పార్లమెంటు సాక్షిగా మళ్లీ వెన్నుపోటు
ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తూ ఓటేసిన టీడీపీ.. రాష్ట్రపతి ప్రసంగంలో హోదాను చేర్చాలని వైఎస్సార్‌సీపీ సవరణ
- ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షకు టీడీపీ తూట్లు
- పార్లమెంటు ఇచ్చిన హామీకి అక్కడే సమాధి
- టీడీపీ, బీజేపీల తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన వైఎస్సార్‌సీపీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అదే మోసం... అదే వంచన..మళ్లీ మళ్లీ అదే నయవంచన..ఈసారి వేదిక...అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు...
దేశమంతా నిర్ఘాంతపోయేలా.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలు ఆవిరయ్యేలా పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఆకాంక్షకు మరోమారు వెన్నుపోటు పొడిచింది.పార్లమెంటు సాక్షిగా లభించిన హామీని పార్లమెంటులోనే సమాధి చేసేందుకు ప్రయత్నించింది. విభజన నాడు నిండు సభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీకి మూడేళ్లుగా తూట్లు పొడుస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు ఏకంగా పార్లమెంటులోనే తమ నిజస్వరూపాన్ని బైటపెట్టుకున్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చడానికి వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు నిస్సిగ్గుగా అడ్డుకోవడం చూసి యావదాంధ్ర ప్రజలు నివ్వెర పోయారు. ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం హోదా అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాలన్న ప్రతిపాదనను అడ్డుకోవడం చూసి నిర్ఘాంతపోయారు. ప్రత్యేకహోదా పదిహేనేళ్లు ఇవ్వాలని ఎన్నికల సభల్లో నరేంద్రమోదికి విజ్ఞప్తి చేసిన చంద్రబాబు ఇపుడు పార్లమెంటు సాక్షిగా హోదా ఆకాంక్ష గొంతునులిమేసేందుకు ప్రయత్నించారు.
హోదా సాధించడం కోసం తాను ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షను సమాధిచేసేందుకు చేసిన ప్రయత్నమిది. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని కోరుతూ మంగళవారం వైఎస్సార్సీపీ లోక్‌సభలో చేసిన సవరణ ప్రతిపాదన నిజానికి అనుకోకుండా లభించిన ఒక గొప్ప అవకాశం. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను దేశం మొత్తం గుర్తించేలా చేసేందుకు లభించిన మహదవకాశం. కానీ ఈ ప్రయత్నాన్ని తెలుగుదేశం వ్యతిరేకించడం చూసి అంతా నివ్వెరపోయారు. ప్రత్యేక హోదాకు అడుగడుగునా తెలుగుదేశం అడ్డుపడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంటు వేదికగా ప్రత్యేకహోదాను తెలుగుదేశం, బీజేపీ వ్యతిరేకించిన తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
ప్రత్యేకహోదాకు టీడీపీ వ్యతిరేక ఓటు
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేస్తామనే వాక్యాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో సవరణ ప్రతిపాదన చేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు ఇచ్చారు. ఈ జవాబులో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఈనేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సవరణ ప్రతిపాదించారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల అతిముఖ్యమైన ఆకాంక్ష. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ ఇది. దీనిని అమలుచేయని పక్షంలో పార్లమెంటు పవిత్రత ప్రశ్నార్థకమవుతుంది’ అని మేకపాటి పేర్కొన్నారు. ‘రాష్ట్రపతి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని సవరణ చేయాలి..’ అంటూ ప్రతిపాదించారు.
ఈ సవరణ ప్రతిపాదనకు స్పీకర్ సుమిత్రా మహాజన్ మూజువాణి ద్వారా ఓటింగ్ చేపట్టగా టీడీపీ, బీజేపీ వ్యతిరేకించాయి. విపక్షాలన్నీ మద్దతు పలికాయి. ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తూ అధికార పక్షాలు ఓటింగ్‌కు వ్యతిరేకంగా నిలవడంతో సవరణ ప్రతిపాదన వీగిపోయింది. ఈ నేపథ్యంలో నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. ముందుగా సవరణకు అవకాశమేరాని పరిస్థితుల్లో మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వెల్‌లోకి వెళ్లి తమ డిమాండ్‌ను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో సవరణ ప్రతిపాదనకు అవకాశం వచ్చింది. ఓటింగ్ సమయంలో టీడీపీ ఎంపీలు తోట నర్సింహులు, రవీంద్రబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాల్యాద్రి శ్రీరాం, మురళీమోహన్, కొత్తపల్లి గీత తదితరులు సభలోనే ఉన్నా బీజేపీ సభ్యులతో కలిసి సవరణను వ్యతిరేకించడంతో అది వీగిపోయింది.