. హెక్టారుకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపును అణిచి వేస్తుంది. చౌడును కొంత వరకు తట్టుకుట్టుంది. ఎల్బీజీ 22: ఈ పంట రకం 85 రోజులు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం. ఎల్బీజీ–17: ఈ రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు. బూడిద తెగులను తట్టుకుంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. ఎల్బీజీ– 752: ఈ రకం పంటకాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు, ఎండు తెగులను తట్టుకుంటుంది. విత్తన మోతాదు: వరి మాగాణాల్లో అయితే ఎకరాకు 16 కేజీలు, మెట్ట భూముల్లో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనం అవసం అవుతుంది. కిలో విత్తనానికి 30 గ్రాముల కార్పోసల్ఫాన్, 2.5 థైరమ్ లేదా కాప్టాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితి ఎర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు పెట్టాలి. వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేలిక తడులు, 30 రోజులకు, 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. కలుపు నివారణ: పెండి మిథాలిన్ ద్రావణం ఎకరాకు లీటరు నుంచి లీటరన్నర ఎకరాకు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. సస్యరక్షణ: మరకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి. ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు వడిలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. పైరుపై మందులను వాడి నివారించడం లాభసాటి కాదు. తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పల్లాకు తెగులు: ఇది జెమిని వైరస్ జాతి వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్టయితే పైరు గిడసబారిపోయి , పూతపూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి. -
కరువును జయించిన సిరిధాన్యాలు!
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.వరి వంటి పంటలు కొన్ని జిల్లాల్లో ఎండిపోయాయి. అయితే, వర్షాధారంగా సాగులో ఉన్న కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు వంటి సిరిధాన్య పంటలు మాత్రం కరువును తట్టుకున్నాయి. నెల నుంచి రెండున్నర నెలల వరకు వాన దేవుడు మొహం చాటేసినప్పటికీ.. సిరిధాన్య పంటలు తట్టుకొని బతికాయి. వర్షాభావం వల్ల ఎదుగుదల మందగించి, దిగుబడి కొంత తగ్గినప్పటికీ ఈ పంటలు రైతులను నిరాశపర చకపోవటం విశేషం. అధిక పెట్టుబడులు అవసరమైన ఇతర పంటలు రైతులను నష్టాల ఊబిలోకి నెడుతూ ఉంటే.. స్వల్ప ఖర్చుతోనే సాగైన సిరిధాన్య పంటలు మెట్ట రైతులకు కొండంత భరోసానిస్తున్నాయి. అటవీ కృషి వ్యవసాయ పద్ధతిలో డాక్టర్ ఖాదర్ వలి (మైసూరు) వద్ద శిక్షణ పొంది, ఆయన అందించిన ‘అటవీ చైతన్య ద్రావణం’ ఉపయోగించి సిరిధాన్యాలను విజయవంతంగా సాగు చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రైతుల అనుభవాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. వత్తుగా చల్లితే కలుపు బెడద ఉండదు! వర్షాధార వ్యవసాయ భూములు 60% వరకు ఉన్నాయి. ఇటువంటి భూములు వేలాది ఎకరాలు పడావు పడి ఉన్నాయి. 15 ఏళ్లుగా బీడుపడిన అటువంటి భూమిలో తెలంగాణకు చెందిన నలుగురు స్నేహితులు ఉమ్మడిగా కొర్రలు, అరికల వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు. విత్తనం వత్తుగా వేశారు. కలుపు తీయలేదు. ఎరువులూ వేయలేదు. పిచికారీలూ చేయలేదు. తక్కువ ఖర్చుతో, అద్భుత పోషక – ఔషధ గుణాలు కలిగిన సిరిధాన్య పంటలను కేవలం వర్షాధారంగా సాగు చేసి ఎకరానికి కనీసం 5–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తామని భరోసాతో చెబుతున్నారు. మెట్ట ప్రాంత రైతులకు, ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఈ పంటలు ఎంతో అనువైనవని వారు చెబుతున్నారు. కరువును తట్టుకోవటంతో పాటు అప్పులు చేయాల్సిన అవసరం లేని పంటలని చాటిచెబుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎమ్మెస్సీ, బీఈడీ చదువుకున్న మైల నర్సింహ, త్రిపురారానికి చెందిన ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి(అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గ్రీన్‌కార్డ్ కలిగిన ఈయన గత ఏడాది తిరిగివచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు), హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆనాజిపురానికి చెందిన పూదిరె భాస్కర్, అల్వాల్‌కు చెందిన అభ్యుదయ రైతు రామానుజం క్రాంతికిరణ్ ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన స్నేహితులు. ‘ప్రకృతి ఆధారిత వ్యవసాయం’ పేరిట రెండేళ్లుగా వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తూ రైతుల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైసూరుకు చెందిన అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలీ వద్దకు వెళ్లి సిరిధాన్యాల సాగులో జూన్‌లో శిక్షణ పొందివచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో సిరిధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారు. అధిక పెట్టుబడులకు అప్పులు చేసి పత్తి, వరి తదితర పంటలు సాగు చేయడానికి బదులు తక్కువ పెట్టుబడితో, అధిక లాభాలనిచ్చే సిరి«ధాన్య పంటలను సాగు చేయమని రైతులకు చెప్పడంతోపాటు.. ఈ నలుగురు మిత్రులు కూడా సాగు చేశారు. కౌలు భూమిలో సిరిధాన్యాలు పండిస్తున్న శ్యాం ప్రసాద్‌రెడ్డి, భాస్కర్, నర్సింహ, క్రాంతి చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఇరవై నాలుగు ఎకరాలలో, చౌటుప్పల్ మండలంలోని లక్కారంలో మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకొని సిరిధాన్యాల పంటలను ఈ ఏడాది జూలై ఆఖరులో విత్తారు. ఎర్ర నేల పదెకరాల్లో అండుకొర్రలు, ఏడెకరాల్లో ఊదలు, 6 ఎకరాల్లో కొర్రలు, 4 ఎకరాల్లో అరికెలు విత్తారు. మరో ఏడెకరాల నల్లరేగడి నేలలో సామలు విత్తారు. ఎర్త్‌మూవర్‌తో చదును చేయించి ట్రాక్టర్‌తో ఫ్లౌ, కల్టివేటర్ వేయించారు. ఎకరానికి సాధారణంగా 3 కిలోల వరకు ఈ సిరిధాన్య విత్తనాలను రైతులు చల్లుతూ ఉంటారు. అయితే, వీరు ఎకరానికి 4 కిలోల విత్తనాన్ని 3 రెట్లు ఇసుకలో కలిపి వెదజల్లారు. కొన్ని చోట్ల విత్తనం లోతుగా పడి మొలవలేదు. 70% విత్తనం మొలిచింది. తర్వాత 5 వారాల పాటు చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. మొదట్లో ఏపుగా పెరిగిన మొక్కలు తర్వాత వాడిపోవటం ప్రారంభమైంది. ఇక ఎండిపోతుందా అనుకున్న దశలో మంచి వర్షం పడింది. ఆశలు వదులుకున్న ఈ నలుగురు మిత్రులు చెలక వైపు వారం వరకు వెళ్లలేదు. తీరా వెళ్లి చూసే సరికి పంట తిప్పుకొని.. ఏపుగా పెరగటంతో ఆశ్చర్యపోయారు. తర్వాత కురిసిన ఒకటి, రెండు వర్షాలతో పంట బాగా ఎదిగింది. దీర్ఘకాలిక పంట అరిక తప్ప మిగతా 4 పంటలు కోతకు వచ్చాయి. వచ్చే వారంలో కోతలు కోయబోతున్నారు. ఈ సిరిధాన్యాల పంటలో కలుపు తీయటం గాని, ప్రత్యేకంగా ఎలాంటి పై మందులు, రసాయన/సేంద్రియ ఎరువులు వాడ లేదు. దుక్కి, విత్తనాల కొనుగోలు, విత్తనాలు చల్లే ఖర్చులు మినహా అదనపు ఖర్చులు చేయకపోవటం విశేషం. నూర్పిళ్ల తర్వాత సిరిధాన్యాల ధాన్యాన్ని పొట్టు తీసి బియ్యంగా, రవ్వగా, పిండిగా మార్చి నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ఈ నలుగురు యువ రైతులు సమాయత్తమవుతున్నారు. – ఎం. వేణు, సాక్షి, చిట్యాల, నల్లగొండ జిల్లా ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి మా గుండ్రాంపల్లి గ్రామ శివారులో ఉన్న భూములు గత 15∙ఏళ్ళుగా సాగునీరు లేక పడావు పడి ఉన్నాయి. అలాంటి భూమిని నలుగురు యువ రైతులం కౌలుకు తీసుకొని సిరిధాన్య పంటలు పండిస్తున్నాం. అంతా స్వయంగా పొలం పనులు చేస్తూ సిరిధాన్యాల విత్తనాలు చల్లాం. డబ్బు ఖర్చయ్యే ఎలాంటి రసాయన ఎరువులు, మందులు ఈ పంటలకు అసలు వాడలేదు. దీంతో మాకు ఖర్చు చాలా తగ్గిపోయింది. 5 వారాలు వర్షం లేకపోయినా, పడావు భూముల్లో పంటలు విజయవంతంగా పండించాం. విత్తనాలు వెదజల్లాం. అండుకొర్రలు, సామలు, ఊదలు బాగా పండాయి. ఎకరానికి ఐదారు క్వింటాళ్లు వస్తాయి. కొర్రలు, అరికలు 3–4 క్వింటాళ్లు వస్తాయి. పశువుల ఎరువు తోలుకొని, నాగలి సాళ్లకు వేసుకొని, అంతరసేద్యం చేసుకునే రైతులకు ఎకరానికి 7–8 క్వింటాళ్ల సిరిధాన్యాల దిగుబడి ఖాయంగా వస్తుందని నా నమ్మకం. విత్తనాలను ఉచితంగా ఇస్తాం. – మైల నర్సింహ (99492 59239), గుండ్రాంపల్లి, చౌటుప్పల్ మండలం, నల్లగొండ జిల్లా రెండున్నర నెలలు వర్షం లేకపోయినా.. లక్ష్మీనారాయణరెడ్డిది ఎస్. కొత్తపల్లి. అనంతపురం జిల్లాలో హిందుపూర్‌కు దగ్గర్లో ఉంటుంది. అటవీ కృషి పద్ధతిపై డాక్టర్ ఖాదర్ వలి గారి వద్ద శిక్షణ పొందిన తర్వాత మా పది ఎకరాలలో కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికెలను సాగు చేస్తున్నారు. మే, జూన్‌లో వర్షాలు పడిన తర్వాత జూన్‌లో 8 ఎకరాల్లో సిరిధాన్యాల విత్తనాలు వెదజల్లారు. జూన్ 4న నారు పోసి, జూన్ 24న 2 ఎకరాల్లో నీరు పెట్టి నాట్లు వేశారు. తర్వాత పూర్తిగా వర్షాధారంగానే సాగు చేశారు. జూలై, ఆగస్టులో చుక్క వర్షం కురవలేదు. సెప్టెంబర్ మూడో వారంలో, అక్టోబర్ మొదటి వారంలో రెండు వర్షాలు పడ్డాయి. అటవీ చైతన్య ద్రావణాన్ని పంటలపై 3 సార్లు పిచికారీ చేశారు. రెండున్నర నెలలకు పైగా వర్షం కురవకపోవడం వల్ల ఆ ప్రాంతంలో వర్షాధారంగా సాగవుతున్న సీజనల్ పంటలు ఎండిపోయాయి. కానీ, లక్ష్మీనారాయణరెడ్డి పొలంలో సిరిధాన్య పంటలు మాత్రం బెట్టను తట్టుకున్నాయి. పెరుగుదల మందగించిందే తప్ప పంట ఎండిపోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత రెండు వర్షాలు పడ్డాయి. వాడిపోయిన పంట ఆశ్చర్యకరంగా మళ్లీ పచ్చబడి, కంకులేసింది. ఒకటి, రెండు వారాల్లో కోతలు కోయబోతున్నారు. వరుసలుగా నాటిన అరికె పంట నాటిన పంటే బాగుంది! 5 రకాల సిరిధాన్యాల్లో ఊదలు, అండుకొర్ర, అరికె పంటలు బాగా పెరిగాయి. కొర్ర బాగానే వచ్చింది కానీ పక్షులు పూర్తిగా తినేశాయి. మాకేమీ మిగల్చలేదు. సామలు సరిగ్గా పెరగలేదు. వెదజల్లిన పంటల కన్నా నాట్లు వేసిన పంట బాగుంది. నాటిన అరికెల దుబ్బుకు 30కి పైగా పిలకలు ఉన్నాయి. ఊద, కొర్రలో 10–15 పిలకలు వచ్చాయి. అండుకొర్ర కూడా చాలా పిలకలు వచ్చాయి. సాధారణంగా రాగులు వేస్తుంటాం. రాగి అయితే ఎండిపోయి ఉండేది. అంతకన్నా తక్కువ నీటితోనే పండేవి కాబట్టే కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ పంటలు రెండున్నర నెలలు ఎండిపోకుండా బతికి ఉన్నాయి. నెలకో వర్షం పడినా ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేవి. ఇప్పుడు ఎకరానికి 3 క్వింటాళ్ల వరకు రావచ్చనుకుంటున్నాం. ఇంతటి కరువులోనూ మాకు దక్కిన ఆ పాటి సిరిధాన్యాలే మాకు మహాప్రసాదం వంటివి. రైతులంతా ఈ పంటలు పండించుకోవాలి. – ఎస్. లక్ష్మీనారాయణరెడ్డి(99017 30600), ఎస్.కొత్తపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా ఖరీఫ్‌లో ఒకటే వర్షం కురిసినా ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి అటవీ చైతన్య ద్రావణంతో కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు వంటి సిరిధాన్యాలను ఈ ఖరీఫ్‌లో 40 ఎకరాల్లో సాగు చేశాం. మా దగ్గర ఒకే వర్షం పడింది. మా చుట్టు పక్కల ఇతర పంటలు ఎండిపోయాయి. మా పొలంలో సిరిధాన్యాల పంటలు బెట్టను తట్టుకొని నిలబడ్డాయి. పంట కోతకు వచ్చింది. వచ్చే వారం కోస్తాం. ఎకరానికి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇంకో రెండు, మూడు వర్షాలు పడి ఉంటే ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. మహబూబ్‌నగర్‌లో ఒక్క వర్షంతోనే పెరుగుతున్న సిరిధాన్య పంటలు; – బసవరాజ్ (93466 94156), గొరిట, నాగర్‌కర్నూల్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా 7.5 క్వింటాళ్ల దిగుబడి గుంటూరు జిల్లా పుల్లడిగుంట వద్ద కొర్నెపాడులో రైతు శిక్షణా కేంద్రం వద్ద నల్ల రేగడి భూమిలో 10 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్యాలను సాగు చేశాం. నేలలో ఘనజీవామృతం వేశాం. ఒకటి రెండు సార్లు జీవామృతం పిచికారీ చేశాం. వర్షాధారంగానే సాగు చేశాం. ఇటీవల సామలు నూర్చాం. ఎకరానికి 7.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొర్రలు, ఊదల కంకులు ఔరా అనిపించేంతగా చాలా పెద్దగా పెరిగాయి. ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. మెట్ట రైతులకు సిరిధాన్య పంటలు వరప్రసాదాలే. అందుకే రైతులకూ శిక్షణ ఇస్తున్నాం. – యడ్లపల్లి వెంకటేశ్వరరావు (9849005182), అధ్యక్షుడు, రైతునేస్తం ఫౌండేషన్ కొర్నెపాడులోని తన పొలంలో డా. ఖాదర్‌తో యడ్లపల్లి వెంకటేశ్వరరావు నీటి వసతి ఉన్న భూముల్లోనూ సిరిధాన్యాలను సాగు చేయవచ్చు వర్షాధారంగా వ్యవసాయం చేసే మెట్ట ప్రాంత భూములతోపాటు.. సాగు నీటి సదుపాయం ఉన్న ఆయకట్టు భూముల్లో కూడా సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. నాలుగు వర్షాలు పడితే చాలు. వర్షాల మధ్య ఎక్కువ రోజులు ఎడం వచ్చినప్పటికీ తట్టుకొని బతికి మంచి దిగుబడిని అందిస్తాయి. నీటి వసతి ఉన్న భూముల్లోనూ పండుతాయి. ఏడాది పొడవునా వర్షాలు కురిసే ప్రాంతాల్లో సైతం సామలు వంటి సిరిధాన్యాలు పండుతాయి. ఎర్ర నేలలు, రాళ్ల నేలలు, నల్ల నేలల్లోనూ పండుతాయి. – డాక్టర్ ఖాదర్ వలీ, అటవీ కృషి నిపుణులు, మైసూరు మిక్సీలతోనే సిరిధాన్యాల పొట్టు తీయిస్తాం చాలా ఏళ్లుగా పడావుగా ఉన్న 30 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్య పంటలను సాగు చేశాం. డా. ఖాదర్ వలి గారి వద్ద నుంచి తెచ్చిన అటవీ చైతన్య ద్రావణాన్ని రెండుసార్లు పిచికారీ చేశాం. ఇసుకలో కలిపి విత్తనం చల్లాం. కొన్ని చోట్ల పంట పల్చగా వచ్చింది. పల్చగా మొలిచిన చోట్ల కలుపు పెరిగి, పంట సరిగ్గా ఎదగలేదు. వత్తుగా మొలిచిన చోట్ల పంట బాగానే వచ్చింది. ఈ వారంలో నూర్పిడి చేయబోతున్నాం. నూర్చిన సిరిధాన్యాలను బుచ్చి పద్ధతిలో మిక్సీలతోనే శుద్ధి చేసి పొట్టు తీసి.. వినియోగదారులకు అందించాలన్నది మా ఆలోచన. సిరిధాన్యాల సాగుపై సదస్సు నిర్వహించాం. అటవీ చైతన్య ద్రావణాన్ని చాలా మంది రైతులకు ఇచ్చాం. వచ్చే ఏడాదికి సిరిధాన్యాలు సాగు చేసే చాలా మంది రైతులకు ఈ ద్రావణాన్ని, విత్తనాలను అందిస్తాం. – దత్తా శంకర్ (86398 96343), ధ్యానహిత, షాబాద్, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సిరిధాన్య పంటలో దత్తా -
చివరికి కష్టమే!
కోయిల్‌సాగర్ డీ– 16 కాల్వ కింద సాగు చేసిన వరికి సాగునీరు లేకపోవడంతో నిట్ట నిలువునా పంటలు ఎండుతున్నాయి. బిల్లుల మంజూరు నిర్లక్ష్యం కావడం మూలంగా కాల్వ ఆధునికీకరణ పనులు ఆలస్యం కావ డంతో ఆయకట్టు కింద ఉన్న బోర్లలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పనులు నిలిపి వేసి ఎండుతున్న పొలాలకు నీరు వదిలి జీవం పోయాలని రైతులు కోరుతున్నారు. డీ–16 కాల్వపనులు సాగకపోవడంతో ఆదిలోనే రైతులకు గోస పట్టుకుంది. మరికల్ : కోయిల్‌సాగర్ డీ– 16 కాల్వ కింద 1100 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని ఆధునీకరణ చేసేందుకు ప్రభుత్వం రూ.4.60 కోట్లను మంజూరు చేసింది. 6నెల్లల క్రితమే ఈ పనులు ప్రారంభం కావడం జరిగింది. కాల్వ వెడల్పు పనులు పూర్తి కావచ్చాయి. బిల్లుల అల స్యం కారణంగా వంతెనలు, అండర్‌టర్నల్ పనులు ముందుకు సాగడం లేదు. బోర్లలో తగ్గుతున్న నీటి మట్టం డీ–16 కాల్వకు కోయిల్‌సాగర్ నీరు విడుదల కాకపొవడంతో కాల్వ కింద ఉన్న వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పూర్తిగా పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. పనులు పూర్తి చేసిన వరకైనా నీటిని వదిలితే బోర్లలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేసు ్తన్నారు. పనుల నత్తనడకన సాగుతుండటంతో మరో ఎడాది పట్టెటాట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం కాల్వ వెడల్పు పనులు మినహా మిగిత పనులు తూములు, వంతేనాలు, అండర్ టర్నల్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూరైన తర్వా తనే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. బిల్లుల అలస్యం కారణంగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు తంటలు పండుతున్నాడు. నత్తనడకన పనులు డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసి డీ–16 కాల్వకు నీరు వదులుతామని చేప్పిన అధికారులు మాట తప్పారు. దీంతో ఈ కాల్వ కింద సాగు చేసుకున్న వరిపంటలు నీళ్లులేక వందలాది ఎకరాలో వరిపంట ఎండుతుంది. ఇటీవల కాల్వ పనులను పరిశీలించడానికి వచ్చిన అధికారులను డీ–16 రెండవ తూమ్ వరకు నీరు వదాలారు. అక్కడి వరకే నీరు రావడంతో కొంత వరకు పంటలు ఉపిరిపిల్చుకున్నాయి. మిగిత తూమ్‌ల కింద పనులు కొనసాగుతుండటంతో సాగునీరు అందడం లేదు. దీంతో అక్కడి పంటల పరిస్థితి చూస్తే కర్షకులకు కనీళ్లు తెపిస్తున్నాయి. డీ–16 కాల్వకు నీరు వదలాలి డీ–16 కాల్వ పనులు ఇపట్లో పూర్తి కావు. ఎండిన పంటలను దృష్టిలో ఉంచుకొని రెండు తడుల నీటిని విడుదల చేస్తే పంటలను కాపాడకునే అకాశంతో పాటు బోర్లను కాపడుకున్నే అవకాశం ఉంది. అధికారులు నీళ్లు వదాలకుంటే ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి దారిస్తుంది. – ఆంజనేయులు, రైతు, తీలేర్ ముందే చెప్పాం డీ– 16 కాల్వ అధునీకరణ పనుల నిమిత్తం ఈ ఆయకట్టు కింద రైతులు ఎవరూ కూడా పంటలను సాగు చేసుకోవద్దాని ముందే చెప్పాం. అయినా కొందరు రైతులు వరిపంటలను సాగు చేసుకున్నారు. వీలైనంత వరకు కాల్వ పనులు పూర్తి చేసిన వరకు ఎండిన పంటలకు నీరు వదిలేందుకు చర్యలు తీసుకుంటాం. – భూపాల్‌రెడ్డి, కోయిల్‌సాగర్, ప్రాజెక్టు ఈఈ -
రైతులకు వరం ఆపరేషన్ గ్రీన్
హన్వాడ : ప్రధాన ఆహార పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. మార్కెట్లో ధర తగ్గిన సమయంలో అన్నదాతలు పండించిన పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కాని రైతులు ప్రధానంగా సాగుచేసే కూరగాయ పంటలైన ఉల్లి, టమాటలకు మాత్రం ఒక్కోసారి ధరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎక్కువగా ధరల్లో హెచ్చు తగ్గులుండే ఈ పంటలకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వీటిని మద్దతు ధరలో చేర్చింది. మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు మధ్య వ్యత్యాసం ఉండి రైతులు నష్టపోతున్న సందర్భంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుంది. మద్దతు ధర కన్నా దిగువ స్థాయికి మార్కెట్లో ధరపడిపోయినప్పుడు ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటల ధరల్లో హెచ్చుతగ్గుల సమస్యల పరిష్కారానికి ఇటీవలే తమ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టమాట, ఉల్లి సాగు చేసిన రైతులకు ఇక ఢోకా ఉండదు. కూరగాయ తోటలే.. హన్వాడ మండల కేంద్రంతోపాటు పెద్దర్పల్లి, కొత్తపేట, టంకర, దాచక్‌పల్లి, సల్లోనిపల్లి, గుడిమల్కాపూర్, కొనగట్టుపల్లి, నాయినోనిపల్లి తదితర గ్రామాల్లో అత్యధికంగా కూరగాయల పంటలే సాగు చేస్తారు. అయితే ఆయా గ్రామాల్లో ఎక్కువగా ఉల్లి, టమాట పంటలు సాగుచేసి గతంలో చాలామంది రైతులు నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. దీంతో సాగుచేసిన ప్రతిసారి ఏదో ఓసారి నష్టాలబారిన పడాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆపరేషన్ గ్రీన్’ పథకం ఆయా పంటల రైతులకు ఇక వరంగా మారనుంది. ఇక మండలంలో మరిన్ని గ్రామాల్లో సైతం వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు మేలుచేసే ఈ పథకంతో చాలామంది అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయా.. ఇటీవల టమాట సాగుచేసి మార్కెట్లో ధరలు రాక తీవ్రంగా నష్టపోయాను. ఉల్లి, టమాట పంటలకు సరైన ధర రాక వృథాగా పారబోశాను. పెళ్లిళ్లు, పండగల సీజన్లకు ముందుగా అందరూ ఇదే పంటల సాగుపై దృష్టిసారించడంతో ఈ సమస్య తలెత్తేది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి, టమాటపై మద్దతు ధర ప్రకటించడం సంతోషంగా ఉంది. – నర్సింహులు, రైతు, హన్వాడ -
బీడు.. ఆయకట్టు గోడు!
కొల్లాపూర్‌రూరల్ : కేఎల్ఐ నుంచి సాగునీరు సరఫరా కాకపోవడంతో మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చెరువులన్నీ వట్టిపోయాయి. చెరువుల కింద ఉన్న వేల ఎకరాల్లో ఆయకట్టు పొలాలు బీడువారాయి. సుదూర ప్రాంతాలకు ఇక్కడి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించటానికి నీటిని సరఫరా చేస్తున్నా... ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్న మండల పరిధిలోని చెరువులకు సాగునీరు లేక వట్టిపోయాయి. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి కేఎల్ఐ అధికారులకు, ప్రభుత్వానికి చెరువులకు సాగునీరు విడుదల చేయాలని విన్నవించినా ఫలితం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వలసబాటలో రైతులు మండల పరిధిలోని జావాయిపల్లి చెరువు, ఎన్మన్‌బెట్ల గ్రామంలోని వీరమనాయుని చెరువు, కుడికిళ్ల గ్రామంలోని ఊర చెరువు, పట్టణంలోని కావలోనికుంట, మొలచింతలపల్లి గ్రామంలోని జిల్దార్తిప్ప చెరువులకు నేటి వరకు కేఎల్ఐ నుంచి సాగునీరు సరఫరా కావడం లేదు. ఈ చెరువుల కింద వేల ఎకరాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుదూర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. సాగునీరు విడుదల చేయాలి మండలంలోని జావాయిపల్లి చెరువుకు కేఎల్ఐ నుంచి సాగునీరు విడుదల చేయాలి. సింగోటం రిజర్వాయర్‌కు అతి సమీ పంలో జావాయిపల్లి చెరువు ఉంది. రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని కొన్నేళ్లుగా విన్నపాలు చేస్తున్నాం. నేటికీ నీటి సరఫరా లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – స్వామి,జావాయిపల్లి రైతు ఉద్యమాలు చేసినా ఫలితం లేదు గ్రామంలోని వీరమనాయుని చెరువుకు కేఎల్ఐ నుంచి సాగునీరు విడుదల చేయాలని గ్రామ రైతులతో కలిసి ఉద్యమాలు చేశాం. నేటి వరకు ఫలితం లేదు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా ఎన్నోసార్లు తెచ్చాం. ఎన్మన్‌బెట్లలోని వీరమనాయుని చెరువుకు సాగునీరు లేక వందల ఎకరాల్లో ఆయకట్టు బీడువారింది. – సాయిరాం, ఎన్మన్‌బెట్ల వార్డుమెంబర్ -
పక్షులు.. పంటలకు ఆప్తమిత్రులు!
పక్షులు..! పంటలకు మిత్రులా? శత్రువులా?? పక్షుల పేరు వినగానే పంటలకు కీడు చేస్తాయన్న భావనే సాధారణంగా చాలా మంది రైతుల మదిలో మెదులుతుంది... కానీ, నిజానికి పంటలను కనిపెట్టుకొని ఉంటూ పురుగులను ఎప్పటికప్పుడు ఏరుకు తింటూ ఎంతో మేలు చేసే పక్షి జాతులు వందలాదిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటూ ఉంటే.. ఏదో చెబుతుంటారు.. కానీ, ఈ కలికాలంలో ఇవన్నీ రైతులు ఆధారపడదగినవి కాదేమోనని అనిపిస్తుంటుంది. అయితే, యువరైతు సురేశ్‌రెడ్డి మాత్రం మిత్ర పక్షుల వల్ల పంటలకు ఎంతో మేలు జరుగుతున్న మాట ముమ్మాటికీ నిజమేనని అనుభవపూర్వకంగా చెబుతున్నారు! తన పొలంలో కొంగలు, కాకులు, నీటికోళ్లు, బండారి గాళ్లు (గిజిగాళ్లు) వంటి మిత్ర పక్షులు పురుగులను ఏరుకు తింటూ పంటలను చాలా వరకు చీడపీడల నుంచి కాపాడుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు. మిత్ర పక్షులు మన పొలాలకు రావాలంటే.. పొలం గట్ల మీద, పరిసరాల్లో చెట్లను పెరగనివ్వాలని.. వాటిపైనే మిత్రపక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకొని మన పంటలకు అనుక్షణం కాపలా కాస్తున్నాయని కృతజ్ఞతాపూర్వకంగా చెబుతున్నారు. గత 20 ఏళ్లుగా తాము ఒక్క చెట్టునూ నరకలేదని సురేశ్‌రెడ్డి గర్వంగా చెబుతున్నారు. పక్షులు, జంతువుల ద్వారా పంటలకు కలిగే లాభనష్టాలపై, పంట నష్టాలను అధిగమించే ఉపాయాలపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సారధ్యంలో దీర్ఘకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. డా.వాసుదేవరావు సూచనలు, సలహాలను సురేశ్‌రెడ్డి గత ఐదారేళ్లుగా శ్రద్ధగా పాటిస్తూ.. పంటల సాగులో మిత్ర పక్షుల సహాయంతో చీడపీడలను సులువుగా జయిస్తుండటం విశేషం. మహారాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి పంటపై అతి ప్రమాదకరమైన పురుగుల మందులను చల్లుతూ ఇటీవల 18 మంది రైతులు, రైతు కూలీలు చనిపోగా 400 మంది ఆసుపత్రులపాలయ్యారు. ఈ నేపథ్యంలో చీడపీడల బారి నుంచి పంటలను కాపాడటంలో పురుగుమందులే కాదు మిత్ర పక్షులు కూడా ఎంత సమర్థవంతంగా ఉపకరిస్తాయో తెలియజెప్పే శాస్త్రీయ పరిశోధనలు, అనుభవాలపై ప్రత్యేక సమగ్ర కథనం ‘సాక్షి సాగుబడి’ పాఠకుల కోసం.. పొలాల్లో పురుగులను పక్షులతో ఏరించవచ్చు! ► పొలాల్లో పురుగులను ఏరుకు తిని పంటలకు మేలు చేసే పక్షులు 420 జాతులున్నాయి. ► పత్తి తదితర పంటల్లో శనగపచ్చ పురుగులు, పొగాకు లద్దెపురుగులను పక్షులు ఇష్టంగా తింటాయి ► మిత్ర పక్షులను సంరక్షిస్తే పురుగుమందుల అవసరాన్ని మూడొంతులు తగ్గించవచ్చు ► ‘సాగుబడి’ ఇంటర్వ్యూలో ముఖ్య శాస్త్రవేత్త డా. వాసుదేవరావు మన దేశంలో 1300 పక్షి జాతులుంటే.. 483 జాతుల పక్షులకు వ్యవసాయ పంటలతో సంబంధం ఉంది. 420 జాతుల పక్షులు రైతు నేస్తాలు. పొలాల్లోని పురుగులు మాత్రం తిని బతుకుతూ రైతులకు ఇవి ఎనలేని మేలు చేస్తున్నాయి. పండ్లు, గింజలు తినే 63 జాతుల పక్షులు పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఈ పక్షులు, అడవి పందులు, కోతులు తదితర జంతువుల (ఎలుకలు మినహా) వల్ల దేశవ్యాప్తంగా పంటలకు తీరని నష్టం జరుగుతున్నది. అడవులు, పొలాల దగ్గర చెట్ల సంఖ్య తగ్గిపోతున్నకొద్దీ వీటి బెడద పెరుగుతున్నది. వీటిని చంపడానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం అంగీకరించదు. కాబట్టి, పంటలను వీటి నుంచి కాపాడుకునే ఉపాయాలపై పరిశోధనలు చేయడానికి దేశవ్యాప్తంగా 17 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ‘అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం’ ఏర్పాటైంది. ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న విభాగానికి ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు అధిపతిగా పనిచేస్తున్నారు. ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పంటలకు హాని చేసే పక్షులను, అడవి పందులను పారదోలడానికి ఆయన కనిపెట్టిన యంత్రానికి పేటెంట్ రావటం విశేషం. ఆయన సారథ్యంలో పక్షులపై 17 ఏళ్లుగా, అడవి పందులపై ఐదేళ్లుగా, రెండేళ్లుగా కోతులపై జరుగుతున్న పరిశోధనలు రైతుల శ్రేయస్సుకు దోహదపడుతున్నాయి. ‘సాక్షి సాగుబడి’కి డా. వాసుదేవరావు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. పక్షులు, జంతువులకు క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటాయి. ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే సంపాదించుకొని ఎంత అవసరమో అంతే తింటాయి. పక్షుల్లో కొన్ని జాతులు పురుగులు మాత్రమే తింటాయి. మరికొన్ని జాతులు గింజలను తింటాయి. రామచిలుకలు స్వతహాగా పండ్లు తింటాయి. అడవుల నరికివేతతో పాటు రోడ్ల విస్తరణ వల్ల పండ్ల చెట్లు తగ్గిపోవటంతో రామచిలుకలు గింజలు తింటున్నాయి. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను పురుగుమందుల పిచికారీ ద్వారానే కాదు మిత్ర పక్షుల ద్వారా కూడా అరికట్టవచ్చు. పత్తి, వేరుశనగ, శనగ, కంది, మినుము, పొద్దుతిరుగుడు తదితర పంటలకు నష్టం చేస్తుంది. పొలాల్లో శనగపచ్చపురుగు, పొగాకు లద్దె పురుగులను ఇష్టంగా తినే పక్షులు మన దేశంలో 420 రకాల జాతులు ఉన్నాయి. వేరుశనగ పొలంలో ఒక కొంగ 20 నిమిషాల్లో సుమారు 50 పురుగులను తింటుంది. శనగ పంటలో శనగపచ్చ పురుగును సముద్ర కాకులు ఏరుకు తిని పురుగుల ఉధృతిని 73% వరకు తగ్గిస్తాయి. పంటల సాళ్ల మధ్య అడుగున్నర దూరం ఉన్న పొలాల్లో కన్నా.. 2 అడుగుల దూరం ఉన్న పొలాల్లో పక్షులు స్వేచ్ఛగా తిరుగుతూ పురుగులను ఏరుకు తింటాయి. మిత్ర పక్షుల్లో తెల్లకొంగలు చాలా ముఖ్యమైనవి. వర్షాలు పడి పొలాలు దున్నుతున్నప్పుడు బయటపడే వేరుపురుగులను, లార్వా దశలో ఉన్న పురుగులను 73% వరకు కొంగలు తినేస్తాయి. మే,జూన్ నెలల్లో చెట్లపై స్థావరాలను ఏర్పాటు చేసుకొని దుక్కుల సమయంలో సంతానోత్పత్తి చేస్తాయి. తెల్ల కొంగలు.. వర్షాల రాకను ముందే పసిగట్టగలవు! ఒకటి, రెండు నెలలు ముందుగానే వర్షాల రాకను తెల్లకొంగలు గ్రహించి, తదనుగుణంగా గుడ్లు పెట్టడానికి సమాయత్తమవుతాయి. వర్షాలు ఆలస్యమౌతాయనుకుంటే.. సంతానోత్పత్తి షెడ్యూల్‌ను ఆ మేరకు వాయిదా వేసుకుంటాయి. పిల్లలను పొదిగే దశలో తెల్లకొంగల మెడ భాగం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని బట్టి వర్షం రాకను తెలుసుకోవచ్చు. వర్ష సూచిక జాతిగా కొంగలు గుర్తింపు పొందాయి. పొలాలు దున్నుతున్నప్పుడు, పశువులు నడుస్తున్నప్పుడు బయటపడే వేరుపురుగులను కొంగలు తింటాయి.ఒక్కో పిల్లకు రోజుకు 16 గ్రాముల చొప్పున.. 3 పిల్లలకు కలిపి 45 గ్రాముల వేరుపురుగులను ఆహారంగా అందిస్తాయి. ఒక చెట్టుంటే.. వందలాది కొంగల గూళ్లుంటాయి. దీన్నిబట్టి పంటలకు ఎంత మేలు చేస్తున్నాయో గుర్తించవచ్చు. వీటి ఆహారంలో 60% పురుగులు, 10% కప్పలు, 5% చిన్నపాములు, చేపలు ఉంటాయి. తెల్లకొంగలు పొలాల్లో చెట్ల మీదకన్నా మనుషుల ఇళ్లకు దగ్గర్లోని చెట్లపైనే ఎక్కువ గూళ్లు పెట్టుకుంటాయి. మనుషులకు దగ్గర్లో ఉంటే శత్రువుల నుంచి రక్షణ దొరుకుతుందని భావిస్తాయి. కానీ, కొంగలు రెట్టలు వేస్తున్నాయని, నీసు వాసన వస్తున్నదని మనం మూర్ఖంగా చెట్లు కొట్టేస్తున్నాం. పంటలపై చీడపీడలు పెరగడానికి ఇదొక ముఖ్య కారణం. పొలాల దగ్గర్లో, గట్ల మీద పూలు, పండ్ల చెట్లను పెంచితే వాటిపై స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ పక్షులు పురుగులను తింటూ పంటలను కాపాడతాయి. కానీ, మన పొలాల్లో, గట్లపై చెట్లను 95% వరకు నరికేశాం. చెట్లుంటే పక్షులు వాలి పెంటికలు వేస్తాయి. వర్షం పడినప్పుడు నీసు వాసన వస్తుంది.ఇది తెలియక మనుషులు ఇళ్ల దగ్గర, ఊళ్లో, పొలాల గట్ల మీద ఉన్న చెట్లను నరికేస్తున్నారు. తెల్ల కొంగలు ఊళ్లో చెట్ల మీదే ఎక్కువగా గూళ్లు పెట్టి.. కిలోమీటర్ల దూరంలోని పొలాలకు వెళ్లి పురుగులను తింటాయి. పక్షుల విసర్జితాలు భూసారాన్ని సహజసిద్ధంగా పెంపొందించడానికి దోహదపడతాయి. పంటల్లో పురుగులు ఏరుకొని తినే మిత్ర పక్షులను ఆహ్వానించాలనుకుంటే పొలాల గట్లపైన, పరిసరాల్లో చెట్లు పెంచాలి. పంట పొలాల మధ్య ‘టి’ ఆకారంలో పంగల కర్రలు లేదా పక్షి స్థావరాలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలి. పంట ఎంత ఎత్తుకు ఎదుగుతుందో దానికన్నా అడుగు ఎత్తున ఈ పంగల కర్రలు ఉండాలి. పురుగులు పంట పూత దశలో వస్తాయి. అప్పుడు పంగల కర్రలను ఏర్పాటు చేయాలి. ఎన్.పి.వి. (న్యూక్లియో పాలీ హైడ్రో ద్రావణం) ద్రావణాన్ని హెక్టారుకు 250 ఎల్.ఈ. మోతాదులో పురుగు వచ్చిన తొలిదశ(మొక్కకు 2,3 పురుగులు కనిపించినప్పుడు)లో పిచికారీ చేయాలి. ఈ రెండు పనులూ చేస్తే పురుగుమందుల వాడకాన్ని 75% తగ్గించుకోవచ్చు. శత్రు పక్షుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలు! పొలాల్లో పురుగులు ఏరుకు తిని బతికే పక్షుల వల్ల పంటలకు మేలు జరుగుతుండగా.. పంటలపై దాడి చేసి కంకుల్లో గింజలను, కాయలను తినేసే 63 రకాల పక్షుల వల్ల రైతుకు నష్టం జరుగుతున్నది. పూల నుంచి మకరందాన్ని, పండ్లను, గింజలను తిని బతికే పక్షులు ఇవి. వీటి నుంచి పంటలను కాపాడుకోవడానికి అనేక ఉపాయాలను డా. వాసుదేవరావు రైతులకు సూచిస్తున్నారు. ► మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, చిరుధాన్య పంటలకు పక్షుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది. వీటిని ప్రధాన పంటలుగా ఎకరంలో సాగు చేస్తే పక్షుల వల్ల దిగుబడి నష్టం 80–90 శాతం ఉంటుంది. అయితే, ఒకే చోట కనీసం 20 ఎకరాల్లో ఈ పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తే నష్టం 5% కన్నా తక్కువగానే ఉంటుంది. ఈ పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులు అనేక ఉపాయాల ద్వారా పంటను రక్షించుకునే తక్షణ, దీర్ఘకాలిక మార్గాలున్నాయి. ► రామచిలుకలు, గోరింకలు, కాకులు, జీలువాయిలు, పిచుకలు, గిజిగాళ్లు.. తదితర జాతుల పక్షుల వల్ల పంటలకు నష్టం జరుగుతున్నది. పూల చెట్లు, పండ్ల చెట్లను నరికేయడం వల్ల ఈ పక్షులు పంటల మీదకు వస్తున్నాయి. ► ఒక ప్రాంతంలో 250–300 పక్షులు ఉంటాయి. 15–20 కిలోమీటర్ల పరిధిలో పంటలపైనే ఇవి వాలతాయి. ఆ పరిధిలోకి ఇతర పక్షులు రావు. ఆహారం దొరక్కపోతే వెళ్లిపోతాయి. సంతతి బాగా పెరిగినప్పుడు దూరంగా వలస వెళ్లిపోతాయి. ► పంటలను నష్టపరిచే జాతుల పక్షులు ఎక్కువగా ఏయే జాతుల చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయో గత 3,4 ఏళ్లుగా డా. వాసుదేవరావు సారధ్యంలో అధ్యయనం జరిగింది. 12 పూలజాతి చెట్లు, 11 పండ్ల జాతి చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీటిలో వీలైన కొన్ని జాతుల చెట్లను పొలం గట్లపై నాటితే.. పంటలను నష్టపరిచే పక్షుల దష్టిని మళ్లించి పంటలను కాపాడుకోవచ్చు. ► పొలాలకు దగ్గర్లో హెక్టారుకు పూల జాతి చెట్లు 4, పండ్ల జాతి చెట్లు 4 పెంచితే పక్షులు వీటిపై ఆధారపడి బతుకుతాయి. పంటల జోలికి రావు. ► పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పూల జాతి చెట్లు: కాడమల్లి, రేల, అడవి బూరుగ, చెట్టు తంగేడు, నిద్రగన్నేరు, మోదుగ, అడవి గానుగ, దేవకాంచనం, కారక, ఆకుపాల, ఇప్ప, సీమగానుగ... ► పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పండ్ల జాతి చెట్లు: నేరేడు, రావి, మర్రి, చీమచింత, చింత, ఈత, పరిగి, రేగు, చెక్కర చెట్టు, నక్కెర, మేడి... పేపర్ ప్లేట్ల పద్ధతి ► పొద్దు తిరుగుడు గింజలు పాలుపోసుకునే దశలో అల్యూమినియం ఫాయిల్ పూతపూసిన పేపర్ పేట్లను పొద్దుతిరుగుడు పువ్వుల అడుగున అమర్చితే రామచిలుకల దాడి నుంచి 69% పంటను రక్షించుకోవచ్చు. మొక్కజొన్నకు ఆకుచుట్టు రక్షణ! ► మొక్కజొన్న పంట పాలు పోసుకునే దశలో కంకి చుట్టూ చుట్టి పక్షుల దష్టిని మరల్చవచ్చు. ► పొలం గట్ల నుంచి 3 లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దష్టిని మరల్చి పంటలను రక్షించుకోవచ్చు. ► తక్కువ విస్తీర్ణంలో పంట వేసిన రైతులకు ఇది అనువైన పద్ధతి. రక్షక పంట పద్ధతి ► రామచిలుకలు సాధారణంగా మొక్కజొన్న పంటకు గట్టు పక్కన మొదటి వరుసపై దాడి చేస్తాయి. ► జొన్న లేదా మొక్కజొన్న మొక్కలను గట్ల పక్కన వరుసలో రెట్టింపు ఒత్తుగా వేయడం (స్క్రీన్ క్రాప్) ద్వారా పక్షులను పంట లోపలికి చొరబడకుండా అడ్డుకోవచ్చు కోడి గుడ్ల ద్రావణం పిచికారీ ► పొద్దుతిరుగుడు పంటలో గింజ పాలుపోసుకునే దశలో 20 మి.లీ. కోడిగుడ్ల ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పూలపై పిచికారీ చేయాలి. పక్షుల వల్ల కలిగే నష్టాన్ని 82% వరకు తగ్గించుకోవచ్చని రుజువైంది. ► విత్తనోత్పత్తి క్షేత్రాలలో నైలాన్ వలలను పంటపైన కప్పటం ద్వారా పక్షుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు. నెమళ్ల నుంచి పంటలను కాపాడుకునేదిలా.. ► పొలంలో వేసిన విత్తనాలను నెమళ్లు తినేస్తుంటాయి. ఒక వైపు ఎరుపు, మరోవైపు తెలుపు రంగులో ఉండే రిబ్బన్లను విత్తనాలు వేసిన పొలంలో అడుగు ఎత్తులో కడితే విత్తనాలను నెమళ్ల నుంచి కాపాడుకోవచ్చు. మొలక వచ్చే వరకు 10 రోజులు ఉంచి రిబ్బన్లను తీసేయవచ్చు. ► పంట పొలాల్లోకి నెమళ్లు రాకుండా పొలం చుట్టూ 3 నిలువు వరుసలుగా కొబ్బరి తాళ్లతో కంచె మాదిరిగా కట్టాలి. పై తాడుకు కింది తాడుకు మధ్య అడుగు దూరం ఉండాలి. దాని నుంచి నెమలి లోపలికి వెళ్లలేదు. వేప గింజల ద్రావణం పిచికారీ పద్ధతి ► వేప గింజల ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా పంటలను పక్షులు తినకుండా కాపాడుకోవచ్చు. ► లీటరు నీటికి 200 మి. లీ. వేప గింజల ద్రావణాన్ని కలిపి పంటలు గింజ పాలుపోసుకునే దశలో పిచికారీ చేయాలి. పక్షులు వేప గింజల ద్రావణం రుచి సహించక వెళ్లిపోతాయి. ► వేప గింజల ద్రావణం లేక పొగాకు కషాయాన్ని లీటరు నీటికి 10 మి.లీ. కలిపి పిచికారీ చేసి పక్షుల బెడదను నివారించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ పంటల్లో ఇది బాగా పనిచేసింది. (అడవి పందులు, కోతుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలపై కథనం వచ్చే వారం ‘సాగుబడి’ పేజీ చూడండి) పక్షులు నడిచిన పొలాల్లో పురుగులు మిగలవు! ► మా పొలాల్లో వందల చెట్లున్నాయి..20 ఏళ్లలో ఒక్క చెట్టూ కొట్టలేదు ► పంటలకు పురుగుమందుల అవసరం పెద్దగా లేదు ► ‘సాక్షి సాగుబడి’తో ఆదర్శ రైతు సురేశ్‌రెడ్డి పొలాల గట్లపైన, పరిసరాల్లో అనేక జాతుల చెట్లను, వాటిపైన గూళ్లు పెట్టుకున్న మిత్ర పక్షులను సంరక్షించుకుంటూ సమీకృత వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు చింతపల్లి సురేశ్ రెడ్డి (39). ఆయన స్వగ్రామం గడ్డమల్లాయిగూడెం. ఆ ఊరు హైదరాబాద్‌కు దగ్గర్లో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంది. ఐదారు బర్రెలున్నాయి. ఒకటిన్నర ఎకరాల్లో వరి, ఎనిమిదెకరాల్లో రాగులు, సజ్జలు, ఉలవలు, కందులు వంటి ఆహార పంటలనే వేస్తున్నారు. వేసవిలో ఆకుకూరలు సాగు చేస్తారు. అధిక పెట్టుబడులు, అనుక్షణం టెన్షన్ పడటం ఎందుకని పత్తి జోలికి వెళ్లటం లేదన్నారు. వరి పొలం గట్ల మీద, చెల్క మధ్యలో కూడా చెట్లను పెరగనివ్వటం సురేశ్‌రెడ్డి ప్రత్యేకత. వంద వరకు వేపచెట్లు, 50 వరకు నల్లతుమ్మ, ఊడుగు తదితర జాతుల చెట్లు ఆయన పొలాల్లో ఉన్నాయి. ఇవన్నీ పడి మొలిచినవేనని అంటూ.. పనిగట్టుకొని మొక్కలు నాటక్కర లేదని, ఉన్న వాటిని నరక్కుండా ఉంటే చాలంటారాయన. గత 20 ఏళ్లలో ఒక్క చెట్టునూ తమ పొలాల్లో కొట్టలేదని గర్వంగా చెబుతున్నారు. గట్ల మీద చెట్లుంటే పంటకు ఇబ్బందేమీ లేదని, వేసవిలో నీడలో పెరిగే కొత్తిమీర వంటి పంటలకు చెట్ల నీడ ఉపయోగపడుతుందంటున్నారు. చెట్లు ఉండటం వల్ల తమ పొలాల్లోకి అనేక రకాల మిత్ర పక్షులు వచ్చి పురుగులను తింటూ పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయంటున్నారు సురేశ్‌రెడ్డి. గత ఐదారేళ్లుగా డా. వాసుదేవరావు సూచనలు పాటిస్తూ మిత్ర పక్షుల సేవలను ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారు. పురుగుమందుల అవసరం బాగా తగ్గింది.. సురేశ్‌రెడ్డి ఇంకా ఇలా చెబుతున్నారు.. ‘‘దుక్కి చేస్తున్నప్పుడు తెల్లకొంగలు, కాకులు వేరు పురుగులను, నిద్రావస్థలో ఉన్న పురుగులను తింటాయి. శ్రీవరి నాటిన తర్వాత సాళ్ల మధ్యలో కొంగలు తిరుగుతూ తెల్ల కంకికి కారణమయ్యే పురుగులను ఏరుకు తింటాయి. నీరుకోళ్లు వరి పొలంలో పురుగులను తింటూ కనిపిస్తాయి. పక్షులను పొలంలో నుంచి వెళ్లగొట్టను. వాటి పని వాటిని చేయనిస్తాను. కొందరు రైతులు మొక్కలను తొక్కుతాయేమోననుకొని వీటిని పారదోలుతుంటారు. కానీ, నీరుకోడి నడిచిన వరి పొలానికి కాండం తొలిచే పురుగు సమస్య అసలు రానే రాదు. చిరుధాన్య పంటలను ఇష్టపడే బండారి గాళ్లు (గిజిగాళ్లు) పక్షులు గడ్డిపోచలను ఏరి చెట్లకు అందమైన గూళ్లను నిర్మించుకొని స్థిరనివాసం ఉంటున్నాయి. పురుగులను తింటాయి. కొంత మేరకు చిరుధాన్యాలను తింటాయి. మనకన్నా ఎక్కువగా పంటను కనిపెట్టుకొని ఉంటాయి. పొలంలో పాము కనిపిస్తే ‘వచ్చే.. వచ్చే..’ అనే విధంగా చిత్రమైన శబ్దాలు చేస్తూ దూరంగా వెళ్లిపోతాయి. అక్కడ ఏమో ఉందని గ్రహించి మేమూ జాగ్రత్తపడుతుంటాం. మిత్ర పక్షులు పురుగులను తినటం వల్ల పురుగుమందుల అవసరం బాగా తగ్గింది. వరి, వంగ, బెండ వంటి పంటల్లో ఒకటి, రెండు సార్లు పురుగుమందులు పిచికారీ చేస్తే సరిపోతున్నది. చెట్లుంటేనే పురుగులను తినే పక్షులు మన దగ్గర్లో ఉంటాయి. వేప, నల్లతుమ్మ చెట్లు బాగా పెరిగాయి కాబట్టి వాటి ఆకులను మేకలు, గొర్రెల మేపునకు ఇస్తున్నాం. ఏటా రూ. 10 వేల అదనపు ఆదాయం కూడా వస్తున్నది..’’ ముందుగా రికార్డు చేసిన ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పక్షులను భయపెట్టి పారదోలటం ఒక పరిష్కారం.. రిబ్బన్లు కడితే పంటలు సేఫ్! ► రిబ్బన్ పద్ధతి ద్వారా వివిధ పంటలను పక్షుల బెడద నుంచి కాపాడుకోవచ్చు. ► పంటకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కర్రలను ఉత్తర – దక్షిణ దిశలలో నాటాలి. ► ఒక పక్క ఎరుపు రంగు, మరో పక్క తెలుపు రంగులతో అర అంగులం వెడల్పు, 30 అడుగుల పొడవు గల రిబ్బన్‌ను 3 లేదా 4 మెలికలు తిప్పి.. కర్రలను 10 మీటర్ల దూరంలో నాటి కట్టాలి. ► పక్షుల ఉధృతి ఎక్కువగా ఉంటే కర్రల మధ్య దూరం 5 మీటర్లకు తగ్గించాలి. ► రిబ్బన్‌పైన ఎండ పడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ.. పంట ఏ దశలో ఉందో పక్షుల కంట పడకుండా ఈ రిబ్బన్ చేస్తుంది. ► ఈ పద్ధతిలో అన్ని రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, పండ్ల తోటలను పక్షుల బారి నుంచి కాపాడుకోవచ్చు. (సురేశ్‌రెడ్డి మొబైల్: 99595 66312) – శ్రీశైలం, సాక్షి, యాచారం, రంగారెడ్డి జిల్లా, కథనం: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: మిరియాల వీరాంజనేయులు, సాక్షి ఫొటో జర్నలిస్టు.) (డా. వాసుదేవరావును 040– 24015754, 94404 11166 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ–మెయిల్: vasuvaidyula@gmail.com) -
49 లక్షల ఎకరాల్లో పంటల సాగు
- ఖరీఫ్‌లో ఇప్పటివరకు 45 శాతం విస్తీర్ణంలో పంటలు -17.84 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల సాగు సాక్షి, హైదరాబాద్ : వర్షాలు సకాలంలో కురియడంతో పంటల సాగు ఊపందుకుంది. చేను, చెలకలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌లో సాధారణ పంటలసాగు 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 48.92 లక్షల ఎకరాల్లో(45%) పంటలు సాగయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు 48.70 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు 17.84 లక్షల (42%) ఎకరాల్లో ఆహార పంటలు వేశారు. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.10 లక్షల ఎకరాలకుగాను 8.58 లక్షల (97%) ఎకరాల్లో వేశారు. 24.65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1.75 లక్షల (7%) ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా రైతులు పట్టించుకోకుండా 20.82 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రత్యామ్నాయంగా సోయాను పండించాలని చెబితే కేవలం 5.95 లక్షల ఎకరాల్లోనే వేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో రైతులు 61 శాతం, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. నల్లగొండ జిల్లాలో మాత్రమే అత్యంత తక్కువగా 28 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 34 శాతం అధిక వర్షపాతం జూన్ 1 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో 713 మిల్లీమీటర్ల(ఎం.ఎం.) వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటివరకు 163.7 ఎం.ఎం.లు కురవాల్సి ఉండగా... ఏకంగా 220.1 ఎం.ఎం.లు కురిసింది. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అధిక వర్షపాతం రికార్డు అయింది. మెదక్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలో 21 శాతం అధిక వర్షపాతం నమోదైతే... దక్షిణ తెలంగాణలో మాత్రం 52 శాతం అధికంగా రికార్డు కావడం విశేషం. అందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 121 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వచ్చే నాలుగు రోజులపాటు సాధారణ వర్షాలు వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కామారెడ్డి, బాన్సువాడ, మెదక్లల్లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.