సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా?.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా చంద్రబాబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఘాటు కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు తన మనసులోని కొన్ని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పులేమీ రాలేదు. చంద్రబాబు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి.
ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ డెవలప్ కాలేదు.. ఐటీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. మేం నెత్తీ నోరూ మొత్తుకున్నా వినకుండా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 33వేల ఎకరాలు తీసుకుని ఏం లాభం.. అక్కడ ముళ్ల చెట్లు పెరిగాయి. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఆ పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. చంద్రబాబు తక్షణమే ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఐరన్ ఓర్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలి. ముందు రాష్ట్రం చేయాల్సిన పని చేస్తే.. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు.
విజయవాడ-విశాఖ మధ్య మెట్రో రైల్ వేస్తానని హడావుడి చేశాడు.. కానీ జరిగిందేమీ లేదు. అమెరికాలో కూడా లేని హైపర్ లూప్ రైలును తెస్తానని ప్రకటించడం చూస్తే నవ్వొస్తోంది. చెన్నై-బెంగుళూరు-హైదరాబాద్-అమరావతిని కలిపి బుల్లెట్ రైలు వేయాలంటున్నాడు. నాది కాకపోతే ఢిల్లీ దాకా దొర్లాలనీ వెనకటికి ఎవడో చెప్పినట్లుంది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఇలాంటి అనవరమైన ఆలోచనలను మానుకోవాలని కోరుతున్నాను.
ఐకానిక్ హైకోర్టు బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన విరమించుకోండి. అలాగే, అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా?. ఐకానిక్ భవనాలకు బదులు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి. ఉచిత ఇసుక అన్నావ్.. ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో మీకూ రిపోర్టులు వస్తున్నాయ్ ఒక్కసారి పరిశీలించండి. అవినీతి చేస్తే ఎన్టీఆర్ మంత్రులను కూడా సహించలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రెండోసారి తప్పులు జరగవు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment