itda
-
తామర పంటకాదు.. పూల్ మఖానా!
నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటలను వినియోగంలోకి తెచ్చి గిరి రైతులకు ఆదాయ వనరుగా మార్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా (alluri sitarama raju district) చింతూరు ఐటీడీఏ అడుగులు వేస్తోంది. డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల్లో నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అనుబంధంగా పూల్ మఖానా (phool makhana) సాగు చేపట్టేందుకు సంకల్పించింది. ఇప్పటికే చింతూరు డివిజన్లో మఖానా సాగు సాధ్యాసాధ్యాలను నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, డాక్టర్ పడాల వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సాగుకు కీలకమైన గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం అనుకూలంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలను పరిశీలించారు. స్థానిక గిరిజన రైతులతో కూడా మాట్లాడారు. ఇక్కడి చెరువులు, కుంటల్లోని మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల నివేదిక ఆధారంగా ఈ ప్రాంతంలో మఖానా సాగు చేపట్టేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో.. మఖానా అనేది జలపంట. దీనిని సాధారణంగా పూల్ మఖానా, గోర్గాన్ నట్ (gorgon nut) అని కూడా పిలుస్తుంటారు. ఇది సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, కుంటల వంటి స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో పెరుగుతుంది. తేలియాడే ఆకులతో మెత్తని ఆకృతి, ప్రకాశవంతమైన నీలిరంగు, స్టార్చ్వైట్ గింజలతో ఉత్పత్తి చేస్తుంది. చూసేందుకు తామర ఆకులను పోలిఉండటంతో దీనిని అందరూ తామర పంటగానే భావిస్తారు. తామర ఆకు మృదువుగా ఉంటే మఖానా ఆకు (Prickly Water Lily) మాత్రం పైకి ముళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ప్రతిమొక్క 15 నుంచి 20 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గుండ్రంగా మెత్తగా ఉంటాయి. ప్రతి పండులో 20 నుంచి 200 గింజల వరకు ఉంటాయి. మార్కెట్లో వీటి ధర కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. మఖానా పంట సగటు దిగుబడి హెక్టారుకు 1.4 నుంచి 1.6 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మఖానాలో ఉన్న ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు, బరువు తగ్గడం, మెదడు పనితీరు మెరుగు పరచడం, గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మఖానాను నేరుగా తినడంతో పాటు వంటకాల్లో ఉపయోగించడం వల్ల స్థానికంగా మార్కెటింగ్ అందుబాటులో ఉంటుంది.ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మఖానా సాగును ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా ఇటీవల ఆంధ్రాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలో పర్యటించాం. సాగులో కీలకమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండాలి. మట్టి, నీరు కూడా పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తాయి. చింతూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడాన్ని గుర్తించాం. సాగుకు అనుకూల పరిస్థితులపై కసరత్తు ప్రారంభించాం. దీనిలో భాగంగానే మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం.– డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, శాస్త్రవేత్త, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాచదవండి: అందాల దీవిలో కడలి కల్లోలంఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదంమఖానా సాగు గిరి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదపడుతుందని భావిస్తున్నాం. చేపల పెంపకం చేపట్టే చెరువుల్లోనే వాటికి అనుబంధంగా మఖానాను కూడా సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు సాగుకు అనుకూలిస్తాయని ఆశిస్తున్నాం. దీనిలో భాగంగానే శాస్త్రవేత్తలు ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారు. ల్యాబ్ నివేదిక రాగానే వారు సాగుకు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవగాహన కల్పించి తరువాత శిక్షణ ఇస్తాం. – అపూర్వభరత్, ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ, చింతూరు -
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
భద్రాచలం అర్బన్: డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఎంతోకాలంగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలతో సహజీవనం సాగిస్తున్న గిరిజనులకు అన్ని విధాలా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 19 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం జరిగిన భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిందని, దీనికి పూర్వ వైభవం తెచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2004 – 2014 సంవత్సరాల మధ్య ఐటీడీఏకు కేటాయించిన బడ్జెట్, చేసిన ఖర్చు వివరాల నివేదికను వచ్చే సమావేశం నాటికి అందజేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని పలువురు విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఇందుకు గల కారణాలను విశ్లేషించి, వారు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు 2005లోనే నాటి వైఎస్సార్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో గత సర్కారు ఇదే శాఖలో స్కామ్ చేసింది విద్యార్థులకు అందిస్తున్న సహకారంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మాట్లాడిన భట్టి.. పక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇదే శాఖలో స్కామ్ చేసిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 32 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఐటీడీఏను విభజిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి ఏజెన్సీ బాధ్యత తనదేనన్నారు. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
మన్యం మిరియాలు అ‘ధర’హో..!
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజన రైతుల నుంచి 100 మెట్రిక్ టన్నుల మిరియాలను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలం నుంచి 10 టన్నులు కొనుగోలు చేయాలని తెలిపారు. మిరియాల పంటను సాగుచేస్తున్న గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కిలో రూ.500 మద్దతు ధరతో నాణ్యమైన మిరియాలను కొనుగోలు చేస్తామన్నారు. తక్కువ ధరతో దళారీలకు అమ్ముకుని మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిరియాల ఉత్పత్తిలో గిరిజన రైతులు తగిన నాణ్యత పాటించాలని, ఎండిన మిరియాలలో తేమశాతం తక్కువుగా ఉండాలన్నారు. వచ్చేనెల 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు కాఫీ లైజన్ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి మిరియాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాల నిల్వలకు గాను గిరిజన రైతులకు ఉచితంగా గోనెసంచులను పంపిణీ చేస్తామన్నారు.10వేల ఎకరాల్లో కాఫీ తోటల కన్సాలిడేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మిరియాల నూర్పిడికి యంత్రాల వినియోగం స్పైసెస్ బోర్డు విస్తరణ అధికారి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు పాదుల నుంచి సేకరించిన మిరియాల నూర్పిడిలో యంత్రపరికరాలను వినియోగించాలన్నారు. కంకుల నుంచి మిరియాలను వేరుచేసేందుకు కాళ్లతో తొక్కడం వల్ల బ్యాక్టిరీయా చేరి నాణ్యత తగ్గే పరిస్థితి ఉందన్నారు. పచ్చిమిరియాలను ఒక నిమిషం వేడినీటిలో ముంచి తీసిన తరువాత ఎండబెడితే గింజ నల్లగా ఉండి మంచి ధర వస్తుందని చెప్పారు. తేమ 10 శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్, కేంద్ర కాఫీబోర్డు డీడీ రమేష్,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికో ఇప్పమొక్క!
ఒకప్పుడు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇప్పపూల సేకరణ జోరుగా సాగేది. ఏటా వందల క్వింటాళ్లు... ఒక్కో ఏడాది అంతకు మించి ఇప్పపూవు సేకరించే గిరిజనులు జీసీసీకి అమ్మి ఆర్థికంగా ఎంతోకొంత లబ్ధి పొందేవారు. తద్వారా వారికి ఉపాధి లభించడమే కాక ఆ పూవును మరింత శుద్ధి చేసి అమ్ముతూ జీసీసీ సైతం ఆదాయం గడించేది. కానీ రానురాను రకరకాల కారణాలతో ఇప్ప పూల సేకరణ తగ్గిపోయి అటు గిరిజనులు, ఇటు జీసీసీ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సేకరణను గాడిలో పడేసేలా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చొరవ తీసుకుని అడుగులు వేస్తున్నారు. – సాక్షి, ఖమ్మం డెస్క్ అడవి లేక.. చెట్లు కానరాక పునర్విభజనతో భద్రాచలానికి సమీపాన ఉన్న చిక్కని అటవీ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో అక్కడి గిరిజనులు ఇప్పపూవు సేకరించి పాడేరు ఐటీడీఏ పరిధి జీసీసీకి అమ్ముతున్నారు. ఇదేకాక పోడు సాగుతో ఇప్ప చెట్ల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. అదేవిధంగా భద్రాచలం జీసీసీకి గిరిజనులు ఇస్తున్న ఇప్పపూవు పరిమాణమూ తగ్గుతోంది. ఇక ఇప్పపూవు సేకరణ, శుద్ధి, అమ్మితే సమకూరే ఆదాయంపై ఆదివాసీ, గిరిజనులకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. ఏడాది క్రితం భద్రాచలం ఏటీడీఏ పీఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్‌జైన్ గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీసీసీ ఆధ్వర్యాన సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులపై ఆరా తీయగా ఇప్పపూవు విషయంలో హెచ్చుతగ్గులు గుర్తించి మళ్లీ గాడిన పడేయాలని రంగంలోకి దిగారు. గత ఏడాది 327 క్వింటాళ్లు భద్రాచలం జీసీసీ పరిధిలో ఆరు సబ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం(2022–23)లో 327 క్వింటాళ్ల ఇప్ప పూవు సేకరించారు. అయితే, పదేళ్ల క్రితం వందలు దాటి వేల క్వింటాళ్లు సేకరించిన దాఖలాలూ ఉన్నాయి. ఇప్పపూవు నాణ్యత ఆధారంగా కేజీకి రూ.30 నుంచి రూ.35 చొప్పున జీసీసీ నుంచి గిరిజనులకు చెల్లిస్తారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఇల్లెందు, కరకగూడెం నుంచి ఎక్కువగా ఇప్పపూవు తీసుకొ స్తున్నారని జీసీసీ అధికారులు చెబుతున్నారు. ఏం చేస్తారంటే? జీసీసీ ద్వారా సేకరించిన ఇప్పపూవును మరింత శుద్ధి చేస్తారు. దీన్ని ఎక్కువగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వ్యాపారులు లేదా అక్కడి ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తారు. వీరు ఇప్పపూలతో గారెలు, లడ్డూలు, ఇతర వంటకాలు చేసుకుంటారు. మరోపక్క అనధికారికంగా ఇప్పపూలతో సారా కాచి తాగడం ఆదివాసీల్లో ఏళ్ల నుంచి ఆచారంగా కొనసాగుతోంది. పర్ణశాలలో అమ్మకం శ్రీసీతారామచంద్రస్వామి వన వాసానికి వచ్చినప్పుడు భద్రాచలం సమీపాన దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు వచ్చినట్లు పురాణాల్లో ఉంది. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అన్ని అటవీ ఫలాలతో పాటు ఇప్పపూవు తీసుకున్నారని భక్తులకు నమ్మకంగా చెప్పే చిరువ్యాపారులు పర్ణశాల వద్ద ఇప్పపూలను కుప్పలుగా పోసి అమ్మడం కనిపిస్తుంది. కానీ దీనికి ఎలాంటి చారిత్రక, పురాణ ఆధారాలు లేవని అర్చకులు చెబుతారు. అయినప్పటికీ పర్ణశాల, భద్రాచలం వచ్చిన భక్తులు ఎంతో కొంత ఇప్పపూవు కొనుగోలు చేసి తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 25వేలకు పైగా మొక్కలు ఇప్పపూవు సేకరణ పెరగాలంటే అదే సంఖ్యలో మొక్కలు ఉండాలి. అందుకోసం అటవీ శాఖ నుంచి 25వేలకు పైగా మొక్కలు సేకరించిన పీఓ.. ప్రతీ గిరిజన కుటుంబానికి ఒక్కో మొక్క పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ మొక్కలు ఉచితంగానే ఇవ్వాలని తొలుత భావించినా.. అలా చేస్తే నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపరనే ఆలోచనతో నామమాత్రపు ధర నిర్ణయించారు. ‘ఇంటికో ఇప్పమొక్క’పేరిట ఆరంభించిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చేలా స్వయంగా పీఓ సైతం ఐటీడీఏ కార్యాలయంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చి ఇప్పమొక్కలు వనాలైతే పూల సేకరణ ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే కాక జీసీసీకి సైతం ఆదాయం పెరగనుందని చెబుతున్నారు. -
గిరిజన ఉపాధిలో వికాసం
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలు(వీడీవీకే)లతో గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తోంది. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్‌తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. విక్రయిస్తున్న ఉత్పత్తులివీ.. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్‌చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం. రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్‌కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్‌రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్‌ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్‌రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
కొలువుల చదువు.. భవితకు నెలవు
గిరి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. బోధనకు అవసరమైన నైపుణ్యం, విజ్ఞానం అందిస్తూ శిక్షణ ఇస్తోంది. వారు కొలువులు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోనే గిరిజన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఏకైక కళాశాల ఇదే. ఏటా 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల (డైట్ కళాశాల) గిరి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించడంలో ఎంతో దోహదపడుతోంది. నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 15 ఏళ్లుగా గురువులుగా తీర్చిదిద్దుతూ... రంపచోడవరంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను 2008లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డైట్ ద్వారా 50 మంది గిరి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కళాశాలలో 520 మంది విద్యార్థులు శిక్షణ పొంది బయటకు వెళ్లారు. ► 2008 –2101 విద్యా సంవత్సరానికి సంబంధించి 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2009 నుంచి 2014 వరకు 96శాతం ఉత్తీర్ణత సాధించింది. 2013 నుంచి 2020 వరకు ఆరు బ్యాచ్‌లు నూరుశాతం ఫలితాలు సాధించాయి. అలాగే 2021 బ్యాచ్ నూరు శాతం ఫలితాలు సాధించాయి. చక్కని వసతి సదుపాయం ► రాష్ట్రంలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు, పార్వతీపురం, కన్నపురం ఐటీడీఏల పరిధిలోని విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలకు రావాల్సిందే. రంపచోడవరం డైట్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పించారు. బాలురకు కళాశాల ఆవరణలోనే హాస్టల్ వసతి ఉంది. బాలికలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతి గృహంలో కల్పించారు. మెరుగైన శిక్షణ రంపచోడరంలోని డైట్ కళాశాలలో మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తరువాత ఉద్యోగం సాధిస్తామనే భరోసా ఉంది. ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు కలుగుతుంది. –కల్యాణ్, విద్యార్థి డైట్ కళాశాల, రంపచోడవరం మెరిట్ విద్యార్థులకే ప్రవేశం రంపచోడవరం డైట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల పాటు చదువుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమకూరుస్తున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది విద్యారంగంలో స్థిరపడ్డారు. –కోసు ఠాగూర్దొర, డైట్ కళాశాల విద్యార్ధి. నూరుశాతం ఫలితాలు తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నాం. వారు బాగా చదివేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం. కళాశాల నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉంది. –సీహెచ్ చిన్నబాబు, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రంపచోడవరం -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్‌తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్‌తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్‌కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
Nature Farming: సేంద్రియ సారం.. పుడమికి జీవం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో వ్యవసాయం సాహసోపేతం. ఇక్కడ సాగుకు వర్షాలు, కొండవాగుల నీరే ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రకృతి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు కూడా సేంద్రియ విధానాలపై ఆసక్తి చూపుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ అధికారుల చొరవతో మూడేళ్లుగా గిరిజన రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగింది. గిరిజన ప్రాంతంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కూరగాయలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 15 వేల మందికి పైగా రైతులు సుమారు 9,400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటిలో 2,100 ఎకరాల్లో చిరుధాన్యాలు, 7 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో కూరగాయలు వంటివి పండిస్తున్నారు. ప్రోత్సాహం ఇలా.. గిరిజన ప్రాంతంలోని సన్న, చిన్నకారు గిరిజన రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విత్తనం నాటిన నుంచి ఎరువులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న వారు, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న వారిని ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఇద్దరు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను, ఒక క్లస్టర్ కార్యకలాపాల నిర్వాహకుడు, ఎంపీఈఓ, సీఆర్పీలను నియమించి రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఐదు పురుగు మందుల అవశేషాలు లేని ఎరువుల దుకాణాన్ని ఏర్పాటుచేశారు. కొందరు రైతులకు ఈ దుకాణాల బాధ్యతలను అప్పగించారు. ఇందుకు రూ.50 వేల రాయితీలపై రుణాలను కూడా అందించారు. వీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూనే దుకాణాల ద్వారా రైతులకు కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారు చేసి అవసరమైన సామగ్రిని విక్రయించేలా ఏర్పాటుచేశారు. అలాగే 30 మంది రైతులకు ఆవుల కొనుగోలుకు రూ.10 వేల చొప్పున రాయితీలతో రుణాలను అధికారులు అందించారు. కషాయాల తయారీకి ఉపయోగపడే పరికరాలను సమకూర్చారు. అలాగే షెడ్, నైట్ నీడలో కూరగాయల సాగు చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. 200 ఎకరాల్లో కూరగాయలు.. సుమారు 200 ఎకరాల్లో 250 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. పొట్ల కాయ, ఆనబకాయ, కాకరకాయ, దోసకాయలు, చిక్కుడు, బీర, వంకాయ, టమాట, బెండకాయ, గోరు చిక్కుళ్లు వంటి కూరగాయలతో పాటు గోంగూర, బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండిస్తున్నారు. 2,100 ఎకరాల్లో సుమారు 1,800 మంది రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. 2,100 ఎకరాల్లో చిరు ధాన్యాలు జొన్నలు, గంట్లు, పెసర, మినుము, ఉలవలు, బొబ్బర్లు, పెసలతో పాటు జీలుగు, జనుము వంటి పంటలను పండిస్తున్నారు. వీటికి ఆదరణ పెరగడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 7 వేల ఎకరాల్లో వరి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 7 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,000 ఎకరాల్లో వరి కోతలు పుర్తయ్యాయి. అయితే ఎకరానికి 400 బస్తాల దిగుబడి రావడంతో రబీలో కూడా వరి పంటలు వేసేలా రైతులు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మెండుగా ఉంది. విస్తరిస్తున్న సేంద్రియ సాగు ప్రకృతి సాగు ఏటా పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 39,873 మంది రైతులు 78,479 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన పెంచి సాగును మరింత పెంచేలా కృషి చేస్తున్నాం. – పైడపల్లి లలితాసుధ, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం, ఏలూరు ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల సహకారం మరువలేనిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వై.ముసలయ్య, ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజనల్ యాంకర్, కేఆర్‌పురం లాభదాయకంగా ఉంది ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది. నేను ఈ ఏడాది సుమారు రెండు ఎకరాల్లో బీర, ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నాను. – సలాది కొండరాజు, గిరిజన రైతు, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం -
'నన్నారి'కి నల్లమల బ్రాండ్!
(నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు) అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆదివాసీ గిరిజనులు ఇప్పుడు నన్నారి (షర్బత్ తయారీకి ఉపయోగించేది)పై గురిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నేతృత్వంలో నన్నారి (సుగంధి) ఉత్పత్తికి ఊతమిస్తోంది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో 171 గూడెంలలో నివసించే 27,857 మంది చెంచుల జీవనోపాధికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి అక్కడి చెంచులు నల్లమల అడవిపై ఆధారపడి సంచార జీవనం సాగిస్తుంటారు. వీరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంచడమే కాకుండా ఆ భూముల్లో సాగు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. చెంచులు వ్యవసాయ ఉత్పత్తులతోపాటు అటవీ ఫలసాయమైన నన్నారి, తేనె, ఉసిరి, కుంకుడు కాయలు, మాడపాకులు, ముష్టి గింజలు, చింతపండు వంటి వాటిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేంద్రాలకు మద్దతు ధరకు విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నన్నారి ఉత్పత్తికి ఊతం.. ఇక నన్నారి చెట్ల సాగు, ఉత్పత్తి, విక్రయాలకు శ్రీశైలం ఐటీడీఏ అనేక చర్యలు చేపడుతోంది. కర్నూలు జిల్లా డి.వనిపెంట చెంచుగూడెంలో 20 మంది చెంచు రైతులు 20 ఎకరాల్లో గత మూడేళ్లుగా నన్నారి సాగుచేస్తున్నారు. మరో 12 మంది 30 ఎకరాల మామిడి తోటల్లోను అంతర పంటగా నన్నారి సాగుచేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఐటీడీఏ ప్రోత్సాహంతో అనేక చెంచు కుటుంబాలు ఇళ్ల ముంగిటే ఈ మొక్కల సాగుచేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 2వేల కుటుంబాలు ఈ సాగుతో ఉపాధి పొందుతున్నాయి. మరో వంద ఎకరాల్లో సాగుకు ఐటీడీఏ అధికారులు కార్యాచరణ చేపట్టారు. నన్నారి గడ్డలు (ముడిసరుకు) కిలో రూ.450 నుంచి రూ.600 కొనుగోలు చేసి నన్నారి షర్బత్ తయారీకి వినియోగిస్తున్నారు. మూడు జిల్లాల్లో 13 వికాస కేంద్రాలు నిజానికి.. గిరిజనుల వద్ద వ్యాపారులు చౌకగా కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి గిరిజనులే మంచి ధరకు అమ్ముకునేలా అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే నల్లమల బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయించాలని సంకల్పించింది. మూడు జిల్లాల్లో 13 ప్రధానమంత్రి వన్‌ధన్ వికాస కేంద్రాలు (ప్రకాశం–5, నంద్యాల–6, పల్నాడు–2) కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రంలో 15 గ్రూపులు (300 మంది సభ్యులు) చొప్పున మొత్తం 13 వికాస కేంద్రాల్లో 3,900 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. వీటి ద్వారా నన్నారితోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఫలసాయాన్ని గిరిజనులు విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కేంద్రాలను అనుసంధానిస్తూ డోర్నాలలో ఐదు ఎకరాల్లో ట్రైబల్ పార్కు ఏర్పాటుచేసి గిరిజనుల ఉత్పత్తులను విక్రయించనున్నారు. నన్నారితో షర్బత్ తయారీ శిక్షణ వేసవిలో దాహార్తిని తీర్చడంతోపాటు శక్తినిచ్చే నన్నారి షర్బత్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్వంలో ప్రస్తుతం 10 కేంద్రాల్లో వెయ్యి మందికిపైగా చెంచులకు నన్నారి శుద్ధి, షర్బత్ తయారీపై శిక్షణనిచ్చారు. అడవి నుంచి సేకరించిన నన్నారి వేర్లను ప్రాసెసింగ్ చేస్తారు. శుద్ధిచేసిన ఒక కిలో నన్నారి గడ్డలతో నీరు, పంచదార, నిమ్మ ఉప్పు, ప్రిజర్వేటివ్, కొద్దిపాటి రంగుతో 25 లీటర్ల నన్నారి పానీయం తయారవుతుంది. లీటరు షర్బత్ తయారీకి రూ.వంద అయితే దాన్ని రూ.150కి విక్రయిస్తారు. నల్లమల బ్రాండ్‌తో విక్రయాలు చెంచులు సేకరించే నన్నారి, తేనె, వనమూలికలతోపాటు ఇతర అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేలా శ్రీశైలం ఐటీడీఏ పాలక మండలి ఇటీవల తీర్మానించింది. ఇప్పటికే నన్నారి షర్బత్ తయారీపై యువతకు శిక్షణనిచ్చాం. నన్నారి దుంపల (వేర్లు) శుద్ధికోసం రూ.3 లక్షల చొప్పున రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నాం. నన్నారి సాగును ప్రోత్సహించడంతోపాటు ఉద్యానవన సాగుకు ఊతమిస్తున్నాం. ఐదువేల మామిడి మొక్కలను పంపిణీ చేశాం. తిరుపతిలోని చినీ, నిమ్మ పరిశోధన స్థానం నుంచి స్వీట్ ఆరంజ్ (రంగపురి రకం) 3వేల మొక్కలను పంపిణీ చేశాం. 750 ఎకరాల్లో చెంచులు మిరప పండిస్తుండటంతో చిల్లీపౌడర్ (కారం) తయారుచేసే కేంద్రాన్ని డోర్నాలలో ఏర్పాటుచేస్తున్నాం. యర్రగొండపాలెం, సున్నిపెంటలో వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) ద్వారా యువతకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌తోపాటు ఫుడ్, గూడ్స్ ప్యాకింగ్పైన శిక్షణనిచ్చాం. చెంచుల అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ చేసి విక్రయించేందుకు మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాం. – బి. రవీంద్రరెడ్డి, ప్రాజెక్టు అధికారి, శ్రీశైలం ఐటీడీఏ -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
మైదాన ప్రాంతంలోనూ ‘సమీకృత గిరిజనాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం.. రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాల్లో కనిష్టంగా 75,886 మంది, గరిష్టంగా 2,88,997 మంది గిరిజనులున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తగినన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత సమర్థంగా అందించే వీలుకలుగుతుందని పేర్కొంది. మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐటీడీఏ అత్యవసరం మైదాన ప్రాంతాల్లో ఎస్టీల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని ఐటీడీఏలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు అందించాం. ఏపీలోని గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మైదాన ప్రాంతంలోని ఎస్టీల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు ప్రాథమిక విద్య, వైద్యం, రహదారుల కల్పన, విద్యుత్, ఆర్థికాభివృద్ధిపై అవకాశాలు వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు
వారే వారసులు.. అనాది జీవన విధానానికి, అపురూప సంస్కృతికి, అరుదైన సంప్రదాయాలకు శాశ్వత చిరునామా వారు. వారు వారధులు కూడా.. నిన్నటి తరం వదిలిపెట్టిన వన సంపదను రేపటి తరానికి అందించే బాధ్యతను మోస్తున్నారు. పచ్చటి కొండకోనలను వేల ఏళ్లుగా రక్షిస్తూ, బతుకులను అడవి తల్లి సంరక్షణకు అర్పిస్తూ ఆదివాసీలు అందరికీ మేలు చేస్తున్నారు. అడవి ఇంకా బతికి ఉందంటే అదంతా వారి పుణ్యమే. అందుకే ఓ చల్లటి గాలి వీచినా, వెచ్చటి చినుకు పడినా మొదటి కృతజ్ఞత వారికే దక్కాలి. నేడు ఆదివాసీ దినోత్సవం. ఆహారం నుంచి ఆహార్యం వరకు అన్నింటా విభిన్నంగా కనిపించే వారి జీ‘వన’శైలి ఎప్పటికీ ప్రత్యేకమే. ఎల్ఎన్ పేట: కళ్లు తెరిస్తే పచ్చటి అడవి. తలెత్తి చూస్తే కొండ శిఖరం. అడుగు మోపితే ఆకుల తివాచీలు. ఆదివాసీల జీవనం ఎంత విశిష్టమో అంతే విభిన్నం కూడా. ఉద్యోగాలు వచ్చి కొందరు వనం వదలి వచ్చేసినా ఇంకా ఆ అడవి ఒడిలో ఎందరో బతుకుతున్నారు. కొండపోడు చేసుకుంటూ అడవి తల్లికి కాపు కాస్తున్నారు. వారి కట్టు, బొట్టు పరిశీలిస్తే అనాది సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయి. మన్యం జిల్లాగా విడిపోయిన తర్వాత సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, భామిని ఈ నాలుగు మండలాలు మన్యం జిల్లాకు వెళ్లగా.. మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 74వేల గిరిజన కుటుంబాలు, సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. 301 గిరిజన గ్రామ పంచాయతీల్లో 103 షెడ్యుల్ గ్రామాలు కాగా, 1282 నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. పోడు పంటలే ప్రధానం గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. జొన్నలు, సజ్జలు, రాగులు, గంటెలు, కంది, అరటి, బొప్పాయి, జీడి, సీతాఫలం, పైనాపిల్, పనస, పసుపు, అల్లం, కొండ చీపుర్లు, ఆగాకర, కర్రపెండ్లం, చీమ మిరప, జునుములు వంటి అనేక పంటలు పండిస్తారు. ఉదయాన్నే పనిచేసుకునేందుకు కుటుంబమంతా పోడు వద్దకు చేరుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పంటలు పండిస్తారు. ఐకమత్యమే బలం.. గిరిజనుల్లో ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నా.. అంతా కలిసికట్టుగా బతకడమే వారి బలం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతా ఒక చోట కు చేరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యక్రమం చేయాలన్నా అందరూ తలో కొంత సాయం చేసుకుంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ఊరంతా ఆ మాటకు కట్టుబడి ఉంటారు. కట్నం ఉండదు గిరిజనుల ఇంట పెళ్లి జరిగితే కట్నం అనే మాట ఉండదు. కట్నం ఎందుకు తీసుకోవటం లేదని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే.. ‘ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తారు. అప్పు కోసం వారు ఎన్నో బాధలు పడాలి. అలాంటి డబ్బు తీసుకోక పోవటమే మంచిది’ అంటారు. అయితే సారె సామాన్లు మాత్రం స్వీకరిస్తారు. జిల్లాల విభజన తర్వాత.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత శ్రీకాకుళంలో ఉన్న సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్లింది. ఐటీడీఏను ఉమ్మడిగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇటు శ్రీకాకుళం, అటు మన్యం జిల్లా పార్వతీపురంతో కలిసి సీతంపేట ఐటీడీఏ కొనసాగుతోంది. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు గిరిజన సంఘాల నాయ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?) మరింత ప్రోత్సాహం ఇవ్వాలి.. గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా అనేక మంది గిరిజనులు అమాయకంగానే జీవిస్తున్నారు. పోడు భూమికి పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించాలి. పోడు పంటలు పండించే గిరిజన రైతులను గుర్తించి అంతరించి పోతున్న పంటల సాగును ప్రోత్సహించాలి. – పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం అధ్యక్షురాలు, శ్రీకాకుళం -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల మీదుగా 10 కి.మీ. రహదారి నిర్మాణం
మాడుగుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవాపురం వరకు.. దట్టమైన అడవిలో నుంచి సాగే 10 కిలోమీటర్ల రహదారి.. 15 ఏళ్ల క్రితమే నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు లభించక మధ్యలోనే నిలిచిపోయింది. ఇన్నాళ్లకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. కాకులు దూరని కారడవిలో పొక్లెయిన్లతో జంగిల్ క్లియరెన్స్ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: అడవి బిడ్డలకు త్వరలో డోలి కష్టాలు తీరనున్నాయి. చదువు కోవాలని ఆశపడే విద్యార్థుల కలలు నెరవేరబోతున్నాయి. అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రగతి పరవళ్లు తొక్కబోతోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మాడుగుల నుంచి దేవాపురం వరకు కీలకమైన రహదారి నిర్మాణం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీడీఏ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి కొండలు, గుట్టల మీదుగా సాగుతుంది. పక్కా రోడ్డు వేయడం కష్టసాధ్యమే అయినా ఈ సత్సంకల్పాన్ని సుసాధ్యం చేయాలని అందరూ శ్రమిస్తున్నారు. వాణిజ్యంలో ప్రత్యేక గుర్తింపు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు మధ్యనున్న మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయంటే దానికి కారణం సరైన రహదారి లేకపోవడమే. వందేళ్ల క్రితమే మాడుగుల వాణిజ్య రంగంలో గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పండించిన పిప్పలి, పసుపు, బత్తాయి, నారింజ, అరటి, చింతపండు, సపోట, మొక్కజొన్న, అనాస, సీతాఫలం, అలచందలు, తదితర పంటలు మాడుగుల చేరుకుంటాయి. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఏడాదికి వందల టన్నుల్లో రవాణా జరుగుతుంది. సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలతోపాటు నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 30 గ్రామాలు ఈనాటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయాయి. దేవాపురం, అయినాడ, సలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఈ గ్రామాలవారు నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దిగి మాడుగుల రావల్సి వచ్చేది. గిరిజనులు పండించిన పంటలను కావిళ్లతో, గంపలతో నడుచుకుంటూ తీసుకువస్తారు. రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత విద్యార్ధులను చదివించడానికి కూడా ఇష్టం చూపించరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఆ గ్రామాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి. గతంలో సగంలోనే నిలిచిన రోడ్డు పనులు 15 ఏళ్ల క్రితం మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖ అనుమతి లేకపోవడంతో అక్కడితో పనులు నిలిపోయాయి. చాలామంది రాజకీయ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాడుగుల–దేవాపురం రోడ్డుకు మోక్షం కలిగింది. గత ఎన్నికలకు ముందే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దానిని నెరవేరుస్తూ అటవీ శాఖ అడ్డంకులున్నా అధిగమించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం శరవేగంతో చేస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన 13 మండలాల్లో గల 30 గ్రామాల రైతులు, చిరు వ్యాపారస్తులు, ప్రజలు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గిరిపుత్రులకు అండగా ప్రభుత్వం గిరిజనమంటే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అమితమైన ప్రేమ. వారి అభివృద్ధికి, వారి గ్రామాలకు రోడ్డు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మాడుగుల నుంచి దేవాపురం వరకు రహదారి సౌకర్యం లేపోవడంతో గిరిజన గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో అటవీశాఖ అనుమతులు లభించాయి. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికే రహదారుల నిర్మాణం జరుగుతోంది. –బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం రుణపడి ఉంటాం.. గత 30 ఏళ్లుగా దేవాపురం రోడ్డు కోసం పోరాడుతున్నాము. గతంలో మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖాధికారుల అనుమతులు లేకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇన్నళ్లకు మా కల నెరవేరుతోంది. రెండు జిల్లాల ప్రజలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు. – వేమవరపు వెంకటరమణ, మాడుగుల మాజీ సర్పంచ్ త్వరితగతిన నిర్మాణ పనులు ఇటీవల అటవీశాఖ అనుమతులు లభించాయి. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రూ.2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టాం. వర్షాలు లేకుండా ఉంటే నెల రోజుల్లో ఫార్మేషన్ పూర్తి చేస్తాం. మరో ఆరునెలలలోపు ఈ రోడ్డు అప్‌గ్రెడేషన్ కూడా పూర్తిచేస్తాం. ఇది పూర్తయితే రెండు జిల్లాల్లో గల 13 మండలాల్లో గల 30 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ పీఓ -
అభివృద్ధే అందరి లక్ష్యం
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కష్టపడి పనిచేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాల్లో సోమవారం ఎస్పీ సతీష్, జేసీ ధనంజయ్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలో పనిచేసే అధికారులు, సిబ్బంది వారి ప్రధాన కేంద్రాల్లో నివాసముండాలని ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 200 నుంచి 300 గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్లతో ఏజెన్సీలోని రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఆస్పత్రులు, వాటిలో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. రేషన్‌కార్డు, పింఛన్ల సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో పరిష్కరించే బాధ్యత ఆయా శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రతి వారం నిర్వహించే స్పందనకు అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.ఏజెన్సీలో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.గిరిజనులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులకు కలెక్టర్ సూచించారు. గిరిజనులకు సేవ చేయడం అదృష్టం జిల్లా ఎస్పీ సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో ఏపీవో సీఎస్ నాయుడు, డీడీ ముక్కంటి, ఈఈ డేవిడ్‌రాజు, ఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అడవిబిడ్డలకు ఉన్నత విద్యను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
బుల్లి బుల్లి దీవులు.. కేరళను మించి సోయగాలు
సాక్షి, విశాఖపట్నం: కొండ కోనల నడుమ మన్యం అందాలు ఒకవైపు.. యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక కేంద్రాల సోయగాలు మరోవైపు. ఆ అందాలకు మరింత వన్నెలద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. విశాఖ మన్యంలో కేరళ తరహాలో బ్యాక్ వాటర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మనోహరమైన సుజనకోట ప్రాంతంలోని చిన్న చిన్న దీవుల్లో కేరళను మించిన అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. సుజనకోట.. ప్రకృతి మేట బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంగా ముంచంగిపుట్టు మండలం సుజనకోటను గుర్తించారు. సుజనకోటలోని మత్స్యగెడ్డ వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. జి.మాడుగులలో ప్రారంభమై.. హుకుంపేట, పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు వద్ద జోలపుట్టు డ్యామ్‌లో కలుస్తుంది. ఒకవైపు పచ్చని దీవులు, మరోవైపు ఆకర్షణీయమైన సుందర ప్రదేశాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా సుజనకోట పంచాయతీలో మత్స్యగెడ్డ అందాలు కేరళను తలపిస్తుంటాయి. మెలికలు తిరుగుతూ ఎత్తయిన గిరుల మధ్య నుంచి మత్స్యగెడ్డ పాయలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ అందాలను చూసేందుకు నిత్యం వందలాదిగా పర్యాటకులు వస్తుంటారు. బ్యాక్ వాటర్ బోటింగ్.. ఫ్లోటింగ్ రెస్టారెంట్ కేరళ పర్యాటకానికి పేరు తెచ్చింది బ్యాక్ వాటర్స్ అని అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే అనుభూతిని సుజనకోటలో పొందవచ్చు. మత్స్యగెడ్డ బ్యాక్‌వాటర్‌ను అభివృద్ధి చేస్తే.. కేరళ వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా అంతర్జాతీయ పర్యాటకుల్ని సైతం ఆకర్షిస్తుంది. బ్యాక్ వాటర్‌లో సేదతీరేలా బోటింగ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.2.50 కోట్లతో సుజనకోట అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశారు. బ్యాక్‌వాటర్ అందాలను తిలకించిన తర్వాత.. దేశ, విదేశీ టూరిస్టుల అభిరుచికి అనుగుణంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. రెండు మూడు రోజులు ఇక్కడ ప్రకృతి ప్రేమికులు విహరించేందుకు వీలుగా కాటేజీలు నిర్మించనున్నారు. అడ్వెంచర్ టూరిజానికీ.. బ్యాక్ వాటర్ టూరిజంతో పాటు అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ ప్లాన్ సిద్ధం చేసింది. బోటింగ్‌తో పాటు జిప్‌లైనర్ ద్వారా బ్యాక్ వాటర్ నుంచి కొండల వైపునకు వెళ్లేలా సాహస విన్యాసాలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఆమోదం తెలిపిన సీఎం జగన్ కేరళకు బ్యాక్ వాటర్స్ టూరిజం ఎంత పేరు సంపాదించి పెట్టిందో.. అదే మాదిరిగా విశాఖ మన్యం అందాలకు సుజనకోట కూడా అంతే పేరు తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే ప్రకృతి కేరళ కంటే వైభవంగా ఆకట్టుకుంటుంది. పర్యాటకులు రాత్రిపూట బ్యాక్ వాటర్‌లో సేదతీరేలా ప్రాజెక్టు రూపొందిస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. అరకు వచ్చే పర్యాటకులు సుజనకోట చేరుకునేందుకు రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్డు మార్గం కూడా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం కలిసొస్తుందని భావిస్తున్నాం. పర్యాటక మన్యహారంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ -
గిరిజన ఉత్పత్తులకు 'బ్రాండింగ్'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడవి బిడ్డల కష్టాన్ని హైజాక్ చేస్తున్న దళారులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది. గిరిజనుల కష్టం వృథా కాకుండా వారు సేకరిస్తున్న 105 రకాల ఉత్పత్తులకు ‘బ్రాండింగ్’ కల్పించి, వాటిని గిరిజన సహకార సంస్థ ద్వారా మార్కెట్లో విక్రయిస్తోంది. ఇవి అరుదుగా దొరికే రకాలు, స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మార్కెట్లో వీటికి మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు సంబంధించి రూ.34 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. వచ్చే ఏడాది దీని విలువ ఏకంగా 40–50 శాతం పెరగనుంది. ఈ పరిణామాలు అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడమే కాక వారికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయి. మార్కెటింగ్ సొసైటీల ఏర్పాటు నల్లమల ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ. వీరి అభివృద్ధి కోసం గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ను 1987లో నంద్యాలలో స్థాపించారు. శ్రీశైలంలో ఐటీడీఏ ఏర్పడిన తర్వాత దీంతో కలిసి పనిచేసేందుకు 1989లో జీసీసీని శ్రీశైలానికి తరలించారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డివిజన్లో నంద్యాల, ప్రకాశం జిల్లా దోర్నాలలో రెండు గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటుచేశారు. ఇవికాకుండా పాడేరు, చింతపల్లి, రంపచోడవరంలోనూ సొసైటీలున్నాయి. వీటి పరిధిలోని మండలాల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. తేనె, చింతపండు, త్రిఫల చూర్ణం, నన్నారి, అలోవిరా, జాస్మిన్, నీమ్ ఇంటర్నేషనల్ సబ్బులు, ఉసిరి, శీకాకాయ, కుంకుడు కాయలు, వీటిద్వారా తయారుచేసిన షాంపులు, రాజ్మా చిక్కుళ్లతో పాటు 105 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇందులో కర్నూలు, ప్రకాశం జిల్లాలోనే 58 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి కల్తీ లేకుండా లభించే స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులు. వీటిని ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి ‘జీసీసీ’ పేరుతో బ్రాండింగ్ చేస్తున్నారు. ఇంకొన్ని ఉత్పత్తుల ద్వారా సబ్బులు, షాంపులతో పాటు అరకు కాఫీ, వైశాఖీ కాఫీపొడి తయారుచేస్తున్నారు. వీటి కోసం హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి నేరుగా మార్కెట్లకు విక్రయిస్తున్నారు. వీటి బ్రాండింగ్‌తో పాటు మార్కెటింగ్ విశాఖపట్నంలోని జీసీసీ ఆధ్వర్యంలో జరుగుతోంది. బ్రాండింగ్, వాటి ధర, ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు ప్యాకెట్‌పై ముద్రిస్తున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. తుట్టె నుంచి తేనెను సేకరిస్తున్న దృశ్యం ఉపాధి అవకాశాలు మెరుగు ఇటీవల వీటికి గిరాకీ పెరుగుతుండడంతో గిరిజనులు కూడా ఎక్కువగా అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. అంతేకాక, వారి పొలాల్లో ఇతర పంటలు పండించి వాటిని సొసైటీకి ఇస్తున్నారు. దీంతో వీరికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. రాష్ట్రంలో అటవీ ఉత్పత్తులపై ఆధారపడే గిరిజనులు 3.78 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సేకరిస్తున్న ఉత్పత్తులను ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులోకి తేవడం ద్వారా కల్తీలేని స్వచ్ఛ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. సూపర్ మార్కెట్లలో జీసీసీ బ్రాండ్ ఉత్పత్తులు భారీగా సేల్ అవుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు లభించడంలేదు కూడా. గిరిజనుల కోసం నిత్యావసర డిపోలు గిరిజనుల ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు వీరికి అవసరమయ్యే వస్తువులు వినియోగించేలా నంద్యాల, ప్రకాశం జిల్లాలోని దోర్నాల సొసైటీలతో పాటు ఇతర సొసైటీలలో నిత్యావసర డిపోలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం, చక్కెర, కందిపప్పుతో పాటు జీసీసీ బ్రాండ్ పసుపు, కారం, చింతపండు, కాఫీ, సబ్బులు, షాంపులు, తదితర వస్తువులు ఇక్కడ అందిస్తారు. అలాగే, ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 100 గిరిజన హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటికి కావల్సిన ఆహార వస్తువులు, కాస్మోటిక్స్, శానిటరీ వస్తువులు కూడా శ్రీశైలం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. దీంతో పాటు వీరి అభివృద్ధి కోసం 171 చెంచుగూడేల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా గిరిజనుల ఆర్థిక స్థోమత పెరిగి సంతోషంగా జీవిస్తున్నారు. -
స్వాతంత్య్రం వచ్చాక మన్యంలో తొలిసారి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండేళ్ల క్రితం వరకు అడవి బిడ్డల ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. చిన్నపాటి జ్వరం వస్తే మన్యం వీడి.. మైదానం వైపు పరుగులు తీసే ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జ్వరాలకు మాత్రలందించేందుకూ వీల్లేని దుస్థితి నుంచి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలిగే స్థాయికి ఏజెన్సీ ఆస్పత్రులు చేరుకున్నాయి. కాన్పుల కోసం అనకాపల్లి, వైజాగ్ వైపు అష్టకష్టాలు పడి గర్భిణుల్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలుగా కాన్పులు నిర్వహిస్తూ తల్లీబిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సారిగా రెండు రోజుల వ్యవధిలో రెండు మేజర్ ఆపరేషన్లు పాడేరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించి రికార్డు సష్టించారు. కాలిలో సిరలు ఉబ్బి నడవడం కష్టంగా మారి ఆస్పత్రిలో చేరిన ఏజెన్సీకి చెందిన వి.చంద్రకళ (30)కు పాడేరు జిల్లా ఆస్పత్రి వైద్యులు సోమవారం వెరికోస్ వెయిన్స్ ట్రెండెలెన్‌బర్గ్ చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన జి.నన్నారావు (48)కు మంగళవారం హెర్నియా రిపేర్ శస్త్రచికిత్సను చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి చరిత్రలో ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. కలెక్టర్ అభినందన మేజర్ ఆపరేషన్లను మారుమూల మన్యంలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బందాన్ని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అభినందించారు. ‘ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషలిస్టు డాక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఏజెన్సీలోనే మేజర్ ఆపరేషన్లను చేసే స్థాయికి వచ్చాం’ అని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆటలకు సై..!
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్కుమార్పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్‌కుమార్ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగేష్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. -
అక్రమ ఆపరేషన్లపై ప్రభుత్వం కొరడా
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్‌నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్‌కు ఇన్చార్జిగా నియమించారు. -
ఆంధ్రా అధికారిని ఘెరావ్ చేసిన ఒడిశా ఎమ్మెల్యే
సాలూరు: ఆంధ్రాకు చెందిన అధికారిని ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఘెరావ్ చేశారు. గిరిపుత్రులు ఎదురుతిరగడంతో పలాయనం చిత్తగించారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు బుధవారం పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ వెళ్లారు. ఆంధ్రాలో కలిసిపోయేందుకు సుముఖత తెలిపిన పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ పీవోను ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగమని చెప్పారు. దీనికి పీవో సమాధానమిస్తూ.. ఇది రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఇది ఒడిశా భూభాగమని ఏమైనా ఆధారాలుంటే చూపించాలన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినదించారు. ఇదంతా పరిశీలిస్తున్న గిరిజనసంఘ నాయకుడు చోడిపల్లి బీసు, గిరిపుత్రులు పీవోకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా నిలుస్తోందని, తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గిరిపుత్రులను పీవో శాంతింపజేశారు. గిరిజనుల తిరుగుబాటుతో కంగుతున్న ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. -
అక్రమ ఆపరేషన్లపై విచారణ వేగవంతం
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్‌రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు. అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. -
అక్రమ కు.ని. ఆపరేషన్లపై విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీలో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు వైద్య బృందంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విశాఖ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మారుమూల ఈదులపాలెం ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఓ మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి గిరిజనుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న వైనంపై ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఏడీఎంహెచ్‌వో, ఇతర వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. మెడికల్ షాపులో ఇంతవరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించడంతో పాటు ఆపరేషన్ జరిగిన మహిళలందరితో మాట్లాడి పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలా ప్రసాద్‌ను ఆదేశించారు. విచారణ అధికారిగా ఈదులపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లకే శివప్రసాద్ పాత్రుడును నియమించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు, మరో ప్రభుత్వ స్టాఫ్ నర్సు అని గుర్తించారు. ఇందుకు ఈదులపాలెం ఆస్పత్రిలోని కొంతమంది వైద్య సిబ్బంది కూడా సహకరించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. ఇక్కడ రెండు విడతలుగా భారీ సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు చేసినట్టు ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు.