సాక్షి, ప్రతినిధి తిరుపతి/ అమరావతి: చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. సీఎం చంద్రబాబు తిరుపతిలో సోమవారం నిర్వహించే ధర్మ పోరాట సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారులు ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే తిరుపతిలో సభ ఏర్పాటు చేయడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు అమర్చరాదని నిబంధనలున్నా పట్టించుకోకుండా సభా ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ నిర్వహణ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందా? అన్న ప్రశ్నకు పలువురు అధికారుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. సభ నిర్వహణకు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.
కోడ్ అమల్లో ఉన్నా..: ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూయడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఈనెల 22 నుంచి మే 29 వరకూ చిత్తూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. కోడ్ మార్గదర్శకాల ప్రకారం సభకు అనుమతులతో పాటు నిర్వహణ వ్యయాన్ని ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. సభ ఖర్చు పార్టీ తరపున చేస్తున్నారా? లేక ప్రభుత్వం భరిస్తోందా? అనేది ప్రభుత్వవర్గాలు వెల్లడించటం లేదు. ప్రజలను తరలించేందుకు బస్సులను ఏర్పాటుచేయడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందే పరిగణిస్తారు.
సభకు హాజరైన వారికి వాటర్ ప్యాకెట్లు, పులిహోర లాంటివి పంపిణీ చేసే ఖర్చు ఎవరిదన్న ప్రశ్నలు వస్తాయి. సభ నిర్వహణకు రవాణా, విద్యాశాఖ, పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర కేబినెట్ అంతా తిరుపతిలోనే బస చేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. అయితే చిత్తూరు జిల్లాలో మంగళవారం కార్మిక దినోత్సవం నిర్వహణకు మాత్రం అధికారులు ఆంక్షలు విధించారు. ర్యాలీలు నిర్వహించడం, సమావేశాల ఏర్పాటు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. మే డేపై ఆంక్షలు విధించిన అధికారులు.. సీఎం సభకు అనుమతి ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వెయ్యికిపైగా బస్సులు..: సభకు భారీఎత్తున జనాన్ని తరలించేందుకు 1,005 బస్సులు పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు పంపాలని చిత్తూరు, తిరుపతి ఆర్టీవోల ద్వారా సదరు యాజమాన్యాలకు ఫోన్లు చేయించారు.విద్యార్థులను కూడా పంపాలని ఆదేశాలు వచ్చాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. సభకు వస్తేనే రుణాలు, స్కాలర్‌షిప్‌లు: సభకు మహిళలను పెద్ద సంఖ్యలో తరలించటానికి మెప్మా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ అధికారులను రంగంలోకి దించారు. సభకు వచ్చిన వారికే రుణాలు, స్కాలర్‌షిప్‌లు ఇస్తామని, రాకపోతే ఇప్పటికే తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని మహిళలను బెదిరిస్తున్నారు.
సభకు వచ్చే వారి వివరాలను సేకరించడానికి ప్రత్యేక పత్రాలు ముద్రించారు. దీనిపై ఐద్వా, కాంగ్రెస్ మహిళా నేతలు మండిపడుతున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పడానికే ప్రధానంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. 2014 ఏప్రిల్ 30న మోదీ, చంద్రబాబు కలసి సభ నిర్వహించిన చోటే ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై పలు సందర్భాలలో మోదీ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలు ప్రదర్శించాలని చంద్రబాబు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment