పూల్ మఖానాతో సుస్థిర సేద్యం
గిరి రైతులకు అదనపు ఆదాయం
చింతూరు ఐటీడీఏ ప్రణాళికలు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానా శాస్త్రవేత్తలు
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
అనుకూలంగా వాతావరణ పరిస్థితులు
మట్టి, నీటి శాంపిళ్ల సేకరణ
పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిన నిపుణులు
నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటలను వినియోగంలోకి తెచ్చి గిరి రైతులకు ఆదాయ వనరుగా మార్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా (alluri sitarama raju district) చింతూరు ఐటీడీఏ అడుగులు వేస్తోంది. డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల్లో నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అనుబంధంగా పూల్ మఖానా (phool makhana) సాగు చేపట్టేందుకు సంకల్పించింది. ఇప్పటికే చింతూరు డివిజన్లో మఖానా సాగు సాధ్యాసాధ్యాలను నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, డాక్టర్ పడాల వినోద్ కుమార్ పరిశీలించారు.
ఈ సాగుకు కీలకమైన గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం అనుకూలంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలను పరిశీలించారు. స్థానిక గిరిజన రైతులతో కూడా మాట్లాడారు. ఇక్కడి చెరువులు, కుంటల్లోని మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల నివేదిక ఆధారంగా ఈ ప్రాంతంలో మఖానా సాగు చేపట్టేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో..
మఖానా అనేది జలపంట. దీనిని సాధారణంగా పూల్ మఖానా, గోర్గాన్ నట్ (gorgon nut) అని కూడా పిలుస్తుంటారు. ఇది సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, కుంటల వంటి స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో పెరుగుతుంది. తేలియాడే ఆకులతో మెత్తని ఆకృతి, ప్రకాశవంతమైన నీలిరంగు, స్టార్చ్‌వైట్ గింజలతో ఉత్పత్తి చేస్తుంది. చూసేందుకు తామర ఆకులను పోలిఉండటంతో దీనిని అందరూ తామర పంటగానే భావిస్తారు.
తామర ఆకు మృదువుగా ఉంటే మఖానా ఆకు (Prickly Water Lily) మాత్రం పైకి ముళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ప్రతిమొక్క 15 నుంచి 20 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గుండ్రంగా మెత్తగా ఉంటాయి. ప్రతి పండులో 20 నుంచి 200 గింజల వరకు ఉంటాయి. మార్కెట్లో వీటి ధర కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. మఖానా పంట సగటు దిగుబడి హెక్టారుకు 1.4 నుంచి 1.6 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
మఖానాలో ఉన్న ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు, బరువు తగ్గడం, మెదడు పనితీరు మెరుగు పరచడం, గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మఖానాను నేరుగా తినడంతో పాటు వంటకాల్లో ఉపయోగించడం వల్ల స్థానికంగా మార్కెటింగ్ అందుబాటులో ఉంటుంది.
ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు
దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మఖానా సాగును ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా ఇటీవల ఆంధ్రాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలో పర్యటించాం. సాగులో కీలకమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండాలి. మట్టి, నీరు కూడా పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తాయి. చింతూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడాన్ని గుర్తించాం. సాగుకు అనుకూల పరిస్థితులపై కసరత్తు ప్రారంభించాం. దీనిలో భాగంగానే మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం.
– డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, శాస్త్రవేత్త, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానా
చదవండి: అందాల దీవిలో కడలి కల్లోలం
ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదం
మఖానా సాగు గిరి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదపడుతుందని భావిస్తున్నాం. చేపల పెంపకం చేపట్టే చెరువుల్లోనే వాటికి అనుబంధంగా మఖానాను కూడా సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు సాగుకు అనుకూలిస్తాయని ఆశిస్తున్నాం. దీనిలో భాగంగానే శాస్త్రవేత్తలు ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారు. ల్యాబ్ నివేదిక రాగానే వారు సాగుకు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవగాహన కల్పించి తరువాత శిక్షణ ఇస్తాం.
– అపూర్వభరత్, ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ, చింతూరు
Comments
Please login to add a commentAdd a comment