
సాక్షి, నరసరావుపేట/సత్తెనపల్లి: రాష్ట్ర ప్రజలకు దయ్యం పట్టిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారికి శని దాపరించి, తనను ఓడించారని అన్నారు. ఆయన బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రజలు తనను ఓడించినందువల్లే అమరావతి నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు. 22 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను నిర్మించానని, అదే విధంగా అమరావతి నిర్మాణం మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోయిందన్నారు.
గుంటూరు ప్రజలు సైతం అమరావతికి కుల ముద్ర వేశారని అన్నారు. తన సూచనలతోనే వాజపేయి దేశంలో రోడ్లు వేశారన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదలందర్నీ ధనవంతులను చేయడమే టీడీపీ లక్ష్యమని చెప్పారు. పాసుపుస్తకం, భూసరిహద్దు రాళ్లపైనా జగన్ ఫొటోనేనా అని ప్రశ్నించారు. బాబాయిని చంపి తనపై నెపం మోపి నారాసుర రక్త చరిత్ర అంటూ వాళ్ల పేపర్‌లో అచ్చు వేసుకున్నారని ఆరోపించారు.
అంబులెన్స్‌కు దారివ్వని చంద్రబాబు కాన్వాయ్
చంద్రబాబు సత్తెనపల్లి పర్యటనలో అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం పట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. బుధవారం రాత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రచార రథంపై పట్టణంలోకి ప్రవేశించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ అంబులెన్స్ వచ్చినప్పటికీ దానికి దారి ఇవ్వలేదు. అక్కడి నుంచి చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లే వరకు అంబు లెన్స్ అక్కడే ఉండాల్సి వచ్చింది.
కాగా, సత్తెనపల్లిలో నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభ కార్యక్రమాల్లో మద్యం ఏరులై పారింది. జన సమీకరణ నిమిత్తం ఒక్కో మహిళకు రూ.300తో పాటు చీర, పురుషులకు ఒక్కొక్కరికి రూ.500, క్వార్టర్ మద్యం, బిరియానీ ప్యాకెట్, టీ షర్ట్ పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ‘గో బ్యాక్ చంద్రబాబూ..’ అంటూ తాలూకా సెంటర్‌లో వెలిసిన ఫ్లెక్సీపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ‘ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన మాట వాస్తవం కాదా? అంటూ ఆ ఫ్లెక్సీలో పలు ప్రశ్నలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment