పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగిరావాలన్న తలంపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదోసారి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ సజావుగా లేదంటూ అనుమతించకుండానే సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించారు. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో కొద్ది సేపటికే లోక్‌సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభం కాగానే వివిధ శాఖలకు చెందిన పత్రాలను పలువురు మంత్రులు, సభ్యులు సభలో ప్రవేశపెట్టారు. 12.08 గంటలకు సభాపతి అవిశ్వాస తీర్మానాల ప్రస్తావన తెచ్చారు. ‘కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నర్సింహం, ఎన్.కె.ప్రేమ్ చంద్రన్, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే, పి.కె.కునహలికుట్టి, శ్రీనివాస్ కేశినేని, కింజారపు రామ్మోహన్‌నాయుడు, బుట్టా రేణుక, అసదుద్దీన్ ఒవైసీ, సి.ఎన్.జయదేవన్ నుంచి నోటీసులు అందాయి.
అవిశ్వాస తీర్మానాలను సభ ముందుంచాలి. ఇలా గందరగోళం ఉంటే నేనేమీ చేయలేను. తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు కావాల్సిన బలాన్ని లెక్కించాలి. సభ్యులు తమ స్థానాల్లో ఉంటేనే ఇది సాధ్యం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ.. ‘అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీనే. సభలో వారు గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మీరు అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావించినప్పుడు వారు లేచి చేతులు ఎత్తొచ్చు. వాళ్లు ఇక్కడ 70 ఏళ్లుగా ఈ సభలో ఉన్నారు. కానీ సమావేశాల తొలిరోజు నుంచీ వారు సభను నడవనివ్వడం లేదు. అన్నాడీఎంకే సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరుతున్నాం. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు. దీనికి కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే స్పందిస్తూ ‘అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలోనూ చర్చించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
కొనసాగుతున్న వాయిదాల పర్వం
తదుపరి లోక్‌సభ స్పీకర్ స్పందిస్తూ ‘నేను తీర్మానం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చకు అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరంతా అంగీకరిస్తేనే దీనిని నేను చేపట్టగలను. అందరూ సహకరించాలి. మీరు మీ స్థానాల్లోకి వెళ్లండి. ఇలా ఉంటే తీర్మానం అనుమతించడం సాధ్యం కాదు..’ అని పేర్కొన్నారు. తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలన్నీ అవిశ్వాసానికి మద్దతుగా లేచి నిలుచున్నాయి. ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లోనే ఉండడంతో సభాపతి స్పందిస్తూ ‘సభ సజావుగా నడవనందున అవిశ్వాస తీర్మానాలను నేను సభ ముందుకు తీసుకురాలేకపోతున్నాను..’ అంటూ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతించలేదు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహం మరోసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసులు అందజేశారు.
వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల ధర్నా
అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు.
రాజ్యసభలోనూ అంతే..
మరోవైపు రాజ్యసభ కూడా ఎలాంటి అంశాలూ చర్చకు రాకుండానే వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభ ప్రారంభమైన వెంటనే ఆందోళన చేపట్టారు. కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళ పార్టీలు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని.. ‘దేశమంతా సభను గమనిస్తోంది. ఇలాంటి ఆందోళనలతో మీరు ఏమీ సాధించలేరు. వివిధ పార్టీలు లేవనెత్తిన సమస్యలపై చర్చించడానికి సభ సిద్దంగా ఉంది’ అని పేర్కొన్నారు. అయితే ఎంతకీ సభ అదుపులోకి రాకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment