ఉక్కు నగరంలో ‘హోదా’ పోరు
- నేడు విశాఖపట్నంలో జై ఆంధ్రప్రదేశ్ సభ
- పూర్తయిన ఏర్పాట్లు.. సన్నద్ధమైన నగరం
- తరలి రానున్న ఉత్తరాంధ్ర జనం
- 11 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్
- 3 గంటలకు సభ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: దారులన్నీ విశాఖ వైపునకు పరుగులు తీస్తున్నాయి. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఉద్యమ కెరటాలై దూసుకొస్తున్నాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ రణన్నినాదం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు విశాఖపట్నం సర్వసన్నద్ధమైంది. సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఎన్నికల్లోఈస్టేడియం వేదికగానే బీజేపీ, టీడీపీ నేత లు ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇదే వేదికపై నమ్మబలికారు.
వీరితో జతకట్టిన జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా ఏపీకి హోదా వస్తుంది, బీజేపీ-టీడీపీలకు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏపీకి హోదా ఇవ్వలేమని గద్దెనెక్కిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఏపీకి హోదా పొందే అర్హతే లేదని వెంకయ్య.. హోదా కంటే ప్యాకేజీయే ముద్దు అంటూ చంద్రబాబు ప్రజలను దగా చేశారు. ఎక్కడైతే వీరంతా హోదాపై హామీల వర్షం గుప్పించారో అదే వేదికపై ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ఆదివారం ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరిట మలిదశ పోరుకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుడుతోంది. హోదా వచ్చే వరకూ పోరు ఆగదంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే వేదికగా సమర శంఖారావం పూరించనున్నారు. ఈ మహోద్యమంలో భాగస్వాములయ్యేందుకు విశాఖతోపాటు ఉత్తరాంధ్ర వాసులు సన్నద్ధమయ్యారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన విజయసాయిరెడ్డి
‘జై ఆంధ్రప్రదేశ్’ సభ కోసం తెన్నేటి విశ్వనాథం ప్రాంగణంగా నామకరణం చేసిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు నేతలు ప్రసంగించేందుకు వీలుగా గురజాడ అప్పారావు పేరిట ఏర్పాటు చేసిన సభావేదిక ముస్తాబైంది. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఓపక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే, మరోపక్క సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నేతలకు సూచిస్తున్నారు.
నేడు ‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు జగన్
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కోసం జగన్ రెండున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘యువభేరి’ సభలు నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆవశ్యతకను విద్యార్థులు, యువతకు వివరించారు. విశాఖపట్నంలో జరగనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెప్పనున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు జగన్ ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. తొలుత నగరంలోని సర్క్యూట్ హౌస్‌లో విడిది చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సభాస్థలికి చేరుకుంటారు. సభ పూర్తయిన అనంతరం విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరుతారు.