‘లోకేష్‌ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’ | KSR Comment On Pawan 10 years Chandrababu CM Comments | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’

Published Fri, Nov 22 2024 12:08 PM | Last Updated on Fri, Nov 22 2024 12:08 PM

KSR Comment On Pawan 10 years Chandrababu CM Comments

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పొగడ్తలు అతిగా మారుతున్నాయి. వీటి వెనుక ఉన్న నిజాయితీ ఎంత? వ్యూహమెంత? అన్నదిప్పుడు రాజకీయ వర్గాల చర్చ. చంద్రబాబు ఈ ఐదేళ్లు మాత్రమే కాకుండా.. మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగాలన్నది పవన్‌ పొగడ్తల్లో ఒకటి. అంటే.. సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పకనే చెప్పడమన్నమాట. ఇంకోలా చూస్తూ,, లోకేష్‌ సీఎం కాకూడదన్న ఆలోచనతో పవన్‌ ఈ మాట అన్నారేమో అనే చర్చ కూడా నడుస్తోంది. 

.. ఈ ప్రకటనతో పవన్‌ సీఎం పదవిపై  ఆశ వదలుకున్నారని సందేశమూ తన సామాజిక వర్గమైన కాపులకు పంపినట్లు కనిపిస్తోంది. అయితే కాపుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి కావాలన్నది వారి చిరకాల ఆకాంక్ష. సినీనటుడు చిరంజీవి ద్వారా ఆ కోరిక తీరుతుందని వారు ఆశించినా ఫలితం లేకపోయింది. ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. కేంద్రంలో కొంతకాలం పాటు మంత్రి పదవి అనుభవించారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ జనసేన పేరుతో పార్టీ పెట్టి తొలుత టీడీపీకి ఆ తరువాత వామపక్షాలు, బీఎస్పీలతో జట్టు కట్టి పోటీచేశారు అప్పట్లో పవన్ ఎక్కడకెళ్లినా అభిమానులు,  ముఖ్యంగా కాపు సామాజిక వర్గ యువత సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేసేది. దానికి ఆయన కూడా సంబరపడేవారు. కానీ.. 

2019 ఎన్నికలలో ఆయన రెండుచోట్ల పోటీచేసి ఓడిపోవడం, పార్టీ ఒక్క సీటుకే పరిమితమైపోయాయి. ఆ వెంటనే పవన్‌ ప్లేటు మార్చి బతిమలాడకుని మరీ మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. ఆ ఎన్నికలలో టీడీపీ కూడా ఓటమి పాలవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరంగా ఉంటే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ ను ముందుగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏలోకి ప్రవేశింప చేసి, తన తరపున రాయబారం చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారని అంటారు. 

.. ఆ తర్వాత కాలంలో పవన్‌ను చంద్రబాబు తన వెంట తిప్పుకున్నారు. చివరికి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో పవన్ ఆయనను పరామర్శించడానికి వెళ్లి పొత్తులపై మాట్లాడారు.అప్పటికే పవన్‌ కల్యాణ్‌ కు ఒక భయం పట్టుకుంది. తాను టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే మళ్లీ ఓడిపోతానని సందేహించారు. పవన్‌ కల్యాణ్‌, జనసేన మద్దతు లేనిదే టీడీపీ అధికారంలోకి రాలేదని చంద్రబాబూ భావించారు. ఎన్నికల కమిషన్ తమకు  అనుకూలంగా పని చేయాలంటే కేంద్రంలోని బీజేపీతో స్నేహం అవసరమని కిందా, మీద పడి ఆ పార్టీని ఒప్పించారు. నిజానికి జనసేనతో కలిసి  కూటమిగా పోటీ చేయడం ద్వారా ఏపీలో తమ బలాన్ని పెంచుకోవచ్చని బీజేపీ అనుకుంది. పవన్‌ను సీఎం అభ్యర్ధిగా కూడా బీజేపీ కేంద్ర నేతలు కొందరు ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తు చర్చల సమయంలో పవన్‌కు ముఖ్యమంత్రి పదవిని ప్రతిపాదించి రెండేళ్లపాటు అవకాశం ఇవ్వాలని బీజేపీ  సూచించింది. 

.. అలాగే సీట్ల పంపిణీ టీడీపీకి సగం, జనసేన, బీజేపీలకు సగంగా జరగాలని బీజేపీ పెద్దలు అభిప్రాయపడినా, పవన్ దానికి కూడా పట్టుబట్టకుండా జారిపోయారు. పవన్‌ కల్యాణ్‌ అసలు తాను గెలుస్తానో, లేదో అన్న భయంతో షరతులు లేకుండా టీడీపీతో పొత్తుకు ముందుకు వెళ్లారన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. బీజేపీని కూడా ఒప్పించారు!. 

ఈవీఎంల మేనేజ్ మెంటా? లేక ప్రజలు  ఓట్లు వేశారా? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ, ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తి చెందారు. ఆ తర్వాత  ఎన్ని అరాచకాలు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పవన్ తొలుత నోరు మెదపలేదు.  కారణం తెలియదు కానీ, సడన్ గా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారన్న వాస్తవాన్ని పవన్ ప్రకటించారు. ఆ సందర్భగా హోం మంత్రి అనిత సమర్థతను ప్రశ్నిస్తూ, తానే హోం మంత్రి అవుతానని హెచ్చరించారు. అది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసింది. 

.. ఆ మీదట చంద్రబాబు ఏమి చెప్పారో కానీ,  వెంటనే స్వరం మార్చి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల గురించి కాకుండా సోషల్ మీడియా లో అసభ్య పోస్టింగ్‌లపైకి  దారి మళ్లించారు. పోలీసుల ద్వారా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులు చేయిస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలోని సూపర్ సిక్స్ తదితర అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం బాగా పని చేస్తోందని ప్రచారం ఆరంభించారు. అదే సందర్భంలో చంద్రబాబు అనుభవం.. అంటూ పవన్  తెగ పొగుడుతున్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజంగానే అమలు చేస్తుంటే ప్రశంసించవచ్చు. నిత్యం అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించిందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని పవన్ అనడంలో ఆంతర్యం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ఆయన సనాతన ధర్మం అంటూ బీజేపీ ఎజెండా ప్రకారం రాజకీయం చేస్తూ ,మరో వైపు చంద్రబాబును పొగడడం ద్వారా టీడీపీతో సత్సంబంధాలు ఉంచుకునేలా జాగ్రత్త పడుతున్నారు. సినీ నటుడు కూడా అయిన పవన్‌ కల్యాణ్‌  గ్లామర్ ను ఉపయోగించుకుని ఏపీలో ఎదగాలని బీజేపీ భావనగా ఉందని అంటున్నారు. భవిష్యత్తులో టీడీపీతో తేడా వస్తే ఈ వ్యూహంలోకి బీజేపీ వెళ్లవచ్చన్నది కొందరి అనుమానం. ఈలోగా చంద్రబాబుతో గొడవ లేకుండా పవన్ పొగుడుతుండవచ్చు. 

మరో విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేష్  సీఎం స్థానంలో ఎప్పుడు కూర్చుంటారా అని లోకేష్  అభిమానులు  ఎదురు చూస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అమెరికా వెళ్లి వచ్చిన సందర్భంగా టీడీపీకి చెందిన 18 మంది మంత్రులు స్వాగతం చెప్పడమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. కుటుంబ పరంగా లోకేష్‌కు సీఎం పదవి సాధ్యమైనంత త్వరగా కట్టబెట్టాలన్న ఒత్తిడి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఒకవేళ లోకేష్ కు సీఎం పదవి అప్పగిస్తే పవన్ ఆయన క్యాబినెట్ లో ఉంటారా? లేదా? అన్నది చెప్పలేం. పవన్‌ కల్యాణ్‌ కు అది పెద్ద సమస్య కాదని, ఆయన పదవికి అలవాటు పడ్డాక దానిని వదులు కోలేరన్నది కొంతమంది వాదన. అయితే బీజేపీతో స్నేహం నడుపుతున్న పవన్ వ్యూహాత్మకంగా లోకేష్ కు సీఎం పదవి ఈ టరమ్‌లో రాకుండా చూడడానికే  ఈ ప్రకటన చేశారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. 

అంతే కాకుండా, పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని అన్నారంటే, ఆ పదవి తనకే కాకుండా లోకేష్ కు కూడా రాదని చెప్పడమే అవుతుంది. ఇది ఒకరకంగా చంద్రబాబుకు  కూడా కొంత ప్రయోజనకరం కావచ్చ. లోకేష్‌ను ఈ టరమ్‌లో సీఎంగా చేస్తే పవన్ ఒప్పుకోరని, ఆయన పొత్తు వీడిపోతే టీడీపీకి ఇబ్బంది అవుతుందని కుటుంబానికి నచ్చ చెప్పడానికి ఇది ఉపయోగపడవచ్చన్నది మరో అభిప్రాయం. 

ఇక్కడ ఒక సంగతి గమనించాలి. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ఈ టరమ్  పూర్తి అయ్యేసరికి 79 ఏళ్లకు చేరతారు. ఆ తర్వాత పదేళ్లు అంటే  89 ఏళ్లు వస్తాయి. వచ్చే టరమ్‌లో తిరిగి కూటమి గెలుస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. ఆ పరిస్థితి ఎలా ఉన్నా 90 ఏళ్లు వచ్చే వరకు చంద్రబాబు సీఎం గా ఉండాలని పవన్ అంటున్నారంటే, అది ముఖస్తుతి కోసం, లోకేష్ సీఎం కాకుండా అడ్డుకోవడానికే కావచ్చన్నది జనసేనలో జరుగుతున్న చర్చ. 

నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ మాటే నడుస్తోందని, మంత్రులు ఎవరూ ఏమీ చేయడానికి లేదని అంటున్నారు. చివరికి పవన్‌ కల్యాణ్‌ శాఖలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు లోకేష్ ద్వారానే జరుగుతున్నాయని అంటారు. లోకేష్‌ను నేరుగా ఎదిరించే ధైర్యం పవన్ ప్రస్తుతం చేయడం లేదని చెబుతున్నారు. కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులను ఒక టీమ్‌గా పెట్టుకుని లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నారని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లు  ఒకరినొకరు పొగుడుకుంటూ కాలం గడుపుతుంటే, అసలు పెత్తనం అంతా లోకేష్ చేస్తున్నారన్నది సచివాలయ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలోనే పవన్‌ కల్యాణ్‌ నిస్సహాయ స్థితిలోనో, లేక వ్యూహాత్మకం గానో లోకేష్ సీఎం కాకుండా  అడ్డుపడే లక్ష్యంతో ఈ ప్రకటన చేశారేమో అనే విశ్లేషణలు సోషల్ మీడియాలో కూడా విస్తారంగా వస్తున్నాయి. 

రాజకీయాలలో అతిగా పొగిడితే కూడా పలు సందేహాలు వస్తుంటాయి. ఏది ఏమైనా పవన్‌ కల్యాణ్‌‌కు సీఎం అయ్యే యోగం ఎప్పటికైనా ఉంటుందా? అన్నది ఆయన అభిమానులకు లక్ష డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement