డ్వాక్రా చెల్లికి టోకరా! | There is no funds to the Dwarka loans from one and half year | Sakshi
Sakshi News home page

డ్వాక్రా చెల్లికి టోకరా!

Published Mon, Mar 20 2017 1:23 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

డ్వాక్రా చెల్లికి టోకరా! - Sakshi

డ్వాక్రా చెల్లికి టోకరా!

ఏడాదిన్నరగా సున్నా వడ్డీ పథకానికి నిధులు సున్నా

మహిళా సంఘాలను దగా చేస్తున్న రాష్ట్ర సర్కారు  
రుణాలు సకాలంలో చెల్లించినా అందని సాయం
డ్వాక్రా సంఘాలపై అదనపు భారం రూ.1,573 కోట్లు
రుణమాఫీ హామీని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మోసం
సున్నా వడ్డీ పథకానికి పాతరేస్తున్న ముఖ్యమంత్రి
బాబు మాటలు నమ్మి మోసపోయామంటున్న మహిళలు


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన డ్వాక్రా మహిళా సంఘాలను ప్రభుత్వమే క్రమంగా నిర్వీర్యం చేస్తోంది. రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాక ఆ మాటే మర్చిపోయారు. రుణమాఫీ ఊసే లేదు పొమ్మన్నారు. ఇప్పుడు ఏకంగా వడ్డీ లేని రుణాలకు సైతం ఎగనామం పెట్టారు. డ్వాక్రా మహిళలను నిలువునా వంచిస్తు న్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందునుంచే అమల్లో ఉన్న ‘డ్వాక్రా రుణాలపై సున్నా వడ్డీ’ పథకానికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. 2015 సెప్టెంబర్‌ నుంచి నిధులు రాకపోవడంతో డ్వాక్రా సంఘాల మహిళలే వడ్డీ కింద అదనంగా రూ.1,573.06 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. అంటే చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోగా ఆయన నిర్వాకం వల్ల రూ.1,573 కోట్ల వడ్డీని సైతం మహిళలు చెల్లించారు. సున్నా వడ్డీ పథకానికి ముఖ్యమంత్రి పాతరేస్తుండడంపై డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలను ముంచేస్తున్న చంద్రబాబు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏమిటీ పథకం?
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించే పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉంది. ఈ పథకంలో నెలవారీగా కట్టాల్సిన వాయిదా డబ్బులను సకాలంలో చెల్లిస్తే, ఆ సంఘం ఆ నెలలో మొత్తం రుణంపై చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వమే సంబంధిత బ్యాంకుకు జమ చేస్తుంది. సంఘాలు మధ్యలో కొన్ని నెలలు సకాలంలో చెల్లించక, తర్వాత బకాయిలతో సహా వాయిదాలను చెల్లించినా ఆ నెలకు అయ్యే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాలో ఒక్క రూపాయి తగ్గినా ఆ నెలలో సున్నా వడ్డీ పొందేందుకు ఆ సంఘానికి అర్హత ఉండదు.

అర్హత పొందినా అందని సాయం
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా సున్నా వడ్డీ పథకానికి నిధులు విడుదల చేయడం లేదు. 2015 ఆగస్టు వరకు వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ డబ్బులు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణం తీసుకున్న డ్వాక్రా సంఘాలు 5,52,512 ఉండ గా, 2015 అక్టోబర్‌లో  3,35,448 సంఘాలు ఆ నెల రుణ వాయిదాలను సకాలంలో చెల్లించి సున్నా వడ్డీకి అర్హత పొందాయి. ఆ నెలకుగాను ఆయా సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ రూ.63.60 కోట్లు కాగా, ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ డబ్బులు చెల్లించలేదు. అప్పటినుంచి ప్రభుత్వం వడ్డీని చెల్లించిన దాఖలాలు లేవు. దీంతో డ్వాక్రా సంఘాలే ఈ వడ్డీని చెల్లించాల్సి వస్తోంది.

ఒక్కో సంఘంపై అదనపు భారం రూ. 70 వేలు
ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి నిధులివ్వకపోవడంతో ఒక్కో డ్వాక్రా సంఘం ఇప్పటికే బ్యాంకులకు వడ్డీ రూపంలో అదనంగా రూ.60 వేల నుంచి రూ.70 వేలు చెల్లించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండ లం ఆర్యపేట గ్రామ సంఘం పరిధిలోని జ్యోతి డ్వాక్రా సంఘం రూ.63,843 అదనపు వడ్డీ భారాన్ని మోయాల్సి వచ్చింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెల్లింపునకు రూ.576.61 కోట్లు, 2016–17లో రూ.996.45 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖను గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

వడ్డీలేని రుణాలు ఇవ్వట్లేదు   
‘‘కోడుమూరు ఏపీజీవీ బ్యాంకులో రూ.30 వేలు అప్పు తీసుకున్నా. ఈ రుణానికి సంవత్సరం నుంచి రూ.100కు రూ.1.40 చొప్పున వడ్డీ కలిపి నెలనెలా కొంత మొత్తం చెల్లిస్తున్నా. గతంలో ప్రభుత్వాలు సున్నా వడ్డీకే రుణాలిచ్చేవి. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం రూపాయికి పైగా వడ్డీ వసూలు చేస్తుండడంతో తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలు నోచుకోవడం లేదు’’    
– శారద, డ్వాక్రా సంఘం సభ్యురాలు, కోడుమూరు, కర్నూలు జిల్లా


చంద్రబాబును నమ్మి మోసపోయాం...
‘‘డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయడు మాట తప్పారు. నేను పొదిలి సిండికేట్‌ బ్యాంకులో రూ.40 వేలు రుణం తీసుకున్నా. ఇప్పటివరకు రుణ మాఫీ కింద రూ.6 వేలు మాత్రమే జమయ్యాయి. మిగతా బాకీ అలాగే ఉంది. రుణం మొత్తం తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు వాళ్లు నోటీసులు పంపిస్తున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. చంద్రబాబును నమ్మి మోసపోయాం. డ్వాక్రా రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న వారికి ప్రభుత్వం వడ్డీ అందజేయడం లేదు’’    
– డి.రమాదేవి, సలకనూతల, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement