సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అంతిమంగా ఎంపీల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తుండటం అధికార టీడీపీలో కలకలం రేపుతోంది. హోదా కోసం వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలకూ వెనుకాడక పోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా చర్చోపచర్చలు సాగిస్తున్నారు. హోదా, విభజన చట్టం హామీలను అమలు చేయకపోవటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్ సీపీ తొలుత ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విధిలేని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కూడా అదే బాటలోకి వచ్చి అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. సభ సజావుగా లేనందున అవిశ్వాసం నోటీసులను పరిగణనలోకి తీసుకోలేకపోతున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గత ఎనిమిది రోజులుగా ప్రకటిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా
ఇచ్చిన అవిశ్వాసం నోటీసులపై పార్లమెంట్‌లో రోజులు తరబడి చర్చ జరగటం లేదు. చర్చ లేకుండా సభను నిరవధికంగా వాయిదా వేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే తమ పార్టీ ఎంపీలు వెంటనే లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటూ వైఎస్సార్ సీపీ చేసిన సూచనపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ ఎంపీలతో ముఖాముఖి భేటీలు, టెలికాన్ఫరెన్సులు ఎడతెరిపి లేకుండా నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, కోటరీ ప్రముఖులతో చర్చల్లో నిమగ్నమయ్యారు.
రాజీనామాలకు ససేమిరా అంటున్న బాబు
వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే తీవ్ర చర్చనీయాంశంగా మారి ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని, ఆ క్రెడిబిలిటీ విపక్షానికే వెళ్లిపోతుందని టెలికాన్ఫరెన్సుల్లో పలువురు టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎంపీల మాదిరిగా తాము కూడా రాజీనామాలు చేయడం ద్వారానే ప్రజల ముందుకు వెళ్లగలుగుతామని, లేదంటే ఎన్నికల ముందు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఎంపీలతో నిర్వహించిన కీలక సమావేశంలో చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజీనామాలు చేస్తే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని, రాజీనామాల ఆలోచన వద్దని ఆయన స్పష్టం చేసినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ ఎంపీ తెలిపారు. ఓటుకు కోట్లు కేసుతో సహా మరికొన్ని ఇతర అంశాలు కూడా చంద్రబాబు ఇలాంటి అభిప్రాయానికి రావడానికి కారణమని ఆ ఎంపీ విశ్లేషించారు. అవిశ్వాసం పెడతామని వైఎస్సార్ సీపీ ప్రకటించి నోటీసులు ఇవ్వగానే అప్పటివరకు దానివల్ల ఒరిగేదేముంటుందన్న చంద్రబాబు అంతలోనే సర్దుకుని టీడీపీతోనూ అవిశ్వాసం నోటీసులు ఇప్పించటాన్ని ఆ ఎంపీ గుర్తు చేశారు. రాజీనామాల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వెనుకంజ వేస్తూ నిర్ణయం తీసుకోవడానికి అవినీతి వ్యవహారాలతో పాటు కేసుల భయం కూడా కారణమని అభిప్రాయపడ్డారు.
పదవులు వదిలిస్తే ఢిల్లీలో పట్టించుకోరు...
‘ప్రస్తుతం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశాం. మనం చేసిన వ్యవహారాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కన్నేసి ఉంచింది. మొత్తం సమాచారాన్ని సేకరించింది. బీజేపీలోని ముఖ్యనేతలు ఇప్పటికే మనపై గుర్రుగా ఉన్నారు. ఒక్కటొక్కటిగా ప్రశ్నలు వేస్తున్నారు. వీటిపై సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఈ సమయంలో ఉన్న పదవులనూ వదిలేసి రాజీనామాలు చేస్తే ఇబ్బందులు పడతాం’అని చంద్రబాబు ఇటీవల ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నట్లు అందులో పాల్గొన్న ఓ ముఖ్య నేత తెలిపారు. ఇదివరకటిలా ఢిల్లీ స్థాయిలో మన మాట వినేవారు లేనందున ఇప్పుడు ఎంపీ పదవులు కూడా వదిలేస్తే అసలు పట్టించుకునే నాథుడే ఉండరని చంద్రబాబు పేర్కొన్నట్లు చెబుతున్నారు. పోలవరం పనులపై కేంద్రం ఆరా తీస్తోందని, రాజధానికి ఇచ్చిన నిధుల వ్యయంపై కూడా నిఘా వేసిందని, ఏ సమయంలోనైనా కేంద్రం నుంచి ప్రతికూల చర్యలు ఎదురయ్యే ప్రమాదముందన్న భావనను బాబు సమావేశంలో వ్యక్తం చేశారని సమాచారం.
ఇప్పటికే అసెంబ్లీ లోపల, బయట చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పార్టీ నేత లు ఉదహరిస్తున్నారు. ఎవరూ అనకముందే కేంద్రం తనపై కేసులు పెడుతుందట అని, అరెస్టు చేస్తారట అని పలుమార్లు చంద్రబాబు చెప్పటం, ఆయనలో ఈ రకమైన భయం నెలకొనటానికి కారణం అవినీతి వ్యవహారాలేనని అంటున్నారు. టీడీపీ సర్కారు అవినీతి వ్యవహారాలపై కేంద్రం నుంచి చర్యలు ప్రారంభమైతే ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరపాలన్నా, ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలన్నా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోవటమే మంచిద నే అభిప్రాయాన్ని ఆయా సమావేశాల్లో బాబు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాబుకు పార్ట్‌నర్‌గా ముద్రపడిన జనసేన అధ్యక్షుడు పవన్ ఎంపీల రాజీనామాలు వృథా అని వ్యాఖ్యానించటం, టీడీపీకి మద్దతునిచ్చే ఓ ముఖ్య పత్రిక దాన్ని ప్రముఖంగా ప్రచురించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకపక్క హోదా కోసం ఉద్యమం చేద్దాం పోరాడదాం అని పిలుపునిస్తూ మరోవైపు విద్యార్థులను వీధుల్లోకి రావద్దు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని చెప్పటం మా నాయకుడిలో చిత్తశుద్ధి లేమిని తెలియచేస్తోందని రాయలసీమ టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎంపీ వ్యాఖ్యానించారు.
ఉప ఎన్నికల భయమూ వెంటాడుతోంది
అక్రమాలపై కేసులు, అరెస్టుల భయంతో పాటు చంద్రబాబును ఉపఎన్నికల భయం కూడా వెంటాడుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులతోపాటు తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే రాజకీయంగానే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఇటీవల పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారని ఓ ముఖ్యనేత తెలిపారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన నేపథ్యంలో రాజీనామాలు సమర్పిస్తే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వాటిని ఆమోదించే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు విశ్లేషించారు. అదే జరిగితే రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన తరుణంలో ఈ ఉప ఎన్నికలు టీడీపీని తీవ్రంగా దెబ్బతీస్తాయని సమావేశంలో బాబు అభిప్రాయపడ్డారు.
ఓడిపోతే మరింత పలుచనైపోతాం
టీడీపీ పట్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించిన టీడీపీని ఉప ఎన్నికలు వస్తే ఇదే అదనుగా ప్రజలు చావుదెబ్బ కొడతారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి పార్టీని మరింత బలహీనపరుస్తుందని, ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతామని, ఈ తరుణంలో కేంద్రం జోక్యంతో కేసులతోపాటు అరెస్టులు లాంటి వ్యవహారాలు తప్పవనే ఆందోళన వ్యక్తం అయింది. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయకుండా కొనసాగితే కేసులపై కేంద్రాన్ని నిలదీసేందుకు, పార్లమెంటు సమావేశాలను అడ్డుకొనేందుకు అవకాశముంటుందనే ఉద్దేశానికి వచ్చారు. ఏదేమైనా హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా టీడీపీ ఎంపీలు మాత్రం పదవులను వీడవద్దని చంద్రబాబు ఈ సమావేశాల్లో స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రం తనపై కన్నేసి ఉంచటం, ఎప్పుడు ఏ పరిణామం నెలకొంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నందున ప్రస్తుతం లోక్‌సభ కాలపరిమితి ముగిసే వరకు టీడీపీ ఎంపీలంతా పదవుల్లో కొనసాగాలని బాబు ఆదేశించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment