మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి? ఈ ప్రశ్న వేయగానే చంద్రబాబు సమాధానంగా కనిపిస్తారు. మరి అదే మహిళలను ఆదుకున్న ముఖ్యమంత్రిగా... వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కళ్లెదుట నిలబడతారు. ఇదే.. ఈ ఇద్దరికీ ఉన్న తేడా. అందుకే ఈ సర్కారును ‘మహిళా పక్షపాత ప్రభుత్వం’గా అంతా గుర్తిస్తున్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రో... ప్రభుత్వమో ఏవైనా సభలు నిర్వహిస్తే ఆ మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావటంలో ఆశ్చర్యమేముంది? దానిక్కూడా బెదిరింపులు... జరిమానాలు.. అంటూ కథలు అల్లాలా రామోజీరావు గారూ? వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉండకూడదన్న కక్షతో రాస్తున్న మీ రాతలు... అబద్దాల్లో ఆస్కార్ స్థాయిని కూడా దాటిపోయాయని ఈ రాష్ట్రంలో తెలియనిదెవ్వరికి? అసలు పొదుపు సంఘాల మహిళల్ని మోసం చేసిందెవరు?
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే బ్యాంకు రుణాలన్నీ భేషరతుగా మాఫీ చేస్తానని, వాయిదాలు చెల్లించొద్దని 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గెలిచాక ఐదేళ్లలో ఒక్క పైసా కూడా మాఫీ చెయ్యలేదు. పైపెచ్చు ఎప్పటికప్పుడు ‘డ్వాక్రా రుణ మాఫీ’పై కథనాలను తన ఎల్లో పత్రికల్లో రాయిస్తూ ఆ మహిళలను ఆశపెట్టి ఉపయోగించుకున్న తీరు దారుణాతి దారుణం.
ఆ మహిళలను నిరంతరం టీడీపీ సభలకు తరలించడానికి ఏకంగా టీడీపీ తరుఫున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అడ్వయిజర్‌గా నియమించేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓడిపోయిన బత్తుల విజయభారతిని చంద్రబాబు 2014లో తాను సీఎం అయ్యాక సెర్ప్ అడ్వయిజర్‌గా నియమించారు.
నిజానికి సెర్ప్ సీఈఓగా ఐఏఎస్ అధికారులే ఉంటలారు. కానీ బాబు తన సామాజికి వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారిని (ఐఏఎస్ కాదు) ముఖ్యమంత్రి ఓఎస్‌డీ పేరిట నియమించుకుని... ఆయన్నే సెర్ప్ సీఈఓగానూ కొనసాగించారు.
పొదుపు సంఘాల మహిళల్ని టీడీపీ సభలకు తరలించటమే ఈ సీఈఓ, అడ్వయిజర్ పని. అధికారికంగా మాత్రం... పొదుపు మహిళలకు ట్రైనింగ్ అని బిల్లులు పెడుతూ... ఆ డబ్బుల్ని మాత్రం వాళ్లను సభలకు తరలించడానికి బస్సులకు, ఇతర వాహనాలకు పెట్టేవారు. అదీ కథ. ఉదాహరణకు బాబు సీఎంగా ఉన్నపుడు నంద్యాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
టీడీపీ తరఫున డబ్బులు పంచడానికి నియోజకవర్గంలో ప్రతి 50 ఏళ్లకు ఒక పొదుపు సంఘ మహిళను ‘సంఘమిత్ర’గా నియమించారు. ఆ ఎన్నికల ముందు చంద్రబాబే నేరుగా పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారంటే ఈ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశారో తెలియకమానదు.
బాబు పాపాల ఫలితమేంటి?
పొదుపు సంఘాలను ఇంతలా వాడేసుకున్న బాబు... వాటికి చేసింది మాత్రం ఏమీ లేదు. హామీ ఇచ్చి కూడా... ఒక్క రూపాయిని సైతం మాఫీ చేయలేదు. అప్పటిదాకా ఉమ్మడి ఏపీలో పొదుపు సంఘాలకు ‘సున్నా వడ్డీ’ పథకం అమలయ్యేది. బాబు సీఎం అయ్యాక ఆ పథకానికి నిధులు నిలిపేశారు. దీంతో వడ్డీ డబ్బులు కూడా మహిళలే చెల్లించాల్సి వచ్చింది.
► ఇక బాబు మాటలు నమ్మి మహిళలు వాయిదాలు కట్టలేదు. దీంతో వడ్డీ, చక్రవడ్డీల భారం పెరిగిపోయింది. 2014 నాటికి రూ.14205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అప్పు, 2019 ఏప్రిల్ నాటికి రెట్టింపు స్థాయిలో రూ. 25,517 కోట్లకు చేరింది. 2019 మార్చి నాటికి పొదుపు మహిళలు తీసుకున్న రుణాలు 20వేల కోట్లకు పైగా ఉన్నాయని ఘనంగా చెప్పిన ‘ఈనాడు’... అందులో సగానికి సగం రుణమాఫీ చెయ్యకపోవటం వల్ల మీదపడిన వడ్డీయేనని ఎందుకు చెప్పదు? ఇంతటి కఠిన వాస్తవాన్ని దాచిపెట్టడానికి కాస్తయినా సిగ్గుండాలి కదా రామోజీరావు గారూ?
► పైపెచ్చు 98.4 శాతం రికవరీ అనేది రామోజీరావు రాతల సారాంశం. అదే నిజమైతే 18.36 శాతం సంఘాలు ఎన్‌పీఏలుగా (నిరర్థక ఆస్తులు) ఎందుకు మారతాయి? బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని నెలల పాటు కేవలం కేవలం 4.4 శాతం సంఘాలే నెలనెలా సమావేశాలు నిర్వహించుకున్నాయి. గ్రామాల్లో ప్రతి నెలా రూ.70 కోట్ల దాకా ఉండే పొదుపు... జస్ట్ రూ.2 కోట్లకు పడిపోయింది.
► ఉమ్మడి ఏపీలో 2014లో మూడున్నర లక్షల పొదుపు సంఘాలు ఏ గ్రేడ్‌లో ఉంటే... బాబు సీఎం అయ్యాక 2015 ఏప్రిల్‌కు ఏ, బీ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కలిపి 2.54 లక్షలకు పడిపోయాయి. ఇక 2015 నవంబరు నాటికి అవి 38 వేలకు (అంటే కేవలం ఐదు శాతం) పడిపోయాయి. ఈ వాస్తవాలు చాలవా... పొదుపు సంఘాల వ్యవస్థను కూకటివేళ్లతో సహా ఈ చంద్రబాబు... రామోజీరావులు ఎంతలా ధ్వంసం చేశారో తెలియటానికి!!?.
ఇప్పుడు.. 91 శాతం సంఘాలది ఏ గ్రేడే...
బాబు చేసిన మోసంతో పూర్తిగా అప్పల ఊబిలో మునిగిపోయిన పొదుపు సంఘాలను ఆదుకుంటానని తన పాదయాత్రలో హామీ ఇచ్చారు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి. తాను గెలిచాక నాలుగు విడతల్లో నేరుగా బకాయి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం... 2019 ఏప్రిల్ ఉన్న రూ.25,517 కోట్లు అప్పును నాలుగు విడతలుగా చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వరుసగా రెండేళ్లు రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.
► వై.ఎస్.జగన్ ప్రభుత్వం మళ్లీ 2020 ఏప్రిల్ 24న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. గడిచిన మూడేళ్లగా ఏకంగా రూ.3615.29 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించింది. ఫలితం... ఇపుడు 91 శాతం సంఘాలు ఏకంగా ‘ఏ’ గ్రేడ్‌కు చేరాయి. 99.5 శాతం మహిళలు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారు.
► ఇవేకాక వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, పేదలకు సొంతిళ్లు వంటి పథకాలన్నిటినీ ప్రభుత్వం మహిళల పేరుతోనే అమలు చేస్తోంది. అందుకే మహిళలు ఈ ప్రభుత్వంపై అభిమానం చూపిస్తున్నారు. సభలకు స్వచ్ఛందంగా తరలి వచ్చి జేజేలు పలుకుతున్నారు. దీన్ని భరించలేని కడుపుమంటకు ప్రత్యక్ష రూపమే... ‘ఈనాడు’ కథనం. కాదంటారా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment