ఢిల్లీలో స్టార్ట్‌.. కెమెరా.. నారా | CM Chandrababu strange stunts at Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో స్టార్ట్‌.. కెమెరా.. నారా ఓ యాక్షన్‌ డ్రామా

Published Wed, Apr 4 2018 1:23 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CM Chandrababu strange stunts at Delhi - Sakshi

మంగళవారం ఢిల్లీలోని పార్లమెంట్‌ మెట్ల దగ్గర ఫొటోకు పోజిస్తున్న సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా కోసం అవిశ్వాసం నుంచి రాజీనామాలు.. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష వరకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఓ కార్యాచరణను ప్రకటించి ఉద్యమాన్ని క్లైమాక్స్‌కు చేర్చిన తరుణంలో.. పార్లమెంటు మరో మూడు రోజుల్లో ముగిసిపోతున్న దశలో.. హస్తిన చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచిత్రమైన విన్యాసాలు చేసి తన నాటకాలను తానే బయటపెట్టుకున్నారు. ప్రత్యేకహోదా పోరు పేరుతో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు తన పోరాటం ఫొటోల కోసమేనని రుజువుచేసుకున్నారు. పార్లమెంటుకు వెళ్లగానే గాంధీ విగ్రహానికి నమస్కరిద్దామని ఆయనకు మొదటిసారి అనిపించిందో ఏమో.. గాంధీ విగ్రహంపై రెండుచేతులు ఉంచారు గానీ మొహం మాత్రం కెమెరాలవైపే ఉంది..  పక్కనున్న నాయకులు పిలుస్తుండడం... ఆయన అటువైపే చూస్తుండడం అదంతా మొక్కుబడి తంతు అని బయటపడిపోయింది. చానళ్ల వీడియోలలో అదంతా రికార్డవుతూనే ఉంది. ఆ తర్వాత పార్లమెంటు ప్రాంగణం మెట్ల దగ్గర ఒంగోని రెండు చేతులూ మెట్లకు ఆనించి మొక్కుతున్నట్లుగా ఉండి కెమెరాలవైపు చూస్తుండడం కూడా ఎబ్బెట్టుగా అనిపించింది. ఫొటో సరిగా రాలేదని అక్కడివారు అనడంతో మరోసారి ఆయన వంగారు. అది అంతా ముందస్తుగా ఏర్పాటుచేసుకున్న ఫొటో షూట్‌ అని తెలుస్తూనే ఉందని మీడియావారు చర్చించుకోవడం కనిపించింది.
  
హోదా ప్రస్తావనే లేదు..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషితో ప్రత్యేక హోదా పోరు ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఆంధ్రుల ఆస్తి అయిన ఏపీభవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆమరణదీక్షకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రజానీకంలో పలచన అవుతున్న చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. హోదా సాధన దిశగా ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా తన అవినీతిపై కేంద్రం విచారణ జరుపుతుందేమోనన్న భయంతో హోదా పేరే ప్రస్తావించకపోవడం గమనార్హం. తన పర్యటన ప్రారంభానికి ముందే జాతీయమీడియా తనకు సహకరించాలని ఆయన కోరారు. అందుకు తగ్గట్టుగానే జాతీయమీడియాను పిలుచుకుని పార్లమెంటు వద్ద ఫొటోషూట్‌కు ప్రయత్నించారు. చంద్రబాబు ఉద్దేశం, వ్యవహారం కనిపెట్టిన వివిధ జాతీయ పార్టీల నాయకులు, ఆ పార్టీల ఎంపీలు ఎవరూ ఆయన దగ్గరకు రావడానికి, కలుసుకోవడానికి ఇష్టపడలేదు.  

హాయ్‌... హలోతో సరి... 
సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి.. మంగళవారం ఉదయం 10.50 గంటలకు పార్లమెంట్‌కు చేరుకున్నారు. బాబు ముందు నడుస్తుండగా ఎంపీల బృందం ఆయన్ను అనుసరించింది. దారిలో కనిపించిన ప్రతి ఎంపీని(పరిచయం ఉన్నా.. లేకున్నా) పలకరిస్తూ బాబు బృందం ముందుకు సాగింది. వారితో బాబును కలిపి ఫోటోలు తీయడానికి టీడీపీ ఎంపీలు ఎక్కువ ఆసక్తి చూపించారు. మాగంటి బాబు, మురళీమోహన్‌.. ఒక్కొక్కరు కనీసం 50 ఫోటోలను అలా తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ ఫోటోలతో ‘ఢిల్లీలో బాబు మంత్రాంగం’ పేరిట కలరింగ్‌ ఇవ్వడానికి వాడుకోవడానికి చేసిన ప్రయత్నాలూ పెద్దగా ఫలించలేదు. పార్లమెంట్‌ మెట్ల వద్ద ‘మొక్కు’బడి తంతు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో.. ‘మంతనాలు.. మంత్రాంగం’ ఫోటోలను తమ సెల్‌ఫోన్లకే టీడీపీ పార్టీ నేతలు పరిమితం చేసుకున్నారు. మంత్రులు, సీనియర్‌ నేతలు, ఎంపీలు ఉన్న చోటుకే ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లి వాళ్లను పలకరించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్‌సీపీ నేతలు శరద్‌ పవార్, సుప్రియా సూలే, తారిఖ్‌ అన్వర్‌లను, అలాగే తృణమూల్‌ నేతలు షౌగతరాయ్, డెరెక్‌ ఓబ్రెయిన్, సుదీప్‌ బందోపాధ్యాయలను కలిశారు.

ఇదే రీతిలో సమాజ్‌వాదీ పార్టీ నేతల రాంగోపాల్‌ యాదవ్, బీఎస్పీ నేత ఎస్‌.పి.మిశ్రా, బీజేడీకి చెందిన భత్రుహరి మెహ్‌తాబ్, వామపక్ష నేతలు డి.రాజా, కరుణాకరన్‌లను కలుసుకున్నారు. ఇక టీఆర్‌ఎస్‌కు చెందిన జితేందర్‌రెడ్డి, కల్వకుంట కవిత, పి.దయాకర్, నగేష్‌లను సీఎం కలిశారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు అహ్మద్‌ పటేల్, జోత్యిరాదిత్య సింధియా, వీరప్పమొయిలీ, జైరాం రమేశ్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రన్‌జిత్‌ కౌర్, నరేష్‌ గుజ్రాల్‌లను కూడా చంద్రబాబు కలుసుకున్నారు.  మర్యాదపూర్వకంగా అందరూ హలో అంటే హలో అనడమే తప్ప.. చంద్రబాబుతో భేటీకి ఎవరూ కనీస ఆసక్తి చూపించలేదు. పట్టుమని పది నిమిషాలు ఆయనతో చర్చించిన వారు లేకపోవడంతో ముఖ్యమంత్రితో పాటు టీడీపీ నేతల ముఖాలన్నీ కళావిహీనమయ్యాయి.

ఉభయ సభలు వాయిదాపడడంతో మధ్యాహ్న భోజన సమయానికి పార్లమెంట్‌ దాదాపు ఖాళీ అయింది. అప్పుడు పార్లమెంట్‌ ఆవరణలోనే సొంతపార్టీ ఎంపీలతో బాబు సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం కూడా ఎంపీలతో సమావేశమై రాత్రి పొద్దుపోయేంత వరకు మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఢిల్లీ యాత్ర టీడీపీ అధినేతకు పరాభవం మిగిల్చిందని, గతంలో ఎన్నడూ బాబు పట్ల ఢిల్లీ ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించలేదని టీడీపీ వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అంతకుముందు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ను కలసిన సందర్భంగా చంద్రబాబు.. రాష్ట్ర విభజనకు మీరే కారణమని వ్యాఖ్యానించగా, మీరిచ్చిన లేఖే కారణమని ఆయన బదులిచ్చినట్టు సమాచారం. విభజన చట్టంలో ఏపీకి పోలవరం ప్రాజెక్టును మంజూరు చేసిన అంశాన్ని కొందరు ప్రస్తావించగా.. పోలవరం ప్రాజెక్టును అనేక షరతులోనే మంజూరు చేశారని చంద్రబాబు పేర్కొన్నట్టు తెలిసింది.  
 
జాతీయ మీడియాపై దృష్టిపెడతారట.. 
పార్లమెంట్‌కు వెళ్లి అందరు నేతలతో మాట్లాడి ఢిల్లీలో బాబు చక్రం తిప్పారని గట్టిగా ప్రచారం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వకపోవడంతో.. బుధవారం మీడియా మీద దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జాతీయ మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని, వీలయినంత ఎక్కువ మందిని ఇంటర్వ్యూలు తీసుకోవడానికి పురమాయించాలని ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్న నాయకులకు అధినేత నుంచి ఆదేశాలు అందాయి. ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్తరాదిలో ప్రాబల్యం ఉన్న బీజేపీయేతర పార్టీల్లోని ద్వితీయశ్రేణి నాయకుల మీద దృష్టిపెట్టి వారినైనా చంద్రబాబు వద్దకు తీసుకొస్తే.. బాబు ఢిల్లీ పర్యటనలో కాస్తయినా పరువు దక్కుతుందని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అధినేత అంగీకరించరేమోనని ద్వితీయశ్రేణి నాయకత్వం మీద దృష్టిపెట్టలేదని, తీరా చూస్తే బాబును పట్టించుకున్న నాథుడే లేకపోవడంతో ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
 
సుప్రీంకోర్టు జడ్జిలను కలిసేందుకు తెరచాటుయత్నాలు
ప్రత్యేక హోదా పోరు కోసం ఢిల్లీకి వచ్చినట్లు చెప్పుకున్న చంద్రబాబు ఢిల్లీలో ఉన్నతన్యాయస్థానంలోని ఒకరిద్దరు న్యాయమూర్తులను కలిసేందుకు తెరచాటు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. హోదా కోసం పోరాడేవాడికి న్యాయమూర్తులతో పనేమిటి? పైగా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఆరోపణలెదుర్కొంటున్నారు. చార్జిషీటులో ఆయన పేరు ప్రస్తావించారు. సమన్లు కూడా వచ్చిన వ్యక్తి. అలాంటి చంద్రబాబు న్యాయమూర్తులను రహస్యంగా కలుసుకునేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని విమర్శకులంటున్నారు. తాము తప్పులు చేస్తూ.. తెలుగుదేశం నాయకులు చీటికి మాటికి ప్రధాని కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనిపిస్తున్నారని, పీఎంఓతో సంబంధాలు పెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

అసలు ప్రధానమంత్రిని ఓ ఎంపీ కలిస్తే తప్పేమిటి? నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నదెవరు? 29సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పుకున్నదెవరు? హోదా కోసం నాలుగేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుండడాన్ని జీర్ణించుకోలేక బురద జల్లడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీలకులంటున్నారు. అయినా తమపై అపనిందలు వేస్తే ప్రజలు గ్రహిచరనుకోవడం పొరపాటని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నేతలంటున్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం నిలకడగా పోరాడుతున్నదెవరో ప్రజలకు తెలుసు. హోదా అవసరం లేదు ప్యాకేజీ చాలు అని కేంద్రానికి లొంగిపోయిందెవరో కూడా వారికి తెలుసు. రాజీనామాలకు సిద్ధమని ముందు ప్రకటించిందెవరో ప్రజలకు తెలియదా.. అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చిందెవరో.. అవిశ్వాసంపై కప్పదాట్లు వేసిందెవరో ప్రజలకు తెలుసు.. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నదెవరో తెలుసు. అయినా ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తూ.. తామే హోదా కోసం పోరాడుతున్నామని కలర్‌ ఇస్తూ.. ఆచరణలో చేస్తున్న పనులు ఇలాంటి దొంగపనులు.. 
 
మీడియా ప్రశ్నలకు తడబాటు.. 
పార్లమెంటును సందర్శించిన సందర్భంగా చంద్రబాబు కొద్దిసేపు జాతీయ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు ముఖం నిరాశజనకంగా కనిపించింది. మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వడంలో ఆయన తడబడ్డారు. పదాలకోసం వెతుకులాడారు. స్పష్టమైన జవాబులివ్వకుండా దాటేశారు. రాబోయే రోజుల్లో టీడీపీపై దాడికి బీజేపీ మరింత పదనుపెడుతుందని, దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. నిధుల విడుదల విషయంలో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిందన్న అంశాన్ని, ఇచ్చిన హామీలను నీరుగార్చిందన్న అంశాన్ని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. దీనిపై మీడియా నుంచి ఘాటైన ప్రశ్నలు రావడంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాగా తన పోరాటం పార్టీ స్థాయిలో కాదని, ఇది రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య అని మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్రం ప్రకటించడానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయడానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేయాలని కేంద్రం కోరిందని, కానీ ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు మీ ప్రధాన ప్రత్యర్థి అన్న ప్రశ్నకు చంద్రబాబు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే కొన్ని రాజకీయ పార్టీలను బీజేపీ ప్రోత్సహిస్తోందని, కానీ వాటికి విశ్వసనీయత లేదని చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన ఒక కూటమిగా పోటీ చేసే అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబివ్వకుండా మౌనం వహించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తనకు రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని, అది తప్పుడు లేఖ అని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో తిరిగి సంబంధాలు నెలకొల్పుకునేందుకు అవకాశముందా? అన్న ప్రశ్నకు లేదని ఆయన బదులిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement