sitampeta
-
చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు
కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్ వద్ద రీసార్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్టర్న్ వెహికల్ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి. పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా.. తొటపల్లి రిజర్వాయర్ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్ థియేటర్, ట్రైబుల్ మ్యూజియం, ట్రైబుల్ ఆర్ట్‌గ్యాలరీ అండ్ బజార్, హెలీప్యాడ్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్ హార్టీకల్చర్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మూడు రోప్‌వేలు... సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్ రీసార్ట్ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..) పర్యాటకాభివృద్ధికి కృషి జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. – నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు
వారే వారసులు.. అనాది జీవన విధానానికి, అపురూప సంస్కృతికి, అరుదైన సంప్రదాయాలకు శాశ్వత చిరునామా వారు. వారు వారధులు కూడా.. నిన్నటి తరం వదిలిపెట్టిన వన సంపదను రేపటి తరానికి అందించే బాధ్యతను మోస్తున్నారు. పచ్చటి కొండకోనలను వేల ఏళ్లుగా రక్షిస్తూ, బతుకులను అడవి తల్లి సంరక్షణకు అర్పిస్తూ ఆదివాసీలు అందరికీ మేలు చేస్తున్నారు. అడవి ఇంకా బతికి ఉందంటే అదంతా వారి పుణ్యమే. అందుకే ఓ చల్లటి గాలి వీచినా, వెచ్చటి చినుకు పడినా మొదటి కృతజ్ఞత వారికే దక్కాలి. నేడు ఆదివాసీ దినోత్సవం. ఆహారం నుంచి ఆహార్యం వరకు అన్నింటా విభిన్నంగా కనిపించే వారి జీ‘వన’శైలి ఎప్పటికీ ప్రత్యేకమే. ఎల్ఎన్ పేట: కళ్లు తెరిస్తే పచ్చటి అడవి. తలెత్తి చూస్తే కొండ శిఖరం. అడుగు మోపితే ఆకుల తివాచీలు. ఆదివాసీల జీవనం ఎంత విశిష్టమో అంతే విభిన్నం కూడా. ఉద్యోగాలు వచ్చి కొందరు వనం వదలి వచ్చేసినా ఇంకా ఆ అడవి ఒడిలో ఎందరో బతుకుతున్నారు. కొండపోడు చేసుకుంటూ అడవి తల్లికి కాపు కాస్తున్నారు. వారి కట్టు, బొట్టు పరిశీలిస్తే అనాది సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయి. మన్యం జిల్లాగా విడిపోయిన తర్వాత సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, భామిని ఈ నాలుగు మండలాలు మన్యం జిల్లాకు వెళ్లగా.. మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 74వేల గిరిజన కుటుంబాలు, సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. 301 గిరిజన గ్రామ పంచాయతీల్లో 103 షెడ్యుల్ గ్రామాలు కాగా, 1282 నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. పోడు పంటలే ప్రధానం గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. జొన్నలు, సజ్జలు, రాగులు, గంటెలు, కంది, అరటి, బొప్పాయి, జీడి, సీతాఫలం, పైనాపిల్, పనస, పసుపు, అల్లం, కొండ చీపుర్లు, ఆగాకర, కర్రపెండ్లం, చీమ మిరప, జునుములు వంటి అనేక పంటలు పండిస్తారు. ఉదయాన్నే పనిచేసుకునేందుకు కుటుంబమంతా పోడు వద్దకు చేరుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పంటలు పండిస్తారు. ఐకమత్యమే బలం.. గిరిజనుల్లో ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నా.. అంతా కలిసికట్టుగా బతకడమే వారి బలం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతా ఒక చోట కు చేరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యక్రమం చేయాలన్నా అందరూ తలో కొంత సాయం చేసుకుంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ఊరంతా ఆ మాటకు కట్టుబడి ఉంటారు. కట్నం ఉండదు గిరిజనుల ఇంట పెళ్లి జరిగితే కట్నం అనే మాట ఉండదు. కట్నం ఎందుకు తీసుకోవటం లేదని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే.. ‘ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తారు. అప్పు కోసం వారు ఎన్నో బాధలు పడాలి. అలాంటి డబ్బు తీసుకోక పోవటమే మంచిది’ అంటారు. అయితే సారె సామాన్లు మాత్రం స్వీకరిస్తారు. జిల్లాల విభజన తర్వాత.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత శ్రీకాకుళంలో ఉన్న సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్లింది. ఐటీడీఏను ఉమ్మడిగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇటు శ్రీకాకుళం, అటు మన్యం జిల్లా పార్వతీపురంతో కలిసి సీతంపేట ఐటీడీఏ కొనసాగుతోంది. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు గిరిజన సంఘాల నాయ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?) మరింత ప్రోత్సాహం ఇవ్వాలి.. గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా అనేక మంది గిరిజనులు అమాయకంగానే జీవిస్తున్నారు. పోడు భూమికి పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించాలి. పోడు పంటలు పండించే గిరిజన రైతులను గుర్తించి అంతరించి పోతున్న పంటల సాగును ప్రోత్సహించాలి. – పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం అధ్యక్షురాలు, శ్రీకాకుళం -
సూపర్ 60@ ఐఐటీ
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ ఇప్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.ఎం.సాయికాంత్ వర్మ తలపెట్టారు. ‘సూపర్ 60’ పేరుతో బ్యాచ్‌ను తయారు చేసి శ్రీకాకుళం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న వైటీసీలో నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో పీఓ ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఐఐటీ, ఎన్ఐఐటీ తదితరఇంజినీరింగ్కోర్సులకు ఒక్క గిరిజన విద్యార్థి కూడా ఎంపిక కాలేదని, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తే తప్పక విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అధ్యాపకులను ఈనెల 14న ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో వారికి ప్రత్యేక పరీక్ష, వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులు బోధిస్తున్న అధ్యాపకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. సబ్జెక్టుకు ఇద్దరు లెక్చరర్లను నియమిస్తామన్నారు. ఎంపికైన అధ్యాపకులకు డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుని వారికి వచ్చే జీతానికి అదనంగా రూ.20 వేల పారితోషికం ఇస్తామన్నారు. విద్యార్థులు ఐఐటీకి ఎంపికైతే వారి సంఖ్యను బట్టి ప్రోత్సాహంగా మరికొంత పారితోషికం ఇస్తామన్నారు. జిల్లాలో ఏ ప్రభుత్వ కళాశాల నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం 9573844699 నంబరుకు ఫోన్ చేసి ట్రైబల్ వెల్ఫేర్ డీడీని సంప్రదించవచ్చన్నారు. గురుకులం, పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక ఎంట్రన్స్ టెస్ట్‌ను పెట్టి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 60మంది, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఏనుగులను కవ్వించొద్దు... సీతంపేట ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగులకు ఎటువంటి కవ్వింపు చర్యలు చేపట్టవద్దని ఐటీడీఏ పీఓ సాయికాంత్ వర్మ తెలిపారు. చాలామంది యువకులు ఏనుగులను చూడాలని వాటి వద్దకు వెళ్లి ఫొటోలు వంటివి తీస్తున్నారని, ఇది ప్రమాదకరమన్నారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలను ట్రాకర్లు ఎప్పటికప్పుడు గమనించి సమాచారాన్ని గిరిజనులకు చేరవేస్తున్నారన్నారు. దాని బట్టి గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు చెప్పిన సూచనలు పాటించాలన్నారు. ఏనుగులను తరలించడానికి ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించడం జరగిందన్నారు. దీనిపై మరికొన్ని రోజుల్లో పరిష్కారం ఉంటుందన్నారు. గిరిజన అటవీ ఉత్పత్తులైన ఫైనాపిల్, పసుపు, జీడి వంటి వాటికి మార్కెట్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. -
సికిల్‌సెల్ విద్యార్థులకు ప్రత్యేక వైద్యసేవలు
సీతంపేట: గిరిజన ఆశ్రమపాఠశాలల్లో గతంలో జరిపిన హిమోగ్లోబిన్ పరీక్షల్లో సికిల్‌సెల్ ఎనిమియా పాజిటివ్‌గా వచ్చిన 106 మంది గిరిజన విద్యార్థులకు రక్తం ఎక్కించి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏలో విద్యార్థుల ఆరోగ్య విషయమై ఏటీడబ్ల్యూవోలు, పీఎంఆర్సీ, గిరిజన సంక్షేమశాఖ, వైద్యసిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కొద్దిరోజుల్లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రక్తాన్ని విద్యార్థులకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షలు హెల్త్ వలంటీర్ల ద్వారా నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో తాగునీటి కోసం 25 ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయన్నారు. ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన ప్రాథమిక చికిత్స కిట్లు ఇవ్వాలని సూచించారు. అక్టోబర్ 15నాటికి విద్యార్థులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈనెల 7,8 తేదీల్లో హెల్త్‌వలంటీర్‌లకు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే జిల్లా కో–ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, న్యూనెట్ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రాజు, ఏటీడబ్ల్యూవోలు బల్ల అప్పారావు, మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడి పర్యటన!
వచ్చారు.. వెళ్లారు అన్నట్టుసాగిన మంత్రి కామినేని మన్యం టూర్ మారుమూల పీహెచ్‌సీలు, సబ్సెంటర్లను తనిఖీ చేయని వైనం రహదారి పక్క గ్రామాలకే పరిమితం.. మందులు, సిబ్బంది ఖాళీలపై దృష్టిసారించని వైద్య మంత్రి మన్యం పర్యటనకు వైద్యశాఖ మంత్రి వస్తున్నారంటే తమ ఆరోగ్యాలు గురించి పట్టించుకుంటారని ఆశించిన గిరిజనులకు నిరాశే మిగిలింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏజెన్సీలో మంగళవారం పర్యటించగా.. అది మొక్కుబడిగానే సాగింది. పర్యటన షెడ్యూల్ మేరకు ఉన్న మారుమూల గ్రామాలను, కొండ ప్రాంతాల్లో కాకుండా కేవలం రహదారి పక్కనున్న గ్రామాలను సందర్శించి మమ అనిపించారు. కుసిమి గ్రామానికి వెళ్లిన మంత్రి మంచినీటి బావిని మాత్రమే పరిశీలించారు. సబ్‌సెంటర్‌ను తనిఖీ చేయలేదు. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సైతం సందర్శించలేదు. ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు, మందుల గురించి కనీసం ఆరా తీయలేదు. సీతంపేట: మంత్రి కామినేని శ్రీనివాస్ మన్యం పర్యటన మొక్కుబడిగానే సాగింది. గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై కనీసం దృష్టిసారించలేదు. మారుమూలన ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, రోజువారి ఓపీ ఎలా ఉంది, వైద్య సిబ్బంది పనితీరు, ఖాళీలు, మందులు ఉన్నాయా? లేదా అనేది పరిశీలించాల్సి ఉన్నప్పటికీ అవేవి చూడకుండా కొద్ది సేపు అక్కడ ఉన్న గిరిజనులతో మాట్లాడి వెళ్లిపోయారు. హైరిస్క్ గ్రామాలైన దోనుబాయి, మర్రిపాడు ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజా సమస్యలు తెలిసేవి. అలా కాకుండా గ్రామాల్లోని వీధుల్లో తిరిగి.. ఒకరిద్దరు గిరిజనులతో మాట్లాడి పర్యటనను ముగించారనే విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. పర్యటన సాగింది ఇలా... మల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను కామినేని సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తల్లిదండ్రులను వ్యాధుల పట్ల చైతన్యం చేయాలని కోరారు. పాత అలవాట్లకు స్వస్తి పలికి ఇళ్లల్లో దోమలనివారణా మందును స్ప్రేయింగ్ చేయించుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం జక్కరవలస గ్రామాన్ని సందర్శించారు. అక్కడ మంచినీటి వసతిసౌకర్యాలు పరిశీలించారు. మండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, వీధులను పరిశీలించారు. కిరప గ్రామానికి వెళ్లి అక్కడ గిరిజనులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను మీ కోసం చేస్తుందన్నారు. వైద్యపరమైన సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. వైద్యాధికారి నరేష్ కుమార్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. మంచి నీటి సమస్య ఉందని సర్పంచ్ గోపాల్‌తో పాటు పలువురు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పెదరామ గ్రామానికి మంత్రి వెళ్లగా గ్యాస్ స్టౌలు పంపిణీ చేయలేదని మహిళలు ఫిర్యాదు చేశారు. అలాగే వివిధ సమస్యలను ఎమ్మెల్యే కళావతితో పాటు గిరిజనులు వివరించారు. దేవనాపురంలో మంత్రి పర్యటించినప్పటికీ వైద్య పరమైన విషయాలను ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సీతంపేట సీహెచ్‌సీని సందర్శించిన కామినేని ఎక్స్‌రే మిషన్, జనరేటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఆర్సీ, బర్త్‌వెయిటింగ్ గదిని పరిశీలించారు. అనంతరం రేగులగూడ, వెంపలగూడ, సోమగండి తదితర గ్రామాలను సందర్శించినప్పటికీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వైద్య సిబ్బంది పనితీరు బాగుందని చెప్పడం స్థానికులను విస్మయం కలిగించింది. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి, ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్, ఆర్డీవో గున్నయ్య, ఎంపీపీ ఎస్.లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు రాజబాబు, ఎంపీటీసీ సభ్యులు బి.జయలక్ష్మి, బి.దమయంతి, శశికళ సర్పంచ్ విజయకుమారి, మలేరియా నివారణా శాఖ జేడీ ఏడీవీ లక్ష్మి, వైద్యాఆరోగ్యశాఖ జేడీ సావిత్రి, డీఎంహెచ్ ఎస్.తిరుపతిరావు, అదనపు డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేష్కుమార్, ఈఈ అశోక్, డీఈ సింహాచలం, జేఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునరా వు, జేఈ మూర్తి, జీసీసీ మేనేజర్ లిల్లీపుష్పనాథం ఉన్నారు. వైద్యులు నిబద్ధతతో పని చేయాలి గిరిజన ప్రాంతాల్లో వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ప్లాన్ మండలాలకు చెందిన వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజీవనానికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులకు ఎంత సేవైనా చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆసరా వంటి పథకాలు వినూత్న రీతిలో ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇటువంటి అధికారి సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల్లో కమ్యూనికేషన్ లోపం ఉందని దీని కారణంగా చాపరాయిలో 22 రోజుల్లో 16 మంది మృతి చెందారన్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యాధికారులకు జీతం రూ. 40 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని.. దీన్ని పెంచాలని మర్రిపాడు వైద్యాధికారి చంద్రమౌళి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్ట్ డాక్టర్లను రెగ్యులర్ చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈఎన్‌వీ నరేష్కుమార్ కోరారు. -
ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా
టెన్త్ విద్యార్థినికి బెదిరింపులు సీతంపేట (విశాఖ ఉత్తరం) : మొదటి సారి నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాను, నిన్ను లవ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. ను వ్వు కూడా నన్ను లవ్ చేయాలి, లేకుంటే యాసిడ్ పోస్తా... అంటూ టెన్త్ క్లాస్ విద్యార్థి తనతోపాటు పరీక్ష రాస్తున్న విద్యార్థినిని వేధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెలితే న్యూరేసపువానిపాలెంకు చెందిన పదో తరగతి విద్యార్థి సీతంపేట రాజేంద్రనగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అలాగే శివాజీపాలెంకు చెందిన అమ్మాయి ఎంవీపీ కాలనీలోని ప్రైవేటు స్కూల్లో టెన్త్ చదువుతోంది. జంబ్లింగ్ సిస్టం కావడంతో వీరిద్దరూ సీతంపేట మధురానగర్‌లోని జీవీఎంసీ హైస్కూల్లో టెన్త్ పరీక్షలు రాయడానికి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే రూమ్‌లో ముం దు వెనకా కూర్చున్నారు. పరీక్షలు ప్రా రంభం నుంచి అమ్మాయిని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో పరీక్ష రాయనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నాడని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్లడంతో , అబ్బాయిని మందలించి వదిలేశారు. నాల్గవ రోజు ఎడమ చేతిపై కోసుకున్న గాయాలు చూపించి, ఇదంతా నీకోసమేనన్నాడు. లవ్ చేయకుంటే యాసిడ్‌పోస్తానని బెదిరించడంతో అమ్మాయి భయపడిపోయింది. తిరిగి ఇన్విజిలేటర్లకు, తను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్, అమ్మాయి తల్లిదండ్రులు బుధవారం పరీక్షా కేంద్రానికి వచ్చారు. మా అమ్మాయిని బెదిరిస్తున్నాడని పరీక్ష కేంద్రం ఇన్చార్జి దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు విషయాన్ని ద్వారకా పోలీస్‌స్టేషన్ సీఐకు వివరించారు. దీం తో అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రుల ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశా రు. పిల్లలు తప్పు చేస్తే పెద్దలదే బాధ్య త, చదువుకునే వయస్సులో తప్పు చేస్తే వారి భవిష్యత్ నాశనం అవుతుంది, జాగ్రత్త వహించాలని హెచ్చరించి పంపించారు. జాగ్రత్త చెబుతామని అబ్బాయి తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. పరీక్ష గదిని మార్చాలని అమ్మాయి తల్లిదండ్రులు కోరగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అబ్బాయిని వేరే రూమ్‌కు మార్పుచేస్తామని పరీక్షా కేంద్రం ఇన్చార్జి వై.కృష్ణ తెలిపారు. -
అట్రాసిటీ కేసుపై విచారణ
సీతంపేట : గిరిజన సహకార సంస్థలో ఎంసీడబ్ల్యూగా పనిచేస్తున్న దళిత మహిళా ఉద్యోగిని ఎం.సాయమ్మపై అదే సంస్థ మేనేజర్ ఎస్.నారాయణరావు ఇటీవల దాడికి పాల్పడినట్లు అట్రాసిటీ కేసు నమోదైన విషయం విదితమే. దీంతో సంబంధిత మేనేజర్‌పై శనివారం విచారణ చేపట్టారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ పి.పెంటారావు దర్యాప్తు నిర్వహించారు. బాధితురాలు, మేనేజర్, ఇతర సిబ్బంది వద్ద వేర్వేరుగా స్టేట్మెంట్ రికార్డు చేశారు. సూపర్‌బజార్ సేల్స్‌మన్ దుర్గారావు, ఇతరుల నుంచి వివరాలు సేకరించారు. -
ఇదీ జీ‘వనం’..!
సీతంపేట: అంతా హైటెక్. అన్నీ టెక్నాలజీతోనే. వేలి ముద్రలు, కంటి చూపుతో రేషను, పింఛన్లు ఇస్తున్న సర్కారుకు ఇక్కడి బతుకులు పట్టడం లేదు. నిత్యం సాంకేతిక మంత్రం జపిస్తున్న అధికార పార్టీ నాయకులను ఇక్కడి చావులు కూడా కదిలించడం లేదు. డిజిటల్ వ్యవస్థ విశ్వరూపం చూపిస్తున్న పరిస్థితుల్లో జిల్లాలోని 300 ఏజెన్సీ గ్రామాలు కనీసం ఫోన్ కాల్‌కు నోచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పది నుంచి 20 కిలోమీటర్ల దూరం వచ్చి ప్రయత్నిస్తే గానీ 108కు సమాచారం అందించలేరంటే నమ్మాల్సిందే. సీతంపేట చుట్టుపక్కల.. సీతంపేట ఏజెన్సీలో సుమారు 24 పంచాయతీల్లో 500కుపైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 300 గ్రామాల ప్రజలు నిత్యం బతుకు యుద్ధం చేస్తున్నారు. దాదాపు సగం గ్రామాల్లో పూర్తిగా నెట్వర్క్ సేవలు లేవు. సెల్‌ఫోన్ వంటి సౌకర్యం లేకపోవడంతో దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులు, మైదాన ప్రాంతాల్లో చదువుతున్న తమ పిల్ల లతో మాట్లాడడానికి గిరిజనులకు వీల్లేకుండా పోతోంది. అత్యవసర సమయాల్లో గర్భిణు లు, రోగులను సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు తదితర ప్రాంతాల ఆస్పత్రులకు తరలించాలన్నా ఇబ్బందే. నెట్వర్క్ లేకపోవడంతో 108కు కూడా వీరు ఫోన్ చేయలేకపోతున్నారు. రాత్రిపూట ఎక్కడో సిగ్నల్ ఉన్న ప్రాం తానికి వచ్చి ఫోన్ చేయాల్సి వస్తోందని గిరిజనులు చెబుతున్నారు. ఈ లోగా ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. పింఛన్‌దారుల పాట్లు అయితే వర్ణాణాతీతం, వికలాంగులు, వృద్ధు లు, వితంతువుల వేలి ముద్రలు పడాలి.. కానీ నెట్వర్క్ పనిచేయక వీరికి ప్రతి నెలా ఇబ్బం దులు తప్పడం లేదు. 20 నుంచి 25 కిలో మీటర్ల దూరంలో నెట్వర్క్ ఉన్న చోటకు కొండలపై నడుచుకుంటూ వచ్చి పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మైదాన ప్రాంతాలకు రావాలంటే పల్లెవెలుగు బస్సుల సౌకర్యం అరకొరగా ఉండడంతో ప్రైవేటు వాహనాలపైనే గిరిజనులు ఆధారపడుతున్నారు. కమ్యూనికేషన్ కరువు మండలంలోని దోనుబాయి, పుబ్బాడ, దారపాడు, సామరెల్లి, పుబ్బాడ, కిల్లాడ, కుడ్డపల్లి, టిటుకుపాయి పంచాయితీల పరిధిలో పూర్తిగా కమ్యూనికేషన్ లేదు. దోనుబాయిలో బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఉన్నా సాంకేతిక పరమైన లో పాలు ఉండడంతో టవర్‌ను ప్రారంభించలేదు. పూతికవలస, కొండాడ, శంబాం, హడ్డుబంగి, కోడిశ, కుశిమి, పులిపుట్టి, హడ్డుబంగి పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాల్లో అరకొర సమాచార వ్యవస్థతో ప్రజలు నెట్టుకొస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కళావతి ఎంత కృషి చేస్తున్నా సర్కారు సహకారం లేకపోవడంతో వీరి బతుకులు బాగు పడడం లేదు. ఈ గ్రామాల్లో కనీసం బ్యాంకులు అందుబాటులో లేవు. మహిళా సంఘాలు, రైతులు, ఇతరులు బ్యాంకు పనిమీద సీతంపేటకు రావాల్సిందే. గతంలో దోనుబాయిలో ఆంధ్రాబ్యాం కు ఉండేది. దాన్ని ఎత్తివేశారు. బ్యాంకు పనుల కోసం సీతంపేటలో ఉన్న బ్యాంకులకు రావాల్సి వస్తోందని గిరిజనులు చెబుతున్నారు. దోనుబాయి, పొల్ల ప్రాంతంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే సమస్యలు తీరుతాయని కోరుతున్నారు. పట్టించుకోవడం లేదు ఇన్ని సమస్యలు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ముం దుగా కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తే బా గుంటుంది. ఎక్కడకు వెళ్లాలన్నా రవాణా వ్యవస్థ కూడా అరకొరగా ఉంది. మా పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. – గేదెల కోటేశ్వరరావు, దోనుబాయి సర్పంచ్ -
రూ.కోట్లు ఖర్చు.. నాణ్యత ఉంటే ఒట్టు..!
సీతంపేట: గిరిజన గ్రామాలకు రూ.కోట్లు వెచ్చించి వేస్తున్న రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం.. రోడ్ల నిర్మాణంలో అలసత్వం వెరసి అనతికాలంలోనే రూపం కోల్పోతున్నాయి. దీనికి ఈతమానుగూడకు సుమారు రూ.50 లక్షలు, జగ్గడగూడకు రూ.20 లక్షలతో నిర్మించిన రోడ్లే నిలువెత్తు సాక్ష్యం. ఇంచుమించుగా అన్ని రోడ్ల పరిస్థితి ఇంతే. మరికొన్ని గ్రామాలకు అసలు రోడ్లే నిర్మించకపోవడంతో గిరిజనులు రాళ్లదారులపై నరకప్రయాణం సాగిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 1250 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికీ 300లకు పైగా గ్రామాలకు రోడ్లు లేవు. 2012 నుంచి ఇప్పటి వరకు భామిని, సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, పాలకొండ, వీరఘట్టం, సారవకోట, మందస, బూర్జ, నందిగాం తదితర మండలాల్లో ఉపాధిహామీ నిధులతో రోడ్లు వేశారు. 2012–13 ఆర్సీపీ –2లో 29 పనులకు 27 పూర్తి చేయగా రూ.41.8 లక్షలు వెచ్చించారు. 2013–14లో ఆర్సీపీ–3 కింద 296 పనులకు 21 పనులు పూర్తిచేశారు. రూ.75.99లక్షలు ఖర్చుచేశారు. 275 పనులు చేస్తామంటూ ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. అన్కనెక్టవిటీ విలేజ్ ప్రొగ్రాంలో 71 పనులకు రూ.16 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించారు. కంచిలి మండలంలో 9, బామిని, హిరమండలాల్లో 3 పనులు చొప్పున, కొత్తూరు, పాతపట్నం 2, మందస 13, సీతంపేట, వీరఘట్టం 4, సరుబుజ్జిలి 1, సారవకోట 7, మందస 13, టెక్కలిలో 3 పనులు ఆరంభించారు. నిర్మాణంలో నాణ్యత లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంట్రాక్టర్లతో ఐటీడీఏ అధికారులు కుమ్మక్కైయ్యారంటూ ఆరోపిస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎక్కడ? ఇంజినీరింగ్ శాఖ విభాగం ఆధ్వర్యంలో జరిగే రోడ్ల పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్లే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే రాళ్లు తేలిపోవడం, కొండలపై గ్రామాలకు మధ్యమధ్యలో సీసీ ర్యాంపులు వేయకపోవడం, సగం పనిచేసి మిగతాపని పూర్తి చేయకపోవడంతో గిరిజనులకు ప్రయోజనం కలగడంలేదు. కొన్ని గ్రామాలకు కనీసం బైక్‌లు కూడా వెళ్లని పరిస్థితి. అత్యవసర వేళ 108 వాహనాలు వెళ్లవు. ఇలాంటి గ్రామాలు 80 ఉన్నాయి. ఈ గ్రామాల్లోని రోగులను డోలీపై ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. చర్యలు తప్పవు.. రోడ్ల నాణ్యతాలోపాలను ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ వద్ద ప్రస్తావించగా నాణ్యతలేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. పనులు వద్ద కాంట్రాక్ట్ పేరు, ఫోన్‌తో బోర్డు పెట్టిస్తామన్నారు. నాణ్యత లోపిస్తే గ్రామస్తులు ప్రశ్నించవచ్చన్నారు. రోడ్లు లేని గ్రామాలకు ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తామన్నారు. -
తొమ్మిదేళ్లలో 14 మంది బలి
సీతంపేట: ఒకటి కాదు రెండు తొమ్మిదేళ్లుగా ఏనుగులు మన్యం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నారయి. ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నా యి. ఎదురు పడిన వారి ప్రాణాలు తీస్తున్నా యి. ఇంత జరుగుతున్నా... అధికారుల్లో చల నం లేదు. వాటి తరలింపునకు చర్యలు తీసుకోవడంలేదంటూ గిరిజనులు మండిపడుతున్నారు. భయంభయంతో బతుకుతున్నారు. 2007 సంవత్సరంలో ఒడిశా లఖేరీ అడవుల నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ఇప్పటి వర కు 14 మందిని చంపేశారుు. సీతంపేట, హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో సంచరిస్తూ వందలాది ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేసి రైతులకు నష్టాన్ని మిగిల్చారుు. ఏనుగుల నష్టాలు ఇలా... 2007 డిసెంబర్ 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావును, దోనుబారుు గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. అదే నెల 19న కుంబిడి నాగరాజు అనే వీరఘట్టానికి చెందిన పాత్రికేయుడిని హుస్సేన్‌పురం వద్ద దారుణంగా హతమార్చాయి. 21న ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును విచక్షణారహితంగా చెట్లకు విసిరికొట్టి మాంసం ముద్దను చేశాయి. ఏడాది కాలం వ్యవధి తర్వాత వీరఘట్టం మండలం చలివేంద్రి వద్ద కొండగొర్రె సాంబయ్యను కూడా ఇదే తరహా లో ఏనుగులు పొట్టనపెట్టుకున్నారుు. అటు తర్వాత ఏడాది, రెండేళ్లకొక మారు ఒకరిద్దరిని చంపేయడం రివాజుగా మారింది. వ్యవసాయ పనులకు వెల్లిన వారిని చాలా మందిని ఏనుగులు పొట్టన బెట్టుకోవడంతో ఆ కుటుం బాలన్నీ దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డాయి. ఇదే క్రమంలో వందలాది ఎకరాల్లో పంట కూడా ధ్వంసమౌతుంది. పంటలను కాపాడుకునే క్రమంలో గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాపై చిన్నచూపు కొద్ది నెలల కిందట ఆపరేషన గజా పేరుతో విజయనగరం జిల్లాలోని ఒక గున్న ఏనుగు ను, చిత్తూరు జిల్లాలోని రారుువరం పరిధిలో మరో ఏనుగును జంతు ప్రదర్శన శాలలకు తరలించారు. శ్రీకాకుళం ఏజెన్సీలో తొమ్మిదేళ్లుగా ఏనుగులు సంచరిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. కనీసం ప్రభుత్వం నుం చి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏలో జరిగిన పాలకవర్గ సమావేశానికి వచ్చిన మంత్రులు ఏనుగులు తరిమేస్తామని, సమస్య పరిష్కరిస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న ప్రకటనలు శూన్యమే అయ్యాయి. -
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సీతంపేట(శ్రీకాకుళం): అక్రమంగా రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు 30క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మెట్టుగూడ సమీపంలో ఆదివారం ఉదయం ఆటోలో తరలిస్తున్న 60 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. -
ఎవరీ బాలుడు?
పాలకొండ : పట్టణంలో పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో శుక్రవారం సాయంత్రం నుంచి అయోమయంగా తిరుగుతున్న ఈ బాలుడు ఎవరో తెలియరాలేదు. సుమారు నాలుగు సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ బాలుడు పేరు సిద్దూ అని, తండ్రి బంగారు, తల్లి సుధారాణి అని చెబుతున్నాడు. వచ్చిరాని మాటలతో తమది సీతంపేట అని చెబుతున్నాడు. రహదారిలో ఏడస్తూ తిరుగుతున్న ఈ బాలుడుని బూర్జ వీఆర్వో జడ్డు నీలకంఠం గుర్తించి చేరదీశారు. ఆచూకీ కోసం పాలకొండ, బూర్జ, సీతంపేట పోలీసుస్టేషన్లలో సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో బాలుడుని వారి సంరక్షణలోనే ఉంచారు. బాలుడుని గుర్తించిన వారు పాలకొండ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
చిరుద్యోగులపై బ్రహ్మాస్త్రం!
బాలబడులకు మంగళం 275 మంది ఉద్యోగులకు ఉద్వాసన ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన తాము అధికారంలోకి వస్తే ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్బాలు పలికిన తెలుగుదేశం ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కొత్త ఉద్యోగాల మాట పక్కన బెడితే..ఉన్న ఉద్యోగాలకు మంగళం పాడుతోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో సేవలందించిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఆదర్శ రైతులు, ఉపాధి మేట్లను ఇంటికి పంపించేసిన చంద్రబాబు సర్కార్..తాజాగా బాలబడుల్లో పనిచేస్తున్న వలంటీర్లను సాగనంపేందుకు నిర్ణయించింది. 2009లో వెలుగు ఆధ్వర్యంలో..రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ పర్యవేక్షణలో బాలబడులను ఏర్పాటు చేశారు. మూడు సంవత్సరాల నుంచి ఐదేళ్ల పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది వీటి లక్ష్యం. అయితే టీడీపీ సర్కార్ వాటిని మూసి వేయూలని నిర్ణయించింది. సీతంపేట: బాలబడుల్లో పనిచేస్తున్న 275 మంది వలంటీర్లపై వేటు పడింది. ఇక మీ సేవలు చాలంటూ స్వయం గా జిల్లా కలెక్టర్ ప్రకటించడంతో వీరంతా రోడ్డున పడినట్లైంది. ఉపాధి కోల్పోయూమని వలంటీర్లు లబోదిబోమంటున్నారు. అర్ధంతరంగా తొలగించేస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇది.. 2009లో వెలుగు ఆధ్వర్యంలో రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లో 130 బాలబడులను ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో 130 మంది వలంటీర్లు, అంతే సంఖ్యలో ఆయాలు, 12 మంది కో-ఆర్డినేటర్లు, ఇద్దరు క్లస్టర్ కో-ఆర్డినేటర్లు, ఒక ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. సుమారు రెండు వేల మంది పిల్లలు వీటిలో ఉన్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య ఉన్న చిన్నారులను బాలబడుల్లో చేర్పించి వారికి ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. ఐదేళ్లు నిండిన తర్వాత ప్రభుత్వ జీపీఎస్ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది. అయితే ఏడాదిన్నరగా ప్రభుత్వం ఈ బాలబడులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోగా సిబ్బందికి వేతనాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతూనే నెట్టుకొస్తున్నారు. ఒక్కో వలంటీర్‌కు రూ.4 వేలు నుంచి 4,500 వరకు సీనియార్టినీ బట్టి వేతనం చెల్లిస్తున్నారు. అలాగే కో ఆర్డినేటర్లకు రూ.5 వేల నుంచి 6 వేలు, ఆయాలకు రూ.1200 చెల్లించేవారు. అయితే ఏడాదిగా వీరికి సక్రమంగా జీతాలు అందడం లేదు. దీనికితోడు ఈ నెల నుంచి వీరిని నిలిపి వేయనుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్‌కు వినతి తమకు ఏడాదిగా వేతనాలు చెల్లించడం లేదంటూ సోమవారం ఐటీపీఏకి వచ్చిన జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహాన్ని బాలబడుల్లో పనిచేస్తున్న వారంతా కలిసి విన్నవించారు. దీనికి స్పందించిన కలెక్టర్ 2015 ఏప్రిల్ నుంచి 2016 మే 31 వరకు బకాయి పడిన వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై బాలబడులను ఎత్తివేస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నందున మరి బాలబడులు వద్దని, మీ సేవలు అవసరం లేదని చెప్పడంతో దీనిలో వలంటీర్లు, సీసీలు, ఆయాలు ఖంగుతిన్నారు. మేమంతా విధులు నిర్వహిస్తున్నామని ముందుగా చెప్పకుండా అర్దాంతరంగా ఇలా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఏపీఎం ఏమన్నారంటే. ఈ విషయమై బాలబడుల ఏపీఎం కొండలరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా 60 వరకు మాత్రమే ప్రస్తుతం బాలబడులు నడుస్తున్నాయని తెలిపారు. వేతనాలు చెల్లించడానికి బడ్జెట్ కూడా లేదని చెప్పారు. -
ఐటీడీఏలో బదిలీలు ఉండవా?
కీలకమైన పోస్టుల్లో ఇన్‌చార్జిలేనా? కొరవడిన జవాబుదారీ తనం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే కళావతి సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో జవాబుదారీ తనం కొరవడిందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని జీరో అవర్‌లో నిలదీశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీతంపేట ఐటీడీఏలో ముఖ్యమైన పోస్టుల్లో ఇన్చార్జిలు కొనసాగడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్ పోస్టును డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోకు ఎలా కట్టబెట్టారని నిలదీశారు. ఆయనకు ఏటీడ బ్ల్యూవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారని తెలిపారు. ఐటీడీఏ మేనేజరుకు పరిపాలనాధికారిగా పదోన్నతి కల్పించి ఏడేళ్లుగా అక్క డే కొనసాగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐటీడీఏ ఉద్యోగులకు బదిలీలు ఉండావా? అని ప్రశ్నించారు. హౌసింగ్, ఎస్ఎంఐ వం టి శాఖల్లో అక్రమాలు పేరుకుపోయినట్టు గతంలో మంత్రు ల వద్ద ప్రస్తావించినా... పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, బాలింత లు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా? లేదా అనే విషయమై ఆయా మంత్రులు ఏనాడైనా ఆరా తీశారని ప్రశ్నించారు. అప్‌గ్రేడ్ చేసిన ఆశ్రమ పాఠశాలలకు సిబ్బందిని నియమించాలని, గిరిజన గురుకుల కళాశాలల్లో సీఈసీ గ్రూపులు ఏర్పాటు చేసి సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. -
కొత్తపల్లి గీతను పదవి నుంచి తొలగించాలి
సీతంపేట: అరుకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.వివేక్ వినాయక్, మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కో-కన్వీనర్ మాలువ సింహాచలం, గిరిజన జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిడ్డిక తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఆరిక మన్మథరావు ఆరోపించారు. గురువారం సీతంపేట వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. ఎంపీ గీత సోదరుడు ఎస్టీ కాదని ఇటీవల హైకోర్టు తీర్చు చెప్పిందని గుర్తు చేశారు. ఆమె కూడా ఎస్టీ కాదని, ఎంపీ పదవి నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆమెను పదవి నుంచి తప్పించి నిజాయతీ నిరూపించుకోవాలన్నారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నారని, ఆమెకు మద్దతు పలికితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గిరిజన తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు తీసుకున్న గిరిజనేతరులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వచ్చేనెల 4వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 డిమాండ్లపై నిరసన ఉంటుందని తెలిపారు. న్యాయం చేయకపోతే గిరిజనోత్సవాలు బహిష్కరిస్తాం... భామిని మండలం తాలాడ గిరిజనులకు న్యాయం చేయకపోతే వచ్చేనెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న గిరిజనోత్సవాలను బహిష్కరిస్తామని గిరిజన ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గిరిజన భూములు ఆక్రమించుకున్న గిరిజనేతరులపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఐటీడీఏలకు నాన్ ఐఏఎస్‌లు ఉండడం వల్ల గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సమావేశంలో గిరిజన సంఘ నాయకులు కుండంగి కాంతారావు, వెంకటరావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
ముంబయిలో డిమాండ్
జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలోని కొండ కోనల్లో పండుతున్న నల్లజీడి పంటకు ముంబయి మహానగరంలో డిమాండ్ ఏర్పడింది. అక్కడ రంగుల తయూరీ పరిశ్రమలో ఈ పిక్కలను విస్తృతంగా వాడుతుండడంతో ఇక్కడ జీసీసీ కొనుగోలు చేసి అక్కడకు ఎగుమతి చేస్తుంది. రంగుల తయూరీ పరిశ్రమల యజమానులు వీటిని వినియోగించుకుని మంచిగానే లాభపడుతున్నా...ఇక్కడ గిరిజన రైతులకు మాత్రం ఒరిగిందేమి లేదు. దీంతో గిట్టుబాటు ధర లేక..జీసీసీ తగిన ధర చెల్లించకపోవడంతో రైతులకు ఆర్థికంగా నష్టాలు తప్పడం లేదు. సీతంపేట :ఏజెన్సీలో కొండపోడులో పండే నల్లజీడి పిక్కలకు ముంబయిలో డిమాండ్ ఉంది. ఈ నల్లజీడిని రంగుల తయారీకి వినియోగిస్తున్నట్టు సమాచారం. గిరిజన సహకార సంస్థ వీటిని కిలో రూ.12కి కొనుగోలు చేస్తుంది. అనంతరం క్వింటాళ్ల లెక్కన జీసీసీ వివిధ కంపెనీలకు విక్రయిస్తుంది. కిలోకు రూ.3 నుంచి ఐదు వరకు ఆదాయం వచ్చేటట్టు జీసీసీ అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 200 క్వింటాళ్ల వరకు నల్లజీడిని జీసీసీ సేకరించినట్టు తెలిసింది. సీతంపేటలో సోమవారం, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమి వారపు సంతల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి జీసీసీ సేల్స్మెన్లు వీటిని కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మాత్రం వీటిని పెద్దగా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ధరను పెంచితే తమకు గిట్టుబాటు ఉంటుందని గిరిజనులు పేర్కొంటున్నారు. రంగుల తయారీలో వినియోగం... ముంబయిలో రంగుల తయారీ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలిసింది. కేరళలో నల్లజీడి పిక్కల మధ్యలో ఉన్న పలుకులను తీసేసి ఇష్టంగా అక్కడ ప్రజలు తింటారు. నల్లజీడి నుంచి లోపల పిక్కలను వేరు చేసి కొన్ని సందర్భాల్లో అరకేజీ వరకు పలుకులను రూ.200లకు గిరిజనులు విక్రయిస్తారు. అయితే వీటి లోపల పలుకులను తీయడం చాలా కష్టమైన పని. దీనికి సంబంధించిన జీడి చేతికి అంటితే అంత వేగంగా వదలదు. పైగా దురదలు కూడా వచ్చేస్తాయని గిరిజనులు చెబుతున్నారు. అందుకే పలుకులను తీయలేని పరిస్థితిలో జీడి పిక్కలనే విక్రయించేస్తామని గిరిజనులు చెబుతున్నారు. ఏటా జనవరి నుంచి ఏప్రిల్ వరకు సీజన్ ఉంటుంది. కొండల్లో నల్లజీడిని గిరిజనులు సేకరిస్తారు. ఈ విషయమై జీసీసీ మేనేజర్ మాట్లాడుతూ ఎండీ నిర్ణయించిన ధరలకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నల్లజీడి కిలో రూ.12కు కొనుగోలు చేస్తున్నామన్నారు. -
గిరివాసుల దాహం తీర్చండి
సీతంపేట: గిరిజన ప్రాంతాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె ఈ సమస్యను ప్రస్తావించారు. ఏటా గిరిజన మహిళలు చాలా ఇబ్బం దులు పడుతున్నారన్నారు. దూరంలో ఉన్న కొండవాగుల్లో నీటి కోసం నడిచి వెళ్తున్నారన్నారు. ఆ నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. ట్యాం కుల ద్వారా సరఫరా చేస్తారో, ఎన్టీఆర్ సుజల ధార ఎప్పుడు అందిస్తారో తెలియజేయాలని పట్టుబట్టారు. గత సమావేశాల్లో 570 ఏజెన్సీ గ్రామాలలో 24 గ్రామాలకు రక్షిత పథకాలు ఏర్పాటు చేశారన్నారు. మిగతా గ్రామాలకు రక్షిత నీరు అందించాలని గుర్తు లేదా అని ప్రశ్నించారు. మహిళల దినోత్సవం రోజైనా మహిళల నీటి కష్టాలు తీరుస్తామని ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ బెల్టు షాపులను నిషేధించండి... మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారితపై చర్చలో పాల్గొంటూ బెల్టుషాపులను ప్రభుత్వం నిషేధించాలన్నారు. వీటి వలన ఎన్నో కుటుంబాలు నాశనమౌతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాటు సారా పేరుతో గిరిజనులను వేధించడం తగదన్నారు. సారా తయారీకి ప్రోత్సాహించేవారిని నియంత్రించలేకపోతున్నారన్నారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం ఫీజు రియంబర్స్ మెంట్ వంటి పథకాలు పూర్తిగా అమలు చేయకపోవడంతో పిల్లలను చదివించుకోలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మా ఇంటి మహలక్ష్మి పథకం కూడా అమలు జరగడం లేదన్నారు. ఏజెన్సీ వైద్యాధికారి పోస్టులను బర్తీ చేయాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అన్నారు. గిరిపుత్రిక కళ్యాణ పథకానికి నిధులు సరిగా కేటాయించడం లేదన్నారు. మైనర్బాలికా వివాహాలను అడ్డుకోలేకపోవడం వలన వారికి రావాల్సిన రాయితీలు కోల్పోతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఎవరైనా గిరిజనులు చనిపోతే ఇంటికి ప్రైవేట్ వహానాల్లో తీసుకువస్తే రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లించాలన్నారు. -
అవినీతిపై ప్రశ్నిస్తే స్పందించరేం?
సీతంపేట: సీతంపేట పీఎంఆర్సీలో జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కలమ ట వెంకటరమణ, అధికార పక్ష ఎమ్మెల్యే శివాజీలు అవినీతిపై అధికారులను నిలదీశారు. ఐటీడీఏలో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, విచారణలో లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై రెండేళ్లుగా ప్రశ్నిస్తే అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏమిటని మండిపడ్డారు. సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఉద్యానవనశాఖ లో రైతులకు ఎరువులు, పురుగు మందులు సక్రమంగా అందలేదని, దీనిలో రూ. 2.80 కోట్లు అవినీతి జరిగిందని, ఎరువులు పక్కదారి పట్టాయని పాలకొండ ఎమ్మెల్యే కళావతి సంబంధిత అధికారులను నిలదీశారు. ఎరువులను పూర్తిగా పంపిణీ చేసేస్తే గోదాంలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. కాలం చెల్లే వరకూ ఎరువులనుహెచ్ఎన్టీసీ ఫారంలో ఎందుటు ఉంచాల్సి వచ్చిందని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నిలదీశారు. దీనికి ఐటీడీఏ పీవో జె.వెంకటరావు బదులిస్తూ.. 2014లో సంభవించిన హుద్‌హుద్ తుపాను సమయంలో రైతులకు పంపిణీ చేయాల్సిన ఎరువులు ఉండిపోయాయని బదులిచ్చారు. అక్రమాలు ఉన్నాయనే ఆలోచించి గత పీవో సత్యనారాయణ ఎరువులు పంపిణీ చేసిన వారికి డబ్బులు చెల్లించలేదని వివరించారు. దీనికి ఎమ్మెల్యే కలమట స్పందిస్తూ.. పీవోగా వెంకటరావు చేరిన కొద్ది రోజులకే రూ.90 లక్షలు చెల్లించాల్సిన అవసరమేమిటని నిలదీశారు. ఎరువుల అవినీతిపై పూర్తి విచారణ ఎప్పటికి జరుగుతుందనేది నివేదిక ఇవ్వాలని పలాస ఎమ్మెల్యే శివాజీ కోరారు. విజిలెన్స్ ఎస్పీకి విచారణ బాధ్యత అప్పగించామని కలెక్టర్ లక్ష్మీనరసింహం చెప్పారు. ‘వెలుగు’లో అవినీతి పెచ్చుమీరింది వెలుగు పథకంలో అవినీతి పెచ్చుమీరిందనిఎమ్మెల్యే కళావతి ఆరోపించారు. గతంలో బాలబడులు, న్యూట్రీషియన్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో జరిగిన పాలకవర్గ సమావేశాల్లో నిలదీసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. అక్రమాలు చేసిన వారికి ఏకంగా ఉద్యోగాలు తిరిగి ఇతర జిల్లాల్లో ఇచ్చేశారన్నారు. భామిని ఎంఎంఎస్‌లో 2012 నుంచి 15 వరకు ఆడిట్ ఎందుకు జరగలేదని ఎమ్మెల్యే కలమట ఏపీడీ సావిత్రిని నిలదీశారు. ఎంఎంఎస్ నిధులు సీఎఫ్ రూ.90 వేలు సొంతానికి వాడుకున్నాడని ఇది ప్రశ్నించిన నాపై దాడికి దిగాడని కొత్తూరు ఎంపీపీ రాజేశ్వరి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.ఆయనపై చర్యలు తీసుకోవాలని కలమట పట్టుబట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మందస ఎంఎంఎస్‌లో ఎటువంటి వోచర్లు లేకుండా లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని, సక్రమంగా విచారణ జరగలేదని గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠల్, ఎమ్మెల్యే శివాజీలు ఆరోపించారు. ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి అక్రమాలు చేసిన నిధులను రాబట్టాలని ఎమ్మెల్సీ ప్రతిభా భారతి కోరారు. మమ్మల్ని అనాగిరికులను చేయొద్దు అణగారిన గిరిజనులను ఇంకా అనాగిరికులను చేయవద్దని, మా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇక్కడ అధికారులుగా వచ్చారా అని ఎమ్మెల్యే కళావతి పీఏవో జగన్మోహన్పై ఆగ్రహించారు. ప్రోటోకాల్ ఉల్లంఘణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ పీవోను కోరారు. పాలకొండ మండలం డోలమడ పంచాయితీలో రహదారి పూర్తి చేయకుండా బిల్లులు మార్చేశారని జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించగా.. విచారణ జరుగుతోందని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఎప్పుడు విచారణ పూర్తవుతుందని సభ్యులు ప్రశ్నించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులతో కమిటీ వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అంబావల్లి గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభం కాకపోవడంతో గిరిజనులు ఖాళీగా ఉన్నారని ఎమ్మెల్యే కలమట సమావేశం దృష్టికి తెచ్చారు. ఇందిర జలప్రభ పథకం బోర్లకు విద్యుత్ కనెక్షన్ వేయలేదని జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సవరతోట ముఖలింగం అన్నారు. ప్రోటోకాల్ ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఐటీడీఏ అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యే కళావతి మండిపడ్డారు. ఇటీవల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు సీతంపేటలో ప్రారంభిస్తే తమ పేరును చిన్నదిగా పెట్టారని, గొయిది పంచాయతీలో కార్యక్రమం జరిగితే ఆ సర్పంచ్‌కే చెప్పలేదని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో ఎందుకు కో ఆర్డినేషన్ చేసుకోవడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లఘించిన అధికారులకు చార్జ్‌మెమో ఇస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. లాడా, పాండ్ర గ్రామాలకు జీసీసీ ద్వారా రేషన్ అందడం లేదని, ఐదు వందల కుటుంబాలు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న వేరే గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే కళావతి సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఉపాధి, మరుగుదొడ్ల నిర్మాణ బిలులు రావడం లేని బూర్జ జెడ్మీటీసీ సభ్యుడు రామకృష్ణ అన్నారు. డీఈ సస్పెన్సన్:నీటి ఎద్దడి ప్రణాళికలు వేయమంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినందుకు సంబంధిత డీఈ మల్లికార్జున్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా రూ.5.6 కోట్లు మంజూరు చేస్తే సీతంపేట మండలంలోని దారపాడు పంచాయతీకి కోటి రూపాయలతో ప్రతిపాదన ఎందుకు పెట్టారని ఎమ్మెల్యేలు వెంకటరమణ, కళావతిలు ప్రశ్నించారు. దీనికి సంబంధిత అధికారులు సరిగా సమాధానం చెప్పకపోవడంతో డీఈ సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశించారు. నీటి ఎద్దడి ప్రణాళికలు క్షేత్రస్థాయిలో తయారు చేయాలని ఎస్ఈ రవీంద్రనాథ్‌కు ఆదేశించారు. ఏనుగుల సమస్యను పరిష్కరించాలని, ఐదోషెడ్యూల్డ్ సాధనకు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. అందరి సభ్యుల ఆమోదించడంతో తీర్మానం చేశారు. ఇకపై ప్రతీ రెండు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శివాజీ కోరారు. మూడు నెలలకొకసారి జరగాల్సిన సమావేశం ఆరునెలలకెందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇకపై రెండు నెలలకు సమావేశం పెడతామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, ఇచ్ఛాపురం, నరసన్నపేట ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఆర్డీవోలు గున్నయ్య, దయానిధి పాల్గొన్నారు. 20 శాఖల ఊసే లేదు! ఐటీడీఏ సమావేశంలో 20 శాఖల పనితీరుపై చర్చే జరగలేదు. ప్రతి సమావేశంలోనూ ఇదే పరిస్థితి. గత సమావేశం మూడు గంటల్లో ముగియగా, ఈసారి మరో గంట ఎక్కువ జరిగినా ఫలితం లేకపోయింది. కీలకశాఖలపై చర్చ జరగకపోవడంతో కొంతమంది ప్రజాప్రతినిధులు అసంతృప్తి చెందారు. ఎంపీ కొత్త పల్లి గీత సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆమె గత సమావేశానికి కూడా రాకపోవడం గమనార్హం. గత సమావేశంలో ప్రస్తావనకు రాని శాఖలపైనే ఇప్పుడు చర్చించి, మిగతా శాఖలను వదిలేశారు. ముఖ్యమైన ఇంజినీరింగ్‌శాఖ, ఎస్ఎంఐ, గృహనిర్మాణశాఖ, ట్రైకార్, ఏపీఈపీడీసీఎల్, మహిళా, శిశుసంక్షేమశాఖ, అటవీశాఖ, పట్టుపరిశ్రమ, ఏపీఎస్ఐడీసీ, ప్రాథమిక విద్య, గిరిజన సంక్షేమ విద్య, మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ, మత్స్య శాఖ వంటి శాఖల ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. నలుగురు ఎమ్మెల్సీలు హాజరు కావాల్సి ఉండగా.. ప్రతిభాభారతి మాత్రమే పాల్గొన్నారు.భారీ బందోబస్తు: పాలకవర్గ సమావేశం సందర్భంగా గట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్సీప సీహెచ్ ఆదినారాయణ, సీఐ అశోక్‌కుమార్, ఎసై్స వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గిరిజన సంక్షేమం?
సీతంపేట : ఐటీడీఏలో ప్రాజెక్టు అధికారి (పీఓ) తర్వాత అత్యంత కీలకమైన విభాగాధిపతి గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్. ఈ పోస్టు భర్తీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది. రాష్ట్రంలో అన్ని ఐటీడీఏలకు డీడీ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ అయినప్పటికీ సీతంపేటలో మాత్రం మూడేళ్లుగా భర్తీ చేయకుండా ప్రభుత్వం వదిలేసింది. కేవలం ఇన్‌చార్జిలతోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల క్రితం ఇక్కడ డీడీగా పని చేసిన సర్వేశ్వరరెడ్డికి ఐటీడీఏ పీఓగా పదోన్నతి లభించడంతో ఆయన నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓగా పని చేసిన కొమరం నాగోరావు కొంతకాలం వరకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన తెలంగాణకు బదిలీ కావడంతో వంశధార ఎస్డీసీ సుదర్శనదొరను ఇన్చార్జిగా నియమించారు. ఆయనకు విజయవాడ సీఆర్డీఏకు బదిలీ కావడంతో ఏడాదిన్నర కిందట డిప్యూటీడీఎంఅండ్హెచ్ఓగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నాయిక్కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. ఇదీ పరిస్థితి... ఐటీడీఏ పరిధిలో 25 గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 16 ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఏడు వసతిగృహాలు, 13 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలు, 4 గురుకుల పాఠశాలలు, 3 కేజీబీవీలు, రెండు మినీగురుకులాలు ఉన్నారుు. ఇందులో 16 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి సంక్షేమాన్ని పర్యవేక్షించా ల్సి ఉంది. అలాగే విద్యార్థుల మౌలిక వసతుల స్థితిగతులు చూడాల్సిన బాధ్యత ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేపథ్యం, మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అనే విషయా లు కూడా డీడీయే పర్యవేక్షించాల్సి ఉం ది. సంక్షేమశాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చే యాల్సి ఉంది. ఎన్టీఆర్ విద్యాజ్యోతి, అంబేడ్కర్ విద్యానిధి, గిరిపుత్రిక కల్యాణం, పోస్ట్‌మెట్రిక్ విద్యార్థు ల ఉపకార వేతనాల ఆన్లైన్ చేయడం వంటి కార్యక్రమాలు పక్కాగా పర్యవేక్షించాల్సి ఉంది. వైద్యశాఖలో కీలక బాద్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ డీడీగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇటు వైద్యశాఖ, అటు విద్యాశాఖ రెండు బాధ్యతలు పర్యవేక్షణతో ఆయన కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. 271 జీఓ ప్రకారం ఐటీడీఏ పీఓకు అన్ని శాఖలను నియంత్రించే అధికారం ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయి డీడీ లేకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే పాఠశాలలను ఐటీడీఏ పీఓ ఆకస్మికంగా తనిఖీ చేయడం, చర్యలకు ఉపక్రమించడం, హెచ్ఎం, వార్డెన్లు, హానరోరియం డెరైక్టర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పీఓ కూడా 15 శాఖల వరకు పర్యవేక్షించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ శాఖపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారే తప్ప మిగతా శాఖలపై ఎటువంటి చర్యలు లేవనే విమర్శలున్నాయి. ఇటీవల కొత్త డీడీగా రంపచోడవరంలో గతంలో పనిచేసిన గ్రూప్ వన్ అధికారి మల్లికార్జునరావును నియమించారు. అయితే ఆయన కూడా ఇక్కడ జాయిన్ కాలేదు. ఈయన రాకను కూడా కొంతమంది కీలక నేతలు, అధికారులు అడ్డుకున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ డీడీ పోస్టు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. -
మూడో విడత నిరాశే !
ఆరుగాలం కష్టపడడమే తప్ప.. ఎవరికీ హాని తలపెట్టడం తెలియని గిరిజన రైతులతో సర్కార్ ఆటలాడుతోంది. ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రుణమాఫీలో ప్రభుత్వం మూడో విడతలోనూ గిరిజన రైతులకు మొండిచేయి చూపడంతో లబోదిబో మంటున్నారు. మొదటి, రెండో విడతలో ఎలాగు రుణమాఫీ జాబితాలో పేర్లు లేవు. కనీసం మూడో విడతలోనైనా పేర్లు ఉంటాయనుకుంటే అది కూడా నిరాశేమిగిలిందని గిరిపుత్రులు వాపోతున్నారు. - ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలకు మాఫీ లేదు - ఆందోళనలో గిరిజన రైతులు సీతంపేట: రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న గిరిపుత్రులు ఇటీవల వచ్చిన జాబితాను చూసి నివ్వెరపోయారు. రెండో విడతలో కేవలం 24 మంది రైతుల పేర్లు మాత్రమే రుణమాఫీలో ఉండడంతో అప్పట్లో కంగుతిన్నారు. మూడో విడత కోసం ఏదురు చూసి గిరిజన రైతులంతా ఆందోళన చెందుతున్నారు. సీతంపేట మండలంలో పదివేల మంది రైతులు ఉన్నారు. వీరిలో వివిధ పంటల రుణాల కింద సుమారు 5,600 మంది రుణాలు తీసుకున్నారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు, ఎస్వీజీబీ, ఎస్బీఐ, కుశిమి ఇండియన్ బ్యాంకులల్లో వీరంతా రుణాలు పొందారు. మొదటి విడతలో కేవలం 445 మందికి రుణమాఫీ అయ్యింది. అదికూడా ఒకొక్కరికీ రూ. 10 వేల లోపే. రెండోవిడతలో మరో 24 మందికి మాత్రమే మాఫీ వర్తించింది. తాము ఖరీఫ్ రుణం 2012లో తీసుకున్నప్పటకీ ఇప్పటి వరకు రూపాయి కూడా మాఫీ కాలేదని అక్కన్నగూడకు చెందిన సుక్కయ్య, జమ్మయ్య, లక్కమ్మ, సరస్వతి సవరబోయడు, సవర ముంజు, తిక్కమై తదితరులు వాపోతున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ రుణమాఫీ కాకపోవడం గమనార్హం. ఉద్యానవన పంటల రైతులకు మాఫీ లేనట్టేనా? గిరిజన ప్రాంతాల్లో ఉద్యానవన రైతులకు రుణమాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఏజెన్సీలో ఎక్కువగా కొండపోడు పంటలే ఆధారంగా జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. రుణం తీసుకున్నవారంతా చిన్నరైతులే. ఒక్కో గిరిజన రైతు రూ.30 వేల లోపే రుణం తీసుకున్నారు. ఇంత తక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకున్నా మాఫీ కాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి చెందుతున్నారు. శంబాం, కోడిశ, కుశిమి, కడగండి, కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్ల పంచాయతీల పరిధిలో రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈ విషయాన్ని వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మూడో విడతలో ఎవరి పేర్లూ రుణమాఫీ జాబితాలో లేవని స్పష్టం చేశారు. ఉద్యానవన పంటలకు మాఫీ వస్తే చాలా మందికి వర్తిస్తోందన్నారు. నిరాశే మిగిలింది గిరిజనులకు నిరాశేమిగిలింది. రెండు విడతల్లో రుణమాఫీ జరగలేదు. కనీసం మూడో విడతోనైనా జరుగుతుందని ఎదురు చూసిన రైతాంగానికి న్యాయం జరగలేదు. కొండపోడు పట్టాలకు రుణమాపీ తప్పనిసరిగా చేయాలి. - సవరగోపాలు, సర్పంచ్, సోమగండి ఖరీఫ్ సాగేలా చేయాలి రుణమాఫీ జరగకపోవడంతో ప్రస్తుతం వరిపంటను ఎలా పండించాలి. మిగతా పంటలు కూడా పండించలేని పరిస్థితి ఉంది. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి మొగ్గు చూపడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి. - సవర బెన్నడు, అక్కన్నగూడ, గిరిజన రైతు -
జల్లెడ పడుతున్న పోలీస్‌లు
కొత్తూరు/భామిని:మావోయిస్టుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కావడంతో పాటు కొత్తూరు-భామిని మండలాలకు అనుకొని ఉన్న తివ్వకొండలు మావోలకు సేఫ్ జోన్ కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. స్థానిక సీఐ కె.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కొత్తూరు నాలుగు రోడ్ల కూడలితో పాటు బత్తిలి రోడ్డు నుంచి వచ్చిన ప్రతి వాహనాన్ని గురువారం నిశితంగా పరిశీలించారు. ఒడిశా నుంచి వచ్చే వాహనాలను మరింత జాగ్రత్తగా తనిఖీ చేపట్టారు. అపరిచిత వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు స్థానిక సర్కిల్ పరిధిలో మొహరించాయి. సీతంపేట, భామిని మండలాలతో పాటు ఒడిశాకు చెందిన కొన్ని గ్రామాలకు కొత్తూరు ప్రధాన కేంద్రం కావడంతో మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ పరిధిలోని కొత్తూరు, దోనుబాయి, సీతంపేట, బత్తిలి పోలీస్ స్టేషన్లు పూర్తిగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చర్యలు చేపట్టారు. సీతంపేట, భామిని ఏజెన్సీ ప్రాంతాల్లో కూబింగ్లు నిర్వహిస్తూ జల్లేడ పడుతున్నారు. లాడ్జీలను సైతం గురువారం రాత్రి పోలీసులు పరిశీలించారు. తనిఖీల్లో ఎస్సై వి.రమేష్, ఏఎస్ఐ ప్రసాద్, ప్రత్యేక పోలీస్ బలగాలు పాల్గొన్నాయి.భామిని మండలంలో బత్తిలి ఎస్ఐ సీహెచ్ రామారావు ఆధ్వర్యంలో సాయుధ పోలీసు బలగాలతో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. జామిగూడ, ఇప్పమానుగూడ, మాసగూడ, ఘనసర పరిసరాల్లో ఎస్టీఎఫ్ దళాలతో కూంబింగ్ చేపట్టారు. సరిహద్దులో అనుమానితులపై నిఘా పెంచారు. అనంతరం ఏబీ రోడ్డు వెంబడి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. -
ఆయిల్‌పై జీసీసీ బాదుడు
సీతంపేట: గిరిజనులకు వెన్నుదన్నుగా నిలిచి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) పరోక్షంగా వారిపై అధిక ధరల భారం మోపుతోంది. తక్కువ ధరలకే నిత్యావసర సరకులను విక్రయించాల్సిన జీసీసీ మార్కెట్ ధర కంటే అధికంగా వసూలు చేస్తూ గిరిజనులను నిలువుదోపిడీ చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డిపోల ద్వారా పామాయిల్ సరఫరా ఏడాదిగా నిలిపివేయడంతో అందరూ సన్‌ఫ్లవర్ నూనెలనే వాడుతున్నారు. సీతంపేట ఏజెన్సీలోని పల్లెలు మారుమూలన ఉండడంతో జీసీసీ డీఆర్‌డిపోల(రేషన్) ద్వారా గిరిజనులకు కావాల్సిన సరుకులను విక్రయిస్తుంటారు. మార్కెట్ ధర కంటే రూపాయి, రెండు రూపాయలు తగ్గించి అమ్మకాలు జరపాల్సిన జీసీసీ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా రిఫైన్డ్ సనఫ్లవర్ ఆయిల్‌ను చెప్పుకోవచ్చు. ఆధార్ నూనె ప్యాకెట్లు లీటర్‌వి కొన్ని డీఆర్‌డిపోల్లో రూ. 81, మరికొన్ని చోట్ల రూ.82 కి విక్రయిస్తున్నారు. సీతంపేటలోని బయట మార్కెట్లో రూ.76కి విక్రయిస్తుండగా, పాలకొండలో రూ. 75కే దొరుకుతోంది. బయట మార్కెట్ రేటు కంటే జీసీసీ మరో ఐదారు రూపాయలు అధికంగా విక్రయించడం పట్ల గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ ప్యాకెట్‌పై ముద్రిత ధర వంద రూపాయలున్నప్పటికీ హోల్‌సేల్‌గా తక్కువ ధరకే ప్రైవేట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. ప్రైవేట్ దుకాణాల కంటే ప్రభుత్వ షాపులో ఎక్కువ ధరలకు విక్రయించడమేమిటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. హోల్‌సేల్‌గా ఎక్కువ ప్యాకెట్లు బాక్సుల రూపంలో కొనుగోలు చేస్తే రూ.73 లోపే ధర పడుతుందని పలువురు వ్యాపారులే తెలియజేస్తున్నారు. -
సలక్షణ దోపిడీ
సీతంపేట : నిరుపేద గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేయాలనుకుంటున్న ఐటీడీఏ ఆశయానికి తూట్లుపడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పథకాలు సక్రమంగా అమలుకాక గిరిజనాభివృద్ధి నేతి బీరకాయ చందంగా మారుతోంది. ఉద్యానవన శాఖ ద్వారా ఐటీడీఏ పరిధిలో వివిధ మండలాలకు చెందిన రైతులకు జీడి, మామిడి తోటల పెంపకం ద్వారా వారి ఆదాయాలను మెరుగుపర్చాలని నిర్ణయించారు. వాటి పెంపకానికి కావాల్సిన ఎరువులను సరఫరా చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రూ. దాదాపు కోటి వరకు నిధులు వెచ్చించారు. అయితే ఆ ఎరువులు, పురుగుల మందులు చాలా మంది రైతులకు పూర్తిస్థాయిలో అందలేదని, అంతంతమాత్రంగానే అందజేసి చేతులు దలుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సీతంపేట, భామిని, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాలకు చెందిన రైతులకు జీడి, మామిడి మొక్కలకు తెగుళ్లు రాకుండా ఎరువులు, పురుగుమందులను సరఫరా చే సేందుకు టెండర్ద్వారా కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. 6 వేల మంది గిరిజన రైతులను ఎంపిక చేసి 5,600 ఎకరాల్లో మొక్కలు పెంపకానికి గతేడాది చర్యలు తీసుకున్నారు. ఎకరాకు రూ. 3,500లు విలువ చేసే ఎరువులు, పురుగుమందులు, ఇతర క్రిమిసంహారకాలను పంపిణీ చేయాలని ఐటీడీఏ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ చాలా మంది రైతులకు పూర్తిస్థాయిలో అవి అందలేదని రైతులు పేర్కొంటున్నారు. వీటి పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు మండలాల్లోని తహశీల్దార్ ద్వారా కమిటీలను వేసి పంపిణీ చేయాలని అప్పటి పీవో ఎన్.సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. అయితే వీటి పంపిణీ తహశీల్దార్లకే తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేయడం గమనార్హం. పంపిణీ చేయాల్సిన సరకు నీమ్‌కేక్ 80 కిలోలు, సింగిల్ సూపర్‌ఫాస్పేటు 70కిలోలు, యూరియా 10కిలోలు, పొటాష్ 15కిలోలు, సీవోసీ 500 గ్రాములు, వేపనూనె ఒక లీటరు, క్లోరీఫైరీఫాస్ ఒకలీటరు, ఫార్ములా 7 పదికిలోలు, వర్మికంపోస్ట్ 80 కిలోలు, జీవశిలీంద్రినాశిని కిలో ఇవ్వాల్సి ఉంది. అయితే నీమ్‌కేక్, సింగిల్‌సూపర్ పాస్పేట్, యూరియా వంటివి అక్కడడక్కడా కొద్ది మంది రైతులకు పంపిణీ చేశారు. మరి కొందరికి అసలు పంపిణీ చేయకపోవడం గమనార్హం. పదిరకాలు కాకుండా నాలుగైదు రకాలను పంపిణీ చేసి చేతులు దులుపు కున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంపిణీ చేసిన అరకొర ఎరువులు సైతం కొన్ని గ్రామాల్లో అలానే పడి ఉన్నాయి. రైతులకు వాటిని ఎలా వినియోగించాలి, ఎప్పుడు వినియోగించాలనే అంశాలను కూడా తెలియజేయలేదు. దీంతో ఇవి కూడా కొన్ని చోట్ల మూలన పడ్డాయి. దాదాపు అన్ని మండలాల్లోనూ పంపిణీ ఇలానే జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై హార్టీకల్చర్ ఏపీవో శంకరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా అంతమందికీ ఎరువులు, పురుగుమందులు పది రకాలు పంపిణీ చేశామని తెలిపారు. -
ఆ తల్లి కడుపుకోత పాపం ఎవరిది?
వైద్యశాఖ వైఫల్యమా- పోషకాహార లోపమా? ఏడాదిలో 190 మంది శిశువులు, 14 మంది బాలింతలు మృతి 20 సబ్‌ప్లాన్ మండలాల్లోని గిరిజనేతరుల్లోనే మరణాలు అధికం పెరుగుతున్న మాతాశిశుమరణాలు సీతంపేట:అటు సర్కారు... ఇటు అధికారులు ఏ సమావేశం ఏర్పాటు చేసినా మాతా శిశు మరణాలు తగ్గాలని ఉద్బోధిస్తున్నారు. అది కంఠశోషగానే మిగిలిపోతోంది. తల్లులకు కడుపుకోత తప్పడంలేదు. మార్పు కార్యక్రమం ద్వారా ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. జిల్లాలో 20 సబ్‌ప్లాన్ గిరిజన మండలాల్లో మాతా శిశుమరణాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమేమిటంటే గిరిజనేతరుల్లోనే ఎక్కువగా మరణాలు సంభవించడం గమనార్హం. ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2015 వరకు అధికారిక గణాంకాల ప్రకారం 190 మంది శిశువులు మృతిచెందగా వీరిలో 177 మంది గిరిజనేతరులుండగా 13 మంది గిరిజన శిశువులున్నాయి. అలాగే 14 మంది తల్లులు మరణించగా వీరిలో 12 మంది గిరజనేతరులు, ఇద్దరు గిరిజన తల్లులు ఉన్నారు. అనధికారికంగా మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందనేది నిర్వివాదాంశం. గిరిజన ప్రాంతాల్లో కొండలపై ఉన్న గ్రామాల్లో ఇంటివద్దే ప్రసవాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అవి లెక్కలోకి రావడం లేదు. ఇదీ పరిస్థితి... ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 27 పీహెచ్‌సీలు, మరో 10 సీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రాలు 151, ఏరియా ఆస్పత్రులు రెండున్నాయి. వీటి ద్వారా సకాలంలో వైద్యసేవలందాలి. అలాగే ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉంది.ప్రసవానికి ముందు 15 రోజులు, ప్రసవం తర్వాత మరో పక్షం రోజులు ఆసుపత్రిలోనే ఉంచడానికి వీలుగా బర్త్ వెయిటింగ్ రూంలను సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి ఆరోగ్య కేంద్రాల్లో నెలకొల్పారు. వీటి పై చైతన్యం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రసవాలు జరిగి మరణించే సందర్బాలు ఎన్నోఉన్నాయి. పోషకాహారం మాటేమిటి ?... ఐసీడీఎస్ పరిధిలో ఏడు గిరిజన ప్రాజెక్టులున్నాయి. వీటిలో 946 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు సుమారు 8,500ల మంది ఉన్నారు. అంతేకాకుండా వీరఘట్టం, సారవకోట, కొత్తూరు, సీతంపేట, మందస, పాలకొండ, ఇచ్చాపురం రూరల్ పరిధిలో అమృతహస్తం అమలవుతోంది. సీతంపేట, కొత్తూరులో 109 న్యూట్రిషియన్ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. ఇన్ని ఉన్నా సరైన పోషకాహారం అందకే మాతాశిశుమరణాలు సంభవిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ ఉపవైద్యాశాఖాధికారి ఎం.పి.వి.నాయక్ వద్ద సాక్షి ప్రస్తావించగా గిరిజనుల్లో మాతా శిశుమరణాలు తగ్గాయని తెలిపారు. ఐటీడీఏ ద్వారా పాలప్యాకెట్లను కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
ఐటీడీఏ పీవో సరెండర్?
సీతంపేట : ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి ఎన్.సత్యనారాయణను మాతృసంస్థ అయిన రెవెన్యూ శాఖకు సరెండర్ చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కూడా పీవోను నాలుగైదు రోజుల్లో సరెండర్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈయన పనితీరు బాగోలేదని కొంతమంది నాయకులు పిర్యాదు చేసిన నేపథ్యంలో పీవోను సరెండర్ చేయనున్నట్టు తెలిసింది. ఈయన స్థానంలో విజయనగరం జిల్లాలో ఆర్డీవో పనిచేస్తున్న జె.వెంకటరావును నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు మంత్రి కూడా సుముఖంగా ఉన్నట్టు పక్షం రోజులుగా ఐటీడీఏలో చెప్పుకుంటున్నారు. -
ఐఏఎస్ అధికారి ఎక్కడ!
సీతంపేట: గిరిజనాభివృద్ధి పథకాలను సమగ్రంగా నిర్వహించాలంటే సమర్ధుడైన అధికారి కావాలి. అందుకే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలకు (ఐటీడీఏ) ఐఏఎస్ అధికారులను నియమించాలనే నిబంధన ఉంది. అయితే ఆ భాగ్యం సీతంపేట ఐటీడీఏకు కలగానే మిగింది. పదేళ్లుగా ఐఏఎస్ అధికారిని నియమించకపోవడంతో పథకాల అమలు నత్తనడకన సాగుతున్నాయి. అదే క్రమంలో పలు అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ తర్వాత రెండో పరిపాలనా ధికారిగా పథకాలు పకడ్బందీగా అమలు జరగాలంటే ఐటీడీఏ పీవోకు సర్వాధికారాలు ఉండాలి. కొన్నాళ్లుగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు ఐఏఎస్ అధికారి లేకపోవడంతో పాలనలో పారదర్శకత పడకేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నాలుగు రోజుల కిందట రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు టైం స్కేల్ కింద పదోన్నతి ఇచ్చి రంపచోడవరం, పార్వతీపురం, పాడేరు ఐటీడీఏలకు పీవోలుగా నియమించారు. మిగతా ఐటీడీఏలకు ఐఏఎస్‌లే పీవోలుగా కొనసాగుతున్నారు. సీతంపేటకు మాత్రం మొండి చేయిచూపించారు. గిరిజనాభివృద్ధిలో భాగంగా 20 మండలాల్లో ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేయాల్సి ఉంది. అలాగే 26 ప్రభుత్వ సంస్థలను ఏకత్రాటిపై నడిపించాల్సి ఉంది. ఐఏఎస్ అధికారి లేకపోవడంతో మౌలిక వసతుల కల్పన నామమాత్రంగా సాగుతోంది. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా పీవోగా పనిచేసి పదేళ్ల క్రితం బదిలీ జరిగిన తర్వాత ఇక్కడ ఐటీడీఏకు పీవోగా గ్రూప్ వన్ అధికారులే సాగుతున్నారు. - గాలిలో సీఎంల హామీలు ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని పీవోగా నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ అమలకు మాత్రం నోటుచోలేదు. గతంలో సీతంపేట వచ్చిన గిరిజన మంత్రి రావెల్ల కిశోర్‌బాబు కూడా సీతంపేట ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అసెంబ్లీలో జీరో అవర్‌లో ఈ విషయమై ప్రస్తావించారు. సీతంపేటకు ఐఏఎస్ అధికారిని నియమించకపోవడంతో అవీనితి జరుగుతుందని సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సమాధానంగా ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా ఐఏఎస్ అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేదు. గ్రూపు వన్ అధికారే దిక్కా? సీతంపేట ఐటీడీఏకు మళ్లీ గ్రూప్‌వన్ అధికారినే పీవోగా నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో గ్రూప్‌వన్ కన్ఫర్మడ్ గా ఉన్న ఒక అధికారిని ఇక్కడ పీవోగా నియమిస్తారనే పుకార్లు వస్తున్నాయి. జిల్లాలో కీలక మంత్రి ఆశీస్సులతో ఇక్కడ చేరుతారనే ప్రచారం జరుగుతుంది. -
ఇదేం స్పెషల్ డీఎస్సీ!
సీతంపేట:ఏజెన్సీస్పెషల్ డీఎస్సీపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. అరకొరగా పోస్టులు కేటాయించడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్డ్ ఏజెన్సీలో 402 పోస్టుల భర్తీకి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అనుమతినిచ్చింది. అయితే మన జిల్లాకు 26 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి, ఇంగ్లిష్, సోషల్ ఒక్కొక్కటీ, హిందీ పండిట్ గ్రేడ్ టు- 4, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ-7, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో 12 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ అసలు వివిధ ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. ఏజెన్సీలో 60కి పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నాయని కేవలం 26 మాత్రమే భర్తీ చేస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు, గిరిజన సంఘాలు వాపోతున్నాయి. ఏ పాఠశాలలో చూసినా సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో విద్యాసంవత్సరం ఆరంభం నుంచే విద్యార్థులకు కష్టాలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అప్‌గ్రేడ్ పాఠశాలల మాటేమిటీ? సీతంపేట ఏజెన్సీలో ఐదు వరకు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. సీతంపేటలోని గిరిజన వసతిగృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మార్చారు. ఇక్కడ ఏడాది పూర్తయినా ఇంతవరకు పోస్టుల భర్తీ లేదు. అలాగే రెండేళ్ల క్రితం శంభాం, సీతంపేట, సామరెల్లి, పూతికవలస, పొల్ల తదితర పాఠశాలలన్నింటినీ అప్‌గ్రేడ్ చేసి సబ్జెక్టుటీచర్లను ఏళ్ల తరబడి నియమించలేదు. ప్రధాన సబ్జెక్టులైన ఆంగ్లం, గణితం, పీజిక్స్ వంటి సబ్జెక్టులకు కూడా టీచర్లు లేరు. తెలుగు, హిందీ పండిట్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఈ విషయాన్ని డిప్యూటీ ఈవో మల్లయ్య వద్ద ‘సాక్షి’ విలేకరి ప్రస్తావించగా వాస్తవానికి షెడ్యూల్డ్ ఏరియాకు ఇంకా 9 పోస్టులు, అప్‌గ్రేడ్ పాఠశాలకు మరో 22 పోస్టులు కేటాయించాల్సి ఉందన్నారు. -
గిరి రైతులకు మొండిచెయ్యి!
సీతంపేట:రుణమాఫీ.. ఈ మాట వింటే గిరిజన రైతులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని హామీలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత లేనిపోని ఆంక్షలతో రైతుల సహనాన్ని పరీక్షిస్తుండడమే దీనికి కారణం. చాలామంది రైతులకు అసలు రుణమాఫీయే వర్తించలేదు. ఇదే కోవకు చెందుతారు ఉద్యానవన పంటలను సాగుచేసే గిరిజన రైతులు. రుణమాఫీ విషయంలో వీరికి టీడీపీ సర్కార్ మొండిచెయ్యి చూపించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. మొదటి విడత జాబితాలో వీరి పేర్లు లేకపోవడంతో రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. తీరా ఈ జాబితాలో కూడా పేర్లు లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గిరిజనులు ఉద్యానవన పంటలను సాగు చేసుకొని బతుకు బండిని ఈడుస్తున్నారు. ఒక్క సీతంపేట మండలంలోనే సుమారు పది వేల మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరంతా కొండపోడు పంటలైన జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. వీరిలో వివిధ పంటల రుణాల కింద సుమారు 5,600 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కేవలం ఖరీఫ్ వరిపై రుణాలు తీసుకున్నట్టుగా జాబితాలో ఉన్న 445 మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యూరుు. వీటికి కూడా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు గిరిజన రైతులు వాపోతున్నారు. స్థానిక ఆంధ్రాబ్యాంకులో దాదాపు 1400, ఎస్వీజీబీలో 1200, కుశిమి ఇండియన్ బ్యాంకులో రెండు వేలకు పైగా రైతులు రుణాలు తీసుకున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఎవ్వరికీ రుణమాఫీ కాకపోవడం గమనార్హం. 8 పంచాయతీల్లో ఒక్కరికీ రుణమాఫీ లేదు... సీతంపేట ఏజెన్సీలో 8 పంచాయతీలున్నాయి. వీటిలో కనీసం ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. శంభాం, కోడిశ, కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్లలలో ఒక్కరైతుకూ రుణమాఫీ వర్తించలేదు. సామరెల్లి, పుబ్బాడలలో అయితే పంచాయతీకి ఇద్దరికి చొప్పున రుణమాఫీ అరుుంది. ఏజెన్సీలో రుణం తీసుకున్నవారంతా చిన్నరైతులే. ఒక్కో గిరిజన రైతు కేవలం రూ.30 వేలు లోపే రుణాన్ని తీసుకున్నారు. అయితే ఇంత తక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకున్నా మాఫీ కాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఉద్యానవన పంటలకు సైతం రుణమాఫీ జరిగిందని, ఇప్పుడు అసలు మాఫీ జరగకపోవడమేమిటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయూన్ని మండల వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కేవలం వరి పంటకు మాత్రమే రుణమాఫీ వచ్చిందని, ఉద్యానవన పంటలకు రాలేదని స్పష్టం చేశారు. పోడు పట్టాలపై ఇచ్చిన రుణాలకు మాఫీ చేయాలి కొండపోడు పట్టాలకు రుణమాఫీ తప్పనిసరిగా చేయాలి. లేకపోతే గిరిజన రైతులు ఇబ్బంది పడతారు. రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నారు. వడ్డీలు చాలా పెరిగిపోయి రుణాలు తడిపిమోపెడయ్యాయి. వీటిపై ప్రభుత్వం స్పందించాలి. - సవరగోపాల్, సర్పంచ్, సోమగండి ఆశ నిరాశ చేశారు నేను ఐదేళ్ల క్రితం బ్యాంకు నుంచి రూ.8 వేలు తీసుకున్నాను. అయితే వడ్డీతో పదివేలు దాటిపోయింది. రుణమాఫీ అంటే అందరికీ చేస్తారనుకున్నాం. గిరిజన రైతులకు అన్యాయం చేశారు. మేమంతా కేవలం కొండపోడుపైనే ఆధార పడి జీవిస్తారనేది ప్రభుత్వం గమనించాలి. - సవర తిక్కమై, గిరిజన మహిళ -
ఏమిటీ స్వచ్ఛంద దుబారా?
సీతంపేట:ఎమ్మెల్యే శివాజీ: మందస కేంద్రంగా పని చేస్తున్న స్నేహాంజలి స్వచ్ఛంద సంస్థకు ఐడబ్ల్యూఎంటీ పథకం కింద రూ.5 కోట్లు ఎలా మంజూరు చేశారు?.. కలెక్టర్ అనుమతితో పీవో మంజూరు చేశారా లేక ప్రభుత్వమే మంజూరు చేసిందా??.. నాకు తెలియాలి.కలెక్టర్: ఆ నిధులు ఎలా మంజూరయ్యాయో మాకు కూడా స్పష్టంగా తెలియదు...కలెక్టర్‌కే తెలియకుండా నిధులు మంజూరు కావడమేంటి?..అని శివాజీ నిలదీయగా మరికొందరు ఎమ్మెల్యేలు ఆయనతో గొంతు కలపడంతో ఈ అంశంపై ఆదివారం సీతంపేట పీఎంఆర్సీలో జరిగిన ఐటీడీఏ సర్వసభ్య సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. స్వచ్ఛంద సంస్థలకు నిధులు మంజూరవుతున్న తీరును సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. చేస్తున్న పనులేమీ కనిపించకపోయినా నిధులు భారీగా ఇచ్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సంస్థల పేరుతో ఎన్ని నిధులు మంజూరు చేశారనేది తెలియాలని పట్టుబట్టారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని స్వచ్ఛంద సంస్థల పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. ఏ సంస్థకు ఎన్ని నిధులు మంజూరు చేశారనేది తాను పరిశీలించి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో మాట్లాడతానని చెప్పారు. మంజూరైన నిధులు ఎంతవరకు ఖర్చు చేశార నేది కూడా పరిశీలిస్తామన్నారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ చిన్నయ్య ఆదివాసీ సంఘం చేసిన కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ఆ ఇద్దరిపై విచారణకు కమిటీ గత ఐటీడీఏ పీవోగా పనిచేసిన సునీల్‌రాజ్‌కుమార్, ఈఈ ఎంఆర్జీనాయుడుల హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రవికుల బంద చెరువుకు రూ.40 లక్షలు వెచ్చించి ఏం పనులు చేశారని ఈఈ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఈ పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. గతంలో చేపట్టిన విచారణ ఏమైందని ప్రశ్నించారు. అప్పట్లో జేసీ వీరపాండ్యాన్ విచారణ ప్రారంభించినా సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో పూర్తి చేయలేకపోయారని, దీనిపై చీఫ్ ఇంజనీర్‌కు రాశామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వానికి రెండు లేఖలు పంపినా స్పందన లేదన్నారు. నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులతో విచారణ చేయించాలని, ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి నిధులు రాబట్టాలని మంత్రి ఆదేశించారు. కొండ ప్రాంతాలకు నీరందించండి కొండలపైనున్న గ్రామాలకు సోలార్ మోటార్ల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కోరారు. ఒడిశాలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని తాను పరిశీలించానని చెప్పారు. అధికారులు కూడా పరిశీలించాలని సూచించారు. నేలబొంతు, గొడ్డ, బందపల్లి, పెద్దమడిలలో రక్షిత పథకాలు ఏర్పాటు చేసినా ఆర్డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ శాఖలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రంకిణి గ్రామంలో ఐదేళ్ల క్రితం బోర్ వేసినా పంపింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదన్నారు. అశోకం గ్రామానికి నీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సవర శివరాంపురంలో బోరు వేసినా విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జనవరిలో సంబంధిత ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అటవీ అధికారి నిలదీత అటవీ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులకు క్లియరెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కోరారు. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు మంజూరవుతుంటే వంద మీటర్ల రోడ్డు నిర్మాణానికి మీరెందుకు అభ్యంతరం చెబుతున్నారని డీఎఫ్‌వో విజయ్‌కుమార్‌ను ఆయన నిలదీశారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల విషయంలో అభ్యంతరాలెందుకని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రశ్నించారు. హెక్టార్ వరకు పర్మిషన్ ఇవ్వొచ్చన్నారు. రోడ్ల నిర్మాణాలకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని మంత్రి అచ్చెన్న కూడా సూచించారు. బూర్జ మండలం అనంతగిరి పేట వద్ద ప్రైవేటు వ్యక్తులు తుపానుకు పడిపోయిన చెట్లు నరికివేస్తున్నారని బూర్జ జెడ్పీటీసీ సభ్యుడు అన్నెపు రామకృష్ణ తెలిపారు. ఏనుగుల దాడిలో పంటలు పోయినవారికి పరిహారం సక్రమంగా అందడం లేదని జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సవరతోట ముఖలింగం ఆరోపించారు. ఒకే రైతుకు చెందిన ఎనిమిది ఎకరాల చెరుకు పంటను ఏనుగులు నష్టపరిస్తే పరిహారం ఇవ్వలేదని ఆ రైతు వలస బాట పట్టాడని ఆయన తెలిపారు. అటువంటి వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఎఫ్‌వో కోరారు. ఉద్యానవనశాఖ ఏడీ సరెండర్ విధుల్లో అలసత్వం వహిస్తున్న ఉద్యానవన శాఖ ఏడీ కె.శ్రీనివాస్‌ను సరెండర్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దీనిపై కమిషనర్‌తో కూడా మాట్లాడతానన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు అన్నెపు రామకృష్ణ మాట్లాడుతూ రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయం లోపంతో తుపాను నష్టాల సర్వే సరిగా జరగలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అసలు సర్వే చేయలేదని కోఆప్షన్ సభ్యుడు ముఖలింగం తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ స్పెషల్ కేసుగా పరిగణించి సర్వేకు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. బూర్జ విత్తనాభివృద్ధి క్షేత్రం ఆక్రమణలకు గురవుతోందని జెడ్పీటీసీ రామకృష్ణ తెలిపారు. కార్యక్రమాల వివరాలు తెలియాలి ఐటీడీఏ పరిధిలో జరిగే కార్యక్రమాల గూర్చి ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ట్రైకార్ యూని ట్లు ఎన్ని మంజూరయ్యాయో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పీవోను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాల దరఖాస్తు గడువును సంక్రాంతి వరకు పెంచేలా ఆయా కమిషనర్లతో మాట్లాడతానన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని సీతంపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలక రాజ్‌కుమార్ తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ కోచింగ్ ఇప్పించాలని కోరారు. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లతోపాటు ట్యూటర్లను నియమించాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు కోరారు. తుపానుకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంకా పది శాతం గ్రామాలకు సరఫరా పునరుద్ధరించలేదని విప్ రవికుమార్ చెప్పారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, ఐటీడీఏ పీవో సత్యనారాయణ, ఆర్డీవోలు దయానిధి, వెంకటేశ్వరరావు, సాల్మన్‌రాజు, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్ఈ వీరారెడ్డి, డీఎంహెచ్‌వో శ్యామ ల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ డీడీ సుదర్శనదొర, జెడ్పీ సీఈవో వసంతరావు, డీసీఎహ్వో సునీల, ఆర్వీఎం పీవో గణపతిరావు, వ్యవసాయశాఖ జేడీ అప్పలస్వామి, జీసీసీ డీఎం విజయ్‌కుమార్, డీఎం వో అరుణ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాయక్, వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. -
ఆరు శాఖలకే పరిమితమైన సమావేశం
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ 68వ పాలక వర్గ సమావేశం తూతూ మంత్రంగానే ఆదివారం ముగిసింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో 26 ప్రభుత్వ శాఖలు ఉండగా కేవలం ఆరు శాఖలపైనే చర్చకు పరిమితమైంది. వాస్తవంగా అన్ని శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా 20 శాఖలను అసలు పట్టించుకోలేదు. అజెండాలో కూడా ఆయా శాఖలకు మంజూరైన నిధులు, చేసిన ఖర్చులు, కార్యకలాపాలు రూపొందించారు. అరుుతే కేవలం ఆరు శాఖలపైనే చర్చ జరిపి పాలకవర్గ సమావేశం అయ్యిందనిపించారు. వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, గ్రామీణ నీటి పారుదల విభాగం, గిరిజన సంక్షేమం, ఇంజినీరింగ్ విభాగం, గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛందసంస్థల కార్యకలాపాలు, అటవీశాఖపై మాత్రమే చర్చ జరిగింది. ముఖ్యమైన గిరిజన సంక్షేమశాఖ, ఉద్యానవనశాఖ, ఐఏపీ, జాతీయగ్రామీణాభివృద్ధి పథకం, ప్రత్యేక ఉపాధి పథకం, వెలుగు, గృహనిర్మాణశాఖ, మలేరియా విభాగం, వైద్యశాఖ, గిరిజన సహకార సంస్థ, ట్రైకార్, స్త్రీ శిశుసంక్షేమశాఖ, భూగర్భజలశాఖ తదితర శాఖలపై చర్చజరగాల్సి ఉన్నప్పటకీ వీటి జోలుకు ఎవరూ పోలేదు. సమయం లేదన్న సాకుతో ముగించారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు ముగించారు. ఒకానొక దశలో పలాస ఎమ్మెల్యే శ్యాంసుందర్ శివాజీ కూడా సమావేశంపై అసంతృప్తి చెందారు. అన్ని శాఖలపై చర్చజరగకుండా సమస్యలు ఎలా పరిష్కారమౌతాయని మంత్రి అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో సమావేశం జరిగితే సమస్యలపై సభ్యులు ప్రశ్నించడానికి అవకాశముండేదన్నారు. కొన్ని శాఖలపై జెడ్పీ సమావేశంలో చర్చించినందున ఇప్పుడు చర్చించడం లేదని మంత్రి అచ్చెన్న చెప్పడం గమనార్హం. ఇకపై జిల్లా పరిషత్ సమావేశం జనవరిలో, ఐటీడీఏ పాలక వర్గ సమావేశం ఫిబ్రవరిలో పెడితే బాగుంటుందని శివాజీ సూచించారు. నోరు కదపని ఎంపీ పాలకవర్గ సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌నాయుడు హాజరైనప్పటికీ కనీసం నోరు కదపలేదు. సమావేశంలో పలాస శాసనసభ్యుడు శ్యాంసుందర్ శివాజీ, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణలు మాత్రమే సమస్యలపై ప్రశ్నలవర్షం కురిపించారు. అవునంటే కాదనిలే అన్న చందంగా ఒకానొక సందర్భంలో మంత్రి అచ్చెన్న ఒకటి మాట్లాడితే దానికి ప్రభుత్వవిప్ కూన రవికుమార్ అడ్డుతగలడం కనిపించింది. అటవీశాఖ పర్మిషన్ లేకపోయినా, గిరిజన సంక్షేమశాఖ రహదారులు నిర్మించాలని, గిరిజనుల ఆవాస ప్రాంతాలు కాబట్టి డీఎఫ్‌వో చూసీచూడనట్టు వ్యవహరించాలని మంత్రి అచ్చెన్న కోరారు. దీనికి స్పందించిన విప్ రవికుమార్ స్పందిస్తూ చట్టబద్ధంగా రహదారులు వేయాలన్నారు. అన్ని శాఖలపై చర్చ జరగకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు సమస్యలపై చర్చించే అవకాశం లేకపోయింది. -
గిరిజన విద్యకు గ్రహణం
సీతంపేట:గిరిజనుల విద్యాభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నా నియామకాల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో 42 ఎస్టీ ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి మూడు పూటల భోజనంతోపాటు మంచి విద్య అందించాలనే ది ప్రభుత్వ లక్ష్యం. అయితే విద్యా బోధనకు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడునెలలు గడిచాయి. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. గణితం, పిజికల్ సైన్స్, ఆంగ్లం, హిందీ, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల ను బోధించడానికి ఇప్పటికీ సిబ్బంది లేరు. అరకొరగా నియమించిన సీఆర్టీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలను ఏ,బీ గ్రేడ్లుగా విబజించారు. నిబంధనల ప్రకారం ఏ గ్రేడ్‌లో 640 మంది విద్యార్థులు మించి ఉన్న పాఠశాలలను చేర్చారు. వీటిలో 26 మంది ఉపాధ్యాయులుండాలి. బీ గ్రేడ్‌లో 320 మంది విద్యార్థులున్న పాఠశాలలను చేర్చారు. వీటిలో 13 మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఏ గ్రేడ్ పాఠశాలల్లో 20 లోపు, బీ గ్రేడ్‌లో పది మందిలోపే ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ఎప్పుడు? టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. దీనికి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాల్సి ఉండగా.. అదీ చేయడంలేదు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో సైతం ఏజెన్సీ పోస్టులు కలపకపోవడంతో వచ్చే విద్యా సంవత్సారానికి కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నా.. పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 27 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పాటికే 90 శాతం సిలబస్ పూరి ్తకావాల్సి ఉంది. అయితే సబ్జెక్టు టీచర్ల కొరతతో సకాలంలో పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిలబస్ పూర్తికాకపోతే తామేం పరీక్షలు రాస్తామని విద్యార్థులు వాపోతున్నారు. కాగా రెండేళ్ల క్రితం ఐటీడీఏ పరిధిలో పది వరకు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలల్లో ఇప్పటివరకు బోధకులు లేరు. దీంతో విద్యార్థులను పట్టించుకున్న నాథడు కరువయ్యాడు. మారుమూలన ఉన్న పూతికవలస, సామరిల్లి వంటి పాఠశాలల్లో అరకొర ఉపాధ్యాయులుతో నెట్టుకొస్తున్నారు. ఆశ్రమాలుగా మార్చారు.. సిబ్బందిని మరిచారు రెండేళ్ల కిందట శ్రీకాకుళం, మందస, సీతంపేటల లో ఉన్న గిరిజన బాలుర వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చారు. అయితే వీటికి బోధకులను మాత్రం నియమించలేదు. సీతంపేటకు 13 పోస్టులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ అనుమతి లేదు. శ్రీకాకుళం, మందస ఆశ్రమ పాఠశాలలకు అసలు పోస్టులనే మంజూరు చేయలేదు. వసతులు కల్పించకుండానే వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ విషయమై ఇటీవల సీతంపేట వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అదనపు డెరైక్టర్ చిన్నవీరభద్రుడు వద్ద ప్రస్తావించగా త్వరలోనే ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని తెలిపారు. గిరిజన విద్య పట్ల నిర్లక్ష్యం: డొంకాన ఈశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి గిరిజన విద్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్వం వహిస్తోంది. అప్‌గ్రేడ్ చేసి రెండేళ్లయినా పోస్టులను భర్తీ చేయకపోవడం అన్యాయం. చాలా ఆశ్రమ పాఠశాలల్లో ఇంతవరకు ఉపాధ్యాయులను నియమించకపోవడం దారుణం. గిరిజన విద్యకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం పోస్టుల భర్తీపై ఇంత నిర్లక్ష్యం వహించడం తగదు. -
నాలుగేళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు..!
సీతంపేట: నాలుగేళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు... ఇళ్లంతా అల్లరి చేస్తారు... బడికి వెళతావా అంటే ఊ..హూ అంటారు.. అఆలు దిద్దిస్తే అష్ట వంకరలు తిప్పుతారు. ఏబీసీడీలు చదవమంటే నోరు మెదపరు. అయితే పాత కొత్త పణుకువలసకు చెందిన భవిత అలా కాదు. జనరల్ నాలెడ్జలో దిట్ట. ఏ ప్రశ్న అడిగినా టక్కమని సమాధానం చెబుతుంది. ఒక సారి వింటే చాలు గుర్తుపెట్టేసుకుంటుంది. ప్రపంచ దేశాలు-వాటి రాజధానులు, రాష్ట్రాలు-వాటి రాజధానులు, ఏయే సరస్సులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.. తెలుగు నెలలు, సంవత్సరాలు, ప్రముఖులు సమాధుల పేర్లు, అవి ఎక్కడ ఉన్నాయి వంటివి ఇట్టే చెప్పేస్తోంది. రోజూ ఇంటి వద్ద జనరల్నాలెడ్జ్ చెప్పడానికి పాప కోసం అరగంట పాటు కేటాయిస్తానని.. తొమ్మిదో తరగతి విద్యార్థికి ఓ మాస్టారు పాఠాలు చెబుతుండగా విని రాజధానులు వాటి పేర్లు చెప్పాలని ఇంటి వద్ద పట్టుబట్టిందని.. దీంతో జనరల్ నాలెడ్‌జ విషయాలు భవితకు చెబుతున్నామని.. అన్నీ చెప్పడమే తరువాయి ఇట్టే గుర్తుపెట్టుకుని అనర్గలంగా చెప్పేస్తుందని స్థానిక మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆమె తండ్రి దిలీప్ చెప్పారు. ఆదివారం యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సీతంపేట మండలంలో వన భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ఉపాధ్యాయులు ఆ చిన్నారిని పలు ప్రశ్నలు వేయగా టకటక చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్నారి ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు అభినందించారు. -
పోడు రైతులకు రుణపోటు!
సీతంపేట: కొండపోడే జీవనాధారమైన గిరిజనులకు రుణమాఫీ పథకం వర్తించదని బ్యాంర్లు పేర్కొంటుండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. రుణమాఫీ అమలు చేయకపోతే అప్పుల్లో నిండా మునిగిపోతామని వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. హయాంలో వర్తించిన రుణమాఫీ ఇప్పుడు వర్తించదనం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో పల్లపు భూములు ఎక్కువగా ఉంటాయి. అదే గిరిజన ప్రాంతాల్లో కొండలు, గుట్టలే అధికం. ఆ కొండలపైనే గిరిజనులు పోడు చేసి పైనాపిల్, పసుపు, ఉసిరి, జీడి, మామిడి, పనస, అల్లం, సీతాఫలం వంటి పంటలు మాత్రమే పండిస్తారు. అక్కడక్కడా వరి వేస్తున్నా అది చాలా తక్కువ. వీరి పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం కొండ పోడు భూములకు డి.పట్టాలు ఇచ్చింది. పంట రుణాలు కూడా మంజూరు చేయిస్తోంది. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో తమ రుణాలు కూడా మాఫీ అవుతాయని గిరిజన రైతులు ఆశించారు. రుణ బకాయిలు చెల్లించడం మానేశారు. తీరా ఇప్పుడు కొండపోడు పంటలకు రుణమాఫీ లేదని బ్యాంకర్లు చావు కబురు చల్లగా చెప్పడంతో నీరుగారిపోతున్నారు. రుణ బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక గిరిజన రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లా 20 సబ్‌ప్లాన్ మండలాలు ఉండగా ఒక్క సీతంపేట మండలంలోనే సుమారు 5 వేల మంది గిరిజన రైతులు ఉన్నారు. బ్యాంకుల్లో వారి పేరిట సుమారు రూ.11 కోట్ల బకాయిలు ఉన్నాయి. సగటున ఒక్కో రైతు రూ.25 వేల వరకు బకాయిపడ్డాడు. ఇప్పుడు వాటిని చెల్లించడం తలకు మించిన భారంగా పరిణమించింది. ఇదే సమయంలో హుద్‌హుద్ తుపాను కారణంగా వేసిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రుణాలు మాఫీ కాకపోతే జీవనం సాగడం కష్టమేనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఐటీడీఏ ఎదుట ధర్నా చేసిన గిరిజనులు, ముందు ముందు ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. దివంగత వైఎస్ పాలనలో రుణాలు మాఫీ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో 2007లో కొండపోడు పట్టాలపై తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేశారని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో గిరిజనుల కొండపోడు రుణాలకు మాఫీ లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ప్రస్తావించగా ఈ విషయం తమకూ స్పష్టంగా తెలియదన్నారు. ఈనెల 15 లోపు రుణమాఫీ అర్హుల జాబితాలను ఆన్లైన్లో పెడతారని, అప్పుడే స్పష్టత వస్తుందన్నారు. గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రుణమాఫీపై గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇప్పుడు చేయకపోవడం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి రుణ మాఫీ వర్తింపజేయాలి. - సవరలక్ష్మి, ఎంపీపీ రుణమాఫీ ప్రకటించాలి పోడు పట్టాలకు కూడా రుణమాఫీ ప్రకటించాలి. ప్రభుత్వం గిరిజనులను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు. కొండ పోడు పంటలే వారికి జీవనాధారం. వెంటనే మాఫీ ప్రకటించకపోతే ఉద్యమాలు తప్పవు. -పత్తిక కుమార్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు -
నాలుగేళ్లకే 25 కిలోలు!
సీతంపేట : బాలబీముడిలా కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు సవర ఫల్గుణరావు. కుడ్డపల్లి పంచాయతీ అంటికొండపెద్దగూడ గ్రామానికి చెందిన సవర మహేష్, మీనాకుమారిలో మూడో సంతానం. పుట్టిన ప్పుడు సాధరణంగా కిలోన్నర బరువున్న ఈ చిన్నారి నాలుగేళ్ల ప్రాయం వచ్చేసరికి 25 కిలోలకు చేరడంతో గిరిజనులైన ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు మగ సంతానం పుట్టి చనిపోయిన తర్వాత 2010 సెప్టెంబరులో ఫల్గుణరావు జన్మించాడని, రోజురోజుకూ బరువు పెరుగుతుండడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు పూటలా పెద్దవాళ్ల మాదిరిగానే అన్నం తింటాడని.. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలిగా ఉంటోందని చెబుతుంటాడని.. కొద్ది దూరం కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్దామన్నా తమ వద్ద చిల్లిగవ్వయినా లేదని.. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
ఐటీడీఏలో ఎమ్మెల్యే ‘ప్రజాదర్బార్’
సీతంపేట : తన నియోజకవర్గంలోని సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం ఐటీడీఏలో ప్రత్యేక గిరి జన దర్బార్ నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని కొత్తూ రు, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళి యాపుట్టి మండలాల్లోని గిరిజన గ్రామాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ల తో సహా పెద్ద ఎత్తున గిరిజనులు హాజరై ఎమ్మెల్యే, అధికారులకు తమ సమస్యలు విన్నవించారు. ప్రాజెక్టు అధికారి ఎన్.సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాస్, ఎం.వీ.రమణ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన దొర ఎమ్మెల్యేతో పాటు అర్జీలు స్వీకరించారు. వీలైనన్ని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. 30కి పైగా వినతులు చెరువులు చెక్‌డ్యాంలు కావాలని, దాదాపు 50 గ్రామాల వరకు రోడ్లు నిర్మించాలని, మరమ్మతు లు చేపట్టాలని వినతులు వచ్చాయి. మెట్టూరు నుంచి గొట్టిపల్లి గ్రామ రహదారిని బాగు చేయాలని, సవర శంకాపురం, సంతోషపురం, బగద ల, జీడిబందల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని, కొత్తగూడలో తాగునీటి సమస్య పరిష్కరించాలని తదితర సమస్యలపై గిరిజనులు అర్జీలు అందించారు. వీటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మె ల్యే వెంకటరమణ అధికారులను కోరా రు. వారు పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక దర్బార్‌లో కొత్తూరు జెడ్పీటీసీ సభ్యురాలు పాలక ధనలక్ష్మి, ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, మెళియా పుట్టి వైస్ ఎంపీపీ దినకర్, సర్పంచ్‌లు రేగన మోహన్‌రావు, చిన్నబాబు, వైఎస్సార్ సీపీ నేతలు శివ్వాల కిషోర్, గంగు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏమి‘టీ’ శిక్ష..?
సీతంపేట: భరించలేని తలనొప్పి ఆ విద్యార్థి పాలిట శాపంలా పరిణమించింది. ఎంతో ఓపిక, సహనంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి..ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయిని బాధ్యత మరిచి వేడి టీ గ్లాసుని బాలుడి చేతిపై ఉంచింది. దీంతో బాలుడి చేతి పై తీవ్ర గాయమై..ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలివీ.. మల్లి గిరిజన సంక్షేమ ఉన్నత బాలుర ఆశ్రమ పాఠశాలలో జగ్గడుగూడకు చెందిన సవర సూగన్న ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 15న పాఠశాలలో సో షల్ అసిస్టెంట్ పల్లెరిక చంద్రకళ 8వ తరగతి మూడు సెక్షన్లు కలిపి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. మధ్యలో టీ రావడంతో ఆమె టీ తాగుతూ..ఆ సమయంలో తలనొప్పితో బాధపడుతూ..కునుకు తీస్తున్న సూగన్న వద్దకు వెళ్లి..టీ గ్లాసుతో చురక వేసింది. వెంటనే తేరుకున్న విద్యార్థి వెక్కివెక్కి ఏడ్చాడు. అనంతరం చేతిపై బొబ్బలు తేలడంతో మరుసటి రోజు.. వసతిగృహ సంక్షేమాధికారి ధర్మారావు ఆస్పత్రికి తీసుకువెళ్లినా.. చేయిపై బొబ్బలు తగ్గలేదు. అనంతరం చెయ్యి సెప్టిక్ అయి..చీము కారడంతో విద్యార్థి..తన స్వగ్రామమైన జగ్గడుగూడకు వచ్చేసి..తల్లికి విషయాన్ని చెప్పాడు. కంగారు పడిన ఆమె..సపర్యలు చేసి, బం ధువులతో విషయాన్ని చెప్పింది. వెంటనే వారంతా.. ఐటీడీఏకు వచ్చి..జరిగిన సంఘటనను బుధవారం రాత్రి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన..విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని డీడీ సుదర్శనదొరను ఆదేశించారు. డీడీ పాఠశాలకు వెళ్లి..విచారణ జరిపారు. ఇంత నిర్లక్ష్యమా..? మల్లి ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన దొర విచారణ చేపట్టారు. ఏటీడబ్ల్యూవో ఎర్రన్నాయుడు, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌పాత్రో తదితరులు పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్నా రు. ఉపాధ్యాయిని చంద్రకళను విచారించగా..విద్యార్థి చేయిపై..టీ తాగుతున్న గ్లాసుతో చేరకవేయడం వాస్తవేనని అంగీకరించారని డీడీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంత సంఘటన జరిగినా..తనకు గానీ, ఏటీడబ్ల్యూవోకు గానీ సమాచారం ఇవ్వకపోవడం వెనుక హెచ్ఎం నిర్లక్ష్యం ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీవోకు అందజేస్తానన్నారు. ఇదిలా ఉండగా..బాబు కనీసం అన్నం తినలేకపోతున్నాడని..సూగన్న తల్లి చంద్రమ్మ రోదిస్తోంది. పాఠశాలకు పంపిస్తే..ఇంతటి శిక్ష వేస్తారా..అంటూ..ఆమె ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చదివించాలంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలుడికి వైద్యసేవలంది స్తున్న డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ..చెయ్యి సెప్టిక్ అయ్యిందని..ప్రస్తుతానికి ఫర్వాలేదని తెలిపారు. ఉపాధ్యాయురాలి సస్పెన్షన్ విద్యార్థిపై టీ గ్లాసుతో చురక వేసిన ఉపాధ్యాయిని పి.చంద్రకళను సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన్ దొర తెలిపారు. సంఘటన జరిగినా..ఐటీడీఏకు సమాచారం ఇవ్వనందుకు హెచ్ఎం గున్ను రామ్మోహనరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏజెన్సీలో రూ.80 లక్షల బకాయిలు
సీతంపేట: ఏజెన్సీలోని ఆదివాసులకూ ఇళ్ల తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే సుమారు రూ.80 లక్షల బిల్లులు పెండింగులో ఉండిపోగా.. ఇప్పుడు మొత్తం ఇళ్లే రద్దవుతాయన్న ఆందోళన గిరిజనులను వేధిస్తోంది. మూడు దశల్లో ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల్లో 6,105 ఇళ్లు మంజూరు కాగా సుమారు 4 వేల ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. అలాగే రచ్చబండ 1, 2 దశల్లో, 171 జీవో ద్వారా మరో 1342 ఇళ్లు మంజూరు కాగా 361 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. యూనిట్ విలువ రూ. లక్షలోపే ఉండడం, నిర్మాణానికి అది ఎంతమాత్రం సరిపోకపోవడంతో గిరిజన లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో సీతంపేట వచ్చినపుడు కొండపైనున్న గ్రామాల్లో ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్లు కట్టిం చి ఇస్తుందని, నిర్మాణ వ్య యా న్ని రూ. లక్షా పదివేలకు పెంచుతామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ధరలు పెరిగిన పరిస్థితుల్లో కొండలపై ఇల్లు నిర్మించాలంటే కనీసం రూ. 3 లక్షలు అవసరం. దీనికి తోడు బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణా లు మధ్యలోనే నిలిచిపోతున్నా యి. రద్దవుతాయన్న ఆందోళన మరోవైపు మంజూరైన ఇళ్లు రద్దు అవుతాయని ప్రచారం జరుగుతుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇళ్లు మంజూరై ఆర్థికపరమైన కారణాలతో నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సుమారు 1500 ఇళ్లు రద్దయ్యే అవకాశముంది. ఈ విషయమై హౌసింగ్ జేఈ లాలాలజపతిరాయ్ వద్ద ప్రస్తావించగా బిల్లుల చెల్లింపు విషయమై ఇంతవరకు ఆదేశాలు రాలేదన్నారు. -
మూడు గంటల్లో మమ..!
సీతంపేట: ప్రతిసారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగే సీతంపేట ఐటీడీఏ(సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) పాలకవర్గ సమావేశం ఆదివారం మాత్రం మొక్కుబడిగా జరిగింది. సంస్థ పరిధిలో అమలవుతున్న అన్ని పథకాలు, శాఖల పనితీరుపై సమగ్రంగా చర్చించాల్సిన ఈ సమావేశాన్ని మూడంటే మూడు గంటల్లో ముగించేశారు. ఉదయం 11.30కు మొదలై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసింది. ఎమ్మెల్యేలతో సమానంగా ప్రశ్నించే హక్కు ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. తాము ఎన్నికైన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో తమ పరిధిలోని ప్రజల సమస్యలు ప్రస్తావించాలని ఎంతో ఉత్సాహంతో హాజరైన వీరంతా సమావేశం జరిగిన తీరుతో నిరుత్సాహం చెందారు. తక్కువ వ్యవధిలోనే సమావేశాన్ని ముగించడంపై ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నందున ఒక్కపూటకే పరిమితం చేశామని, ఇక ముందు రెండుపూటలా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో పది నియోజకవర్గాలుండగా రాజాం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరూ హాజరు కావాల్సి ఉంది. కానీ టీడీపీకి చెందిన ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు బి.అశోక్, కళా వెంకట్రావు, బగ్గు రమణమూర్తి, గౌతు శివాజీలు రాలేదు. గిరిజన మంత్రి కిశోర్‌బాబు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, అరుకు ఎంపీ కొత్తపల్లి గీతలు మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావనకు నోచుకోలేదు. ఎమ్మెల్సీలు కూడా గైర్హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పాతపట్నం, పాలకొండ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వాసరాయి కళావతిలు మాత్రమే హాజరై తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై స్పందించారు. అధికారులను ప్రశ్నించారు. కొన్ని శాఖలపై చర్చే లేదు సమయాభావం కారణంగా కొన్ని శాఖలపై చర్చే జరగలేదు. కీలకమైన ట్రాన్స్‌కో, చిన్న నీటివనరులు, మలేరియా విభాగం, గిరిజన సహకార సంస్థ, హౌసింగ్ తదితర శాఖలు అసలు ప్రస్తావనకే రాలేదు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, ఇంజనీరింగ్ విభాగం, వైద్యశాఖలపైనే చర్చ సాగింది. అది కూడా నామమాత్రంగానే జరిగింది. కాగా ఇటీవల మంత్రి అచ్చెన్న జరిపిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కొంత చర్చ జరిగింది. ఆ నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. -
ఎందుకీ ‘వేలం’ వెర్రి!
సీతంపేట: నిధులకు కటకటలాడుతున్న ఐటీడీఏలో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. అనవసర ఖర్చులతో దుబారా చేయడంపైనే అధికారులు శ్రద్ధ చూపుతున్నారు. నిక్షేపంలా తిరుగుతున్న వాహనాలను వేలం వేసి వాటి స్థానంలో అద్దెకు వాహనాలు సమకూర్చుకోవాలని తలపెట్టడం దీనికి నిదర్శనం. ఇప్పటికే ఐకేపీలో ఏ ఇతర ఐటీడీఏలోనూ లేని విధంగా గుమస్తాల నుంచి ఏపీఎంల వరకు కార్లు కేటాయించేసి అద్దెల రూపంలో లక్షలాది రూపాయల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది చాలదన్నట్లు ఉన్న వాహనాలను వేలం వేసి కొత్త వాహనాలు అద్దెకు తీసుకోవాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న కొన్ని వాహనాలను మూలనపడిన వాటితో కలిపివేలం వేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించడానికి ఐటీడీఏలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహనాలు కేటాయించింది. ఇలా ఐటీడీఏలో రెండు అంబులెన్సులు కాకుండా మరో 8 వాహనాలు ఉన్నాయి. వాటిలో 7 జీపులు కాగా.. ఒకటి బొలేరో వాహనం. వీటిలో మూడు మాత్రమే కండీషన్లో లేక మూలనపడ్డాయి. సీజ్ చేసిన ఒక జీపు కూడా మూలన పడింది. మిగతా ఆరు వాహనాలు తిరుగుతున్నాయి. అయితే మూలనపడిన వాటితోపాటు అన్ని వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. చిన్న రిపేర్లతో సరిపోయేదానికి.. ప్రస్తుతం తిరుగుతున్న వాహనాలకు ఏవో చిన్నపాటి సమస్యలు తప్ప ఏ లోపం లేదు. ఒక్కో వాహనానికి రూ. 25 వేలు.. మొత్తం మీద రూ.2 లక్షలు వెచ్చించి వీటికి మరమ్మతులు చేయిస్తే.. మరో రెండేళ్ల వరకు బాగా పనిచేస్తాయని ఐటీడీఏ డ్రైవర్లే చర్చించుకుంటున్నారు. కొండలపైనున్న గ్రామాలకు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తాయని అంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా వీటిని వేలం వేసి.. కొత్తగా ఎనిమిది వరకు వాహనాలను అద్దెకు తీసుకుని ఒక్కో వాహనానికి నెలకు రూ. 24 వేలు చెల్లించడానికి అధికారులు సిద్ధమతున్నారు. దీనివల్ల వాహనాలకు అద్దె రూపంలో నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతాయి. డ్రైవర్ల పరిస్థితి ప్రశ్నార్థకం... కాగా కొందరు డ్రైవర్లు గత 20 ఏళ్లుగా ఐటీడీఏనే నమ్ముకుని పని చేస్తున్నారు. ఇప్పుడున్న వాహనాలను వేలం వేసి.. వేరేవి అద్దెకు తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి 9 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వాహనాలను వేలం వేస్తే వీరికి పని ఉండదు. అందువల్ల తమ ఉపాధి పోతుందేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. అవి పాత వాహనాలే:పీవో ఐటీడీఏలో ప్రస్తుతం తిరుగుతున్నవన్నీ పాత వాహనాలని ప్రాజెక్టు అధికారి ఎన్.సత్యానారాయణ అన్నారు. 15 ఏళ్లు క్రితంనాటి ఈ వాహనాలు ఇప్పటికే 2.50 లక్షల కిలోమీటర్లు తిరిగేశాయన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న ఉద్దేశంతో వేలం వేయాలని నిర్ణయించామని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వేలం వేస్తామని, ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పారు.