మాఫీ... టోపీ!
- డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వని సీఎం
- రుణాల వసూళ్లకు బ్యాంకర్ల శ్రీకారం!
- పొదుపు సొమ్ము ‘కంతు’ల కింద జమ
- తరిగిపోతున్న సామాజిక పెట్టుబడి నిధి..!
పేద మహిళలు రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టుకుని దాచుకున్న మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఎవ్వరూ కంతులు కట్టాల్సిన అవసరం లేదని ఎన్నికల్లో బాబు ప్రచారం చేశారు. ఆయన మాటలు నమ్మి మహిళలు ఓట్లేశారు. కంతులు కట్టడం మానుకున్నారు. బాబు సీఎం అయ్యాక డ్వాక్రా రుణాల మాఫీ ఊసే ఎత్తలేదు. దీంతో బ్యాంకర్లు మహిళా సంఘాల పొదుపులోంచి నెలనెలా డబ్బు కట్ చేసేస్తున్నారు. ఇదేమంటే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి/ గుర్రంకొండ: అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానంటూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. జూన్ 8న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రుణాల మాఫీపై విధి విధానాల రూపకల్పన కోసం కమిటీని వేసేందుకు మాత్రమే సంతకం చేశారు. పంట రుణాల మాఫీపై విధివిధానాల రూపకల్పనకు కోటయ్య కమిటీ కసరత్తు చేస్తోంది. కానీ.. డ్వాక్రా రుణాల మాఫీపై కోటయ్య కమిటీ ఇప్పటిదాకా ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వలేదు. రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాంకర్లు మహిళా సంఘాల పొదుపు ఖాతాలో నుంచి కంతులకు డబ్బు జమ చేసుకుంటున్నారు.
రూ.1611.03 కోట్ల మాఫీపై స్పష్టత ఏదీ..?
జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మార్చి 31, 2014 నాటికి 61,711 స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. ఆ రుణాల మాఫీపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు.
మహిళా సంఘానికి రూ.50 వేల వరకూ మాఫీ చేస్తామని ఒకసారి.. రుణమాఫీ కాదు ఒక్కో మహిళా సంఘానికి రూ.50 వేల వరకూ ప్రోత్సాహకం కింద ఇస్తామని మరొకసారి ప్రభుత్వం మీడియాకు లీకులు ఇస్తోంది తప్ప దేనిపైనా స్పష్టత ఇవ్వడం లేదు. పాత రుణాలు మాఫీ కాకపోవడంతో మహిళలకు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు సరి కదా.. వారు పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచి వారికి తెలియకుండానే బ్యాంకర్లు కంతుల కింద జమా చేసుకుంటున్నారు. గుర్రంకొండ, వి.కోట, శాంతిపురం, పాలసముద్రం, ఏర్పేడు తదితర మండలాల్లో అధికశాతం బ్యాంకుల్లో ఈ తరహాలో డ్వాక్రా రుణాల వసూళ్లకు అధికారులు దిగడం గమనార్హం.
నిబంధనలు బేఖాతరు..
రుణాల వసూళ్లలో బ్యాంకు అధికారులు నిబంధనలను ఖాతరు చేయడం లేదు. సీఐఎఫ్ నిధి నుంచి గ్రామ సమాఖ్యల తీర్మానం లేకుండా ఒక్క రూపాయి కూడా బ్యాంకర్లు అప్పు కింద జమ చేసుకోవడానికి లేదు. కానీ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి పొదుపు మొత్తం(సీఐఎఫ్) నుంచి కంతుల మొత్తాన్ని బ్యాంకర్లు మినహాయించుకుంటున్నారు. చాప కింద నీరులా బ్యాంకర్లు రుణాల వసూళ్లకు దిగడంతో సీఐఎఫ్ నిధి ఏ మేరకు ఉందన్నది అంతుచిక్కడం లేదు.
డీఆర్‌డీఏ-ఐకేపీ అధికారుల అంచనాల ప్రకారం సీఐఎఫ్ నిధి రూ.196 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఇప్పుడు వంద కోట్లకు మించి ఉండే అవకాశం లేదని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. రుణాల మాఫీపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే బ్యాంకర్లు నిబంధనలను ఉల్లంఘించి సీఐఎఫ్ నుంచి అప్పుల కింద మొత్తాన్ని జమ చేసుకుంటున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.
రుణమాఫీపై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మహిళలు మండిపడుతున్నారు. తక్షణమే స్పష్టమైన విధానం ప్రకటించి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంతుల కింద కట్ చేసుకున్న పొదుపు మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేయకపోతే ఉద్యమిస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మా డబ్బు డ్రా చేసుకోనీ లేదు
మేము స్థానిక వైశ్యాబ్యాంకులో 2013 జూన్‌లో రూ.5 లక్షలు డ్వాక్రా రుణం తీసుకున్నాం. నెలకు 2 వేలు చొప్పున 17 నెలలు 34 వేలు రుణం తిరిగి చెల్లించాం. చంద్రబాబు డ్వాక్రారుణాలు చెల్లించవద్దని ప్రకటించడంతో రెండు నెలలుగా కంతులు చెల్లించలేదు. మా పొదుపు ఖాతాలో 87,750 ఉంది. బ్యాంకు అధికారులు మే, జూన్ నెలలకు కలిపి రూ.37,500 అప్పు కింద జమ చేసుకున్నారు. తక్కిన సొము డ్రా చేసుకుందావుంటే బకాయిలు చెల్లించేంత వరకు డ్రా చేసుకోనివ్వబోవుని చెబుతున్నారు.
-పి.హేవులత, స్వాతి వుహిళావుండలి లీడర్, గుర్రంకొండ
దిక్కున్నచోట చెప్పుకోమన్నారు
మేము 2013 జూన్‌లో స్థానిక వైశ్యాబ్యాంకులో రూ.3.50 లక్షలు డ్వాక్రా రుణం తీసుకొన్నాం. నా వాటాకు రు.35 వేలు వచ్చింది. నెలకు 1200 చొప్పన 15 నెలలపాటు రుణం తిరిగి చెల్లించాం. చంద్రబాబు ఎన్నికల హామీని దృష్టిలో ఉంచుకుని రెండునెలలుగా రుణాలు చెల్లించలేదు. వూ పొదుపు ఖాతాలో ఉన్న 39 వేలలో నుంచి మే, జూన్ నెలలకు కలిపి 16,700 బ్యాంకు అధికారులే డ్రా చేసి అప్పు కింద జమ చేసుకున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు.
-పి.సరస్వతి, జ్యోతి వుహిళావుండలి లీడర్, గుర్రంకొండ
ఇంతకన్నా మోసం ఉంటుందా?
మేము 2013 జనవరిలో స్థానిక వైశ్యాబ్యాంకులో రూ.5లక్షలు డ్వాక్రా రుణం తీసుకొన్నాం. నా వాటాకు 50 వేలు వచ్చింది. నెలకు 2100 చొప్పన 17 నెలలు రుణం తిరిగి చెల్లించాం. చంద్రబాబు హామీతో మేము గత నెలలో వూత్రమే రుణం చెల్లించలేదు. బ్యాంకు వారు వూ పొదుపు ఖాతాలో నుంచి జూన్‌లో రూ.18 వేలు జమ చేసుకున్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాటే పట్టించుకోవడం లేదు. ఇంతకన్నా మోసం మరొకటి ఉండదు.
-రెడ్డిలక్ష్మి, ఇందిరా వుహిళావుండలి లీడర్, గుర్రంకొండ