
పోడు రైతులకు రుణపోటు!
సీతంపేట: కొండపోడే జీవనాధారమైన గిరిజనులకు రుణమాఫీ పథకం వర్తించదని బ్యాంర్లు పేర్కొంటుండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. రుణమాఫీ అమలు చేయకపోతే అప్పుల్లో నిండా మునిగిపోతామని వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. హయాంలో వర్తించిన రుణమాఫీ ఇప్పుడు వర్తించదనం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో పల్లపు భూములు ఎక్కువగా ఉంటాయి. అదే గిరిజన ప్రాంతాల్లో కొండలు, గుట్టలే అధికం. ఆ కొండలపైనే గిరిజనులు పోడు చేసి పైనాపిల్, పసుపు, ఉసిరి, జీడి, మామిడి, పనస, అల్లం, సీతాఫలం వంటి పంటలు మాత్రమే పండిస్తారు. అక్కడక్కడా వరి వేస్తున్నా అది చాలా తక్కువ. వీరి పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం కొండ పోడు భూములకు డి.పట్టాలు ఇచ్చింది. పంట రుణాలు కూడా మంజూరు చేయిస్తోంది. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో తమ రుణాలు కూడా మాఫీ అవుతాయని గిరిజన రైతులు ఆశించారు. రుణ బకాయిలు చెల్లించడం మానేశారు. తీరా ఇప్పుడు కొండపోడు పంటలకు రుణమాఫీ లేదని బ్యాంకర్లు చావు కబురు చల్లగా చెప్పడంతో నీరుగారిపోతున్నారు. రుణ బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక గిరిజన రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లా 20
సబ్‌ప్లాన్ మండలాలు ఉండగా ఒక్క సీతంపేట మండలంలోనే సుమారు 5 వేల మంది గిరిజన రైతులు ఉన్నారు. బ్యాంకుల్లో వారి పేరిట సుమారు రూ.11 కోట్ల బకాయిలు ఉన్నాయి. సగటున ఒక్కో రైతు రూ.25 వేల వరకు బకాయిపడ్డాడు. ఇప్పుడు వాటిని చెల్లించడం తలకు మించిన భారంగా పరిణమించింది. ఇదే సమయంలో హుద్‌హుద్ తుపాను కారణంగా వేసిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రుణాలు మాఫీ కాకపోతే జీవనం సాగడం కష్టమేనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఐటీడీఏ ఎదుట ధర్నా చేసిన గిరిజనులు, ముందు ముందు ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
దివంగత వైఎస్ పాలనలో రుణాలు మాఫీ
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో 2007లో కొండపోడు పట్టాలపై తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేశారని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో గిరిజనుల కొండపోడు రుణాలకు మాఫీ లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ప్రస్తావించగా ఈ విషయం తమకూ స్పష్టంగా తెలియదన్నారు. ఈనెల 15 లోపు రుణమాఫీ అర్హుల జాబితాలను ఆన్‌లైన్‌లో పెడతారని, అప్పుడే స్పష్టత వస్తుందన్నారు.
గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
రుణమాఫీపై గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇప్పుడు చేయకపోవడం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి రుణ మాఫీ వర్తింపజేయాలి.
- సవరలక్ష్మి, ఎంపీపీ
రుణమాఫీ ప్రకటించాలి
పోడు పట్టాలకు కూడా రుణమాఫీ ప్రకటించాలి. ప్రభుత్వం గిరిజనులను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు. కొండ పోడు పంటలే వారికి జీవనాధారం. వెంటనే మాఫీ ప్రకటించకపోతే ఉద్యమాలు తప్పవు. -పత్తిక కుమార్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు