పసుపు-కుంకుమగా మూడువేలు
డ్వాక్రా మహిళలతో ముఖాముఖిలో సీఎం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పసుపు-కుంకుమ పేరిట రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో రూ.3 వేల చొప్పున పదివేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పొదుపు, రుణాల రూపేణా చేతికందిన సొమ్ము గురించి ఇంట్లో మగాళ్లకు తెలియనివ్వవద్దని, తెలిస్తే తాగుడుకు వాడేస్తారని, ఇవ్వకపోతే హింసిస్తారని హెచ్చరించారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. వాటిని పాటిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వచ్చే సంక్రాంతికి కూడా కానుకలు అందజేస్తామని, ఆ సరుకులతో పిండివంటలు చేసుకొని ఆనందించాలని చెప్పారు. రాష్ట్ర జనాభా తగ్గిపోతోందని, పిల్లలను కని రాష్ట్ర జనాభాను పెంచాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని 46,211 డ్వాక్రా సంఘాలకు రూ.285.30 కోట్ల ఆస్తులను సీఎం పంపిణీ చేశారు.
తమ్ముళ్ల దందాకు అధికారులే బాధ్యులు...: రాష్ట్రంలో ఎక్కడైనా టీడీపీ నాయకులు ఇసుక దందాలకు పాల్పడితే సంబంధిత ప్రాంతంలోని డీఎస్పీ, ఆర్డీవో, తహసిల్దార్లే బాధ్యులని, వారిపై చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఎన్‌టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో మధ్యాహ్నం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో సొంత పార్టీ నాయకులు, అక్కడున్న అధికారులు విస్మయం చెందారు. ఇప్పుడు నామినేటెడ్ పదవులకు, పార్టీ కమిటీలకు సభ్యులను ఐవీఆర్‌ఎస్ ఆధారంగానే ఎంపిక చేస్తామని, వచ్చే ఎన్నికలలో సీట్ల కేటారుుంపు కూడా ఈ విధానంలోనే ఉంటుందన్నారు.