సాక్షి, విజయవాడ: విశాఖలో 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు టీడీపీ మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి ఎంపీలు, మంత్రులు గాడిదలు కాస్తున్నారా?.. అని ప్రజలు నిలదీసే రోజులు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది బలి దానాలతో సాధించుకున్నాం. కానీ, ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఉత్పత్తి నిలిపివేశారు. స్టీల్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మన తెలుగు వ్యక్తే. ఆయన కేంద్రమంత్రిగా ఉండి కూడా స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడటం సిగ్గుచేటు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి నేతలు ఏం చేస్తున్నారు. తెలుగు ప్రజలను ఆషామాషీగా, తేలిగ్గా తీసుకోవద్దు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ పార్టీ అధికారంలో ఉండి కూడా స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తారా?. ప్రజలు దీన్ని సహించరు.
స్టీల్ మినిస్టర్ కుమారస్వామి వైజాగ్ వచ్చి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. కర్నాటకలో మూతబడిన హెచ్ఎంటీ వాచ్ కంపెనీని కేంద్రమంత్రి తిరిగి తెరిపించుకున్నాడు. తెలుగు వాళ్లు చేసుకున్న పాపం ఏంటని మోదీని మన నేతలు నిలదీయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఈనెల 16న గుజరాత్ వెళుతున్న చంద్రబాబు.. ప్రధాని మోదీతో మాట్లాడాలి. మోదీని నిర్మోహమాటంగా చంద్రబాబు నిలదీయాలి. ఇలాంటి సమయంలో చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌ను సాధించుకోలేకపోతే ప్రజలు క్షమించరు. కేంద్రంలో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి ఇదే నా సూచన. విమానాశ్రయాల గురించి కాదు.. పోరాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సాధించండి అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఆధారాలతో సహా చర్చకు సిద్ధం.. స్పందించు పవన్: పోతిన మహేష్
Comments
Please login to add a commentAdd a comment