యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్‌లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్‌లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్‌లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)
ఎలా ఉందంటే?
షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.
హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట‍్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.
చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్‌లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.
రేటింగ్: 2.75/5
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ)
Comments
Please login to add a commentAdd a comment