
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు.
జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్‌చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.
ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది.
తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్‌లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది.
కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు బద్వేలు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.
టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు.
రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment