సైలేజీ గడ్డి సీజన్‌ ఇదే! | grass for silage making | Sakshi
Sakshi News home page

సైలేజీ గడ్డి సీజన్‌ ఇదే!

Published Tue, Jan 7 2020 6:27 AM | Last Updated on Tue, Jan 7 2020 6:27 AM

 grass for silage making  - Sakshi

సైలేజి గుంత

పచ్చిమేత లేకుండా పాడి లాభసాటి కాదు. అయితే, సంవత్సరం పొడవునా మనకు పిచ్చమేత లభ్యం కాదు. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో మనకు కొరత మరీ ఎక్కువ. అందుచేత జనవరి నెలలోనే మాగుడు గడ్డి / సైలేజీ గడ్డి / పాతర గడ్డిని తయారు చేసుకొని, పచ్చి గడ్డి కొరత ఉండే నెలల్లో వాడుకుంటే పాల దిగుబడి తగ్గిపోకుండా ఉంటుంది.

సైలేజీ గడ్డి తయారీ ఇలా..
     
► పచ్చి మేత పుష్కలంగా ఉన్నప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి, గుంతలో వేసి, గాలి చొరపడకుండా కప్పి పెట్టి, పోషక విలువలు తగ్గకుండా కాపాడుకొని, అవసర సమయాల్లో పశువులకు మేపుకొనే గ్రాసాన్నే సైలేజీ గడ్డి అంటారు.
     
► ఎక్కువ పిండి పదార్థాలు కలిగి, సుమారుగా మాంసకృత్తులు కలిగిన పశుగ్రాసాలు అనువైనవి. ఉదా: జొన్న, మొక్కజొన్న, నేపియర్, గిన్నీ గడ్డి, సజ్జ మొదలైనవి. అలాగే గుర్రపుడెక్క, చెక్క తట్టాకు, గుంతకల్లుడు ఆకు, చెట్టింటాకు లాంటి కలుపు మొక్కలను కూడా సైలేజీకి వాడవచ్చు.
   
 ► సైలేజీ గడ్డిలో ఎండుగడ్డిని కూడా 1:4 నిష్పత్తిలో వాడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టన్ను పశుగ్రాసానికి సుమారు 30 కిలోల మొలాసిస్‌ వాడితే మంచిది. మొలాసిస్‌ లభ్యం కానప్పుడు బెల్లం నీటిని కూడా వాడవచ్చు. ఈ ద్రావణాన్ని పశుగ్రాసం పైన పిచికారీ చేసుకొని సైలేజీని తయారు చేసుకోవాలి.
   
 ► సైలేజీ తయారీకి 35 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ఎక్కువ మాంసకృత్తులున్న పశుగ్రాసాలు– లూసర్ను, బర్సీము, అలసంద, పిల్లిపెసర లాంటివి సైలేజీకి పనికిరావు.
     
► సైలేజీ తయారీకి వాడే గుంతలు 3 రకాలు.. అపార్ట్‌మెంట్‌ పద్ధతి, గుంత కాల్వ పద్ధతి, బంకర్‌ పద్ధతి.
     
► రైతు తన అవసరాన్ని బట్టి సైలేజీని తయారు చేసుకోవచ్చు. సైలేజీ తయారీకి వాడే గుంత ముఖ్యంగా పశువుల సంఖ్య, నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది.
     
► ఒక్కో రోజుకు సుమారుగా 20 కిలోల సైలేజీని పశువుకు మేపుకోవచ్చు.
     
► గుంత పరిమాణాన్ని నిర్ణయించడానికి సూత్రం– ఉదా: ఒక రైతు దగ్గర 3 పాడి పశువులున్నాయి. వేసవిలో 3 నెలల పాటు సైలేజీ అవసరం అనుకుంటే, ఒక్కోపశువుకు రోజుకు 20 కిలోలు. 90“20=1,800 కిలోల అవసరం. అదే 3 పశువులకు 5,400 కిలోలు అవసరం. ఈ సైలేజీ తయారు చేసుకోవడానికి 8,100 కిలోల పశుగ్రాసం అవసరం. ఒక ఘనపు అడుగులో 20–23 కిలోల పశుగ్రాసాన్ని పాతర వేయొచ్చు. కాబట్టి, దాదాపు 350 ఘనపుటడుగుల గుంత అవసరం. అంటే.. 12 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉన్న గుంత అవసరం.


సైలేజీ గడ్డి తయారీలో జాగ్రత్తలు
     
► పశుగ్రాసాన్ని నింపేటప్పుడు గుంతలో గాలి చొరబడకుండా చూడాలి.
     
► గుంతలో నీరు లేకుండా, చేరకుండా చూడాలి.
     
► సైలేజీ తయారీలో పశుగ్రాసాల్లో 65 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు.
     
► జొన్న, మొక్కజొన్న చొప్ప సైలేజీ గడ్డి తయారీకి చాలా అనుకూలం. సైలేజీ గుంతను 3–4 రోజుల వ్యవధి లోపలే నింపాలి. అంతకన్నా ఆలస్యం కాకూడదు.

► జొన్న, మొక్కజొన్న, నేపియర్‌ గడ్డి రకాలు వాడినట్లయితే.. టన్నుకు 3 కిలోల యూరియా కలిపితే మంచిది.
     
► డోములాగా గుంత పై భాగాన్ని 2–3 అడుగుల ఎత్తు వరకు నింపవచ్చు.

► సైలేజీ నింపిన తర్వాత 2–3 అంగుళాల వరకు మట్టితో కప్పినట్లయితే, వత్తిడి వల్ల గుంతలోని గాలి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది.

► 2–3 నెలల వ్యవధిలో సైలేజీ తయారవుతుంది.

► 2–3 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు.
     
► గుంత తెరచిన తర్వాత సైలేజీని ఒక నెల లోపల వాడాలి. లేదంటే బూజు పడుతుంది. బూజు పట్టిన సైలేజీ గడ్డిని పశువులకు మేపకూడదు.


ప్రతిరోజూ పశువుకు 20 కిలోలతో బాటుగా, పచ్చిమేత ఒక భాగం, ఎండు మేత ఒక భాగం కలిపి మేపుకుంటే మంచిది. ప్రాణ వాయువు లేకుండా బ్యాక్టీరియా కారణంగా జరిగే రసాయనిక చర్య ద్వారా సైలేజీ గడ్డి తయారవుతుంది. ఈ ప్రక్రియ వల్ల సువాసనలతో కూడిన ఆమ్లాలు కూడా ఉత్పత్తవుతాయి. అందుకే సైలేజీ గడ్డి మంచి సువాసన కలిగి ఉంటుంది. పశువులు ఇష్టంగా తింటాయి.

– డా. ఎం.వి.ఎ.ఎన్‌. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్‌–అధిపతి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైవ్‌స్టాక్‌ ఫామ్‌ కాంప్లెక్స్, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, తిరుపతి


సైలేజి తయారీకి సిద్ధం చేసిన గడ్డి ముక్కలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement