
ఉన్నతాధికారులపై కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం
అడ్డు చెప్పారో మీ సంగతి తేలుస్తామని బెదిరింపులు
అసెంబ్లీ ప్రాంగణంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే రభస
రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, సీసీఎల్‌ఏ జయలక్మిని తిట్టిపోసిన వైనం.. మంత్రి సర్ది చెప్పినా లెక్కచేయకుండా అరుపులు, కేకలు
ఇలా నోరు పారేసుకోవడంతో ఐఏఎస్ అధికారుల ఆందోళన
ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ చాంబర్లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం
ఆయనకు భయపడి వెంటనే కోరిన ప్రకారం ఆర్డర్ ఇచ్చేసిన డైరెక్టర్
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎస్సీ ప్రొఫెసర్‌పై ఎమ్మెల్యే నానాజీ దాడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరుతో బెంబేలెత్తుతున్న అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే రీతిలో అధికారులపై విరుచుకు పడుతున్న ఎమ్మెల్యేలు
అయినా పట్టించుకోని సీఎం చంద్రబాబు.. వారిపై సీరియస్ అయినట్లు లీకులతో సరి
పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇదేనేమోనని ఉన్నతాధికారుల ఆందోళన
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన కూటమి ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు సామాన్య ప్రజలనే కాకుండా, ఉన్నతాధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నారు. తాము చెప్పిన ఎలాంటి పని అయినా నిబంధనలతో నిమిత్తం లేకుండా చేసేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చేయకపోయినా, ఆ పని ఆలస్యమైనా వారిపై విరుచుకు పడుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా సరే బెదిరించడానికి, ఇష్టం వచ్చినట్లు తిట్టడానికి వెనుకాడడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెవెన్యూ ఉన్నతాధికారులపై వీరంగం వేసిన వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణకు సంబంధించి ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్న అడిగిన ఆయన.. మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో అధికారులు ఉండే రూమ్‌లోకి వెళ్లి రెచ్చిపోయారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జయలక్మిని తన పని ఎందుకు చేయలేదంటూ ఇష్టానుసారం తిట్టిపోశారు. అరుపులు, కేకలతో వారిపైకి దూసుకెళ్లారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని సర్ది చెప్పినా వినిపించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ తిట్టడం చూసిన మిగిలిన అధికారులు బిత్తరపోయారు.
పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళుతుండగా.. మీ సంగతి తేలుస్తానంటూ అధికారులను బెదిరించడం గమనార్హం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014–19) కూడా బొండా ఉమ... విజయవాడలో అప్పటి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను అందరి ముందు తిట్టి రభస సృష్టించడం సంచలనం రేకెత్తించింది.
ఎక్సైజ్ కమిషనరేట్‌లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం
ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు ఎక్సైజ్ శాఖ కమిషనరేట్‌కు వెళ్లి నానా బీభత్సం సృష్టించడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. నరసరావుపేటలోని మద్యం డిపోలో తాను సిఫారసు చేసిన 10 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించలేదంటూ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ ఛాంబర్‌లోకి వెళ్లి ఆయన్ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తాను రాసిన లేఖను ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. ఇప్పటికిప్పుడు తాను చెప్పిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లనని బీభత్సం సృష్టించారు.
ఛాంబర్‌లోనే ఉన్న సోఫాలో పడుకుని హడావుడి చేయడంతో డైరెక్టర్.. సంబంధిత మంత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మంత్రి వెంటనే.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వెనక్కు వచ్చేయాలని, తాను ఆ పని అయ్యేలా మాట్లాడతానని చెప్పినా ఆయన వినలేదు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అరవింద్‌బాబు పట్టించుకోలేదు. రెండున్నర గంటలపాటు ఛాంబర్‌లోనే ఉండడంతో గత్యంతరం లేక డైరెక్టర్ ఆయన చెప్పిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాతే అరవింద్‌బాబు అక్కడి నుంచి బయటకు వచ్చారు.
మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి
కొద్ది రోజుల క్రితం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం కలకలం సృష్టించింది. విద్యార్థులు ఆడుకోవాల్సిన కాలేజీలో బయట వ్యక్తులకు అనుమతి లేదని చెప్పడంతో రెచ్చిపోయిన నానాజీ అనుచరులు వెంటనే ఆయన్ను పిలుచుకుని వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. ఎమ్మెల్యే నానాజీ సైతం బూతులు తిడుతూ డాక్టర్ మాస్క్‌ని లాగిపడేశారు.
⇒ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక అధికారులను బెదిరించడం, తిట్టడం సర్వసాధారణం కావడం అందరికీ తెలిసిందే. తన వద్దకు వచ్చే అధికారులను ఎలా పడితే అలా మాట్లాడుతుండడంతో వారు బెంబేలెత్తుతున్నారు. అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆయన పేరుగాంచారు.
⇒ శ్రీకాళహస్తి, తాడిపత్రి, ఆమదాలవలస, దెందులూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి (ఈయన కుమారుడు ఎమ్మెల్యే), తదితరులు అధికారులను బూతులు తిట్టడం పరిపాటిగా మారింది.
⇒ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తనకు ఇష్టం లేని అధికారిని మున్సిపల్ కమిషనర్‌గా నియమించారని అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ దుర్భాషలాడుతూ ఆయన్ను కార్యాలయంలోనికి రానీయకుండా అడ్డుకుని రభస చేశారు.
చంద్రబాబు అండతో రుబాబు
విధి నిర్వహణలో ఉన్న తమను బెదిరించడం, అసభ్యంగా తిడుతుండడాన్ని ఐఏఎస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బొండా ఉమ, ఎక్సైజ్ కమిషనరేట్‌లో అరవింద్‌బాబు సృష్టించిన రభస ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాగైతే పని చేయడం కష్టమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. దీంతో ఇదంతా సీఎం ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశాల్లో తనది పొలిటికల్ గవర్నెన్స్ అని సీఎం చెప్పడం, ఆ క్రమంలోనే అధికారులపై ఎమ్మెల్యేలు విరుచుకు పడడం జరుగుతుండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అధికారులు.. ఎమ్మెల్యేల దగ్గర కుక్కిన పేనుల్లా పడి ఉండి, వారు చెప్పిన తప్పుడు పనులు చేయడమేనా.. అనే చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఒత్తిడి చేయడం, చేయకపోతే దాడులు, దౌర్జన్యాలు చేసే సంస్కృతి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదని ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.
ఇప్పుడు కూటమి పాలనలోనే ఆ సంస్కృతి కొత్తగా మొదలైందని, ఉన్నతాధికారులపై దాడులు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సీరియస్ అంశాలపై కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం, ఊరికే వారిపై సీరియస్ అయినట్లు, విచారణ జరుపుతున్నట్లు మీడియాకు లీకులిచ్చి, తర్వాత వదిలేయడం పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment