
సాక్షి,హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. రాష్ట్రానికి హోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాం. దీనికి బీజేపీ మినహా అన్ని పార్టీల మద్దతు కోరాం. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం ఏ రాజకీయ పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా మా పార్టీ మద్దతు ఇస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఏ రాజకీయ పక్షానికైనా మద్దతు ఇస్తామన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టింది టీడీపీనా, ఇంకో పార్టీనా అనే అంశాన్ని చూడబోమని, మద్దతు ఇస్తామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఊసరవెల్లి కంటే దారుణంగా ఉంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వరకూ ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి. 9.31 గంటలకు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి చంద్రబాబు ఊసరవెల్లినని నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చారు. చంద్రబాబు ఇప్పటికైనా ఎన్డీయే నుంచి బయటికొచ్చి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పడం సంతోషకరం. ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగే ఏ తీర్మానానికైనా మద్దతిస్తామని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే చెప్పారు.
మేం ప్రధానిని కలిస్తే తప్పేంటి?
‘‘జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు అసెంబ్లీకి రారా? నిజాయితీ గల ప్రజాప్రతినిధిగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులను ఎంపీకి ఉండే ప్రొటోకాల్ నిబంధన ప్రకారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా వెళ్లి కలవొచ్చు. చంద్రబాబుకు ప్రోటోకాల్ నిబంధనలు తెలియకపోతే ఓసారి చూడమనండి. ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ప్రధానమంత్రినే కాదు, ఎవరినైనా కలుస్తా. అందులో తప్పేముంది?’’ అని అన్నారు.