
టైటిల్: మెకానిక్ రాకీ
నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది తదితరులు
నిర్మాణ సంస్థ: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : రామ్ తాళ్లూరి
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మనోజన్ రెడ్డి కాటసాని
ఎడిటింగ్: అన్వర్ అలీ
విడుదల తేది: నవంబర్ 22, 2024

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షలను అలరించిన విశ్వక్.. ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు విశ్వక్ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేయడంతో ‘మెకానిక్ రాకీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
రాకేష్ అలియాస్ రాకీ(విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలో ఆపేసి తండ్రి రామకృష్ణ(నరేశ్ వీకే)నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా జాయిన్ అవుతాడు. కార్లను రిపేర్ చేస్తూ.. మరోవైపు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ గ్యారేజీపై రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. వారసత్వంగా వస్తున్న ఆ గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ(శ్రద్ధా శ్రీనాథ్) వస్తుంది. తాను ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నానంటూ రాకీతో పరిచయం చేసుకుంటుంది. రాకీ సమస్య తెలిసి మాయ ఎలాంటి సహాయం చేసింది? గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ఏం చేశాడు? కాలేజీలో ప్రేమించి అమ్మాయి ప్రియ(మీనాక్షి చౌదరి) గురించి రాకీకి తెలిసి షాకింగ్ విషయాలు ఏంటి? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? ప్రియ, రాకీల జీవితాల్లోకి మాయ వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఈ సినిమా కథ ప్రారంభ సన్నివేశాలను చూడగానే ఇదొక సాదాసీదా ప్రేమ కథ అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్, కామెడీ సీన్లన్ని రొటీన్‌గా సాగుతాయి. ఒకనొక దశలో ఇది కామెడీ లవ్‌స్టోరీ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా జానరే మారిపోతుంది. అప్పటి వరకు కథపై ఉన్న ఓపీనియన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని తెలిసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే థ్రిల్లింగ్‌గా అపిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక్కో మలుపు ఉంటుంది. ఆ మలుపు సీన్లను మరింత థ్రిల్లింగ్‌గా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు.
కొన్ని ట్విస్టులను ముందే ఊహించొచ్చు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నేటి తరం యువత చేస్తున్న ఓ పెద్ద తప్పిదాన్ని చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల అవసరాన్ని, ఆశని ఆసరాగా తీసుకొని కొంతమంది చేస్తున్న ఆన్‌లైన్ మోసాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దాని చుట్టు అల్లుకున్న కథే రొటీన్‌గా ఉంది. భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. మోతాదుకు మించి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కథనం వాస్తవికానికి దూరంగా సాగితున్నందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే ఫలితం మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
రాకీ అలియాస్ మెకానిక్ రాకీ పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా నటించాడు. అయితే ఈ తరహా పాత్రలు విశ్వక్ చాలానే చేశాడు. అందుకే తెరపై కొత్తదనం కనిపించలేదు. మాయగా శ్రద్ధా శ్రీనాథ్ అదరగొట్టేసింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మీనాక్షి చౌదరికి చాలా బలమైన పాత్ర దొరికింది. మిడిల్ క్లాస్ యువతి ప్రియగా ఆమె చక్కగా నటించింది. తెరపై శ్రద్ధా, మీనాక్షి ఇద్దరూ అందంగా కనిపించారు. హీరో తండ్రిగా నరేశ్ తనకు అలవాటైన పాత్రలో జీవించేశాడు. సునీల్, హర్షవర్ధన్, రఘు, వైవా హర్షతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment