
సాక్షి, అమరావతి: తమతో పెట్టుకుంటే మీకూ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తాము ప్రారంభించిన పోరాటంలో సైకిల్ యాత్ర ప్రారంభం మాత్రమేనని చెప్పారు. శుక్రవారం అమరావతిలోని వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్రను సీఎం ప్రారంభించారు. చంద్రబాబు కొద్దిసేపు స్వయంగా సైకిల్ తొక్కారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా చేపట్టిన ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. కొందరు కుట్రపూరితంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. మెడికల్ విద్యార్థిని నిహిత రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి ప్రజలు సహకరించాలని, బాండ్లపై బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
ఎంపీలు రాజీనామా చేస్తే పోరాడేదెవరు?
పార్లమెంటులో టీడీపీ ఎంపీల ధర్నాతో జాతీయస్థాయిలో కదలిక మొదలైందని సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం పార్టీ ఎంపీలు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఇక పోరాడేది ఎవరని ప్రశ్నించారు. రాజీనామా అంటే పోరాటం నుంచి పారిపోవడమేనన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీని ప్రజలు ఛీకొడుతున్నారని, దేశం మొత్తం ఆ పార్టీని ఛీకొట్టే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చాక 13 జిల్లాల్లో ఎంపీలు పర్యటనలు జరపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment