సీతంపేట: గిరిజన గ్రామాలకు రూ.కోట్లు వెచ్చించి వేస్తున్న రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం.. రోడ్ల నిర్మాణంలో అలసత్వం వెరసి అనతికాలంలోనే రూపం కోల్పోతున్నాయి. దీనికి ఈతమానుగూడకు సుమారు రూ.50 లక్షలు, జగ్గడగూడకు రూ.20 లక్షలతో నిర్మించిన రోడ్లే నిలువెత్తు సాక్ష్యం. ఇంచుమించుగా అన్ని రోడ్ల పరిస్థితి ఇంతే. మరికొన్ని గ్రామాలకు అసలు రోడ్లే నిర్మించకపోవడంతో గిరిజనులు రాళ్లదారులపై నరకప్రయాణం సాగిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 1250 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికీ 300లకు పైగా గ్రామాలకు రోడ్లు లేవు. 2012 నుంచి ఇప్పటి వరకు భామిని, సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, పాలకొండ, వీరఘట్టం, సారవకోట, మందస, బూర్జ, నందిగాం తదితర మండలాల్లో ఉపాధిహామీ నిధులతో రోడ్లు వేశారు. 2012–13 ఆర్‌సీపీ –2లో 29 పనులకు 27 పూర్తి చేయగా రూ.41.8 లక్షలు వెచ్చించారు. 2013–14లో ఆర్‌సీపీ–3 కింద 296 పనులకు 21 పనులు పూర్తిచేశారు. రూ.75.99లక్షలు ఖర్చుచేశారు. 275 పనులు చేస్తామంటూ ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. అన్‌కనెక్టవిటీ విలేజ్ ప్రొగ్రాంలో 71 పనులకు రూ.16 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించారు. కంచిలి మండలంలో 9, బామిని, హిరమండలాల్లో 3 పనులు చొప్పున, కొత్తూరు, పాతపట్నం 2, మందస 13, సీతంపేట, వీరఘట్టం 4, సరుబుజ్జిలి 1, సారవకోట 7, మందస 13, టెక్కలిలో 3 పనులు ఆరంభించారు. నిర్మాణంలో నాణ్యత లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంట్రాక్టర్లతో ఐటీడీఏ అధికారులు కుమ్మక్కైయ్యారంటూ ఆరోపిస్తున్నారు.
క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎక్కడ?
ఇంజినీరింగ్ శాఖ విభాగం ఆధ్వర్యంలో జరిగే రోడ్ల పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్లే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే రాళ్లు తేలిపోవడం, కొండలపై గ్రామాలకు మధ్యమధ్యలో సీసీ ర్యాంపులు వేయకపోవడం, సగం పనిచేసి మిగతాపని పూర్తి చేయకపోవడంతో గిరిజనులకు ప్రయోజనం కలగడంలేదు. కొన్ని గ్రామాలకు కనీసం బైక్‌లు కూడా వెళ్లని పరిస్థితి. అత్యవసర వేళ 108 వాహనాలు వెళ్లవు. ఇలాంటి గ్రామాలు 80 ఉన్నాయి. ఈ గ్రామాల్లోని రోగులను డోలీపై ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే.
చర్యలు తప్పవు..
రోడ్ల నాణ్యతాలోపాలను ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ వద్ద ప్రస్తావించగా నాణ్యతలేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. పనులు వద్ద కాంట్రాక్ట్ పేరు, ఫోన్‌తో బోర్డు పెట్టిస్తామన్నారు. నాణ్యత లోపిస్తే గ్రామస్తులు ప్రశ్నించవచ్చన్నారు. రోడ్లు లేని గ్రామాలకు ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తామన్నారు.
రూ.కోట్లు ఖర్చు.. నాణ్యత ఉంటే ఒట్టు..!
Published Tue, Jan 17 2017 5:04 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement
Advertisement