
వల్లభనేని వంశీ అరెస్టుకు ప్రభుత్వ పెద్దల కుతంత్రం బట్టబయలు
టీడీపీ కార్యాలయంపై దాడిపై ఫిర్యాదుతో సంబంధం లేదని చెప్పిన సత్యవర్ధన్
ఆ మర్నాడే అతనిపై ‘టీడీపీ’ ఫిర్యాదు
అదే రోజు క్రైం నంబరు 84/2025తో సత్యవర్ధన్‌పై కేసు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు, అరెస్టు వెనుక పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు ఆడించిన నాటకం బట్టబయలైంది. వంశీ అరెస్టుకు రెండు రోజుల ముందే సత్యవర్ధన్‌పై టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి, దాని ఆధారంగా కేసు పెట్టి, దాన్నే బూచిగా చూపించి సత్యవర్ధన్‌ను, అతని కుటుంబ సభ్యులను దాదాపుగా బ్లాక్‌మెయిల్ చేసినట్లు వెల్లడైంది. దీంతో భయపడిన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పినట్లుగా వంశీపై కేసు పెట్టినట్లు, సత్యవర్ధన్ మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి భిన్నంగా స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు బయటపడింది.
ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే.. ఒకవేళ నిజంగా వంశీనే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించి ఉంటే అదే పెద్ద కేసు అయి ఉండేది. టీడీపీ వర్గీయులు సత్యవర్ధన్‌పై కేసు పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. వంశీపై అక్రమ కేసు, అరెస్టు వెనుక కుతంత్రం ఇదీ..
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిపై పెట్టిన కేసుతో తనకు సంబంధం లేదని, ఆ ఫిర్యాదు తానివ్వలేదంటూ అప్పటివరకు ఫిర్యాదుదారుగా భావించిన సత్యవర్ధన్ 10న మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం చంద్రబాబు కూటమికి శరాఘాతంలా తగిలింది. వంశీని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయించాలన్న దుగ్ధతో ఉన్న చంద్రబాబు కూటమి ఓ కుతంత్రానికి తెరలేపింది. ఆ మరుసటి రోజునే కొందరు టీడీపీ కార్యకర్తలతో ఆయనపైన ఓ తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. సత్యవర్థన్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని, లేకపోతే వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇస్తానంటూ బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాని ఆధారంగా 11వ తేదీనే క్రైం నంబరు 84/2025తో కేసు పెట్టారు. వెంటనే సత్యవర్ధన్, ఆయన కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా బెదిరించారు. సత్యవర్ధన్‌పై కేసు నమోదైందని, తాము చెప్పినట్లుగా వంశీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే ఆ కేసులో రాజీ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. లేకపోతే సత్యవర్ధన్‌తోపాటు కుటంబ సభ్యులనూ నిందితులుగా చేర్చి అరెస్టు చేసి, ఐదారు నెలలు బయటకు రాకుండా చేస్తామంటూ భయపెట్టారు. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సత్యవర్ధన్ మాట మార్చినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్, కుటుంబ సభ్యులను బెదిరించి, వారితో వంశీపై ఫిర్యాదు చేయించారు.
వంశీని హైదరాబాద్‌లో 13వ తేదీ తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొన్నారు. అదే రోజు ఉదయం 7 గంటల తర్వాత సత్యవర్ధన్‌ను విశాఖలో ఆదుపులోకి తీసుకున్నారు. అంటే సత్యవర్ధన్‌ను విచారించి, స్టేట్‌మెంట్ తీసుకోకుండానే వంశీని అరెస్టు చేసినట్లు తేటతెల్లమైంది. ఆరోజు సాయంత్రం వంశీకి వ్యతిరేకంగా సత్యవర్ధన్‌తో వాంగ్మూలం నమోదు చేయించారు. ఇలా సత్యవర్ధన్‌పై ముందే కేసు పెట్టి, బ్లాక్‌మెయిల్ చేసి కిడ్నాప్ కేసు పెట్టించడం, అతన్ని విచారించకుండానే వంశీని అరెస్టు చేయడం ద్వారా ఇదంతా ప్రభుత్వ పెద్దల కుతంత్రమన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోందన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment