చంద్రబాబును కోరుతున్న సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు
లోకేశ్ చుట్టూ అదే పనిగా చక్కర్లు
ఎవరికీ హామీ ఇవ్వని తండ్రీకొడుకులు
మంత్రివర్గం, కీలక పదవులపై పార్టీ నేతల్లో ఉత్కంఠ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు.
లోకేశ్ చుట్టూ చక్కర్లు..
చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు.
నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు.
తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.
లోకేశ్‌పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..
మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది.
సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment