♦ వేయికోట్ల దోపిడీపై విచారణ ఏది?
♦ దోషులకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లేనా..తమ్ముళ్లను రక్షించడానికే కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్: అధికార పగ్గాలు చేపట్టగానే మన రాష్ర్టంలో ఇసుక విధానాన్ని మార్చింది చంద్రబాబు నాయుడే. డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తానని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు వారికి ఇసుక క్వారీలు అప్పగించారు. డ్వాక్రా సంఘాల ముసుగులో అధికార పక్ష నేతలు ఈ వ్యాపారం ద్వారా వేల కోట్లు గడించారు. అక్రమ తవ్వకాలతో సహజ సంపదను దోచుకున్న తమ్ముళ్ల ఇసుక దందాలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ర్టంలో ఇసుక ధరలు విపరీతంగా పెరగడమేకాక, ఇసుక కూడా దొరకని పరిస్థితి తలెత్తింది.
ఈ విమర్శల నుంచి తప్పించుకోవడం కోసమే కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత దోచుకునేందుకే మరలా టెండర్ల విధానానికి చంద్రబాబు రాచబాట వేశారని వినిపిస్తోంది. ఇసుక అమ్మకాలలో దోపిడీని అడ్డుకునేందుకే ఈ విధానాన్ని మార్చుతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. రూ. వేయికోట్ల పైగా ఇసుక మాఫియా కైంకర్యం చేసినట్లు విమర్శలున్నాయి.
వాటిపై ఎలాంటి విచారణా లేనట్లే.. తమ్ముళ్ల ఇసుక దందాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిజాయితీ గలిగిన అధికారులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. కృష్ణా-పశ్చిమగోదావరి సరిహద్దులో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ముసునూరు తహసీల్దారు వనజాక్షిపై ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులతో కలిసి దాడి చేయడం సంచలనం రేపింది. దాడి చేసినవారిపై చర్య తీసుకోవలసింది పోయి దాడికి గురైన అధికారిణిదే తప్పని తేల్చడం చంద్రబాబు చిత్తశుద్దికి నిదర్శనంగా నిలుస్తుంది.
వెయ్యికోట్లు దోచుకున్నారు: ఇసుక తవ్వకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి సుమారు రూ. 1,000 కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక స్థానికంగానే ఇసుక ధరను నిర్ణయించి డ్వాక్రా సంఘాల ద్వారా అమ్మకాలు చేయాలని ఆదేశించింది. ఆ ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇసుక క్యూబిక్ మీటరుకు రూ. 500 గా, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో క్యూబిక్ మీటరుకు రూ. 700 నుంచి రూ. 750లుగా నిర్ణయించారు.
గతంలో ఇసుక రాయల్టీ రూ. 40లు ఉన్నపుడే 2013లో (12 నెలల్లో) ఇసుకపై రు 121 కోట్ల మేర రాబడి వచ్చింది. ఇపుడు ఇసుక ధరలు పధ్నాలుగు రెట్లు పెరిగాయి. అంటే 12 నెలల్లో దాదాపు రూ. 1700 కోట్ల ఆదాయం రావాలి. కానీ 17 నెలల్లో రూ.850 కోట్ల ఆదాయం వచ్చినట్లు చంద్రబాబు చెబుతున్నారు. సుమారు రూ. 1,000 కోట్లకు పైనే చంద్రబాబు, ఆయన వందిమాగధులు దోచుకుతిన్నారనేది స్పష్టం అవుతోంది. ఇంత దోపిడీ జరిగి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యతకమైనపుడు దోషులపై చర్యలు తీసుకోవలసింది పోయి వారిని రక్షించడం కోసమే కొత్త ఇసుక విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ్ముళ్ల దోపిడీకి రాజముద్ర వేయడమే కాక సరికొత్త విధానం పేరుతో మరలా భారీ దోపిడీకి రంగం సిద్ధం చేశారు.
ఇసుక మాఫియాపై చర్యలు లేనట్లే!
Published Thu, Dec 31 2015 2:44 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement