చిలకలూరిపేట సభ నిర్వహణలో విఫలమైన తెలుగుదేశం పార్టీ
ప్రధాని పాల్గొనే సభకు ఏర్పాట్లు చేయలేక బోర్లాపడ్డ నేతలు
సాంకేతిక సమస్యలతో తిప్పలు పెట్టిన మైక్ సిస్టమ్
ప్రధాని రావడానికి ముందు నుంచే పని చేయని మైకులు
అప్పుడే సరిచేసి ఉంటే సమస్యే ఉండేది కాదు
జనం పల్చగా ఉండటంతో వెనక ఉన్నవారిని ముందుకు రప్పించిన నేతలు
దీంతో వీఐపీ గ్యాలరీల్లోకి చొచ్చుకువచ్చిన జనం
వాటర్ ప్యాకెట్లు ఇవ్వాలని పోలీసులు చెప్పినా బాటిల్స్ ఇచ్చిన నేతలు
టీడీపీ నేతలు వాహనాలు అడ్డుపెట్టి ట్రాఫిక్ జామ్ చేసిన వీడియోలు
వేదిక పర్యవేక్షణ మొత్తం ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీదే
బొకే అనుమతించాల్సిందీ ఎస్పీజీనేశాలువా, బొకే తెచ్చుకోకుండా పోలీసులు అనుమతించలేదని ఆరోపణ
ఇలా అన్నీ వారి నిర్వాకాలే.. టీడీపీ ఆరోపణలు మాత్రం పోలీసుల మీద..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏదో చేయబోతే మరేదో అయిందన్న తీరుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట సభ జరిగింది. మూడు పార్టీలు కూటమి కట్టాక జరుగుతున్న తొలి సభను, అదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సభకు ఏర్పాట్లు సక్రమంగా చేయలేక, సభను సక్రమంగా నిర్వహించలేక, బోర్లాపడి, ఆ తప్పులను టీడీపీ నేతలు పోలీసులపైకి నెడుతున్నారు.
అంతటితో ఆగక, సంబంధం లేనిదే అయినా ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. అదీ కొందరు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని పోలీసులు, విశ్లేషకులు అంటున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చేతిలో ఉన్న అంశాలను కూడా పోలీసుల మీదకు రుద్దడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు.
ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట శివారు బొప్పూడి వద్ద ప్రజాగళం పేరుతో ఈ బహిరంగ సభ జరిగింది. ఇందులో ప్రధాని మాట్లాడుతుండగా మూడు సార్లు మైక్ మూగబోయింది. పోలీసులు మైక్ ఆపుతున్నారంటూ వేదిక మీద నుంచే నేతలు ఆరోపించారు. సాధారణంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో మైక్ ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్‌ఫర్‌మెషన్ బ్యూరో (పీఐబీ) చూస్తుంది. ఎన్నికల కోడ్ రావడంతో మైక్ ఏర్పాట్లను నిర్వాహకులే చూసుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. మైక్ సిస్టమ్ కూడా ఎప్పుడూ లేనివిధంగా మీడియా గ్యాలరీలో పెట్టారు.
మైక్ సిస్టమ్‌కు మొదటి నుంచి సాంకేతిక, రిమోట్ సమస్యలు ఉన్నట్లు కార్యక్రమం మొత్తాన్ని చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. జనం తొక్కిడి కారణంగా కేబుల్ కట్ అయి ఉంటే పునరుద్ధరణ సాధ్యం అయ్యేదే కాదు. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే సమయంలోనే మైక్ పలుమార్లు ఆగిపోయింది. ఆ సమయంలో గ్యాలరీలో ప్రజలే లేరు. ప్రధాని హెలీకాప్టర్ వచ్చే సమయంలో కూడా మైకులు సరిగ్గా పనిచేయడంలేదు చూడండంటూ నిర్వాహకులు చెప్పడం వీడియోల్లో స్పష్టంగా కనపడుతోంది. అప్పుడే సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి ఉంటే ప్రధాని ప్రసంగించే సమయంలో మైక్ సమస్యే ఉండేది కాదు.
4.15 గంటల సమయంలో టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు ఎడమ వైపు గ్యాలరీ నిండిపోయినందున మిగతా వారిని కుడివైపు గ్యాలరీలలోకి పంపాలంటూ అనౌన్స్ చేశారు. ప్రధాని వచ్చే సమయానికి జనం పల్చగా ఉండటంతో వెనుక ఉన్న వారందరినీ ముందుకు రప్పించారు. అప్పటివరకూ విఐపీ పాసులు ఉన్న వారు మాత్రమే కుడివైపు గ్యాలరీలోకి వచ్చి కూర్చొగా, పుల్లారావు చెప్పిన తర్వాత సాధారణ కార్యకర్తలు కూడా వీఐపీ గ్యాలరీలలోకి చొచ్చుకువచ్చారు.
సభకు వచ్చే వారికి వాటర్ ప్యాకెట్లు మాత్రమే ఇవ్వాలని పోలీసులు, ఎస్పీజీ స్పష్టంగా చెప్పినా నిర్వాహకులు పట్టించుకోలేదు. వారికి అర లీటర్ వాటర్ బాటిల్స్ అందజేశారు. దీంతో కొంతమంది ఆకతాయిలు వేదిక ముందు ఉన్న డి–సర్కిల్‌లోకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఇవన్నీ నిర్వాహకుల నిర్వాకాలే.
శాలువా, బొకే తెచ్చుకోకుండా..
వేదిక పైన చంద్రబాబు ప్రధాని మోదీని సన్మానిస్తారని చెప్పి అవమానించిన ఘటనపై కూడా నిర్వాహకుల వైఫల్యాన్ని పోలీసుల పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బొకేలు తేకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. వాస్తవానికి హెలీప్యాడ్, డయాస్ అన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ చేతుల్లో ఉంటుంది. హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పడానికి ఎవరు రావాలి, వీడ్కొలుకు ఎవరు రావాలి, వేదికపై ఎవరు ఉండాలనే విషయం కూడా ఎస్పీజీనే చూసుకుంటుంది.
పోలీసులకు ఏమాత్రం సంబంధం లేదు. పాసులు కూడా ఎస్పీజీనే ఇస్తుంది. ఓ శాలువా, బొకే ముందుగా తెచ్చుకొంటే వాటిని ఎస్పీజీ ముందుగా తనిఖీ చేసి, అనుమతిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తెచ్చిన వినాయకుని ప్రతిమను అనుమతించలేదా? ఈ విషయం తెలిసి కూడా పోలీసులపై నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు.
ట్రాఫిక్ జామ్ వాళ్లు చేసిందే
ట్రాఫిక్ జామ్‌కు సంబంధించి కూడా బాపట్ల జిల్లా మేదరమెట్ల నుంచి గుంటూరు వరకూ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం రెండు వేల మంది పోలీసులను ఉపయోగించారు. మామూలు సమయంలోనే చిలకలూరిపేట సెంటర్‌లో ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఆదివారం సభకు చిలకలూరిపేట, బొప్పూడి నుంచి వచ్చే వాహనాలు అన్నీ నాలుగున్నర తర్వాతే బయలుదేరాయి. దీంతో చిలకలూరిపేట వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరోవైపు భారీ సంఖ్యలో ప్రజలు వాహనాల్లో వస్తున్నట్లుగా చూపించడం కోసం టీడీపీ నేతలే వాహనాలు అడ్డం పెట్టి ట్రాఫిక్ ఆపి డ్రోన్‌షాట్స్ తీశారు. దీనివల్ల వాహనాలు నిలిచిపోయాయి. సభ పూర్తయిన తర్వాత అవే వాహనాలు గంటలోనే తిరిగి వెళ్లిపోయాయి. పోలీసులు పట్టించుకోకపోతే ఇలా గంటలోనే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యేది కాదు.
12 మంది ఐపీఎస్‌లు, వేల మందిపోలీసులతో బందోబస్తు
సభ ఏర్పాట్ల కోసం సుమారు 3,960 మంది పోలీసులను ఉపయోగించారు. ఏడీజీ నుంచి, ఐజీ, ఎస్పీల వరకూ 12 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తనిఖీల కోసం 20 డాగ్ స్క్వాడ్‌లను వాడారు. ప్రధాన మంత్రి కార్యక్రమం పూర్తయ్యేసరికి చీకటి పడినప్పటికీ, హెలికాప్టర్ కూడా చీకట్లో సురక్షితంగా టేకాఫ్ తీసుకొని, ఆయన క్షేమంగా వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సభలో చిన్నపాటి తొక్కిసలాటగానీ, లాఠీఛార్జిగానీ జరగలేదు. ఒక్కరు కూడా గాయపడలేదు.
జనం ఎక్కువగా వచ్చారన్న బిల్డప్ కోసం టీడీపీ నేతల సూచనలతో మైక్, లైటింగ్ టవర్స్‌పైకి ఎక్కిన వారిని దించాలని ప్రధాని కోరినప్పుడు వారిని క్షేమంగా దింపింది కూడా పోలీసులే. ఇవన్నీ వీడియోల్లో కనపడుతూనే ఉన్నాయి. అయినా టీడీపీ నేతలు పోలీసులను, ప్రత్యేకించి కొందరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మాధవరెడ్డిని హెలీప్యాడ్ వద్ద నియమించడం ఏమిటని వారు టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇటీవల ప్రధాన మంత్రి సత్యసాయి జిల్లా పర్యటన ఏర్పాట్లు చూసిన అనుభవం ఉన్నందున ఆయన్ని ఇక్కడ నియమించారు. దీనికితోడు మాధవరెడ్డి ఇటీవలి వరకు మూడేళ్లకు పైగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీకి ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఎస్పీలపైనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర కోణం ఉందన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment