చౌకబారు పనులకు చిరునామా | Devulapalli Amar Guest Columns On TDP Cheap Politics | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 4 2018 12:53 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Devulapalli Amar Guest Column On TDP Cheap Politics - Sakshi

మొన్న ఢిల్లీలో తీరికగా కాళ్లు బార్లా చాపుకుని కూర్చుని ఆయన పార్టీకి చెందిన ఎంపీలు మాట్లాడిన మాటలే చంద్రబాబుకు, టీడీపీ నేతలకూ విభజన హామీలపై ఎంత చులకన భావం ఉందో తేల్చిచెప్పాయి. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకోడానికి వైఎస్సార్‌సీపీతో బాటు ఇతర ప్రతిపక్షాలూ, ప్రజలూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే మీరు ఇంత ఆషామాషీగా వ్యవహరిస్తారా అని సదరు ఎంపీలను పిలిచి గట్టిగా బుద్ధి చెప్పాల్సింది పోయి, ఆ మాటలను వీడియో తీసిన వారెవరో తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని సీఎం çహూంకరించడం బట్టి ఆయన కూడా ఈ సమస్యలను ఎంత ఆషామాషీగా తీసుకుంటున్నారో అర్థమవుతుంది.

అప్పటికప్పుడే మాట మార్చేయడం ఒక కళ. ఆ కళలో అత్యంత ప్రావీణ్యం గల కొద్దిమంది నాయకుల్లో ఎన్నదగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వయసు మీద పడుతున్న కారణంగానో, పరిస్థితులు అనుకూలించకనో తెలియదు కానీ బాబు ఆ కళా ప్రదర్శనలో వెనకబడి పోతున్నట్టు కనిపిస్తోంది. అందుకే తరచూ దొరికిపోతున్నారు. అన్న మాట అనలేదనీ, అనని  మాట అన్నాననీ బల్ల గుద్ది వాదిం చగల శక్తి, అందరి పీక పట్టుకుని అనుకూలించకపోతే గడ్డం పట్టుకుని ఒప్పించే సామర్థ్యం గతంలో ఆయన సొంతం. ఇప్పుడా కళలో పూర్తిగా వెనకబడిపోయా రనడానికి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉదంతం గొప్ప ఉదా హరణ. కడపలో ఉక్కు పరిశ్రమ రావాలని చంద్ర బాబు ఎన్నడూ కోరుకోలేదు. పైగా అది రాకుండా చూడటానికే చాలా ప్రయత్నించారు. వైఎస్‌ రాజశేఖ రరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడపలో బ్రాహ్మణి స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జరిగిన ప్రయ త్నాలను అడ్డుకోడానికి ఆయన చెయ్యనిదంటూ లేద న్నది జగమెరిగిన సత్యం. 

ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కడప గడపలోకి కూడా అడుగుపెట్టలేని స్థితి మొదటి నుంచీ. ఆయన బహిరంగంగానే చాలా సార్లు కడప జిల్లాపై వ్యతిరేకత ప్రదర్శించారు. దానికి మొదటి కారణం వైఎస్సార్‌ కుటుంబానికి ఆ జిల్లా పెట్టని కోట కావడమే. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ కంచుకోటను తాకలేని పరిస్థితి. పైగా ఇప్పుడా జిల్లా అధికారికంగా రాజశేఖరరెడ్డి పేరున వైఎస్సార్‌ జిల్లాగా మారడం ఆయనకు మరింత కంటగింపు అయిన విషయం. హైదరాబాద్‌ నుంచి మకాం విజయవాడకు మార్చిన వెంటనే నగర నది మధ్యలో ఉన్న రాజశేఖరరెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని ఆ దారెంట వెళుతూ రోజూ చూడాల్సి వస్తోందన్న దుగ్ధతో తొలగించేంత సహించలేని గుణం చంద్రబా బుది. వీటన్నిటికి తోడు వైఎస్సార్‌ కుమారుడు జగన్‌ మోహన్‌రెడ్డి తండ్రి వలే ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయనకంటే దీటుగా తనను ఎదుర్కొంటూ రాజ కీయాల్లో ముందుకు దూసుకుపోవడం కూడా చంద్ర బాబుకు మింగుడు పడటం లేదు.

స్టేట్స్‌మన్‌ అంటూనే చౌకబారు పనులు!
రాజశేఖరరెడ్డి హయాంలో మొదలయిన ప్రయత్నం చివరికి విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ స్థాపన ఒక అంశంగా చోటుచేసుకోవడం కూడా చంద్రబాబుకు నచ్చని విషయమే. సరే.. 2014లో అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల పాటు ఆయన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల జోలికి ఎన్నడూ పోలేదు. ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్ట్‌ అన్నీ కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీ ముందు దిగ దుడుపుగా అనిపించాయి. కేంద్రంతో ముఖ్యంగా బీజేపీతో చెడేసరికి నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌ ఆయన పార్టీ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తున్న సమస్యలన్నీ దిక్కులేని పరిస్థితిలో తలకెత్తుకోవాల్సి వచ్చింది. మొన్న ఢిల్లీలో తీరికగా కాళ్లు బార్లా చాపుకుని కూర్చుని ఆయన పార్టీకి చెందిన ఎంపీలు మాట్లాడిన మాటలే చంద్రబాబుకు, ఆయన పార్టీ నేతలకూ విభజన హామీలపై ఎంత చులకన భావం ఉందో తేల్చి చెప్పాయి. ఒకాయన జోన్‌ లేదు గీన్‌ లేదు అంటే ఇంకో ఆయన ఉక్కు రాదు తుక్కు రాదు అంటాడు. 

ఇంకో పెద్ద మనిషి బరువు తగ్గడం కోసం ఒక వారం దీక్ష చెయ్యడానికి నేను రెడీ అంటాడు. ఒక పక్క ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను  సాధించుకోడానికి వైఎస్సార్‌సీపీతోబాటు ఇతర ప్రతి పక్షాలూ, ప్రజలూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే మీరు ఇంత ఆషామాషీగా వ్యవహరిస్తారా అని సదరు ఎంపీలను పిలిచి గట్టిగా బుద్ధి చెప్పాల్సింది పోయి ఆ వీడియో తీసిన వారెవరో తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని సీఎం çహూంక రించడం బట్టి తానుకూడా ఈ సమస్యలను ఎంత ఆషామాషీగా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. 

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్‌టీ రామారావు స్థాపించిన నాటి స్థితిలో లేదు. ఇప్పుడది కలగూర గంప. కాంగ్రెస్, ప్రజా రాజ్యం, వైఎస్సార్‌  కాంగ్రెస్‌ ఇట్లా నానా పార్టీల నుంచి వచ్చిన వలస పక్షుల కూటమి కాబట్టి మందలించాక వారు ఎదురు తిరిగితే భంగపడాల్సి వస్తుందన్న బెంగ కూడా ఉండొచ్చు. ఒక పక్క అంతర్గతంగా ఎవరినీ అదుపు చెయ్యలేని పరిస్థితి ఉంటే మరో పక్క ప్రతిపక్ష నేత పాదయాత్రకు రోజు రోజుకూ పెరుగుతున్న అపార ప్రజాదరణ, ఇంకో పక్క ఇష్టం లేకున్నా కేంద్రం మీద విమర్శలు చెయ్యాల్సిన స్థితి చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను రాజమండ్రి రైల్‌ కం రోడ్‌ బ్రిడ్జ్‌ మీద నుంచి వెళ్లకుండా చూడటానికి ముఖ్యమంత్రి శత విధాలా ప్రయత్నించారు. అధికారులు అందుకు సహకరించక  చేసేదేమీలేక ఊరుకోవాల్సివచ్చింది. వందిమాగధ మీడియాలో ఆ అపూర్వ ఘట్టానికి ప్రచారం రాకుండా చూసుకుని సంతృప్తి చెందాల్సి వచ్చింది. పదే పదే స్టేట్స్‌మన్‌ను అని ప్రకటించు కునే ఆయన స్టేట్స్‌మన్‌ ఇలాంటి చౌకబారు పనులు చెయ్యరని గుర్తిస్తే బాగుండేది.

బాబు తప్పులు మాట్లాడినా మౌనమే...
అన్యమనస్కంగానే కడప ఉక్కు పరిశ్రమ అంశం ఎత్తుకోక తప్పని స్థితిలో అంతే అన్యమనస్కంగా సీఎం రమేష్‌ను నిరాహార దీక్షకు కూర్చోబెట్టడం నుంచి ఆ దీక్షను ముఖ్యమంత్రి స్వయంగా విర మింప చెయ్యడం వరకూ అంతా ప్రహసనంలా సాగింది. దీన్నిచూస్తే ఆ సమస్యపై బాబుకు, ఆయన ప్రభుత్వానికి, పార్టీకి ఇసుమంత నిజాయితీ కూడా లేదన్న విషయం  స్పష్టంగా అర్థమవుతుంది. రమేష్‌ దీక్ష మీద పలు విమర్శలొచ్చాయి. ఆ విమర్శల జోలి మనకు అనవసరం. కానీ ఆ దీక్ష మీద వాళ్ళ పార్టీ నాయకుల స్పందన ఆషామాషీగా ఉండటాన్నే అందరూ ప్రశ్నిస్తారు. మేం ఏం మాట్లాడినా జనం నమ్ముతారు, వారు తెలివిలేని వారన్న గట్టి నమ్మకం చంద్రబాబుది. అందుకే చరిత్రను తిరగ రాసేస్తుం టారు, జరగనివి జరిగిపోయాయని చెపుతుంటారు. 

కడప ఉక్కు దీక్ష ప్రహసనం ముగింపులో ఆయన మాట్లాడిన మాటలే తీసుకుందాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఆ లక్ష్యం సాధించాక దీక్ష విర మించారని ఒక మహా ప్రసంగం చేశారు ముఖ్య మంత్రి. పొట్టి శ్రీరాములు దీక్ష చేస్తూ చనిపోయాక ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి హింసాకాండ వరకూ పోయాక కానీ నెహ్రూ ప్రభు త్వం దిగిరాలేదన్న చారిత్రక సత్యాన్ని ఆయనకు గుర్తు చేసే ధైర్యం తెలుగు తమ్ముళ్లకు ఎక్క డిది?ఆయనకు మొదటి నుంచీ చరిత్ర అంటే గిట్టదు. కానీ సీఎం రమేష్‌ను పొట్టి శ్రీరాములుతో పోల్చే సాహసం చేసేప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి కదా. మహాకవి పోతన ఒంటిమిట్టలో కూర్చుని రామాయణం రాశాడన్నా, బ్రిటిష్‌ పాలకులతో పోరాడి స్వాతంత్య్రం సాధించిన పార్టీ తెలుగుదేశం అన్నా సరిదిద్దే వారు లేక ఆయన పొట్టి శ్రీరాములు వ్యవహారంలో కూడా పప్పులో కాలేశారు. తమ పత్రి కల్లో రాయకపోతే పోయారు, తమ చానళ్లలో చూప కపోతే పోయారు ప్రైవేటుగానయినా, ‘మీరు తప్పులు మాట్లాడుతున్నారు’ అని వందిమాగధ మీడియా హెచ్చరించి బాబుగారి పరువు కాపాడాలి కదా. చంద్రబాబు వంశాన్ని శాశ్వతంగా సింహా సనం మీద ప్రతిష్టింప చేసే పనిలోపడి వారు ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం లేదట.

సీఎం మానసిక స్థితిపై అనుమానాలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రస్తుత మానసిక స్థితికి రమేష్‌ దీక్ష విరమింప చేసే సమయంలో ఆయన ప్రసంగం అద్దం పడుతోంది. రమేష్, బీటెక్‌ రవి దీక్షను ఆయన గొప్ప త్యాగంగా అభివర్ణించి, ‘‘మీ దీక్ష కారణంగా కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చింది. మీరు చరిత్రలో నిలిచి పోతారు,’’ అని ప్రకటించేసి నిమ్మరసం తాగించారు రమేష్‌తో. రమేష్, రవితో పోటీ దీక్ష చేయించి మార్కులు కొట్టేయాలనుకున్న చంద్రబాబు అదేమీ లాభం లేదని తెలిశాక దీక్షలు విరమింపచేసి ఉక్కు పరిశ్రమ వచ్చేసిందని ప్రకటిం చారు. దీంతో ఆయన పార్టీ వారే ముక్కున వేలేసుకు న్నారు. నాయకుడి మానసిక స్థితి గురించి చెవులు కొరుక్కున్న పరిస్థితి. 

‘బీజేపీకి కర్ణాటకలో ట్రెయిలర్‌ చూపించాం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా మొత్తం చూపిస్తాం,’ అన్న చిన్నబాబు ఆరు నెలల్లో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని విభజన చట్టంలో ఉందని మాట్లాడు తున్నారు. ఈ నాలుగేళ్లూ దాని ఊసెందుకు ఎత్తలే దంటే జవాబు ఉండదు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధనకు మేమే పోరాడుతున్నామని చెపుతూ అదే సమస్యపై ప్రశాంతంగా బంద్‌ నిర్వహించిన ప్రతి పక్షాల మీద అదే జిల్లాలో పోలీసులు విరుచుకు పడతారు. కేంద్రానికి ఊడిగం చేసినా, కేంద్రం మీద ఉద్యమం చేసినా మేమే చెయ్యాలి ఇంకెవరూ చెయ్య కూడదన్నది బాబు, ఆయన కుమారుడు, వారి కొలు వులో చేరిన మీడియా పెద్దల కోరిక. పోనీ ఆ పనేదో చిత్తశుద్ధితో చేస్తారా అంటే అదీ లేదు.

ఇందు మూలముగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలియజేయునది ఏమనగా సీఎం రమేష్, బీటెక్‌ రవి నిరాహార దీక్ష ఫలితంగా కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చేసింది. ఇదే రీతిలో మిగిలిన సమస్యలపై కూడా తెలుగు తమ్ముళ్లు ఎవరో ఒకరు దీక్షలు చేస్తారు. ఆ దీక్షల ఫలితంగా ఆ డిమాండ్లన్నీ సాధించుకున్న విష యాన్ని ముఖ్యమంత్రి స్వయంగా వారందరికీ నిమ్మ రసం ఇచ్చి మరీ ప్రకటిస్తారు. ఇక ఈ రాష్ట్రానికి ప్రతి పక్షం అవసరం లేదని కూడా ప్రకటిస్తారు. ఆ తరు వాత నారా వారి సామ్రాజ్యంలో ప్రజలంతా సుఖ శాంతులతో జీవించారని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మీద నిర్మించే బయోపిక్‌లో మనం చూసు కోవచ్చు. వాస్తవ జీవితంలో జరగని వాటిని, చేయ లేని వాటిని సినిమాల్లో చూసి మురిసిపోవడం మామూలే కదా.

వ్యాసకర్త, దేవులపల్లి అమర్‌ datelinehyderabad@gmail.com 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement