సాక్షి, అమరావతి: ‘‘దేశప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగా 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఎన్డీఏని అఖండ మెజారిటీతో గెలిపింది, మళ్లీ మోదీ గారినే ప్రధానిగా చేయాలని చంద్రబాబు అనే నేను కోరుతున్నాను’’ ఇది.. 30 రాజకీయ పార్టీల ప్రతినిధుల సాక్షిగా ఎన్డీఏ సమావేశంలో ఏపీ సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానం!
ఆవిధంగా మాట్లాడిన బాబుగారు నెలలు తిరిగేలోపే మళ్లీ మాటమార్చారని, కేంద్రాన్ని, మోదీని విమర్శిస్తూ వింత ప్రేలాపనలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సహకారం’ పేరుతో 32 పేజీల సుదీర్ఘ బహిరంగ లేఖను ఆయన విడుదలచేశారు.
పలు కీలక అంశాలతో కూడిన ఆ లేఖలో చంద్రబాబు బండారం బట్టబయలు కావడంతోపాటు బీజేపీ ద్వంద్వవైఖరి కూడా స్పష్టంగా వెల్లడికావడం గమనార్హం.
► విభజన సమయంలో నాటీ యూపీఏ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినా, ఆ విషయాన్ని 14వ ఆర్థిక సంఘానికి నివేదించలేదని, జాతీయ సమగ్రతా మండలిలో ఆమోదించలేదని హరిబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఆ పక్క పేజీలోనే ఏపీకి వరదాయిని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని కూడా నాటి యూపీఏ ప్రభుత్వమే చెప్పిందని, ముంపు మండలాలలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ కూడా తెస్తామని హామీ ఇచ్చినా చేయలేకపోయిందని రాసుకొచ్చారు.
►ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాల్లోనే.. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘ముంపు మండలాల బదలాయింపు ప్రక్రియ’ను తాము విజయవంతంగా పూర్తిచేశామని హరిబాబు గొప్పలు చెప్పారు. కానీ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఏమేరకు జరిగాయో, నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పే సాహసం చెయ్యలేకపోయారు. అదే విధంగా హోదా హామీని ఎందుకు అమలుచేయలేకపోయారన్న దానిపై కప్పదాటువైఖరి ప్రదర్శించారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలను ప్రస్తావించినా.. మోదీ ప్రధాని అయిన 7 నెలల తర్వాతగానీ ఆర్థిక సంఘం రద్దైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారు.
►పోలవరం, ప్రత్యేక హోదా హామీల్లో ఏ ఒక్కదానిని పూర్తిచేయకుండా సాకులు వెతుక్కోవడం మోసకారితనమే అవుతుందని బీజేపీ-టీడీపీలకు ముందే తెలుసు. ఇప్పుడు మాత్రం ‘కూరిమి విరసంబైనను నేరములే కానవచ్చు..’ అన్న చందంగా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ మొత్తంగా ఏపీ ప్రజల కళ్లకుగంతలుకట్టే వ్యర్థప్రయత్నాలు చేస్తున్నారు.
(ఏపీ దూరదర్శన్ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ అయిన ఫొటోలివి)
Comments
Please login to add a commentAdd a comment