
జనసేన 12వ ఆవిర్భావ సభలో ‘కొత్త’ పవన్
ఫస్ట్ మీటింగ్‌లో అందరిలాంటి నాయకుడిని కాదంటూ స్పీచ్
పిఠాపురం సభలో.. రోటీన్ లీడర్‌లానే ప్రసంగం
సిద్ధాంతాలు, విలువలు, ప్రజలను, ఆఖరికి కేడర్‌ను పక్కన పడేసిన వైనం!
40 ఏళ్ల టీడీపీనే నిలబెట్టానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
అవసరం లేకున్నా.. సనాతన ధర్మం, హిందీ అంటూ ఆవేశంతో ఊగిపోయిన జనసేనాని
హామీలపై ఏపీ ప్రజలకు మరోసారి టోకరా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్ కల్యాణ్ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన.
విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్‌ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు.
పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్‌సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు.
డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్ చేశారు.
అన్‌అపాలజెటిక్ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు.
పవర్ స్టార్‌ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.

ఎంత మార్పు!
గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే..
👉గత మీటింగ్‌లలో పవన్ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు.
👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్ కాస్త నుంచి సడన్‌గా సనాతని డిఫెండర్ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment