విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్‌పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..
మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఇందులో చోటు దక్కింది.
ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్‌కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment