
గిరిజనులకు వరంలా మారిన కొండ చీపుర్ల సాగు
ఏజెన్సీలో సుమారు 1,000 ఎకరాల్లో పంట
ఎకరానికి 2 వేల చీపురు కట్టల వరకు తయారీ
ఏటా రూ. లక్ష వరకు ఆదాయం
సాక్షి, పాడేరు: మనం ఇళ్లలో వాడే చీపురు పంట గిరిబిడ్డలకు జీవనాధారం. ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు, అరకులోయ, జి.మాడుగుల, పాడేరు, సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో వేల కుటుంబాలు చీపురు పంటను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నాయి. పూర్వం దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే కొండచీపురు మొక్కలు నేడు మన్యం అంతా విస్తరించాయి.
కొండపోడు, మెట్ట భూముల్లో గిరిజనులు చీపురు పంటను సాగుచేస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ పంట చేతికి వస్తుంది. చీపురు గడ్డి (Broom grass) శాస్త్రీయనామం “థైసెలోలెనా మాక్సిమా’ ఈ మొక్కలు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. మన ప్రాంతానికి దీన్ని వలస మొక్కగా చెప్పవచ్చు.
చీపురుతో స్వయం సమృద్ధి
కొండచీపుర్లకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రస్తుతం చీపురు పంట దిగుబడికి రావడంతో పుల్లలను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఎండబెట్టి, కట్టలు కట్టి మండల కేంద్రాలు, వారపుసంతల్లో అమ్ముతున్నారు. చీపురు కట్టల తయారీలో గిరిజన కుటుంబాలు ఇంటిల్లిపాదీ కష్టపడతాయి. మహిళలు కూడా చీపురు సేకరణ, కట్టలు కట్టడం అలవాటు చేసుకున్నారు.చీపురు కట్టకు మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలుకుతోంది. ఎకరానికి కనీసం 2వేల వరకు చీపురు కట్టలు తయారవుతాయి.
దీంతో ప్రతి గిరిజన రైతు ఏడాదికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు. కొంతమంది గిరిజన రైతులు నేరుగా విశాఖపట్నం,గాజువాక, విజయనగరం, రాజమండ్రి వంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏటా ఏజెన్సీ అంతటా కొండచీపుర్ల అమ్మకాలు భారీగా జరుగుతాయి. ప్రస్తుతం మన్యం (Manyam) సంతల్లో వ్యాపారులంతా పోటాపోటీగా కొనుగోలు చేస్తుండటంతో చీపురు అమ్మకాల ద్వారా గిరిజన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు.
అడవిలోకి వెళ్లి పుల్ల, పుల్ల ఏరుకుని ఇంటికి తెచ్చి చీపురు కట్టలుకట్టి సంతల్లో అమ్ముకునేవారు. దట్టమైన అడవుల్లో చీపురు పుల్లల సేకరణ గిరిబిడ్డలకు నిరంతర సవాలే. నిత్యం క్రూర మృగాలు, విషసర్పాలతో పోరాటమే. సేకరణ మరీ కష్టంగా మారుతుండటం, రోజురోజుకూ గిరాకీ పెరుగుతుండటంతో ఆ చీపురు మొక్కల్ని తమ సమీపంలోని కొండవాలుల్లో పెంచడం మొదలు పెట్టారు. అలా ప్రారంభమైన చీపుర్ల సాగు ప్రస్తుతం ఏజెన్సీలో సుమారు వెయ్యి ఎకరాల వరకు విస్తరించింది.
చీపురు పంటతో మంచి ఆదాయం
కొండచీపురు పంట ద్వారా మా గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలకు మంచి ఆదాయం లభిస్తోంది. మెట్ట,కొండపోడులో చీపురు సాగు చేస్తున్నాం.ఎకరం పంట ద్వారా సుమారు 2వేల వరకు చీపురు కట్టలు తయారు చేస్తాం. పంట సేకరణ, కట్టలు కట్టడం కష్టం తప్ప చీపురు సాగుకు ఎలాంటి పెట్టుబడి లేదు.
– పాంగి అప్పన్న, మేభ గ్రామం సూకురు పంచాయతీ, హుకుంపేట
మహిళలకు స్వయం ఉపాధి
చీపురుపంట సాగుతో సీజన్‌లో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తోంది. సంక్రాంతి పండుగ దాటిన నాటి నుంచి మే నెల వరకు చీపురు కట్టలను సంతల్లో అమ్మకాలు జరుపుతాం, వీటి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం మహిళలమే తీసుకుని ఆసొమ్ముతో పలు వస్తువులు కొనుక్కుంటాం.గత పదేళ్ల నుంచి కొండచీపురు పంటను సాగుచేసుకుంటున్నాం.చీపురు పంట ఆరి్ధకంగా ఏటా మా కుటుంబాలను ఆదుకుంటోంది.
– జన్ని సన్యాసమ్మ, గిరిజన మహిళా రైతు
Comments
Please login to add a commentAdd a comment