గంటా, కళా, అయ్యన్న, గోరంట్ల, జ్యోతులకు మంత్రివర్గంలో దక్కని చోటు
ప్రత్తిపాటి, సోమిరెడ్డి, కోట్ల, పరిటాలకు నో ఛాన్స్
జూనియర్లు, కొత్త వారి వైపు మొగ్గు చూపిన చంద్రబాబు
24 మందిలో తొలిసారి మంత్రులుగా 17 మంది
ఎన్నికలకు ముందు పార్టీలో చేరి మంత్రి అయిన పార్థసారథి
ఎమ్మెల్యేగా గెలిచినా సుజనా చౌదరికి మొండి చేయే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారు, గతంలో మంత్రులుగా పని చేసి, పార్టీలో, జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.
24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014–2019 మధ్య కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికీ అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేశ్‌కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు.
గంటా, అయ్యన్నకు దక్కని పదవులు
ఉమ్మడి విశాఖ జిల్లాలో సూపర్ సీనియర్లయిన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యన్నారాయణమూర్తిని పక్కనపెట్టి జూనియర్ అయిన వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్, మరో నేత సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి మాత్రమే మంత్రి పదవి దక్కగా కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్‌లకు మొండిచేయి చూపారు.
తూర్పులో జనసేనకు ప్రాధాన్యం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాధాన్యత లభించింది. ఆ జిల్లా నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్‌కి అనూహ్యంగా మంత్రి పదవి లభించింది.
ఈ జిల్లకే చెందిన సీనియర్లు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా అనుకున్నట్లుగానే నిమ్మల రామానాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ జిల్లాలో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది.
ఎన్నికలకు ముందు పార్టీలోకొచ్చి మంత్రి అయిన పార్ధసారథి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య వంటి వారికి కాకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలిచిన కె. పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబుకు నిరాశ తప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరి సాంబశివరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికీ అవకాశం రాలేదు.
సీమలో సీనియర్లకు మొండి చేయి
చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరిక్కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ జిల్లాకు చెందిన అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నాని నిరాశకు లోనయ్యారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజుల రెడ్డి మంత్రి పదవులు ఆశించగా, మండిపల్లి రామప్రసాద్‌రెడ్డికి పదవి ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి మొండిచేయి చూపారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులును పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చిన సవితకు మంత్రి పదవి ఇచ్చారు.
సుజనా చౌదరికి ఎదురు దెబ్బ
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. గతంలో చంద్రబాబు కోటరీలో కీలక నేతగా ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన్ని చంద్రబాబు కాదనలేరనే చర్చ జరిగింది. కానీ బీజేపీలోని ప్రధాన వర్గం, టీడీపీలోని మరో వర్గం ఆయన్ని వ్యతిరేకించడంతో మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి పొందలేకపోవడం సుజనాకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే.
ఉత్తరాంధ్రకు తగ్గిన ప్రాధాన్యం
మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు కలిపి నాలుగు పదవులే దక్కాయి. ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక్కరికే అవకాశం రాగా, విజయనగరం జిల్లాలో మాత్రం ఇద్దరికి అవకాశం లభించింది.
ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు మూడు చొప్పున మంత్రి పదవులు లభించాయి. విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెండేసి చొప్పున పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి.
జనసేనకు మూడే
జనసేన తరఫున నలుగురైదుగురికి మంత్రి పదవులు లభిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ మూడు మాత్రమే దక్కాయి. జనసేన నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మాత్రమే అవకాశం దక్కింది. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, పులపర్తి రామాంజనేయులు అసంతృప్తిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment