సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సాగిన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాగ్రహానికి తలవంచి చివరికి అదే బాట పట్టినా తనపై వెల్లువలా వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి మార్గాన్ని ఎంచుకున్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసి, కేంద్రంలో నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి వైదొలిగినా, వారితో కలిసి ఉన్నప్పుడు ఎదురైన వైఫల్యాలకు జవాబు చెప్పాల్సిన చంద్రబాబు వాటిని బీజేపీపైనే రుద్దేందుకు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి బయటకు వచ్చిన బాబు, ఇప్పుడు ఆ పార్టీతో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి లాలూచీపడినట్లు అదేపనిగా ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా చేసిన పోరాటాన్ని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడాన్ని, ఎంపీల చేత రాజీనామాలు చేయించడానికి కూడా సిద్ధపడడాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. మీడియా, సోషల్ మీడియాలో ఈ ప్రచారాల కోసం కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
కావాలనే వైఎస్సార్ కాంగ్రెస్‌పై దుష్ప్రచారం
ప్రత్యేక హోదా అంశం ప్రజల్లో సెంటిమెంటుగా మారి, తొలి నుంచి దాని కోసం పోరాడుతూ ఆ నినాదాన్ని సజీవంగా ఉంచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ఈ విషయం ప్రజల్లోకి బాగా వెళ్లడంతో దాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాలుగా మాటలు మారుస్తూ వ్యతిరేక ప్రచారాలు పారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లాలూచీపడిందనే ప్రచారం ద్వారా అటు హోదా ఉద్యమాన్ని భుజానమోసిన జగన్ పై దుష్ప్రచారానికి పూనుకున్నారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు గానీ, ఎంపీలు గానీ ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను ప్రజాసమస్యలపై కలిస్తే అదేదో నేరమైనట్లు దుష్ప్రచారం చేయిస్తున్నారు. తాను మాత్రం నాలుగేళ్లుగా అధికారాన్ని పంచుకుంటూ 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి ఎవరిని కలిసి ఏమడిగిందీ చెప్పరు. ఐదు కోట్ల ఆంధ్రులకు సంజీవని వంటి ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై వత్తిడి తీసుకురాకుండా.. కలసిన ప్రతిసారీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ సీట్ల పెంపు వంటి వాటి గురించే చంద్రబాబు మాట్లాడి వస్తున్నా దానిని ఎవరూ ఆక్షేపించకూడదట.
కింది స్థాయి వరకు అదే ప్రచారం
బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, పవన్ కల్యాణ్‌లపై తాను చెప్పే విషయాలనే మళ్లీ మళ్లీ పార్టీ సమావేశాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ చంద్రబాబు చెబుతున్నారు. తాను మాట్లాడుతున్న మాటల్నే జనంలోకి తీసుకెళ్లాలని, కరపత్రాలు పంచాలని, విలేకరుల సమావేశాలు పెట్టి చెప్పాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకూ ఇవే విషయాలను అనుకూల మీడియాలో ఊదరగొడుతున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని వదలకుండా పోరాటం చేసి అందరి చేత హోదా నినాదాలు చేయిస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరగడాన్ని జీర్ణించుకోలేక అందులో తనకూ భాగం ఉందని చెప్పుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. అయినా ప్రజలు తనను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఒక పథకం ప్రకారం రకరకాల జిమ్మిక్కు ప్రచారాలు, వాదనలు లేవనెత్తడం ద్వారా వారిని గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
తనపై ఆరోపణల్ని తెలుగుజాతిపై పోరాటంగా చిత్రీకరణ
ఎన్డీఏ నుంచి వైదొలిగిన వెంటనే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే ప్రచారంతో ఆ పార్టీపై చంద్రబాబు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, నిధులు ఇవ్వలేదని, అవమానించారని, వైసీపీతో లాలూచీపడ్డారని రకరకాల ప్రచారాలు లేవనెత్తారు. చంద్రబాబు చేసిన తప్పులను ఎత్తి చూపుతామని, ఏపీ కోసం తెలుగుదేశంపై పోరాటం చేస్తామని బీజేపీ చేసిన వ్యాఖ్యలను సైతం వక్రీకరించి వారు రాష్ట్రంపై పోరాటం చేస్తారా, తెలుగుజాతిపై పోరాటం చేస్తారా అంటూ ప్రజల్ని రెచ్చగొట్టేవాదనను లేవనెత్తారు. తనను బలహీనపరిస్తే రాష్ట్రాన్ని బలహీనపరచినట్లేననే విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. తనపై వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలకు రాష్ట్ర ప్రయోజనాలకు లింకుపెట్టి మాట్లాడుతూ ప్రజల్ని ఏమార్చేందుకు విశ్వప్రయత్నం చేస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అలాగే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, నాలుగేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన పవన్ కళ్యాణ్ తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తుండడంతో ఆయనకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లింకు కలిపి ప్రత్యారోపణలు చేయడం మొదలు పెట్టారు. నాలుగేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్నే పవన్ చేస్తున్నారని, తనపై చేస్తున్న ఆరోపణల వల్ల రాష్ట్రం నష్టపోతుందని చెబుతూ అసలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారు. చివరికి బీజేపీ, వైసీపీ, జనసేనలు టీడీపీపై బురదజల్లుతున్నాయని, వైసీపీ, జనసేనలు బీజేపీకి కోవర్టులనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. నాలుగేళ్లుగా జనసేన అధినేతతో జగన్‌పై చేయించిన ఆరోపణలను పక్కనపెట్టిన చంద్రబాబు ఇప్పుడు జగన్ – పవన్ కలిసిపోయారని ప్రచారం చేయడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment