సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన పయనమయ్యారు. టూర్ నెంబర్–30 షురూ అయ్యింది. ఇంతకీ ఆయన హస్తినలో ఏం చేయబోతున్నారు? ఎవరిని కలవబోతున్నారు? ఎందుకు కలుస్తున్నారు? ఏం మాట్లాడనున్నారు?... అవిశ్వాస తీర్మానంపై పార్టీల మద్దతు కూడగట్టనున్నారా... ఇప్పటికే వైఎస్సార్‌కాంగ్రెస్ ఆ పని చేసింది.. సరిపడినంతమంది ఎంపీలు మద్దతు పలుకుతున్నారు. పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తారా.. ససేమిరా చేయించేది లేదని ఆయనే చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసే ఆమరణదీక్షలో భాగమవుతారా...అలాంటిదేమీ లేదంటున్నారు. మరి పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న దశలో చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానమేమిటంటే.. తన హస్తిన పర్యటనపై భారీ అంచనాలున్నాయని, ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని ఆయన చెప్పుకుంటున్నారు. మంగళవారంనాడు చంద్రబాబు పార్లమెంటులో వివిధ పార్టీల నాయకులను కలుసుకునే ప్రయత్నం చేస్తారని, వీలునుబట్టి మంగళవారం రాత్రికి గానీ బుధవారం గానీ ఒక విందు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ఎందుకు ఈ విందు సమావేశం? ఆ పార్టీలతో ఆయన ఏం చర్చిస్తారు? అన్న ప్రశ్నలుదయించడం సహజం. ఐదుకోట్ల ఆంధ్రులకు అపరసంజీవని వంటి ప్రత్యేకహోదా ఉద్యమం క్లైమాక్స్‌కు చేరుకున్న ఈ దశలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికో, రాష్ట్రప్రయోజనాలు కాపాడడానికో చంద్రబాబు హస్తిన పయనమయ్యారని అనుకుంటే పొరపాటే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమానికి మద్దతియ్యడానికో.. ఆయన స్వయంగా ఉద్యమించడానికో కానేకాదు. మరి దేనికి ఈ టూర్ నెంబర్ – 30?
విచారణ జరిపిస్తారని ఉలికిపాటు..
గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు.. తన అవినీతి వ్యవహారాలన్నీ గుర్తుకు తెచ్చుకుని చంద్రబాబు ఉలికులికి పడుతున్నారు. తన స్కాములన్నీ ఢిల్లీ పెద్దలకు తెలిసిపోయాయని, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సేకరించారని, ఏ క్షణాన్నైనా విచారణకు ఆదేశిస్తారని తనకు తాను ఊహించుకుని చంద్రబాబు భయపడుతున్నారు. ఈ భయాల కారణంగానే బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు సమీకరించడానికి ఆయన బయల్దేరారని వినిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అనో మరొకటో పేరు పెట్టి కలసివచ్చే చిన్నాచితకా పార్టీలను కూడగట్టి తనపై విచారణ వంటివేవైనా జరిగితే తనకు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేయడానికే ఈ పర్యటనను ఉపయోగించుకుంటారని తెలిసింది. అందుకే విందు సమావేశాల వంటి ప్రయత్నాలు. తనకు కొన్ని పార్టీలైనా కలసివస్తే కేంద్రం విచారణ జరిపించకుండా ఆగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆ లాబీయింగ్ కోసమే పార్టీ ఎంపీలెవరినీ రాజీనామాలు చేయకుండా ఆపారన్న విమర్శలూ విదితమే.
టీడీపీ ఎంపీల లాబీయింగ్...
ఇపుడు ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలు ఆ లాబీయింగ్ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. అధినేతతో వివిధ పార్టీల నాయకులను కలిపే పనిలో తలమునకలై ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీతో ఫోన్‌లో సంభాషించేందుకు చంద్రబాబు ఇప్పటికే ఒకటిరెండుసార్లు ప్రయత్నించారని సమాచారం. ఢిల్లీలో కలుసుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారని, అయితే వేరే కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున ఢిల్లీ రావడానికి వీలు కాదని మమత చెప్పారని తెలిసింది. దాంతో మిగిలిన పార్టీల నాయకులను, ఎంతమందిని వీలైతే అంతమందిని కలుసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే కొన్ని పార్టీల నాయకులకు టీడీపీ ఎంపీలు ఫోన్లు చేశారని తెలిసింది. పార్లమెంటుకు వచ్చి వీలైనమేరకు పార్టీల నాయకులను చంద్రబాబు కలుసుకుంటారని, అక్కడే విందుకు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే విందు సమావేశం మంగళవారం ఉంటుందా లేక బుధవారమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. పార్టీల నాయకులతో చంద్రబాబు మాట్లాడిన తర్వాతే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కాగా, ఢిల్లీ బయల్దేరడానికి ముందు చంద్రబాబు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ సమావేశానంతరం కొందరు నాయకులు మీడియా ముందుకొచ్చి ఎవరూ అడగకుండానే ‘చంద్రబాబు హోదా సాధించడానికే ఢిల్లీ వెళుతున్నారు’ అని పదేపదే చెప్పడం మొదలుపెట్టారు. చంద్రబాబు దేనికి ఢిల్లీ వెళ్తున్నారు అని ఎవరూ ఏమీ అడగకుండానే చంద్రబాబు హోదా కోసమే వెళ్తున్నారు.. అని పదేపదే ఆ నాయకులు నొక్కి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే బాబు ఢిల్లీ టూరు వెనక అసలు విషయం వేరే ఉందని అర్ధమౌతోంది.
పార్లమెంటు ముగుస్తున్న దశలో పర్యటన..
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ఎద్దేవా చేసిన చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం ప్రజావెల్లువను చూసి దారికొచ్చారు. అయితే క్రెడిట్ తనకే దక్కాలన్న దుగ్ధతో అనేక నాటకాలాడడం మొదలుపెట్టారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషితో అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు, ప్రతిపాదించడానికి కావలసిన సభ్యుల సంఖ్య అన్నీ సమకూరాయి. దాంతో ఆ క్రెడిట్ తనకు దక్కాలని.. తామే అవిశ్వాసం ప్రవేశపెడతామని పోటీ నోటీసులిస్తున్నారు. పోనీ చంద్రబాబు వచ్చి చిత్తశుద్ధితో పోరాడతారా.. తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించబోతున్నారా అంటే అలాంటిదేమీ లేదు. అవిశ్వాసతీర్మానంపై చర్చ జరగకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడితే ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామాలు చేద్దామని, ఆమరణ దీక్ష చేద్దామని, అపుడే కేంద్రం దిగివస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రతిపాదిస్తే దానికీ చంద్రబాబు సిద్ధం కావడం లేదు. వీటిలో వేటినీ చంద్రబాబు అంగీకరించడం లేదు. తన అవినీతి గురించి తనకు బాగా తెలుసు కనుక.. కేంద్రం ఒకవేళ విచారణకు ఆదేశిస్తే మద్దతుగా నిలబడే పార్టీలను కూడగట్టి తనను తాను రక్షించుకునేందుకే ఢిల్లీ పర్యటిస్తున్నారు తప్ప రాష్ట్రప్రయోజనాల కోసం కాదని విశ్లేషకులంటున్నారు. పార్లమెంటు ముగిసిపోతున్న దశలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం వెనక మతలబు అదన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment