టీడీపీ అవిశ్వాస తీర్మానం వెనుక కేంద్ర సర్కార్‌ కనుసైగ! | TDP Seeks AAP's Support For No-Confidence Motion In Lok Sabha | Sakshi
Sakshi News home page

టీడీపీ అవిశ్వాస తీర్మానం వెనుక కేంద్ర సర్కార్‌ కనుసైగ!

Published Fri, Jul 20 2018 3:39 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

TDP Seeks AAP's Support For No-Confidence Motion In Lok Sabha - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అమరావతి/న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగినప్పటికీ సొంత ప్రయోజనాల కోసం లోపాయికారీగా సంబంధాలు కొనసాగిస్తోంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ చేత తొలిరోజైన బుధవారం ఆన్‌లైన్‌లో హడావుడిగా నోటీసులు ఇప్పించడం, దానిపై శుక్రవారమే చర్చను చేపట్టనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించడం యాధృచ్ఛికం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవి శ్వాస తీర్మానం నోటీసుకు సంబంధించి బీజేపీ, టీడీపీ ఒక స్పష్టమైన అవగాహనతోనే ముందుకు వెళుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్, వామపక్షాలు జాతీయ స్థాయిలో పలు కీలక అంశాలను లేవనెత్తి, చర్చకు పట్టుబట్టవచ్చని, అవిశ్వాస తీర్మానం నోటీసులు సైతం ఇచ్చే అవకాశం ఉందని ఎన్‌డీఏ సర్కారు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

అదే జరిగితే తన వైఫల్యాలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, అందుకే చర్చను పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీని బీజేపీ ముందుగానే రంగంలోకి దించినట్లు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశం చర్చనీయాంశంగా మారితే.. రాష్ట్ర విభజన యూపీఏ హయాంలోనే జరిగింది కాబట్టి కాంగ్రెస్‌ పార్టీని దోషిగా నిలబెట్టవచ్చని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

జాతీయ అంశాలు చర్చకు వస్తే...
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, గోరక్షణ పేరుతో కొనసాగుతున్న మూకుమ్మడి దాడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేకపోవడం, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేకపోవడం, బ్యాంకుల్లో కుంభకోణాలు, మహిళలకు భద్రత కరువు తదితర అంశాలపై  ప్రతిపక్షాలు పార్లమెంట్‌ సమావేశాల్లో దాడిచేసే అవకాశాలు ఉన్నట్లు ఎన్‌డీఏ ప్రభుత్వం గ్రహించిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దానికి విరుగుడుగానే టీడీపీని రంగంలోకి దించి, అవిశ్వాస తీర్మానం నోటీసు ఇప్పించినట్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రజలు నమ్ముతారా?
కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు విషయంలో టీడీపీ అంతర్గతంగా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్‌డీఏ సర్కారుతో నాలుగేళ్లు అంటకాగి, కేంద్రంలో అధికారం అనుభవించి, ఎన్‌డీఏ నిర్ణయాలన్నింటినీ సమర్థించి, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అంటే ప్రజలు తమను నమ్ముతారా? అని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇది రాజకీయంగా తమకు తీరని నష్టం కలిగిస్తుందని అనుమానిస్తున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం వద్దని సూచించిన టీడీపీ సీనియర్‌ ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే తోట నరసింహం, కొనకళ్ల నారాయణరావు లాంటి సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లయిన గల్లా జయదేవ్, కె.రామ్మోహన్‌ నాయుడులు చర్చలో పాల్గొనాలని ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  

తెర ముందు విమర్శలు.. తెర వెనుక కాళ్ల బేరాలు  
పార్లమెంట్‌లో తాము ఏయే అంశాలను లేవనెత్తితే వాటికి ఎన్‌డీఏ ఏ రీతిన సమాధానం చెపుతుందో తెలియడం లేదని టీడీపీ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు వారి ముందు అతి వినయం ప్రదర్శిస్తున్నారని, తద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని పేర్కొంటున్నారు. నాలుగు నెలల కిందటి వరకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై ప్రశంసల వర్షం కురిపించి, సన్మానాలు చేసిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు సభలో ఎంతవరకు గట్టిగా నిలబడతారనేది చర్చనీయాంశంగా మారింది.  

నిలకడా? పలాయనమా?
చర్చలో టీడీపీ ఏయే అంశాలను ప్రధానంగా లేవనెత్తుతుంది? అనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని కోరి తెచ్చుకోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తానే దక్కించుకోవడం, కేంద్ర నిధులకు వినియోగ పత్రాలు(యూసీ) సరిగ్గా పంపకపోవడం, కడపలో ఉక్కు ప్యాక్టరీ, దుగరాజపట్నం/రామాయపట్నం పోర్టుల ప్రస్తావన తీసుకురాకపోవడం తదితర అంశాలను సభలో బీజేపీ ప్రస్తావించి, అన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా వివరిస్తే అప్పుడు తమ పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా టీడీపీ సీనియర్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటాయా? లేక కుమ్మక్కు రాజకీయాలతో సభలో చర్చను పక్కదోవ పట్టిస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తారా? లేక పలాయనం చిత్తగిస్తారా? అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట  
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లుగా వెలుగెత్తి చాటుతోంది. హోదా కోసం అవిశ్రాంతంగా ఉద్యమిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదలు పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు హోదా కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే దృఢ సంకల్పం ఉన్న పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  

అంతా వ్యూహంలో భాగమే..
కేశినేని శ్రీనివాస్‌ మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా ఆన్‌లైన్‌లోనే అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ టీడీపీ నోటీసునే పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీ పేరును సభలో ప్రస్తావించడాన్ని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నోటీసు ఇచ్చిన తమ పార్టీ పేరును ఎందుకు విస్మరించారని మల్లిఖార్జున ఖర్గే అడగ్గా స్పీకర్‌ సున్నితంగా తిరస్కరించారు.

దీన్నిబట్టి సీఎం చంద్రబాబు బీజేపీకి అజ్ఙాతమిత్రుడిగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుధవారం నోటీసు ఇవ్వగా, శుక్రవారమే చర్చకు అనుమతి ఇవ్వడం కూడా బీజేపీ, టీడీపీల వ్యూహంలో భాగమేనని అంటున్నారు. సమావేశాల ప్రారంభంలోనే చర్చను ముగించేస్తే ఆ తరువాత సంఖ్యాబలం దృష్ట్యా సభ పూర్తిగా తమ అదుపాజ్ఞల్లో ఉండేలా చూసుకోవచ్చనేది పాలకపక్షం ఎత్తుగడ అని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement