
సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.
‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.
‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్‌లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.
‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.
చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు
చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు.